మామూలు దేవాలయానికి మాదిరి పళ్ళు, కొబ్బరికాయలు పట్టుకెళ్ళడానికి లేదు పూరీ దేవాలయనికి! ఈగలు ముసిరే లస్కోరావుండలు, పిడతలలో దొరికే రసగుల్లాలు, జగన్నాధుడికి యిష్టంకాబోలు, పూలు, లస్కారావుండలు కొని లోపలికి వెళ్లాం. దేవాలయానికివెళ్ళే త్రోవలో లోపలికిరుప్రక్కలా రకరకాల సైజుల కుండలలో అన్నాలు, పప్పులు కూరలువండి అమ్మకానికి పెడతారు. వాటిని ఆశ్రయించుకుని ఎన్నివేలు, లక్షలు ఈగలు బ్రతుకుతున్నాయో లెక్కలేదు....
"అబ్బ... అదేమిటి ఆ అన్నా లేమిటి... ఛీ ఛీ... ఈగలు ఎలా వ్రాలుతున్నాయో చూడు!" మీనాక్షి అసహ్యించుకుంది అవి చూసి.
"తప్పు తప్పు....కళ్ళుపోతాయి అలా అన్నావంటే....అది మహాప్రసాదం, దానికే రోగాలు అంటవు ఎన్ని ఈగలు వాలినా!" నవ్వుతూ అన్నాను.... నవ్వుతూ అన్నా ఆ మాటల్లోకాస్త నిజం వుందేమో అనిపిస్తుంది. రోజుకి ఎన్ని వందలమందో ఆ భోజనం కొనుక్కుని తింటూనే వున్నారు... అందరికీ రోగాలు వస్తున్నాయా? అంతేగాక ఆ భోజనం ఎంతో రుచిగా వుంటుందని, ఆ రుచి మనం ఎంతబాగా యింట్లో వండినా రాదని తిన్న అందరూ అంటారు. మన దేవాలయాల్లో దద్దోజనం పులిహోరరుచి ఇంట్లోచేసిన దానికి చస్తేరాదు. అలాగేనేమో ఇదీ అని భగవంతుని మహిమో ఏమో!" మనమూ తినాలి. ఆ ప్రసాదం, పూరీ వచ్చి అది తినకుండా వెడితే తిన్నగా నరకానికి పోతావు" నవ్వుతూ బెదిరించాను.
"అప్పటి నరకం సంగతి తరువాత కానీ ముందీ నరకంలోంచి నన్ను లాక్కెళ్ళు!" - "మీనాక్షి నీకిష్టం లేకపోతేమానేయికాని, కామెంట్స్ మాను!" రామావతారం కసిరాడు, అతనికి దైవభక్తి, నమ్మకం ఎక్కువట.
ఆ తొడత్రొక్కిడిలో దైవదర్శనం అయిందనిపించుకొని బైటపడ్డాం. మామూలుకంటే ఆ నెలలో పూరీలో విపరీతమైన రష్ వుంది. కారణం జగన్నాధుని "నవ కళేబర్" ఉత్సవం జరుగుతుంది. "నవ కళేబర్" అంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జగన్నాధుడు, బల భద్రుడు, సుభద్రాదేవి పాత విగ్రహాలని తీసేసి క్రొత్తవి ప్రతిష్టిస్తారు. ఆ పాత విగ్రహాలని దేవాలయం ఆవరణలోనే అగ్నిహోత్రానికి అర్పిస్తారు. దాన్ని "కైవల్యవైకుంఠం" అంటారు! అది చూడడానికి వేలకొద్దిప్రజలు వస్తారు. ఆ క్రొత్త విగ్రహాలని ఏ కర్రతోపడితే ఆ కర్రతో చేయడానికి వీలులేదు. దేవస్థానం పూజారులు నెలరోజులు ముందుగా ఆ విగ్రహాలకి కావల్సిన కలపకోసం వెతకడానికి బయలుదేరుతారు! ఆ విగ్రహాలు చేసేందుకు కావల్సిన వేపచెట్టుకి, నేలనించి మూడు గజాలెత్తువరకు కొమ్మలు వుండకూడదు. కొమ్మలన్నీ ఆకాశంవైపే వుండాలి, చెట్టు మొదట పాము పుట్ట వుండడం శ్రేష్టం, చెట్టుమీద ఏ పక్షులగూడు వుండరాదు. వేపచెట్టు రావిచెట్టు ప్రక్కప్రక్కన వుండాలి మొదలైన ఏవేవో నిబంధనలు వుంటాయి. అలాంటి చెట్టుకోసం అన్వేషిస్తారు. ఈసారి ఒవింత జరిగింది. ఓ పూజారికి జగన్నాధుడు కలలో కనిపించి నాకోసం ఫలానాచోట ఓ చెట్టుంది, దానితో నా విగ్రహాలు చేయండి, ఆ చెట్టుమీద శంఖ, చక్రగదా పద్మ చాహ్నాలు వుంటాయి అని చెప్పాడట? ఆ ప్రకారంగానే ఆ చెట్టుని వెతుక్కుంటూ బయలుదేరితే సరిగా కలలో చెప్పిన ఆ చోటులోనే ఆ చెట్టు కన్పించింది. దానిమీద శంఖ, చక్ర, గదా పద్మాల ఆకారం ఆనవాళ్ళు చెట్టుమీదే సహజంగా వున్నాయి! యింక ఆ వింత చూడడానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చారు! ఆ చెట్టు నరికి ఉత్సవాలతో ఊరేగింపులతో పూరీ తీసికెళ్ళి విగ్రహాలు తయారుచేసి ప్రతిష్టించారు.....
ఇదంతా చెపితే మీనాక్షి వాళ్ళు ఆశ్చర్యంగా విన్నారు. త్రోవలో ఆ చెట్టు దొరికిన చోటు చూపించాను వెళ్ళేటప్పుడు.
మధ్యాహ్నం అంతా షాపింగ్ చేశారు మీనాక్షి, శాంతి, ఒరిస్సా ఫిలిగ్రీ వర్క్ కి, కొమ్ముసామానుకి ప్రసిద్ధి! మీనాక్షి "ఫిలిగ్రీ" వస్తువులు చాలా కొంది. డ్రాయింగ్ రూములోకి ఏవేవో డెకరేషన్ సామాను కొంది! జంతువుల చర్మంతోచేసే బూట్లు, పాముచర్మాలతో చేసిన చెప్పులు ఎన్నెన్నో కొంది. గవ్వలతో చేసిన వస్తువులు, పూసలహారాలు కొంది. వెర్రిగా! ఓ రెండు వేలు ఖర్చు పెట్టి వుంటుంది ఆ పూట!
మర్నాడు ఉదయమే బయలుదేరి వచ్చేశాం భువనేశ్వర్.
కోణార్క్ భువనేశ్వర్ కి నలభై మైళ్ళ దూరంలో వుంది! ఒకప్పటి సూర్యభగవానుని ఆలయం ప్రస్తుతం శిధిలాలయంగా మిగిలింది. పద మూడవ శతాబ్దం నాటిది. గర్భగుడి ముఖద్వారం, సూర్యుడు ఉదయించే తూర్పుదిక్కున వుంటుంది. సూర్యుని ఉదయకిరణాలు సరిగా ఆ విగ్రహం మీద పడేవిట! ప్రస్తుతం సూర్యవిగ్రహం లేదు. పడిపోతున్న ఆ గర్భగుడిని రాళ్ళు పేర్చి నిలబెట్టారు. అంత ఎత్తుకు ఆ రాళ్ళనుచేర్చి కట్టిన సూర్యరధం చూడగానే ఎలా తెచ్చారీ రాళ్ళను యింత ఎత్తుకు అని ఆశ్చర్యం వేస్తుంది. ఆధునిక పరికరాలు లేకుండానే,సిమెంటు ఇసక వగైరాలు ఏమీ లేకుండా అంత అధ్బుతమైన కళా ఖండాన్ని అంత ఎత్తున రాళ్ళలో మలచిన ఆనాటి శిల్పులు కౌశల్యానికి ఆశ్చర్యపడకుండా వుండలేరు ఎవరూ సరిగా ఆర్టిస్టిక్ వ్యూతో చూస్తే ఒక్కోప్రక్క ఓ రోజు తక్కువ పట్టదు, ఆ శిల్పకళా వైభవం చూడాలంటే, మనకి తెలియని ఎన్నో అర్ధాలతో రాళ్ళని మలిచారు ఆ శిల్పులు! పన్నెండు నెలలు పన్నెండు చక్రాలుగా, ఏడుఅశ్వాలువారానికి గుర్తుగా ఒక్కోచక్రంలోని చీలికలు పక్షంగా రక రకాలుగా అర్ధాలున్నాయి ఒక్కోదానికి. ఒక్కచక్రంలో అలంకారాలు, ఆభరణాలు ఆనాటి ఆయుధాలు అన్నీ తీర్చిదిద్దారు. అన్నింటికంటే ప్రజలని ఎక్కువ ఆకర్షించేవి కోణార్క దేవాలయం మీద వున్న 'కామసూత్రాల 'శిల్పాలు! కొంటె కోణంగులు ముసిముసి నవ్వులు నవ్వుతారు! స్త్రీలు సిగ్గుపడి తలలు తిప్పుకుంటారు! విదీశీయులకే ఆశ్చర్యంగా కనిపించే ఆ శిల్పాలని జాగ్రత్తగా ఖరీదయిన కెమేరాలతో ఫోటోలు తీసుకుంటారు కావల్సిన వారికి ఆ ఫోటోలన్నీ పైన దొరుకుతాయి దుకాణంమీద! అక్కడ మన దేశీయులకంటే విదేశీయులే కనిపిస్తారు. టూరిజం అంటే మనకంటే విదేశీయులకే ఎక్కువ యిష్టం అనుకుంటా! వాళ్ళకున్న అంగబలం, అర్ధబలం మనకులేవు.
వెంటపడ్డ గైడ్ ని వద్దని బయలుదేరాం అందరం. నెంబర్ల వారీగా ఎక్కుతూ వెడితే సులభం అవుతుంది వెళ్ళడం! ఉప్పునీతి గాలికి రాళ్ళు కన్నాలుపడి ఆకారాలు పోగొట్టుకుంటున్నాయి. రాయినే కన్నాలు పెట్టగలిగేశక్తివంతమైన గాలి!
"అబ్బ! ఎంత బాగుంది బావా!" మీనాక్షి క్రిందనించే చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయింది.
"రియల్లీ, వర్త్ సీయింగ్" రామావతారం కూడా. మెచ్చుకున్నడు.
"ఇక్కడనించే ఏం చూస్తారు. పదండిముందు చుట్టూ తిరిగి తరువాత పైకివెడదాం" అన్నాను. చుట్టూ తిరిగిచూసి పైకి ఎక్కడం ఆరంభించాం. కాస్తదూరం ఎక్కేసరికి రామావతారం ఆయాసంతో చతికిలబడిపోయాడు! పాపం స్థూలకాయుడు దానికితోడు పొట్ట! అంతేకాక మరీ పిరికివాడు! అన్నింటికి భయం, చాదస్తం! చకచక పరుగులు పెడ్తున్న పిల్లలని పడిపోతారని వెళ్ళద్దని కేకలు పెట్టసాగాడు. మమ్మల్ని జోళ్ళు విప్పేయమని గాభరా పెట్టాడు. జారిపోతారు రాళ్లమీద అని పిల్లల బూట్లు విప్పి, వాళ్ళు అటు ఇటు పరిగెత్తిపోకుండా చేతులు పట్టుకున్నాడు.
"ఇక్కడినించే చూద్దాం. కనిపిస్తూందిగా" అంటాడు రామావతారం.
బాగుంది మీరు రాకపోతే మానేయండి, ఇంతదూరం వచ్చి ఏం చూడకుండా కూర్చోడానికా వచ్చాను," రామావతారం మాటలు లక్ష్యపెట్టకుండా పైకి ఎక్కసాగింది మీనాక్షి. నేను మరేం ఫరవాలేదని నచ్చచెప్పినా రామావతారం పైకి రాలేదన్నాడు.
