నేను చేస్తాను టీ, సారీ, మధ్యన మీరు ఈ గొడవలో ఇరుక్కున్నారు. అనవసరంగా మీకు శ్రమ నా వలన - మీ మనసు పాడయింది శలవు పూట." మొహమాటంగా నొచ్చుకుంటూ అంది అర్చన.
"బలే వారే, యిందులో శ్రమ ఏముంది - ఇట్సే ఎ ప్లెజర్ - అంటే మీకలా అవడం ప్లెజర్ అనికాదు సుమండీ-ఇలా మీరు నా ఇంట్లో వచ్చి నాతో టీ తాగడం అని నా భావన" చనువుగా అన్నాడు. "పక్కన వున్నా యిన్నాళ్ళుగా ఎన్నోసార్లు మీ యింటికి రావాలని మీవారితో పరిచయం పెంచుకోవాలని అనుకున్నాను. కాని ఆయన ఎప్పటికప్పుడు మాట పెంచకుండా వెళ్ళిపోయేవారు. నాలాంటి బ్రహ్మచారి మీతో మాట్లాడితే ఏం తప్పు పడ్తారోనని మిమ్మల్ని పలకరించడానికి భయపడ్డాను."
"ఆయనకి స్నేహితులు పరిచయాలు, మాటలు యివేం అక్కరలేదు. లెండి, అంత సజావయిన మనిషయితే ఈ ఏడుపు ఎందుకు - జస్ట్ ఏమినిట్.....పాపలేచిందంటే బాత్ రూమ్ కి వెళ్ళనీయదు...." అంటూ బాతురూములోకి వెళ్ళింది. రాజేష్ వంట గదిలో స్టవ్ మీద టీకి నీళ్ళు పెట్టాడు - ఆమె యిలా తనింట్లో పడుకోవడం, తను ఆమెతో మాట్లాడడం అంతా ఏదో కలమాదిరి అనిపిస్తూంది అతనికి కెటిల్లో నీళ్ళు పోసి-ట్రేలో కెటిల్, కప్పులు పెట్టుకుని డ్రాయింగు రూములోకి వచ్చేసరికి ఆమె బాత్ రూములోంచి వచ్చింది - "అరే. నేను చేస్తానన్నాను కదండీ." మొహమాటపడ్తూ అంది. "ఎంత బాచిలర్ అయినా టీ చెయ్యడం రాదనుకుంటున్నారా- ప్లీజ్ మీరు అలా అడుగడుగునా, మొహమాట పడకండి-రిలాక్స్. హాయిగా కూచుని తాగండి - నాకు మార్నింగ్ కప్పు మాత్రం సావకాశంగా తాగకపోతే ఏదోలా వుంటుంది" ఆమెకి కప్పు అందిస్తూ నవ్వుతూ అన్నాడు. "రాజేష్ గారూ....ఎంత విచిత్రంగా వుంది మనిద్దరం యిలా కూర్చుని టీ తాగడం."
"ఎగ్జాట్లీ. నేనూ యిదే అనుకున్నాను యింతకు ముందే."
అదే మామూలు పరిస్థితుల్లో అయితే మీ గుమ్మంలోకి యిలా వచ్చి కూర్చున్నందుకు ఆయన ఏమనేవారో అసలు యిప్పుడూ ఆయన వచ్చి చూస్తే ఏమంటారో నా ఊహకి అందడం లేదు." రాత్రిపడిన అవమానం, దుఃఖపు ఛాయలు ఆమె మొహంలో యిప్పుడు కనపడడంలేదు. చాలా తేలికగా మాట్లాడుతున్న ఆమెని చూస్తే ఆశ్చర్యంగానే అన్పించింది రాజేష్ కి. కాపురం వదిలిపోతున్నప్పుడు ఒక స్త్రీ ఇంతటి నిర్లిప్తత దశకి చేరుకుందంటే ఆమెలో సున్నితపు పొర ఏదో చెదిరిపోయి ఏం జరిగినా ఇంతకంటే అధ్వాన్నంగా వుండదులే అన్న ధైర్యం ఆమె గుండెని రాయిగా మార్చేసి వుండాలి.
"మిసెస్ రావ్. నేనొక మాటచెప్పనా." ఏదో అనపోయాడు రాజేష్.
"నన్ను అర్చన అని పిలవండి నేనింక మిసెస్ రావుని కాను. నిన్న రాత్రితో ఆ అధ్యాయం ముగిసిపోయింది. చెప్పండి మీరేం చెప్పదలిచారో." సూటిగా అంది.
"ఆహా. ఏంలేదు. మీరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. సరే బాగానే వుంది. కానీ వెళ్ళే ముందు ఒకసారి ఆయనతో స్పష్టంగా చెప్పేసే వెళ్ళిపోవచ్చు గదా. ఆయన ఏమంటారో విని వెళ్ళచ్చుగదా. ఆయనతో స్పష్టంగా యిల్ ట్రీట్ మెంట్ కారణంగా ఆయనతో కల్సి యింక బతకలేనని, కోర్టు ద్వారా విడాకులు తీసుకుందామని చెప్పి వెళ్ళచ్చుగదా- అలా అయితే బ్లేమ్ మీమీద వుండదు. రేపు మీవాళ్ళు మీరిలా తెగతెంపులు చేసుకొని వచ్చేముందు చెప్పకుండా వచ్చేసారంటే మిమ్మల్ని తప్పు పట్టచ్చు."
"అర్ధరాత్రి భార్యని యింట్లోంచి తరిమేసిన భర్త కాళ్ళు యింకా పట్టుకోమనే మీరూ అంటున్నారా" ఆవేశంగా అంది అర్చన.
"ఛా.ఛ. మీరు నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. నా ఉద్దేశ్యం మీరిలా ఇక్కడ దాక్కుని దొంగతనంగా వెళ్ళడం ఎందుకు దైర్యంగా ఆయనతో తెగేసి చెప్పి మీ బట్టలు అవి సర్దుకుని బయటికి వచ్చేయండి "నీ ప్రవర్తనతో నా సహనం ఆఖరి మెట్టుకు వచ్చింది-నేను మా ఇంటికి వెళ్ళి మా పెద్దలతో మాట్లాడి ఏం చెయ్యదలచింది నా నిర్ణయం తెలియపరుస్తాను" అని ఖచ్చితంగా చెప్పండి." అర్చన ఆలోచనలో పడ్డట్టు ఒక నిముషం ఊరుకుంది.
"నేను యింట్లోంచి వెళ్ళిపోతానంటే ఆయన ఒప్పుకోకపోతే ఇలా మీ యింట్లోవున్నానని నన్ను కొట్టి తిట్టి యింట్లోంచి వెళ్ళనీయకపోతే ఏం చెయ్యను - ఆ మనిషి దేనికన్నా సిద్దపడతాడు- "పెళ్ళాం ఇంట్లోంచి లేచిపోతే అవమానం అని నన్ను గడపదాటకుండా కట్టడిచేసి యింకా హింసిస్తే." భయంగా అంది.
"నిన్న రాత్రి యింట్లోంచి గెంటిన మనిషి యింతవరకు మీరేమయ్యారో పట్టించుకోని మనిషికి యింకా మీ మీద ఏం హక్కుందని యింట్లోంచి వెళ్ళనీయడు-అలా జరిగితే నేనున్నాను మీకు అండగా, నలుగురిని పిలిచి అతని అసలు రంగు బయట పెడ్తాను. అందరం కల్సి దాడి చేస్తే యింకేం చేస్తాడు-ఇంకా ఏదన్నా హింసకి డిగితే పోలీసు కంప్లైంట్ యివ్వచ్చు మనం" ఆవేశంగా అన్నాడు రాజేష్-"అసలు మీరు భయపడకుండా తెగించి ధైర్యంగా వెళ్ళి ఎదుర్కోండి-ఎదుర్కోనూ అక్కరలేదు-యింట్లోంచి వెళ్ళి మీ సామాను సర్దుకోండి ముందు-ఎక్కడికి, ఏమిటి అంటే తెగేసి యింట్లోంచి వెడ్తున్నానని చెప్పండి-అడ్డుకుంటే నలుగురిని పిల్చి మీరు చేసిన పని చెప్తానని చెప్పండి. ఆయన మూర్ఖంగా చేయి చేసుకుంటే బయటికి వచ్చి నన్ను పిలవండి నేను నలుగురినీ పిలుచుకువస్తాను. చూద్దాం అందరూ కలిస్తే ఏం చెయ్యగలడో" అర్చనకి ధైర్యం చెప్తూ అన్నాడు రాజేష్-అతని మాటలకి తల ఊపింది అర్చన. మనసులో ఓ మూల అతనితో ముఖాముఖి తలపడటానికి జంకుగా వున్నా రాజేష్ అన్నట్టు తను పిరికిగా పారిపోవడం ఎందుకు అని తనకి తాను ధైర్యంగా చెప్పుకుంది.
