"కావచ్చు..."
"ఎంతకాలం తాగుతావు?"
"చచ్చేదాకా"
"నువ్వు తాగుతున్నావని ఆమెకి తెలుసా?"
"తెలీదు...."
"తెలిస్తే ఏమౌతుంది?"
"ఆమె బాధపడుతుంది"
"ఆమెని బాధపెట్టటానికి తాగుతున్నావా?"
"నో......నాటెటాల్"
"కాని ఎప్పుడో ఒకప్పుడు నీ పతనం ఆమెకి తెలీక పోదు అప్పుడు ఆమె బాధ పడదూ? చూడు మధూ! ప్రేమ త్యాగం కోరుతుందంటారే మరి నువ్వు చేస్తున్న పనేంటి?" సూటిగా అడిగాడు శ్రీకాంత్.
"నేను స్వార్ధపరున్ని .... అంత దూరం ఆలోచించ లేదు" మధు గొంతు మూగబోయింది. చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
శ్రీకాంత్ హృదయం ద్రవించింది.
మధు వాంతి చేసుకున్నాడు. అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. మనిషి టేబిల్ మీద వాలిపోయాడు. శ్రీకాంత్ అతన్ని లేవదీసి, పొదవి పట్టుకుని వాష్ బేసిన్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు.
ముఖంమీద చల్లని నీళ్ళు పడగానే మధు స్పృహలోకి వచ్చాడు. అతనికి మైకం వదులుతోంది.
బేరర్ విస్కీ బాటిల్ తెచ్చి టేబిల్ మీద పెట్టాడు.
శ్రీకాంత్ బాటిల్ వోపెన్ చేసి మధు చేతి కిచ్చాడు తాగమన్నట్టు.
"క్షమించండి సార్.....నా తప్పు తెలుసుకున్నాను. నాకు కనివిప్పు కలిగించారు. జీవితంలో ఇంకెప్పుడూ తాగను....."
బటర్ మిల్క్ కోసం ఆర్డరిచ్చాడు శ్రీకాంత్.
"ఈ సమాజంలో ప్రేమకి.......పెళ్ళికి మధ్య కులం, మతం, జాతి, పేద, ధనిక తారతమ్యాలు అడ్డుగోడలుగా ఉన్నప్పుడు ప్రేమ ఫలించదు తమ్ముడు !.....ప్రేమించి నంత మాత్రాన పెళ్ళి అవుతుందని ఆశించటం తప్పు. ప్రేమిస్తే పెళ్ళి జరిగేటట్టయితే బహుశ జరిగే పెళ్ళిళ్ళన్నీ ప్రేమ పెళ్ళిళ్ళయ్యేవేమో! ఈ సమాజంలో అసలు ప్రేమించనేకూడదు. ఒకవేళ ప్రేమించి విఫలమయితే ఆవేదన పడకూడదు. ఆ శక్తి ఉన్నప్పుడే ప్రేమించాలి......' ఆవేశంగా అన్నాడు శ్రీకాంత్.
"నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. తాగుడు ఉపశమనం కాదని తెలుసుకున్నాను. నా దేవి సుఖమే నేను కోరుకునేది. ఆమె ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండటమే నాకు కావలసింది .... ఇక నేను వెళతానండి...."
మధు లేచాడు.
బేరర్ బిల్ తీసుకొచ్చాడు. మధు ఇవ్వబోతుంటే వారించాడు శ్రీకాంత్.
"గుడ్ లక్ తమ్ముడూ" భుజం పట్టి బయటకు పంపి వచ్చాడు శ్రీకాంత్.
టేబిల్ మీద వున్న విస్కీ సీసాలు అలానే ఉన్నాయి. కసిగా ఓ సీసా పైకెత్తాడు శ్రీకాంత్. అతనిలోని ఆవేశానికి విస్కీ కసిగా గొంతులో దిగుతోంది. అతని ముఖం ఎర్రబడింది. గొంతుమీది రక్తనాళాలు ఉబికాయి.
బేరర్ అతనివేపు అయోమయంగా చూసి, సీలు తియ్యని సీసా టేబుల్ మీంచి తీశాడు.
"బేరర్ .... బాటిల్ ఇక్కడే ఉంచు" గర్జించాడు శ్రీకాంత్.
"సార్!" ఏదో అనబోయాడు బేరర్.
"బిల్లు ఇవ్వనని భయపడుతున్నావా?"
జేబులోంచి నోట్లకట్ట తీశాడు శ్రీకాంత్.
"ఎందుకు సార్ అంత తాగుతున్నారు?" అమాయకంగా అడిగాడు బేరర్.
అతని అమాయకత్వానికి నవ్వూ, అధిక ప్రసంగానికి చికాకూ కలిగాయి శ్రీకాంత్ కి.
"నీ కనవసరం......వెళ్ళు" కసురుకున్నాడు. ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు బేరర్.
"ఒరే శ్రీకాంత్......ఎందుకురా బేరర్ మీద విరుచుకుపడ్డావు.....నువ్వు అందర్నీ అడిగే ప్రశ్నే నిన్ను తను అడిగాడు. అందులో తప్పేముంది? జవాబు చెప్పలేక అతని నోరు మూయించావు....అవునా?... మధుని తాగొద్దని అంతసేపు లెక్చర్ యిచ్చావు. నువ్వు చేస్తున్న పనేమిటి?....."
"ఎదుటివాడు పతనం అవుతుంటే చూడలేక ఆపాను."
"అయితే అదే నీకు వర్తిస్తుందిగా. తాగుడు మానెయ్యి"
"చెప్పటం తేలికే. ఆచరించటం కష్టం. నేను తాగక తప్పదు.......తాగకపోతే గతం గుర్తుకు వస్తుంది. ఆ బాధ భరించలేను."
"అయితే ఎంతవరకు తాగుతావు?"
"నన్ను నా ప్రేయసిని విడదీసిన కులమతాలమీద కసి తీరేదాకా"
"అప్పుడు మట్టుకు నీ ప్రేయసి నీదవుతుందా?"
"లేదు.....ఆ ఆశ నాకిక లేదు. ఆమె ఇంకొకరి భార్య అయ్యింది"
"మరెందుకీ పంతం?"
"పంతం కాదు పతనం. ప్రేమించిన నేరానికి సమాజం విధించిన శిక్ష......"
"శ్రీకాంత్ నీ ఆరోగ్యం ....."
"మనసుకి లేని ఆరోగ్యం మనిషి కెందుకు?"
"ఇంత చిన్న వయసులోనే వైరాగ్యమా? మధుని తాగొద్దని అతని జీవితంలో వెలుగు నింపావే, మరి నీజీవితం?"
"ప్చ్...... నా మనసుకి నేను నచ్చచెప్పుకోలేక పోతున్నాను. చెప్పుకున్నా అది వినే పరిస్థితిలో లేదు..."
శ్రీకాంత్ రెండో సీసా అందుకున్నాడు.
"పూర్ శ్రీకాంత్! జీవితంలో ఒక్కసారి వోడిపోయిన నేరానికి, క్షణం, క్షణం ఓడిపోతూ నీ పతనం నువ్వే కోరితెచ్చుకుంటున్నావు"
"నువ్వెన్ని చెప్పినా తాగుడులేందే నే బతకలేను......నాకు అన్నీ తెలుసు నా పతనం నాకు తెలుసు. తాగుడు వల్ల చావుకు దగ్గర అవుతున్నానని తెలుసు. కాని ఏం చెయ్యలేక పోతున్నాను......దురలవాటుకి బానిసయ్యాను. పూర్తిగా ఓడిపోయాను....." శ్రీకాంత్ ఆగిపోయాడు. టేబులు మీద వాలిపోయాడు.
అక్కడివాళ్ళంతా నివ్వెరపోతూ చూశారు.
* * *
