కాలింగ్ బెల్ నొక్కిన రెండు మూడు నిమిషాలకి కాని తలుపు తెరుచుకోలేదు. తలుపు తెరిచిన రావు అర్చనని గుమ్మంలో చూసి ఏదో అనేలోపుగానే అర్చన యించు మించు అతన్ని నెట్టుకుంటూనే లోపలికి వెళ్ళింది. అప్పుడే నిద్రలేచి వచ్చినట్టుంది అతని మొహం. అర్చన ఎక్కడనించో బయటికెళ్ళివచ్చి లోపలికి వెడ్తున్నంత మామూలుగా రావు మళ్ళీ వెళ్ళి మంచంమీద పడుకుని ముసుగు పెట్టేశాడు. రాత్రి డ్రింక్ తీసుకున్న హేంగోవర్ అతన్నింకా పూర్తిగా విడలేదు. రాత్రి జరిగింది అతనికి మాత్రం గుర్తులేదు-అర్చన కూడా అతన్ని ఏమీ పలకరించకుండా, మాట్లాడకుండా గాడ్రెజ్ మీద తన సూటుకేసులు రెండూ తీసుకుని గాడ్రెజ్ లోని అలమారులోని బట్టలు, నగలు అన్నీ సూట్ కేసులో సర్దుకోసాగింది. బీరువాలో యింటి ఖర్చుల కిచ్చిన దానిలో నెలాఖరు ఏమో డెబ్బైరూపాయలుంటే అది పర్సులో పెట్టుకుంది. తన టాయ్ లెట్ సామాను, పాప వస్తువులు, ఆటవస్తువులు అన్నీ సర్దింది ఓ బుట్టలో గదిలో చప్పుళ్ళకి, సూట్ కేస్ లాక్ చేసిన శబ్దానికి మొహం మీద నించి రగ్గుతీసి విసుగ్గా "ఏమిటి గోల, చప్పుళ్ళు. కాసేపు పడుకోనీయవు కొంపలో ప్రశాంతంగా' అంటూ అరిచాడు. అరుస్తూ పూర్తిగా కళ్ళు విప్పి పాక్ చేసిన సామానుచూస్తూ "ఏమిటిది ఎక్కడికీ ప్రయాణం" అన్నాడు మత్తు పూర్తిగా వదుల్చుకుని కటువుగా. అర్చన మౌనంగా తనపని పూర్తిచేసి "ఇదిగో మీ యింటి తాళాలు, నేను యీ యింట్లోంచి వెడ్తున్నాను. నా సామాను, బట్టలు మాత్రం తీసుకెడ్తున్నాను" అని తాళాలు మంచంమీద పెట్టింది నిబ్బరంగా చూస్తూ-ఒక్కక్షణం ఆశ్చర్యంగా చూశాడు రావు. తరువాత మొహం జేవురించింది. "ఏమిటి నీ ఉద్దేశం" తీక్షణంగా చూస్తూ అన్నాడు.
"నా ఉద్దేశం...ఇంక మీతో కాపురంచేసే ఉద్దేశంలేదు. నా ఉద్దేశం అది - ఇన్నాళ్ళుగా, మూడేళ్ళనించి మీ జులుం, మీ అధికారం అన్నీ సహించాను. నిన్నటితో నా ఆశ అడియాశ అయింది. నా సహనం ఆఖరి మెట్టుకు వచ్చింది. మీ అనుమానాలు, అమానుషత్వం యింక భరించేశక్తి నాకులేదు. అంచేత యింక మీతో కాపురం నావల్లగాదు. నేను ముందుగా మా యింటికి వెడ్తున్నాను అక్కడ మా పెద్దలతో ఆలోచించి కోర్టులో ప్రొసీడ్ అవుతాను." స్థిరంగా ఒక్కొక్క మాట వత్తి పలుకుతూ అంది అర్చన - ఒక్క అరక్షణం రావు మొహం తెల్లబడింది. అంతలోనే మొహం కోపంతో జేవురించింది. ఒక్క ఉదుటున మంచంమీద నించి లేచి అర్చన జుత్తుపట్టుకున్నాడు "రాస్కెల్, నీకింత ధైర్యమా.......నన్నే ఎదిరించి మాట్లాడతావా, యింట్లోంచి పోతావా, కాలు కదిపితే నరికేస్తాను జాగ్రత్త కోర్టుకెక్కుతావా. కోర్టుదాకా ఎందుకు నీ అంతుఇప్పుడే తేలుస్తా." జుట్టుపట్టుకు గుంజి చెంపమీద చెళ్ళుమని కొట్టాడు.
"ఆగండి మళ్ళీ నా వంటిమీద చేయిపడిందో నేనూ మీ అంతుతేలుస్తా - వదలండి ముందు నా జుట్టు." అర్చన ఆడపులిలా గర్జించి అతని చేతులనించి జుట్టులాక్కుని తిరస్కారంగా ఏహ్యంగా చూసి మళ్ళీ మీదకి రాబోతున్న రావుని ఒక్క తోపుతోసి వంటింట్లోకి పరుగున వెళ్ళి కూరలుకోసే కత్తి చేతిలోకి తీసుకుని "ఒక్క అడుగు ముందుకు వేసారో నేనేం చేస్తానో నాకే తెలియదు జాగ్రత్త." దెబ్బతిన్న శివంగిలా గర్జించింది. అర్చన అవతారం, చేతిలో కత్తిచూసి అప్రయత్నంగానే అడుగు వెనక్కి వేశాడు రావు.
"నిన్న రాత్రితోనే మీకూ నాకు సంబంధం తెగిపోయింది. ఇప్పుడు యింక నన్నేం చేసినా, నామీద చేయి చేసుకున్నా ఏదన్నా కట్టడి చేసినా యిప్పుడే వెంటనే వెళ్ళి పోలీసు రిపోర్టు యిస్తాను-" తీక్షణంగా చూస్తూ అంది అర్చన, అర్చన మాటలు విన్నాక ఆమె ఏదో భయపెట్టడానికి అనడంలేదని సీరియస్ గానే అంటూందని అర్ధం అయింది రావుకి.
మనసులో ఒక్కక్షణం బెదిరినా అర్చన ముందు తగ్గిపోవడానికి మగ అహం అడ్డువచ్చింది. అసలే రాత్రి తాగుడుతో ఎర్రబడ్డకళ్ళు మరింత ఎర్రబడి క్రూరంగా చూశాడు. "ఫో. తక్షణం నా యింట్లోంచి పోయి రోడ్లమీద అడుక్కుతిను. అప్పుడుగాని నీకు బుద్ధిరాదు. అప్పటికిగాని మొగుణ్ని ఎదిరించడం అంటే ఏమిటో తెలిసిరాదు." ఆవేశంతో మాటలు తడబడ్డాయి.
"హు....నీలాంటి నీచుడితో కాపురం కన్నా రోడ్లమీద అడుక్కుతినడం నయమేలే - నీలాంటి అధముడితో వుండి నీవు పడేసే తిండితినే కంటే నాలుగిళ్ళల్లో పాచిపని చేసుకుని తినడం నయం." ఛీత్కారంగా చూస్తూ అంది అర్చన. అర్చన అన్నింటికి తెగించి నిర్ణయం చేసుకుందని తన చేయి దాటిపోయిందన్న విషయం రావుకి అర్ధం అయింది ఆఖరి అస్త్రం వదిలాడు.
"ఫో, నడు నా యింట్లోంచి నా పిల్లని వదులు నా పిల్లనిచ్చి నీ యిష్టం వచ్చిన చోటపోయి అడుక్కుతిను." అంటూ కూర్చున్నపాపని విసురుగా లేపి లాగాడు.
అసలే యిద్దరి దెబ్బలాటకి బిక్కచచ్చిపోయి చూస్తున్న పాప ఏడుపు లంకించుకుంది, పాప ఏడుపు, తండ్రి చేతుల్లోంచి గింజుకుని తన దగ్గిరకి రావాలని ఏడుస్తున్న కూతురిని చూసి కూడా గుండెదిటవు పరుచుకుంది రాజేష్ మాటలు గుర్తుచేసుకుని మనసు కలచివేస్తున్నా పైకి నిబ్బరంగా నటించి నిర్లక్ష్యంగా పాప బట్టలపెట్టి పక్కనపెట్టి అసలు నేనే అనాలనుకున్నాను మీ పిల్లని మీరే వుంచుకొని పోషించుకోండి అని. నాకేదో దారి దొరికే వరకు పాప నాకు బరువు" దాన్ని పోషించే స్తోమత నాకుండదు ఎలాగా అని ఆలోచిస్తున్నాను. తప్పకుండా మీరే పెంచి పెద్ద చేయండి తల్లిగా దాన్ని వదలడం నాకు బాధ అయినా కొన్నాళ్ళకి అలవాటయి పోతుంది లెండి" అంటూ తన పెట్టెలు రెండూ గుమ్మం బయట పెట్టుకుంది తన అస్త్రానికి బెదిరి లొంగిరాకపోగా నిర్లక్ష్యంగా పిల్లని తనమీద పడేసి వెళ్ళిపోతున్న అర్చనని చూసి బెదిరాడు రావు.
చేతిలో నిలవకుండా గింజుకుంటూ ఏడుస్తున్న పిల్లని చూసి-దీన్ని నేనెక్కడ పెంచను ఎలా పెంచను..... ఈ తద్దినం తననెత్తిన ఎందుకు పసిపిల్లని పెట్టుకుని తన ఆఫీసు పని ఎలా చూసుకుంటాడు. అరక్షణంలో అతని మనసులో లక్ష ఆలోచనలు భయపట్టేశాయి గుమ్మందాటినా అర్చన వెంట గాభరాగా వెళ్ళి పిల్లని కింద కుదేశాడు. "తీసుకుపో - దీన్ని తీసుకుఫో నీవు కన్న ఈ తద్దినం నాకెందుకు యిద్దరూ కలిసి రోడ్లమీద అడుక్కోండి నాకేం నేను మగవాడిని నాలుగురోజులు తిరక్కుండా మళ్ళీ పెళ్ళి చేసుకుంటాను చూస్తుండు. బట్టలు సర్దిన సూట్ కేస్ తీసుకొచ్చి వరండాలోకి గిరవాటుపెట్టి దబాలున తలుపు మూసుకున్నాడు రావు. అర్చనకి నవ్వు వచ్చింది హు, ఈమగవాళ్ళు....అందితే జుత్తు పట్టుకోడంతెలుసు. పిల్లని ఆడదిక్కు లేకుండా పెంచడం తమాషా అనుకున్నాడు..... యింట్లో చాకిరి చేసిపెట్టే భార్యలేనపుడు కాని ఆ అవస్థ అర్ధంకాదు. ఆ మనిషికి బుద్ధి వచ్చినా రాకపోయినా ఇంతతనకి అనవసరం....అర్చన గుమ్మంలోంచి పెట్టెలు తీసుకుని రాజేష్ యింటివైపు వెళ్ళిపోతుంటే రాజేష్ చటుక్కున బైటికివచ్చి సూట్ కేసులు రెండూ అందుకుని లోపల పెట్టాడు. అర్చన మిగిలిన సామాను లోపల పెట్టాక తలుపులు మూసింది."
