కాలుకదపక బిడ్డ లుయ్యేలలందు
నూగునాడె ముల్లోకమ్ము లూగుచుండె;
కాలువచ్చి గంతులు వేయు కాలమున
ఇంతకెంతౌనొ? వింతబాలెంతరాల!
ఇయ్యఖిల ప్రపంచములనే తమబొజ్జల మాటుకొన్న బా
బయ్యలు మువ్వురున్ శిశువులై శయనించిరి నీ గృహాన - నీ
తియ్యని జోలపాటల కిదే పులకించెను సృష్టియెల్ల - నీ
యుయ్యెల తూగులో నిదురనొందెనులే పదునాల్గు లోకముల్ !!
గర్భము లేదు - కష్టపడి కన్నది లే -దిక బారసాల సం
దర్భము లే - దహో! పురిటిస్నానములున్ నడికట్లు లేవు- ఏ
స్వర్భువనాలనుండి దిగివచ్చిరి నీ ప్రణయాంక పీఠి కీ
యర్భకు? లంతులేని జననాంతర పుణ్యతపఃఫలమ్ములై.
ఆదియు నంతమే యెఱుగనట్టి మహామహిమాఢ్యులైన బ్ర
హ్మాదుల కుగ్గువెట్టి ఒడియం దిడి జోలలుపాడు పెద్ద ము
త్తైదువ! "ధన్యురాలవు" గదమ్మ! త్వదుజ్జ్వల కీర్తిగీతికా
నాదము మ్రోగె స్వర్గ భువనమ్మున దైవతమౌని వీణపై.
అగ్గిని గల్పి మట్టు మరియాదలు - పుణ్య పురాణపూరుషుల్
ముగ్గురు చేయవచ్చిన యమోఘపు టగ్నిపరీక్షలోపలన్
నెగ్గితి వీ, వపూర్వములు నీ చరితల్ చెవిసోకి మేనులన్
గగ్గురుపాటు పుట్టినదిగా ముగురమ్మల కొక్క పెట్టునన్!
కొంగులువట్టి "మా పసుపుకుంకుమతో పతిభిక్ష పెట్టి మా
మంగళసూత్రముల్ నిలుపు" మంచు సరస్వతి సర్వమంగళా
మంగళదేవతల్ ప్రణతమస్తకలై పడియున్నవారు నీ
ముంగిటిముందు; నారదుని మోమున నవ్వులు నాట్యమాడగన్!
అమ్మవైనావు చతురాస్యహరిహరులకు -
అత్తవైతివి వాణీరమాంబికలకు -
ఘనమైన అత్తగారి పెత్తనము చూపి
క్రొత్త కోడండ్ర నిక దిద్దుకోగదమ్మ !
మాతృప్రేమ పునీతమౌ సఫల దాంపత్యమ్ము నీ సొమ్ము, నీ
పాతివ్రత్యములోన అత్రితపముల్ పండెన్, వియద్గంగకే
యేతామెత్తెను నీయశస్సులు, గుమాయించెన్ జగమ్మెల్ల నీ
యాతిథ్యమ్ము, నమస్సులమ్మ అనసూయా! అత్రిసీమంతినీ!
సతీసావిత్రి
"నల్లనివాడు రక్తనయనమ్ముల వాడు - భయంకరస్వరూ
పోల్లసనమ్మువాడు - గద నూని మహామహిషమ్ముపై ప్రవ
ర్తిల్లెడివాడు - నా ప్రణయదేవుని జీవధనమ్ము తెచ్చె -నో
భిల్ల పురంధ్రులార! కనిపింపడుగా? దయచేసి చెప్పరే!"
ఓ దీనత్వము రూపు గైకొనిన ప్రేమోన్మాదినీ! యేల నీ
వీ దారింబడి దక్షిణాభిముఖివై యేతెంతువీ కానలో?
నీ దిక్కైదరిజేర్చువా రెవరు లేనేలేరటే తల్లి! ఏ
దేదీ! మోమిటు ద్రిప్పు మెవ్వతెవు దేవీ! నీవు సావిత్రివా!
చెడ్డది గొడ్డుబోతువిధి, చెల్లి! నిమేషముక్రింద ఏటికా
యొడ్డున గట్టుమీద నిలుచుండి హుటాహుటి రెండుచేతులన్
గొడ్డలిబట్టి కట్టియలుగొట్టెడి నీ హృదయేశు నెత్తిపై
గొడ్డలిపెట్టిపెట్టి పడగొట్టిన దుష్టకిరాతు డెవ్వడో !
నారదుడు చెప్పె - బెదిరించె నాన్నగారు -
తల్లి బతిమాలె - నీ గుండెధైర్యమేమొ !!
చా వెఱింగియు కట్టుకొన్నావు నాడు !
కొదువయైపోయె పసుపు కుంకుమలు నేడు !
పెండ్లినా డమ్మ చెక్కిట బెట్టినట్టి
కాటుక యరాబు రవ్వంత కందలేదు !
పెద్ద ముత్తైదువలు కాళ్ళ దిద్దినట్టి
పసుపు పారాణి కనుమాపు పడనెలేదు.
అత్తయు మామగారు జనుషాంధులు; కాసానభూములందు క్రొం
గ్రొత్తది కాపురమ్ము; జనకుండిట లేడు; నిజేశు డి ట్లక
స్మాత్తుగ కూలిపోయె;కొరమాలిన క్రూరవిధాత నేడు నీ
కుత్తుక కత్తిపెట్టి తెగగోసెను చిట్టెపు రాతిగుండెతో !
వదనశ్రీ వసివాడిపోయినది; జవ్వట్లాడె లేగౌను; నీ
మృదు పాదమ్ములు బొబ్బలెత్తినవి; నెమ్మేనెల్ల కంపించె; వ
ట్టిది నీ నాథుడు నీకు దక్కుట - వధూటీ! ఆగిపోవమ్మ! అ
ల్లదిగో కాలుడు చాలదూరమున; నీవందించుకోలేవులే!
"నా" యను దిక్కులేని, పదునారవయేడును వచ్చిరాని, లే
బ్రాయపు చిట్టితల్లివి! అరణ్యములో జమువెంట నొంటిగా -
నాయువు దీరిపోవు పతికై పరువెత్తెదు! నీ ప్రపత్తికిన్
మ్రోయవె దేవదుందుభులు; మ్రొక్కెవె ఈపదునాల్గులోకముల్ !
బత్తెపు గింజలేనిపతి ప్రాణముకోసము వెంటనంటి ప
ర్వెత్తెడు పిచ్చిపిల్ల వనియే తలపోసెనొ -కచ్చగట్టి దం
డెత్తుసతీమతల్లి వని యెంచెనొ - చట్టున నిల్చిపోయినా;
డుత్తదిగాదు చూడు మవిగో! బిగబట్టిన దున్నపగ్గముల్!
"వందన మో మహా మహిషవాహన! నీదయచేత నాన్నకున్
నందను లబ్బినారు; నయనమ్ముల గల్గెను మామగారికిన్;
హైందవసాధ్వి కీ శుభములన్ని లభించియు భర్తలేక ఆ
నందము గల్గునా? నుతగుణా! పతిభిక్ష ననుగ్రహింపుమా!"
"పతి నొసగు" మంచు దోసి లొగ్గితివొ లేదొ
చేతిపగ్గాలు సడలించె ప్రేతరాజు;
పఱచుచున్నది మహిష మంబరమునందు
వెంటబడుమమ్మ గుండె ద్రవించునేమో!
చేతిమీదుగ ఎన్నెన్నో పూతపిందె
కాపురమ్ములు తీసిన ఘాతుకుండు;
నిండు ప్రాణాలు నిలువున పిండుకొనెడి
గుండెతడిలేని కర్కోటకుండు వాడు!
కాలుని దున్నపోతు మెడ గంటల పట్టెడలోని కింకిణీ
జాల "ఘణం ఘణం" ధ్వనులు చల్లగ చల్లగ సాగి, దూర దూ
రాలకు పోయె - నీ యెలుగు రాసిన గొంతుక పిల్పులేల? "ఓ
హో" లకు నంద డాత; డడుగో! కనిపించెడి కొండమల్పులో !
వైతరణీ ప్రవాహములు వైదొలగెన్ - అసిపత్ర కానన
వ్రతాహము స్వాగతమ్మిడె - సెబాసదిగో యమ రాజధానియున్!
ప్రేతపురీశు డేడి కనిపింపడు! దుర్గములోన దూరినా
డాతడు; కోటతల్పు లకటా! బిగియించిరి ద్వారపాలకుల్.
కడకంటన్ బ్రభవింప రక్తనది - సాక్షాత్ కాళికాదేవివై
నడికట్టుం బిగియించి నిల్చిన త్వదంతశ్శక్తికిన్ "ఫెళ్ళునన్"
గడియల్ గూలి "గభీలు" మంచు యమ దుర్గద్వారముల్ బ్రద్దలై
పడియెన్ ధాత్రి; "చిరాయురస్తు" జగదాంబా! నీకు నీభర్తకున్ !
"భగవంతుం డొకడున్న నా కీడును నాప్రాణేశు - లేకున్నా నీ
జగముల్ నిల్చునె" యంచు భారత సతీసామర్ధ్యముల్ మ్రోత మ్రో
యగ గర్జించితివమ్మ! దండధర బాహాదండ చండ ప్రచం
డ గదాదండము బెండువోయినది బిడ్డా! నీదు క్రోధాగ్నికిన్!
నిఖిల లోకైక సాధ్విని నిన్ను గన్న
భరతజనయిత్రి భాగ్యాలు పండెనమ్మ!
మెచ్చుకొన్నాడు నీభర్త నిచ్చినాడు
పుచ్చుకోవమ్మ నీ పూర్వ పుణ్యఫలము!
విశ్వవిచిత్రమైనది పవిత్రము నీ చరితమ్ము - దిక్కులన్
శాశ్వతమయ్యె తావక యశశ్శశికాంతులు -నీవు రాజరా
జేశ్వరివే పతివ్రతల కెల్లను - పచ్చని తల్లి! ఇంత కా
యశ్వపతి క్షితీంద్రుడు కృతార్దుడులే నిను గన్న తండ్రియై !!
మహాకవి పోతన
గంటమొ చేతిలోది ములుగఱ్ఱయొ? నిల్కడ యింటిలోననో
పంటపొలానొ? చేయునది పద్యమొ సేద్యమొ? మంచమందు గూ
ర్చుంటివొ మంచెయందొ? కవివో గడిదేరిన కర్షకుండవో?
రెంటికి చాలియుంటివి సరే కలమా హలమా ప్రియం బగున్ ?
కాయలుగాచిపోయినవిగా యరచేతులు! వ్రాతగంటపున్
రాయిడిచేతనా? మొరటు నాగలిమేడి ధరించి సేద్యమున్
జేయుటచేతనా? కవికృషీవల! నీ వ్యవసాయదీక్ష "కా
హా" యని యంతలేసి కనులార్పక చూచిరిలే దివౌకసుల్!
మెత్తని చేయి నీది; సుతిమెత్తని చిత్తమువాడ వంచు నీ
పొత్తమె సాక్ష్యమిచ్చు; పోలమున్ హలమున్ గొని దున్నుచో నెటుల్
గిత్తల ముల్లుగోల నదలించితివో! వరిచేలపైన ను
వ్వెత్తుగ వ్రాలుచో పరిగపిట్టల నెట్టుల తోలినాడవో!
"నమ్ముము తల్లి నాదు వచనమ్ము; ధనమ్మునకై బజారులో
అమ్మనుజేశ్వరాధముల కమ్మను ని" న్నని బుజ్జగించి నీ
గుమ్మములోన నేడ్చు పలుకుంజెలి కాటుకకంటి వేడి బా
ష్పమ్ములు చేతితో తుడిచివైచెడి భాగ్యము నీకె యబ్బెరా !!
గంటలు కట్టుకొంటివటగా! "విటగాండ్రను బోలునట్టి యీ
కుంటి కురూపి భూపతులకుం గవితాసుత నీయ" నంచు; ఆ
పంటవలంతియల్లునకె భాగవతమ్మును ధారవోసి, ని
ష్కంటకవృత్తికై నడుముగట్టితి వెంతటిపుణ్యమూర్తివో!
అచ్చపు జుంటితేనియల, నైందవ బింబ సుధారసాల, గో
ర్వెచ్చని పాలమీగడలు, విచ్చెడి కన్నెగులాబి మొగ్గలన్
మచ్చరికించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ
వెచ్చట నేర్చినావు? సుకవీ! సుకుమార కళా కళానిధీ !
కమ్మని తేటతెల్గు నుడికారము లేరిచి కూర్చి చాకచ
క్యమ్ముగ కైత లల్లు మొనగాండ్రు కవీశ్వరు లెంతమంది లో
కమ్మున లేరు - నీవలె నొకండును భక్తి రసామృత ప్రవా
హమ్ముల కేతమెత్తిన మహాకవి ఏడి తెలుంగుగడ్డపై?
