"మీరు వెళ్ళండి పిల్లల్ని చూస్తూ కూర్చుంటాను అన్నాడు."........ "పిల్లల్ని నేను చూస్తాను నేను ఎన్నిసార్లో చూశాను" అంది శాంతి. మొత్తం మీద రాలేక రమావతారం, ఇంటరెస్టు లేదంటూ శాంతీ ఉ=ఇద్దరూ క్రిందే వుండిపోయారు. సరదా పడ్తున్న పిల్లల్ని జాగ్రత్తగా తీసికేడతాననిన రామావతరానికి ప్రామిస్ చేసి పిల్లలు, నేను మీనాక్షి పైదాకా ఎక్కి అన్నీ చూశాము. తిరిగి వస్తూ ఆయాసం తీర్చుకోడానికి ఓమూల నీడ వున్న రాయి మీద కూర్చున్నాం..... పిల్లలు ఎంత చెప్పినా వినకుండా క్రిందికి పరుగెత్తి వెళ్ళిపోయారు.....
క్రింద కూర్చున్న రామావతారం , శాంతి బొమ్మలలాగ కనిపిస్తున్నారు. అంత ఎత్తునించి..... అలా చూస్తూ హటాత్తుగా మీనాక్షీ అంది "మీ ఆవిడ చాలా అందగత్తె నే బావా!......"
ఏం అంటాను! అందులో రామావతారం ప్రక్క కూర్చుంటే మరీ అందంగా బొమ్మలా కనిపిస్తుంది! ఏదో ఒకటి అనాలిగా!" ఆ .....అందంగా మలచిన ప్రాణం లేని పాలరాతి బొమ్మ!' నిర్లక్ష్యం ధ్వనించేటట్టు సిగరెట్టు అంటించుకుంటూ అన్నాను.
మీనాక్షిని చూసిం దగ్గరనించి నిజంగా శాంతి ఇంట్లో ఓ ప్రాణం లేని బొమ్మలాగే కనిపిస్తుంది నాకు.
"అదేమిటలా అంటున్నావూ!"
"కాకపోతే మరే అంటాను! నీవే చూస్తున్నావుగా , కదలిక లేని బొమ్మలాగే వుంటుంది ఇంట్లో. ఓ చలాకీతనం లేకుండా, డ్రాయింగ్ రూములో డెకరేషన్ పీస్ లాగ ఇంటికి అలంకారం!....." విరక్తిగా అన్నాను.
"ఊ..... మా ఆయనే బుద్దావతారం అనుకుంటే. మీ ఆవిడా ఆయన్ని మించిపోయింది స్తబ్ధతనానికి.... అబ్బ అలా ఎలా వుండగలదో ఓ మాటా మంతీ సరదాల్లేకుండా .... నేను వుండలేను బాబూ....!"
"నీకీ బుద్దావతారం , నాకీ కూర్మావతారం దొరికాయి....." నవ్వుతూ స్పోర్టివ్ గా అందామని ప్రయత్నించినా ఆ మాటలో చిన్న నిస్పృహ ధ్వనించింది....
"బాగా చెప్పావు .... అయినా అంతే.... దేన్లోనూ సరదా లేదు .... సినిమా అంటే ఇంటరెస్టు లేదు, క్లబ్బు లంతకంటే అక్కరలేదు .... ఫ్రెండ్స్ అసలే లేరు, ఎంతసేపూ ఆఫీసు, తరువాత తిండం, పడుకోడం .... నాకు ఒళ్ళు మండిపోతూ వుంటుంది.... ఆయనతో లాభం లేదని నా అంతట నేనే సరదాలు తీర్చుకుంటాను. కొన్నిటిని అయన కోసం చంపుకోక తప్పడం లేదు....." అదోరకంగా అంది మీనాక్షీ.
"నీది, నాది ఒకటే కేసు! ఇలాంటి జతలు ఎందుకు కూరుస్తాడో ఆ దేవుడు! .... శాంతి అన్ని విధాల అనుకూలవతే .... అందం , చదువు .... అన్నీ వున్నయి.... ఇంట్లో దేనికీ లోటు లేదు ! .... మరెందుకు అస్తబ్ధత? సరదాగా, చలాకీగా, జల్సాగా బ్రతికే నాల్గురోజులు ఎందుకు బ్రతకకూడదని నేనంటాను! ముందు చూపు వుండాలంటుంది... "ఈరోజు విచ్చలవిడిగా తిరిగి ఖర్చు పెడితే రేపో' అంటుంది .... భవిష్యత్తు ఆలోచించాలంటుంది... ఏదేదో నాన్సెన్స్ చెబుతూ వుంటుంది, కబుర్లు చెప్పమంటే ఫస్టు .... ఎంతకని వాదిస్తాను.... తన మూలంగా నా సరదాలెన్నో చంపేసుకున్నాను....." అదో రకం విరక్తిగా అన్నాను....
బావా! అటు చూడు ....ఆ బుద్దావతారం , మీ కూర్మావతారం ఇద్దరినీ ప చోట పెడితే ఎలా వుంటుందంటావు? .... నిజంగా అలాంటివాళ్ళు ఇద్దరూ మొగుడు పెళ్లాలయితే ఆ యిల్లు ఎలా ఉంటుందంటావు!?" నవ్వుతూ కొంటెగా అంది మీనాక్షి !
"ఇంకెలా వుంటుంది , వాళ్ళతో పాటు ఇల్లూ నిద్రపోతుంది, నా జోక్ కి నేనే నవ్వాను." గట్టిగా .... మీనాక్షి గట్టిగా నవ్వింది "కరెక్టు బావా!" అంటూ.
క్రింద నించి రామావతారం , శాంతి మావైపు చూస్తున్నారు. మేం నవ్వుతున్నామని తెల్సినా, కారణం తెలియదు , వినపడదు ..... రమ్మని చేయి ఊపాడు రామావతారం .... క్రిందికి దిగి వెళ్ళాం. కొబ్బరి బొండాలు కొంటున్నాడు రామావతారం.
చల్లని కొబ్బరిబొండాలలో నీళ్ళు త్రాగాక ప్రాణం కుదుటపడిందనిపించింది.... కెమెరా తీసి రకరకాల ఫోజుల్లో ఏనుగుల శిల్పాల దగ్గిర, రధ చక్రాల దగ్గిర అందరిని నిలబెట్టి ఫోటోలు తీశాను.
బయటికి వెళ్ళి ఎదురుగా సర్వి చెట్ల మధ్య ఇసుకలో కూర్చుని తెచ్చుకున్న ఫలహారాలు తిని కాఫీ త్రాగాం.
అక్కడ రాత్రి వుండదాల్చినవారికీ గెస్టు హౌస్ వుంది. అక్కడి వుండి చేసేదేమీ లేదని రాత్రికి వుండే ప్రోగ్రాం పెట్టుకోలేదు .... ఇంక అక్కడ చూడవల్సిన మ్యూజియం ఒకటి చూసేసి ఏడుగంటలకి ఇల్లు చేరాం.
తరువాత మా ప్రోగ్రాం గోపాల్ పూర్! గోపాల్ పూర్ దూరం కాబట్టి ఒకరోజులో వెళ్ళి రావడం కుదరదని మూడు రోజులు ప్రోగ్రాం వేశాను ఒకరోజు వెళ్ళడం అక్కడకరోజుండడం మూడో రోజు బయలుదేరి రావడం.
గోపాల్ పూర్ సముద్రం తప్ప అక్కడ యింక చూసేందుకు ఏమీ లేవు! అక్కడికి వెళ్ళేవారు సాధారణంగా సముద్రంలో స్విమ్మింగ్ కీ వెళతారు, గోపాల్ పూర్ లో బీచి ఒడ్డున ప్రసిద్ది చెందిన "ఓబ్ రాయ్ హోటలు వుంది. విదేశీ పద్దతులలో, ఆధునికంగా కట్టిన హోటలు అది! ఆ ఖరీదులు సామాన్యులకి అందుబాటులో వుండని కారణంగా సాధారణంగా అక్కడికి వచ్చేవారు మరీ డబ్బున్నవాళ్ళు, విదేశీయులే వుంటారు. పూరీ లాగే హోటలులో, బీచ్ లో అందరూ విదేశీయులే వుంటారు. ముఖ్యంగా సమ్మర్ కి , క్రిస్మస్ సెలవలకి హోటలు నిండుగా ఉంటుంది .... హోటలు ముందు కుర్చీలు వేసుకు కూర్చుంటే సముద్రం ఒడ్డున కూర్చున్నట్టే వుంటుంది.
నా ప్రోగ్రాం విని శాంతి "ఓబ్ రాయ్ హోటలు చాలా కాస్ట్లీ కాదూ!" అంది.
నావళ్ళు మండింది తీక్షణంగా చూశాను. " అవుతే అవుతుంది , రోజు ఖర్చు పెడతామా ఏమిటి? ఎప్పుడూ డబ్బు డబ్బు ఓ సరదా లేదు పాడు లేదు " అవసమైన దీని కంటే నా గొంతు అంత కర్కశంగా మారడానికి కారణం ఇన్నాళ్లుగా శాంతి పట్ల నా విరక్తి కారణం ..... సందు దొరగ్గానే కసి తీర్చుకున్నాను.....
శాంతి ముఖం నల్లబడింది. "అందుకు అనలేదు" అదురుతున్న .... పెదాలతో మెల్లిగా అంది. పరిస్థితి గుర్తించి రామావతారం శాంతిని సపోర్టు చేస్తూ మాట్లాడడానికి ప్రయత్నించాడు...."అవునండీ , రోజుకి ఏ నాలుగు వేలు అనవసరంగా ఎందుకు ఖర్చు? అందులో రెండు రూములు కావాలి మనకు, చాలా ఎక్కువ! ఇంతా చేస్తే అక్కడ సముద్రం తప్ప మరేమీ లేదంటున్నారు.... పూరీ చూశాంగా" అన్నాడు.
"మరేం పరవాలేదు అవనీయండి. రోజూ మీరు రారు , రోజూ ఖర్చు పెట్టం.... అన్నీ చూడ్డానికే కాకపోతే మరెందుకు వచ్చారు మీరు....' శాంతి వంక కఠినంగా చూస్తూ అన్నాను....
శాంతి తలవంచుకు లోపలికి వెళ్ళిపోయింది. మలినమైన ఆమె ముఖం చూస్తె అంత దురుసుగా మాట్లాడకపోవలసిందేమో అనిపించింది.
గోపాల్ పూర్ వెళ్ళి రోజు మధ్యాహ్నం ఆ మర్నాడు అంతా .... నేను మీనాక్షి ఎక్కువభాగం సముద్రంలోనే గడిపాం.
సముద్రం ఒడ్డున కుర్చీలు వేసుకొని రామావతారం, శాంతి పుస్తకాలో, ట్రాన్సిస్టరో పట్టుకుని కూర్చునేవారు. వాళ్ళ పర్యవేక్షణలో పిల్లలు దగ్గిరిగా నీళ్ళల్లో ఆడుతుండేవారు.
