Previous Page Next Page 
అగ్ని పరీక్ష పేజి 9


    "ఒక్క విషయం......ఒకవేళ నా మీద కోపంతో కసిగా పావని యివ్వనని బెదిరిస్తే, ఈ మగవాళ్ళు భార్య లొంగి రాకపోతే పిల్లల్ని అడ్డుగా వాడుకుంటారు. పాపని యివ్వనని అంటే ఎలా? పాపని వదిలి రాలేను గదా" ఆ ఆలోచనకే కలవరపడ్తూ అంది.
    రాజేష్ ఒక్క క్షణం ఆలోచించాడు-అదీ నిజమే-భార్య తన మాట వినకుండా యింట్లోంచి పోతుందన్న కసితో పిల్లనివ్వకుండా బెదిరిస్తే-ఆ పాయింట్ ఆలోచించాల్సిందే, "చూడండి ముందరి కాళ్ళకి బంధంలా మీరే ముందు "నేను వెడ్తున్నాను, మీ పిల్లని మీరే చూసుకోండి" అంటూ వదలండి. ఆయన బెదిరిపోతారు. వంటరిగా చంటిపిల్లని చూసుకోడం తమాషా కాదు. 'పోతే పోనీ కూతుర్ని కూడా తీసుకో' అనకపోతే చూడండి. ఒకవేళ అలా అనకపోతే చంటి పిల్లని తల్లినించి తీసుకుని యివ్వడం లేదని మనం పోలీసు కంప్లైంట్ యివ్వచ్చు. అంత దాక రాదని నా నమ్మకం. మనం ముందే యిక్కడ కూర్చుని అన్నీ ఊహించడం ఎందుకు. వెళ్ళండి అక్కడికి, ముందు ఏం జరిగేది చూద్దాం' ఆమెకి ధైర్యం చెప్తూ ప్రోత్సహించాడు.
    "రాజేష్ గారూ......యీ రోజు మీరు లేకపోతే నేనేమయ్యోదాన్నో గదా! ఆ రాత్రి చలిలో చేతిలో దమ్మిడి లేక ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాక, తల్చుకుంటే భయంగా వుంది. ఈ మీ సహాయానికి నేను ఎలా కృతజ్ఞతలు."
    "ప్లీజ్, మీరలా మాట్లాడి నన్ను మొహమాట పెట్టకండి, ఈ స్థితిలో నేనే కాదు ఎవరున్నా నాలాగే రియాక్ట్ అవుతారు. ఇందులో మీరింత నన్ను పొగడడానికి ఏంలేదు." రాజేష్ మొహమాటంగా అన్నాడు "అది సరే, ఎనిమిది గంటలవుతూంది ఆయన ఈ పాటికి లేచి వుంటారు మీరు వెళ్ళకూడదూ."
    "ఊ......పాపనిలేపి కాస్త మొహం కడిగి పాలు తాగించి వెడ్తాను కొంచెం పాలు వున్నాయా" బిడియంగా అడిగింది.
    "అఫ్ కోర్స్.....ఫ్రిజ్ లో యింకో పేకట్టు కూడా వుంది. బ్రెడ్ బటర్ వుంది బ్రేక్ ఫాస్ట్ కి. లేదంటే దగ్గిరలో సౌత్ యిండియన్ హోటల్లా వుంది. యిడ్లీ తీసుకువస్తాను స్కూటరు మీద వెళ్ళి.....మీరు ముందు పాలు సంగతి చూడండి. అన్నట్టు పాప పేరేమిటి అడగనే లేదు."
    "పూజ!......ఏరి కోరి పెట్టాను. దాని వెనక ఎంత గొడవ" నసుగుతూ అంది.
    "బలే గమ్మత్తుగా వుంది. అర్చన, పూజ!-ఇంత చక్కగా కలిశాయి మీ యిద్దరి పేర్లు పాపకి సంవత్సరం నిండిందా!"
    "ఈ నెలాఖరుకి రెండు వెళ్ళి మూడు వస్తుంది. పాపని లేపి ఎత్తుకు వచ్చి అంది అర్చన-పాప అంతా చాలా వరకు తల్లి పోలికే! తెల్లగా బొద్దుగా గుండ్రంగా వుంది. ముద్దులూరు తున్న పాపని చూసి చేతులు చాచాడు రాజేష్-కొత్త అనేదిలేకుమ్డా వచ్చేసింది పూజ. "అంకుల్ అమ్మా-పూజా-ఏదీ అంకుల్ అను" అంది అర్చన-పూజ సిగ్గుగా నవ్వి వచ్చీరాని ముద్దు మాటలతో 'అంకుల్' అంది. అప్పుడప్పుడే అన్ని మాటలు వస్తున్న పూజ ముద్దు మాటలకి పొంగిపోయి ముద్దు పెట్టుకున్నాడు రాజేష్. పూజ తల్లి వైపు చేతులు చాపింది. పాపని తీసుకొని అర్చన బాత్ రూములోకి వెళ్ళింది. 'మీరు అనవసరంగా హోటలుకి వెళ్ళనక్కరలేదు. బ్రెడ్ బటర్ చాలు ఈ పూటకి" అంటూ చెప్పింది.
    "స్నానం చేస్తే మార్చుకోడానికి బట్టలు లేవు. యింటికి వెళ్ళి వచ్చాక చేస్తాను" స్వగతంలా అంది అర్చన. "టోస్ట్ చేస్తున్నాను. రెండు స్లైజులు తిని వెళ్ళండి-ఆయనతో తలపడడానికి కాస్త బలం వుండాలి మీకు' చనువుగా నవ్వుతూ అన్నాడు. అర్చన కూడా నవ్వి, అతను కాల్చిన స్లైజులకి వెన్న రాసింది చాకుతో.
    "ఏమిటో ఆ యిల్లు అప్పుడే నాకు పరాయిదయి పోయినట్టు వెళ్ళాలంటే భయంగా వుంది. ఏదో ఆపద నెత్తిన పడినట్టు, ఏ పెద్ద పులినో ఎదుర్కోవాలన్నట్టు గుండెల్లో దడవస్తూంది. నిన్న రాత్రి చేసుకున్న నా నిశ్చయం సడలిపోతుందేమోనని భయంవేస్తూంది. నిన్నటి ఆవేశం, ఆవేదన తగ్గిపోయింది నాలో. కానీ, యింక కలిసి వుండడం అన్న ప్రశ్నకి తావు లేదనుకోండి-కాని ఎలా ఎదుర్కోడం అన్నదే భయంగా వుంది" బేలగా అంది అర్చన. బలవంతంగా బ్రెడ్ ముక్కలు కొరుకుతూ.
    "మీరేమిటి అంతలా భయపడ్తున్నారు, పులినోట్లో తలపెట్టడానికి వెళ్తున్నట్టు. యింత భయపడితే మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి వుండగలరా అసలు-ఎంతో భవిష్యత్తు వుంది మీ ముందు-ఒక్క రోజుతో అయ్యేది కాదిది-మరోసారి బాగా ఆలోచించండి ఆయన దగ్గరకి వెళ్ళేముందు."
    అర్చన డైనింగ్ చైర్ జరిపి నిల్చుంది- 'యింకేం ఆలోచించను - చూస్తాను. ఏం జరిగినా ఎదుర్కుంటాను. పాపని చేతిలోకి తీసుకుని వెడతాను. చూద్దాం ఏం అంటారో ఆ పెద్దమనిషి. రాజేష్ గారూ ఒకవేళ ఆయనగాని దౌర్జన్యానికి దిగి నన్ను కట్టడిచేస్తే మాత్రం సహాయానికి మిమ్మల్ని కలుస్తాను. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నన్ను ఆయన బారినించి కాపాడాలి" అభ్యర్ధన పూర్వకంగా అంటూ పావని తీసుకుని తన ఫ్లాట్ ముందుకు వెళ్ళి బెల్ నొక్కింది.
    'మీకేం ఫరవాలేదు......నేను యిక్కడే వుంటాను-తలుపు తీసే ఉంచుతాను. ఏం అవసరం వచ్చినా పిలవండి'-అన్నాడు తలుపు దగ్గిరకి వస్తూ రాజేష్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS