ఎండిన మ్రోడులే కిసలయించెనొ! ఏకశిలాపురమ్ములో
బండలు పుల్కరించెనొ! అపార ముదమ్మున తెల్గుతల్లికిన్
గుండెలు పొంగిపోయి కనుగొల్కులు నిండెనొ! పచ్చిపైరులే
పండెనొ! జాలువాఱిన భవత్ కవితామృత భక్తిధారలన్!
భీష్మునిపైకి కుప్పించి లంఘించు గో
పాలకృష్ణుని కుండలాల కాంతి
కరిరాజు మొఱపెట్ట పఱువెత్తు కఱివేల్పు
ముడివీడి మూపుపై బడిన జుట్టు
సరసమ్ము గావించు సత్య కన్నులనుండి
వెడలు ప్రేమక్రోధ వీక్షణములు
కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ
సందు మాగాయ పచ్చడి పసందు
ఎటుల కనుగొంటివయ్య! నీ కెవరు చెప్పి
రయ్య! ఏరాత్రి కలగంటివయ్య! రంగు
కుంచెతో దిద్దితీర్చి చిత్రించినావు!
సహజపాండితి కిది నిదర్శనమటయ్య !!
ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో
నద్దితివేమొ గంటము మహాకవిశేఖర ! మధ్య మధ్య అ
ట్లద్ధక - వట్టిగంటమున నట్టిటు గీచిన తాటియాకులో
పద్దెములందు - ఈ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా?
"భాగవతమ్ము భాగ్య పరిపాకము ఆంధ్రులకెల్ల - దానిముం
దాగగజాల వే కవిత" లంచు నభంబున దేవదుందుభుల్
మ్రోగినవేమొ! నీవు కలముంగొని కావ్యము వ్రాయ చిందిపో
సాగినవేమొ! తీయని రసాల రసాలు త్వదీయలేఖినిన్ !
వేసము మార్చి యిన్ని దిగవేసి "యభా" సొనరింపకుండ శ్రీ
వ్యాసుని గ్రంథ మాంధ్రమున వ్రాసితి వంధము చింద; నీద అ
గ్రాసనమయ్య ఆంద్రకవులందు; వారాలకు నెత్తుకెత్తుగా
ఆ సొగసైన పద్దెము లయారె! తయారగు నీ కలాననే !!
ఖ్యాతి గడించుకొన్న కవు లందరు లేరె! అదేమి చిత్రమో
పోతన యన్నచో కరిగిపోవు నెడంద; జొహారుసేతకై
చేతులు లేచు; ఈ జనవశీకరణాద్భుతశక్తి చూడగా
నాతని పేరులో గలదొ! ఆయన గంటములోన నున్నదో!
ఆంధ్రవిద్యార్ధి
సర్వభూమీ పూజ్య గీర్వాణ భాషా మ
తల్లి గారాబంపుతల్లి నాకు
అత్యంత సుకుమారి ఆంధ్రభాషాయోష
అల్లారుముద్దులచెల్లి నాకు
నవనవోన్మేష సుందరమూర్తి సాహితీ
లక్ష్మియే అర్ధాంగలక్ష్మి నాకు
కమనీయ మృదుపదక్రమ కవితా బాల
కలికి పాలకుల పసికందు నాకు
పాణినీయులు దేశికప్రభులు నాకు
సరసవాఙ్మయపురము కాపురము నాకు
వాణి వాయించు మాణిక్య వీణలోని
యర్ధ మెఱిగిన "ఆంధ్ర విద్యార్ధి" నేను!
ఒకమాటు కనుమోడ్చుచుందు బమ్మెరవారి
మందార మకరంద మధురవృష్టి
ఒకమాటు మూర్కొనుచుందు తిమ్మనగారి
పారిజాత వినూత్న పరిమళమ్ము
ఒకమాటు చవిచూచుచుందు పెద్దనగారి
ద్రాక్షాగుళుచ్చ సుధా సుధార
ఒకమాటు విహరించుచుందు పింగళివారి
వరకళాపూర్ణ సౌవర్ణ శిఖరి
ఒకట కవితా కుమారితో నూగుచుందు
గగన గంగా తరంగ శృంగారడోల;
ఆంధ్ర సాహిత్య నందనోద్యానసీమ
నర్ది విహరించు "ఆంధ్ర విద్యార్ధి" నేను.
కాళిదాస కవీంద్ర కావ్యకళావీథి
పరుగులెత్తెడి రాచబాట నాకు
భట్టబాణుని ముద్దుపట్టి కాదంబరి
కథలు చెప్పెడి చెల్మికత్తె నాకు
భవభూతి స్నేహార్ధ్ర భావవైభవ గీతి
కరుణారసాభిషేకమ్ము నాకు
వాల్మీకి కవిచక్రవర్తి భావస్ఫూర్తి
ఆటలాడెడి పూలతోట నాకు
భారతీదేవి మృదులాంక భద్రపీఠి
ముద్దు లొలికెడి రతనాల గద్దె నాకు
తెనుగుతోటల సంస్కృత వనలతాళి
నంటుత్రొక్కెడు "ఆంధ్ర విద్యార్ధి" నేను!
అస్వతంత్రుడు
నేనొక దగ్ధజీవనుడనే అయినాను - మదీయ మానసో
ద్యానమునిండ రక్కసిపొదల్ చిగిరింతలు గారకంపలే
గాని, పదే పదే పయిరుగాలికి నూగు గులాబి గుత్తులే
కానగరావు - స్వేచ్చయును గల్గునె యీ కరుణావిహారికిన్?
నేనొక వెఱ్ఱిమొఱ్ఱికవినే అయినాను - మదీయ జీవితా
ఖ్యానమునందు క్లిష్టగతి కష్టసమన్వయ దుష్టసంధులే
కాని సుగమ్య సుందర సుఖంకర సూక్తి సువర్ణ పంక్తియే
కానగరాదు - బోధమును గల్గునె యీ కవితావిలాసికిన్?
నేనొక జీర్ణశిల్పకుడనే అయిపోయితి - నాయులిన్ సదా
పీనుగ మొండెముల్ పునుక పేరులు కుంటికురూపి బొమ్మలే
కాని, వినూత్న యౌవన వికాస మనోహర రూపరేఖయే
కానగరాదు - తృప్తియును గల్గునె యీ తృషితాంతరాత్మకున్?
నేనొక క్లిష్టగాయకుడనే అయిపోయితి - నా విపంచిపై
దీన గళమ్ముతో తెగిన తీగలమీద విషాదగీతులే
కాని, రసంబు పొంగి పులకల్ మొలపించు ప్రమోదగీతియే
కానగరాదు - స్థాయియును గల్గునె యీ రసలుబ్దజీవికిన్?
నేనొక రంగలంపటుడనే అయినాను - మదీయ నాటకా
స్థానములో బుసల్ గుసగుసల్ సకిలింతలు చప్పరింతలే
కాని, సెబాసటంచు రసిక ప్రవరుల్ తలలూపి మెచ్చుటే
కానగరాదు - సిద్ధియును గల్గునె యీ నటనావినోదికిన్?
నేనొక కష్టకర్షకుడనే అయినాను - మదీయ బుద్ధి మా
గాణము నిండ ఒడ్డు మెరకల్ రవపెంకులు ఱాలుఱప్పలే
కాని, పసందుగా పసిడి కంకులు వంగిన పంటపైరులే
కానగరావు -పుష్టియును గల్గునె నిష్ఠదరిద్రమూర్తికిన్?
నేనొక నష్టజాతకుడనే అయినాను - మదీయ జన్మ చ
క్రాన కుజాష్టమాది కుటిలగ్రహ కుండలి క్రూరదృష్టులే
కాని, త్రికోణ కేంద్ర శుభగ గ్రహ వీక్షణ సామరస్యమే
కానగరా - దదృష్టమును గల్గునె యీ దురదృష్టమూర్తికిన్?
నేనొక భగ్ననావికుడనే అయినాను - మదీయ భావనాం
భోనిధిలో మహామకరముల్ సుడిగుండములున్ తుఫానులే
కాని, సుధా సుధాకిరణ కల్పక దివ్యమణీ వితానమే
కానగరాదు - అద్దరియు గల్గునె యీ యెదురీతగానికిన్?
నేనొక దీనభిక్షుకుడనే అయినాను - మదీయ జీర్ణ గే
హాన దరిద్రదేవత మహా వికట ప్రళయాట్టహాసమే
కాని, యదృష్టలక్ష్మి కడకంటి సుధా మధురార్ధ్రదృష్టియే
కానగరాదు - భాగ్యమును గల్గునె యిట్టి యభాగ్యశాలికిన్.
నేనొక వ్యర్ధతాపసుడనే అయినాను - మదీయ సంతత
ధ్యాన సమాధిలో వెకిలిదయ్యపు మూకల వెక్కిరింతలే
గాని, ప్రసన్నభావ కళికా లవలేశ విలాసమేనియున్
గానగరాదు - ముక్తియును గల్గునె యీ పరితప్తమౌనికిన్?
తెనుగుతల్లి
కనిపింపదే నేడు! కాకతీయ ప్రాజ్య
సామ్రాజ్య జాతీయ జయపతాక
వినిపింపదే నేడు! విద్యానగర రాజ
సభలోని విజయ దుందుభుల మ్రోత
చెలగదే నేడు! బొబ్బిలికోట బురుజుపై
తాండ్రపాపయ తళత్తళల బాకు
నిప్పచ్చరంబయ్యెనే నేడు! వీర ప
ల్నాటి యోధుల సింహనాదలక్ష్మి
చెక్కుచెదరని - యేనాడు మొక్కవోని -
ఆంధ్ర పౌరుష మిప్పుడధ్వాన్న మయ్యె;
మరల నొకమాటు వెనుకకు మరలిచూచి
దిద్దుకోవమ్మ! బిడ్డల తెనుగుతల్లి!
రాజురాజుల చరిత్రల నాలపించెడి
గౌతమీ గద్గద కంఠరవము
కృష్ణరాయల కీర్తిగీతాలు కడుపులో
జీర్ణించుకోను హంపి శిథిలశిలలు
అలనాటి కాకతీయుల పౌరుషము త్రవ్వి
గంపకెత్తెడి ఓరుగంటి బయలు
బలితంపు రెడ్డి బిడ్డల సాము గరిడీల
రాటుతేలిన కొండవీటి తటులు
విని - కని - తలంచుకొని గుండె వ్రీలిపోయి -
వేడి వేడి నిట్టూర్పులే విడిచినాము!
గుడ్డ గట్టిన కడిపెడు కొడుకులుండి
యిల్లు వాకిలి కరవైన తల్లి వీవు !!
"రాయి గ్రుద్దును" నీ పురా శిల్పసంపత్తి
నమరావతీస్తూప సముదయంబు;
"చదివించు" నీ మహాసామ్రాజ్య కథల నాం
ధ్ర క్ష్మాపతుల జయస్తంభ లిపులు;
"గళమెత్తిపాడు" నీ గాన సౌభాగ్యమ్ము
రమణీయముగ త్యాగరాయ కృతులు;
"వేనోళ్ళచాటు" నీ వీర మాతృత్వమ్ము
పలనాటివీరుల పంబ కథలు;
