Previous Page Next Page 
ది సెల్ పేజి 8


                                 అడ్డు గోడలు
    
    బార్ లో సన్నగా వెస్ట్రన్ మ్యూజిక్ స్టీరియోలో వినిపిస్తోంది. జనం రద్దీగా ఉన్నారు. డిమ్ లైట్ కాంతిలో వాళ్ళ ముఖాలు దీనంగా కనిపిస్తున్నాయి.

    శ్రీకాంత్ కి తల దిమ్ముగా ఉంది. అప్పటికి మూడు పెగ్గులు విస్కీ ఖాళీ చేసాడు. అంతా మసక మసగ్గా కనిపిస్తోంది.
    తన ఎదుట కూర్చున్నతనివేపు ఆశ్చర్యముగా శ్రీకాంత్ చూశాడు. అతని వయస్సు దాదాపు ఇరవైలోపు. బేరర్ రావటముతోనే పెగ్ విస్కీకి ఆర్దరిచ్చాడతను.
    శ్రీకాంత్ అతన్నే గమనిస్తున్నాడు. అక్కడ వాతావరణం కొత్తగా అనిపించేమో అతను అయోమయంగా భయంగా చూస్తున్నాడు.
    శ్రీకాంత్ కి ఏదో అనుమానం వచ్చింది. అతన్ని గురించి తెలుసుకావాలన్న ఆసక్తి పెరిగింది. తన ముందున్న గ్లాసు తీసుకోమన్నట్టు అతనివేపు జరిపాడు.
    తనకి కానట్టు కూర్చున్నాడతను.
    "ఫరవాలేదు తీసుకో ..." శ్రీకాంత్ ఈ సారి వత్తిడి చేసాడు.
    అప్పటికీ అతను తీసుకోలేదు.
    "బి బోల్డ్ ఐ సే..."
    శ్రీకాంత్ మాటకి ఉలిక్కిపడి గ్లాసు అందుకున్నాడు అతను చాలా కష్టంగా తాగుతున్నాడు. అతను ఇంకొంచెం సాఫ్ట్ గా ఉండటం కోసం అన్నట్టు గ్లాసులో మిగిలిన సోడా వంచాడు శ్రీకాంత్.
    అతను ఒక్కసారిగా గ్లాసు ఎత్తిపెట్టి తాగాడు. కంగారుగా అతను తాగిన తీరుచూస్తే మొదటిసారిగా అతను తాగుతున్నాడని అర్ధమయింది శ్రీకాంత్ కి. అయినా తెలుసు కోవటానికి అడిగాడు.
    "నువ్వు తాగటం ఇది ఫష్ట్ టైమ్ కదూ!"
    అవునన్నట్లు తల వూపాడతను.
    "వెల్ ...ఐయాం....శ్రీకాంత్......నీ పేరు?"
    "మధు" చెప్పాడతను.
    "ఇప్పుడు ఏం చేస్తున్నావు?"
    "తాగుతున్నాను"
    అతని జవాబుకి ఉలిక్కిపడ్డాడు శ్రీకాంత్.
    అది డ్రింక్ ప్రభావమని అర్ధమయింది.
    "అది కాదు నేనడిగింది, ఉద్యోగం ఏమన్నా చేస్తున్నావా అని"
    "చేయటంలేదు.....ఖాళీగా ఉన్నాను"
    "ఒక్కడివే వచ్చావేం?"
    "వంటరివాణ్ణి కాబట్టి"
    "అంటే....."
    "నాకెవరు లేరు?"
    "మరి అమ్మ నాన్న..."
    "ఆ! వాళ్ళకి నేను ఉన్నాను"
    శ్రీకాంత్ కి అంతా అయోమయంగా ఉంది. అతను తాగే ఇలా మాట్లాడుతున్నాడో లేక తెలివిలో ఉండి మాట్లాడుతున్నాడో అర్ధం కాలేదు.
    "నువ్వెందుకు తాగుతున్నావు?" వింత ప్రశ్న వేశాడు శ్రీకాంత్.
    చివ్వున తలెత్తి శ్రీకాంత్ కేసి చూశాడు మధు.
    "తాగటానికి కారణాలు ఉంటాయా?"
    "ఉంటాయనే అనుకుంటాను....."
    "అయితే కారణం ఉండే తాగుతున్నాను......"
    "ఏమిటో అది?"
    "తాగాలనిపించింది తాగుతున్నాను..."
    "నేన్నమ్మను..."
    శ్రీకాంత్ కేసి వింతగా చూస్తూ, "పోనీ జీవితం మీద విరక్తి పుట్టి తాగుతున్నా ననుకోండి"
    "జీవితం మీద విరక్తి పుడితే సన్యాసుల్లో కలవచ్చుగా తాగటం దేనికి?"
    "చేతకాక"
    "అయినా ఇంత చిన్న వయసులో విరక్తికి కారణం"
    "చెప్పలేను.....అయాం సారీ"
    బేరర్ విస్కీ తీసుకువచ్చాడు. మధు గడగడ తాగి వెంటనే మరో పెగ్ కి ఆర్డరిచ్చాడు.
    "సరే నువ్వేమీ చెప్పనవసరం లేదు...నన్ను చెప్పమంటావా?" అన్నాడు శ్రీకాంత్.
    "మీకు జాతకం తెలుసా!" అడిగాడు మధు
    "తెలీదు..."
    "మరి..."
    "ఊహించగలను"
    "అయితే చెప్పండి చూద్దాం"
    "నీకు పెళ్ళి కాలేదు.....అవునా?"
    అవునన్నట్లు తలవూపాడు మధు.
    "ఓ అమ్మాయిని ప్రేమించావు.....అవునా?"
    మధు ముఖం వివర్ణ మయ్యింది. జవాబు చెప్పలేనట్లు తల వొంచుకున్నాడు.
    బేరర్ విస్కీ తీసుకొచ్చాడు. మధు నోట్లో పోసుకుని, మళ్ళీ బాటిల్ కి ఆర్దరిచ్చాడు.
    "నువ్వు ప్రేమించే అమ్మాయి నిన్ను ప్రేమించటం లేదా?
    "నో మాది  ఒన్ వే లౌవ్ కాదు ... ఆమె ప్రేమించింది."
    "అయితే పెళ్ళి చేసుకోవచ్చుగా?"
    "ఆ అమ్మాయికి పెళ్ళయిపోయింది."
    "అంటే పెళ్ళయిన అమ్మాయిని ప్రేమించావా?" అడిగాడు శ్రీకాంత్.
    "లేదు క్షణం క్రిందటే ఆమెకి పెళ్ళయింది"
    "మరి నువ్వెందుకు వాళ్ళ పెద్దలని అడగలేదు ... ధైర్యం చాలకా?"
    "అడిగాను.....వాళ్ళు ఒప్పుకోలేదు"
    "ఎందుకని"
    "మా మతాలు వేరు"
    "ఆల్ రైట్ ... తాగటంవల్ల ఫలితం వుంటుందంటే ఈ బాటిల్స్ అన్నీ తాగు..."
    అప్పటికే బేరర్ బాటిల్ తీసుకువచ్చి టేబిల్ మీద పెట్టాడు. శ్రీకాంత్ మరో బాటిల్ కి ఆర్దరిచ్చాడు.
    దాంతో మధు తల వొంచుకున్నాడు.
    "ఆమెని మర్చిపోవటానికే తాగుతున్నావా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS