Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 10


    
    "వల్లెవేయును" నీ వైభవప్రశస్తి
    హోరుమంచును నేడు మా ఓడరేవు;
    బ్రతికిచెడియున్న నీపూర్వభాగ్యరేఖ
    చెరిగిపోలేదు తల్లి! మా స్మృతిపథాల!!
    
    గంటాన కవితను కదను త్రొక్కించిన
        "నన్నయభట్టు" లీనాడు లేరు
    కలహాన కంచుఢక్కల నుగ్గునుగ్గు గా
        వించు "శ్రీనాథు" లీవేళ లేరు
    అంకాన వాణి నోదార్చి జోలలు పాడు
        "పోతనామాత్యు" లీప్రొద్దు లేరు
    పంతాన ప్రభువుచే పల్లకీ నెత్తించు
        కొను "పెద్దనార్యు" లీ దినము లేరు
    "వాణి నా రాణి" యంచు సవాలుకొట్టి
    మాటనెగ్గించు "వీరు" లీపూటలేరు!
    తిరిగి యొకమాటు వెనుకకు తిరిగిచూచి
    దిద్దుకోవమ్మ! బిడ్డల తెనుగుతల్లి!
    
    కవులకు బంగారు కడియాలు తొడిగిన
        రాయల గన్న వరాల కడుపు    
    సీసాలతో కవితాసార మిచ్చు శ్రీ
        నాథుని గన్న రత్నాల కడుపు
    భద్రాద్రిలో రామభద్రు స్థాపించు గో
        పన్నను గన్న పుణ్యంపు కడుపు
    జగ మగంటిమీ నల్దెసల్ వెలార్చిన పాప
        రాయని గన్న వజ్రాల కడుపు
    పిసినిగొట్టు రాజులకును - పిలకబట్టు
    కుకవులకు - పిచ్చిపిచ్చి భక్తులకు - పిఱికి
    పందలకు - తావు గాకుండ ముందు ముందు
    దిద్దుకోవమ్మ! బిడ్డల తెనుగుతల్లి!
    
                                                   
            
    శ్రీకరమ్ములు మీకు నాట్యైకలోల
    శివజటాజూట గాంగేయ శీకరములు;
    రంజితమ్ములు మీకు శర్వాణి చరణ
    కంజ మంజుల మంజీర శింజితములు !


                                             
    
    రాణ్మహేంద్ర కవీంద్రు రత్నాల మేడలో
        పసిడి గిన్నెల నుగ్గుబాలు త్రాగి
    సోమయాజులవారి హోమవేదికలపై
        అల్లారుముద్దుగ నాటలాడి
    శ్రీనాథుల సువర్ణ సీసమాలికలలో
        హాయిగా తూగుటుయ్యాల లూగి
    భాగవతులవారి పంచపాళీలలో
        మెత్తని శయ్యల నొత్తిగిల్లి    
    విజయ విద్యానగర రాజవీథులందు
    దిగ్గజమ్ములమీదనే తిరిగి తిరిగి    
    కంచు జయభేరి దెసల మ్రోగించుకొన్న
    ఆంధ్ర కవితాకుమారి! "జయోస్తు" నీకు.
    
                                      కవితా కుమారి
    
    జడయల్లి జడకుచ్చు లిడ "రాయప్రోలు" త
        ల్లావజ్ఘల" కిరీటలక్ష్మి నింప
    "పింగళి" "కాటూరి" ముంగురుల్ సవరింప
        "దేవులపల్లి" శ్రీ తిలక ముంప
    "విశ్వనాథ" వినూత్న విధుల కిన్నెర మీట
        "తుమ్మల" రాష్ట్రగాన మ్మొనర్ప
    "వేదుల" "నాయని" వింజామరలు వేయ
        "బసవరాజు" "కొడాలి" పదము లొత్త    
    "అడవి" "నండూరి" భరతనాట్యములు సలుప
    "జాషువా" "ఏటుకూరి" హెచ్చరిక లిడగ
    నవ్యసాహిత్య సింహాసనమున నీకు
    ఆంధ్ర కవితాకుమారి! "దీర్ఘాయురస్తు!"
    
                                         బీదపూజ
    
    "వాడిన గ్రుడ్డిపూలు గొనివచ్చెను "వీ డని జాలిమాలి నో
    నాడకు మో దయామయ! యథార్ధము నీకడ విప్పిచెప్ప నో
    రాడుటలేదు - పూలకొరకై పువుదోటకు నేనుగూడ జ
    న్నాడను - పుష్పమొక్కటయినన్ లభియింపకపోయె నా కటన్.
    
    వారలు పెద్దపెద్ద ధనవంతుల బిడ్డలు - మంచి మంచి బల
    గారపు పూలబుట్టలను గైకొని పోయిరి ముందుగానె - మా
    బూరుగుచెట్టుక్రింద పడిపోయిన గోడల పూరిపాకలో
    దూరిన లేత వెల్గులకు దుప్పటినెత్తితి - అమ్మ లేపినన్.
    
    లేచి - చిఱుచాప నొకమూల దాచిపెట్టి    
    పాత్ర తాటాకుబుట్టను చేతబట్టి
    పొంత లోపలి జల మింత పుక్కిలించి
    తల్లి కాళ్ళకు వంగి వందన మొనర్చి!
    
    తెలతెలవాఱుచుండ జనితిన్ విరితోటకు - తోటమాలి త
    ల్పులు బిగియించె నా చినిగిపోయిన గుడ్డలు నన్నుజూచి; కా
    ళుల బడి, గడ్డమంటి, యెటులో బతిమాలి, యవస్థనంది లో
    పల బడినాను - చెంత గనుపట్టిరి మిత్రులు పూలుగోయుచున్.
    
    చకచక పూలు గోసికొని సాగిరి వారలు - శూన్యకుంజ మా
    లిక లెటు చూచినన్; మిగులలే దొక పుష్పముకూడ నాకు; నే
    నొకదెస విన్నబోయి నిలుచుంటి; ననున్ గని వారలందఱున్
    పకపక నవ్వినారు - తలవంచితి నేనొక కొమ్మచాటునన్.
    
    వట్టిపూమొక్క లన్ని నా వంక చూచి
    ప్రసవబంధాలు సడల బాష్పములు రాల్చె;
    చేతిలోనున్న బుట్టను చింపివైచి
    తిరిగివచ్చితి గుండెలు దిగబడంగ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS