రైలు సికింద్రాబాద్ చేరగానే సుజాత ఆరాటం, ఆతృత మరింత హెచ్చింది. తను ఫలాన తారీఖున వస్తున్నట్టు ఉత్తరం రాసింది ఆమెకి. స్టేషన్ కి యెవరన్నా వస్తారో లేదో? వస్తే యెలా గుర్తుపట్టడం? తనని వలలు గుర్తించగలరో లేదొ!.....
"ఏమ్మా నీ విక్కడ దిగుతావా, హైదరాబాదు స్టేషన్ లో దిగుతావా?" సూర్యనారాయణగారు అప్పగించి నాయన సికింద్రాబాదు రాగానే అడిగాడు.
సుజాత కంతా అయోమయం. ఎక్కడ దిగాలో, ఎక్కడ దిగితే ఇంటికి దగ్గిరో అదంతా ఆమెకేం తెలుసు.
"మీ రిక్కడే దిగుతారా?" అంది సుజాత.
"అవునమ్మా, ఇక్కడనవసరంగా ఓ అరగంట కూర్చునేకంటే ఓ పావలా రిక్షాకు యెక్కువయినా ఇంటికి తొందరగా చేరచ్చు" అన్నాడు.
"అయితే నేనూ దిగిపోతాను. నన్నేదన్నా ఆటోరిక్షా యెక్కించి వెళ్ళండి" అంది సుజాత, దిగడానికి సిద్దపడుతూ.
స్టేషను బయటికి రాగానే ఓ ఆటోరిక్షాని పిలిచి సుజాతని యెక్కించి, ఎడ్రసు అదీ చెప్పాడాయన. "ఏమమ్మా, మరి నే వెడతాను, వెళ్ళగలవుగా, ఇంటి నెంబరు ఆ వీధికి వెళ్ళి వెతుక్కుంటే అయిపోతుంది...." అన్నాడాయన.
"అలాగే....మీరు వెళ్ళండి.....ఫరవాలేదు...." అంటూ సుజాత ఆయనకి నమస్కారంచేసి ఆటోలో కూర్చుంది.
హిమాయత్ నగర్ లోని ఆ వీధి చేరగానే, "నెంబర్ బతాయియే" అన్నాడు ఆటోవాలా. హిందీ సినిమాల ధర్మమా అని ఆ మాత్రం హిందీ సుజాతకి అర్ధం అవుతుంది. నెంబరు వెతుక్కుంటూ అట్నించిటూ, ఇట్నించి అటూ వెనక్కి, ముందుకు తిరిగాక....ఆ వీధిలోంచి వచ్చే ఒకావిడని "డాక్టరు కల్యాణిగారిల్లు చెప్పగలరా యెక్కడో" అనడిగింది సుజాత తెలుగావిడని రూపురేఖలబట్టి గ్రహించి.
"డాక్టరుగారిదా.....అదిగో ఈ సందుచివర కుడివైపుకితిరగ్గానే కనిపించే రెండో మేడే!" అందావిడ.
"హమ్మయ్య...." అనుకుంది సుజాత. అటో ఇంటిముందు ఆగింది. 'డాక్టరు కళ్యాణి అన్న బోర్డు గేటుకే వుంది. సామాను దింపుకునిమీటరు చూసి డబ్బిచ్చి పంపేసింది సుజాత. పెట్టె ఒకచేత్తో బాస్కట్టు ఒకచేత్తో పట్టుకుని లోపలికి అడుగుపెట్టింది.
ఇల్లు చాలా ఆధునికంగా అందంగా వుంది. ముందున్న ఖాళీస్థలం మరీ అంత పెద్దది కాకపోయినా పూలమొక్కలు వేసుకోడానికి తగినంత స్థలం వుంది. ప్రహరీగోడకి ఆనుకుని నాలుగు పోకచెట్లు ఎవుగా పెరిగినవి వున్నాయి. గేటుకి రెండువైపులా బోగన్ విల్లా విరగబూచిన పూలగుత్తులతో నిండి అందంగా వుంది. లోపల చిన్న లాన్ ఇటు అటు అన్నిరకాల పూలమొక్కలు - అన్నీ అందంగా, వరసగా వేసినవి వున్నాయి. ఇంటి గుమ్మంముందు, మెట్లమీద అందంగా పూలకుండీలు వున్నాయి. మేడమీదకి యెక్కించిన సన్నజాజి, మనీప్లాంట్ గుబురుగా పెరిగాయి.
తలుపు వేసివుంది. మనుష్యులు యెవరూ కనపడలేదు సుజాతకి. కాలింగ్ బెల్ నొక్కింది. ఎత్తికట్టిన లుంగీ, బనీను వున్న అతను సుజాతని, సుజాత చేతిలో సామానుని కాస్త ఆశ్చర్యంగా చూసి "ఎవరు కావాలి?" అన్నాడు.
"డాక్టరుగారు..... డాక్టరుగారు...." అంది కాస్త తడబడుతూ సుజాత.
"మందుకోసమా.....అమ్మ టిఫిన్ తింటూంది.....నర్సింగ్ హోమ్ పొండి, అక్కడికొస్తారు అమ్మ" అన్నాడు కాస్త అరవయాసతో.
సుజాత మధ్యలోనే తల త్రిప్పుతూ "మందుకోసం కాదు......నేను ఉద్యోగం కోసం వచ్చాను......డాక్టరుగారు రమ్మన్నారు" అంది.
ఓ......హౌస్ కీపర్ ఉద్యోగానికి వచ్చుండారా....." అన్నాడతను సుజాతని ఎగాదిగా చూస్తూ.
తల ఊపింది సుజాత. "అమ్మతో చెప్పి వస్తా" అంటూ లోపలికి వెళ్ళాడు. మరో నిమిషానికి పైకి వచ్చి....."రండి, అమ్మ పిలుస్తూంది" అని దారితీశాడు లోపలికి.
సుజాత దడదడలాడుతున్న గుండెతో కాస్త తొట్రుపడుతూ అతని వెంట నడిచింది. ఆ ముందు వరండాని దాటి నాలుగడుగులు దారిలా వున్న పడవ దాటగానే పెద్ద హాలులో ప్రవేశించారు. ఆ పెద్దహాలు డ్రాయింగ్ కమ్ డైనింగ్ రూముగా విభజించి వుంది. డ్రాయింగు రూము చాలా ఆధునికంగా, అందంగా అలంకరించి వుంది. డైనింగ్ టేబిల్, ఫ్రిజ్, కప్ బోర్డులతో
డైనింగురూము-సుజాత ఒక్కక్షణంలో చుట్టూ చూసి గ్రహించినది ఇది. ఆ తరువాతే డైనింగ్ టేబిల్ దగ్గిర కూర్చుని టిఫిన్ తింటున్న ఆమెమీద దృష్టిపడింది.
సుజాత చేతిలో పెట్టె క్రిందపెట్టి నమస్కారం చేసింది ఆమెకి గాభరాగా. ఆమె అప్పటికే సుజాతని ఓసారి ఆపాదమస్తకం పరీక్షించేసింది. ఆమె మొహం సంతృప్తిగా వికసించింది.
"నువ్వేనన్నమాట సుజాతవి......వచ్చేశావన్నమాట....రా.....రాఅలా కూర్చో...." అంది కుర్చీ చూపిస్తూ.
"స్టేషనికి వద్దామనుకున్నాను గానీ, ఇవాళ లేచేసరికి కాస్త ఆలశ్యం అయింది.
"డ్రైవరన్నా లేడు పంపుదామన్నా.....నేనే రావాలి.....మళ్ళీ ఆస్పత్రికి ఆలస్యం అవుతుంది అని బద్దకించాను. ఇంకెవరునన్నా పంపితే వాళ్ళు గుర్తుపట్టలేరు అని వూరుకున్నాను. ట్రైను కాస్త లేటయినట్టుందే" అంది వాచి చూసుకుంటూ.
"అవునండీ, నలభై నిమిషాలు....."
"సర్లే పోనీ, వచ్చేశావు కదా నాయర్, ఈ అమ్మాయికి కాఫీ తీసుకురా...." అని నాయర్ ని పురమాయించింది ఆవిడ టిఫిను గబగబ తింటూ.
