Previous Page Next Page 
ది సెల్ పేజి 10


                         దొంగలు! బావోయ్ దొంగలు!
    
    అర్దరాత్రి.....అందులోను అమావాస్య చీకటి.
    నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ గోడగడియారం రెండు గంటలు కొట్టింది.
    ఆవులిస్తూ ఆఫీసర్ ఆనందరావు భార్య ఆండాళ్ళమ్మ బెడ్ రూంలోంచి డ్రాయింగ్ రూంలోకి వచ్చింది.
    "అబ్బబ్బ! రెండు దాటింది ఇంక నిద్రపోరా?" అంటూ డ్రాయింగ్ రూంలో కూర్చుని నవల చదువుకుంటున్న భర్త ఆనందరావు మీద తన విసురునంతా ప్రదర్శించింది. ఆనందరావు భార్యవైపు ఒకసారి సీరియస్ గా చూసి తిరిగి నవలాపఠనంలో మునిగిపోయాడు.
    "తెల్లవార్లూ నిద్రలేకుండా చదివితే ఆరోగ్యం పాడవదా?" అంటూ ఆమె ఆయన చేతిలోని నవలను లాక్కొంది.
    "నా ఆరోగ్యమేమీ పాడవదుగాని.....దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు, నీవెళ్ళిపడుకో" అన్నాడు ఆనందరావు.
    "మీ కిదో డిటెక్టివ్ నవలల పిచ్చి." అంది ఆండాళ్ళమ్మ ఆవులిస్తూ, అంతలో "దొంగలు! దొంగలు పారిపోతున్నారు పట్టుకోండి" అంటూ ప్రక్కఇంట్లోనుంచి కాంతమ్మ అరవటం మొదలు పెట్టింది.
    "అరెరె! కాంతమ్మగారింట్లో దొంగలు పడినట్లున్నారే ఏది ఆ టార్చిలైట్ యిటివ్వు నేవెళ్ళి చూసొస్తా," అంటూ  లేచి షర్టువేసుకోబోయాడు ఆనందరావు.
    "మీకేమైనా మతిగాని పోయిందా? అసలేరాత్రి పూట. దొంగలు పారిపోతూ ఏ కర్రో, కత్తో విసిరితే? ఆపని చేయడానికి పోలీసులుంటారు. పోలీసులడ్యూటీ మీరు చేస్తారా? హాయిగా పడుకోండిక" అంది ఆండాళ్ళమ్మ భర్తను వారిస్తూ.
    "ఓసి పిచ్చి మొహమా! బయటకు వెళ్ళిచూడకపోతే, యిరుగు పొరుగు వాళ్ళు ఏమనుకొంటారు?" అన్నాడు.
    అయితే నేనూవస్తాను ఆగండి అంటూ ఆండాళ్ళమ్మ డ్రెస్సింగ్ టేబిలుముందు కూర్చుంది, దువ్వెన తీస్తూ.
    "అర్దరాత్రి! నీకిదేం మేకప్ పిచ్చి?" అన్నాడు. "బాగానే వుంది. వున్న పళంగా వెడితే మన హోదా ఏం కాను? మిమ్మల్ని ఆఫీసరుగా నన్ను ఆఫీసరు భార్యగా వాళ్ళు గుర్తించవద్దు?" అంది ముఖానికి పౌడరు పట్టిస్తూ, అదీ నిజమే ననుకుంటూ భార్యతోపాటు తనూ మేకప్ చేసుకోవడంలో పోటీపడ్డాడు.
    వేకువ ఝాము, గోడ గడియారం అప్పుడే నాలుగు గంటలు కొట్టింది. ఆ యింట్లో లైట్లు అన్నీ వేసున్నాయి. ఇంటి తలుపులు బార్లా తెరచివున్నాయి. గదిలో చిందర వందరగా సూట్ కేసులు యినపపెట్టెలు పడేసివున్నాయి. వాటిలో వుండవలసిన బట్టలు, సామాన్లు వగైరా కనిపించడం లేదు. ఓ మూలకూర్చుని ఒక్కొక్కరే పరామర్శించి వెళ్తున్నారు.
    ఎక్కడ? దొంగలు ఎక్కడ? నరికేస్తాను చంపేస్తాను! ఆ వీధిలో స్టూడెంట్ కుర్రాడు ఒకతను ఫైట్లు చేస్తూ యింట్లోకి ప్రవేశించాడు.
    "వీడి మొహం మండా! వీడో కరాటే వీరుడు. దొంగలుపడ్డ ఆరేళ్ళకు కుక్కలు మొరిగినట్లు బయలుదేరాడు" అంటూ అక్కడ చేరిన ఆండాళ్ళమ్మ తనలోతాను గొణుక్కుంది.
    "ఇంకెక్కడి దొంగలు నాయనా? పారిపోయారు" నీరసంగా అంది కాంతమ్మ. అప్పటికే చుట్టు ప్రక్కల యిండ్లలోని వారంతా చేరారు. "ఏమండి కాంతమ్మగారూ, బంగారమంతా పోయిందా?" అంది ఒకామె.
    మనసిచ్చిగాని, దొంగలు పడ్డ తర్వాతా బంగారం మిగిల్చివెళతారా? అంది ఆండాళ్ళమ్మ. పట్టుచీరలన్నీ వున్నాయా? అవి కూడా పట్టుకుపోయారా దొంగలు వదినగారూ? దీర్ఘం తీసింది మరొకావిడ. కాంతమ్మగారి పట్టుచీరెలు గుర్తుకొచ్చి. పట్టుచీరలేమిఖర్మమ్మ! అన్నీ పోయాయి. ఇంకేమైనా వివరాలు కావాలా? ఉక్రోషంగా అంది కాంతమ్మ.
    "దొంగలు పడి అంతాపోయి ఆవిడి బాధపడ్తుంటే మధ్యలో మీపరామర్శయేమిటి? పై పెచ్చు దొంగవెధవలు బురద కాళ్ళతో వచ్చి గదులన్నీతొక్కేశారు. కాస్త నీళ్ళు తెచ్చి కడిగితే బావుంటుంది. పంపులో నీళ్ళువస్తున్నవేమో చూడండి?"అన్నాడు ఆనందరావు.
    అక్కడ చేరిన అమ్మలక్కలంతా తలా ఒక చెయ్యేసి గదులు కడిగి శుభ్రము చేశారు నిమిషాల్లో.
    భుజానికి ఒక సంచి, మెడలో ఒక కెమెరా వేళ్ళాడేసుకుని ఒక యువకుడు సరాసరి ఇంటిలోకి ప్రవేశించాడు.
    "ఎవరయ్యా నీవు? సరాసరి ఇంట్లోకి వచ్చావు?" అన్నాడు ఆనందరావు. "అయ్యా! మీకు నమస్కారము. నేను పత్రికా విలేఖరిని. ఇక్కడ దొంగతనం జరిగిందని తెలిసి, వార్త వ్రాసుకుందామని వచ్చాను" అన్నాడు. ఇంతలో వీధిగేటు లోంచి "చెల్లియో, చెల్లకో, కో, కో..." అంటూ పాడుకుంటూ ఆ యింటి యజమాని నటకంఠీరవ బిరుదాంకితుడు కాంతయ్య లోపలికి ప్రవేశించాడు. ఇంటి ముందు మూగివున్న జనాన్ని చూచి కాంతయ్య, అయ్యోకాంతం అంటూ గొల్లుమన్నాడు. "నీకిప్పుడే నూరేళ్ళు నిండాయా? నన్ను నట్టింట్లో ముంచి వెళ్ళిపోయిందా?" కాంతమ్మ చనిపోయి వుంటుందని, అందుకే ఇంటిముందు జనం పోగయ్యారని శోకాలు పెట్టాడు కాంతమ్మ భర్త కాంతయ్య. మీ నోరు పడిపోను? ప్రొద్దున్నే అవేంమాటలండి అంటూ కాంతమ్మ జనాన్ని తప్పించుకుంటూ ముందుకు వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS