"అయితే! ఇంత చదువూ చదివి జీవితమంతా ఇదే వృత్తి చేస్తావా?" అవధానులు ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు నాగేశ్ ముఖంమీద వయస్సుకుమించిన గాంభీర్యం అలుముకుంది. ఓ క్షణం మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంతలో నాగేశ్ కళ్ళలో కదిలిన కాంతిరేఖల తాలూకు వెలుగు ముఖంమీదిగా గాంభీర్యాన్ని కప్పివేసింది.
"లేదు నేను ఇంకా చదువుతాను. ఐ.ఏ.యస్. పాసవుతాను. కలెక్టరవుతాను." దూరంగా చూస్తూ అన్న ఆ మాటలు తనకు తనే తన నిర్ణయాన్ని వినిపిస్తున్నట్లున్నాయి.
"నువ్వు తప్పక గొప్పవాడివి అవుతావురా కుర్రోడా! నీముఖంలో రాజకళ ఉట్టిపడుతుంది. ఆ నుదురు చూడవయ్యా గోపాలం? ఎంత ప్రశస్తంగా ఉందో ఆ లలాటం!" అన్నాడు అవధానులు ఉత్సాహంగా.
"అవధానులుగారూ నాగేశ్ చెయ్యి చూడండీ!" అన్నాడు గోపాలం.
నాగేశ్ కుతూహలంతో ఓ నిముషం అవధానుల వైపూ, మరో నిముషం అతని చేతిలోని పంచాంగంవైపూ చూసి, కుడిచేతిని ముందుకు చాచాడు.
అవధానులు చెయ్యి అందుకొని పరీక్షగాచూశాడు. "ఆహాఁ ఎంత అదృష్ట జాతకుడివోయ్! నువ్వు, తప్పక కలెక్టర్ అవుతావు. అప్పుడు నాకు పట్టుపంచల చాపు పెట్టాలి సుమా!" అన్నాడు అవధానులు. నాగేశ్ మొహం సిగ్గుతో కందిపోయింది. పర్సు తీసి, ఐదురూపాయల నోటు తీసి అవధానులకిస్తూ వినమ్రతతో మ్రొక్కాడు. ఐదురూపాయలనోటు తీసుకోవటానికి ఓ క్షణం తటపటాయించాడు. మళ్ళీ వద్దు వద్దంటూనే అందుకొని రొంటి మడతలో పొడుంకాయ పక్కగా దోపేశాడు. గోపాలం మనస్సు చివుక్కుమంది. అవధానులవైపు నిరసనగా చూశాడు. అవధానులు గోపాలాన్ని చూస్తేగా సిగ్గుపడటానికి? గోపాలం బుర్ర లోకి అకస్మాత్తుగా ఓ ఆలోచన వచ్చింది.
"సిద్దాంతిగారూ! నాగేశ్ ఎంతకాలం బ్రతుకుతాడో" చెయ్యిచూసి చెప్పండి.
నాగేశ్ చేతిని పరీక్షగా చూసి "ఎనభయి సంవత్సరాలకు ఢోకా లేదు." అన్నాడు అవధాన్లు.
"సరిగ్గా చూడండి!" ఆత్రంగా అన్నాడు గోపాలం.
"అవునయ్యా! చూడు ఈ రేఖ కోటేరు వేసినట్లు ఎంత తిన్నగా ఉందో! ఎక్కడా చిన్న అడ్డగీతకూడా లేదు" అన్నాడు అవధానులు.
"అవునయ్యా గోపాలం! ఇలాంటివి నువ్వు నమ్మవుగా? మరి ఇప్పుడు___?"
"ఇప్పుడు నమ్మాలనిపిస్తూంది" అన్నాడు గోపాలం. మరో సమయంలో అయితే గోపాలం ఇలాంటివి నమ్మడు. మనస్సును ఏదో సందేహం పీడిస్తుంటే, ఆ బాధనుంచి విముక్తిని పొందటానికి నమ్మటానికి ప్రయత్నిస్తున్నాడు.
"నాగేశ్ ఇంకా చదువుతానన్నావుగా? ఎలా చదువుతావు?" గోపాలం ప్రశ్నించాడు నాగేశ్ ను.
"ఈ రెండు నెలలూ శెలవలుగా? ఈ రెండునెల్లూ ఈ ప్రదర్శనిచ్చి బాగా సంపాదిస్తాను. ఇవ్వాళ ఇప్పటి కప్పుడే ఐదువందలు కలెక్షన్ అయింది; కనీసం నావాటా వందరూపాయలైనా వస్తాయి."
"మిగతాసొమ్ము ఎవరికి పోతుంది?"
"కొంత ఖర్చులకు పోతుంది. మిగిలింది కాంట్రాక్టర్ యాదగిరి గారూ నేనూ సమానంగా పంచుకుంటాం. ఏర్పాట్లన్నీ ఆయనే చేస్తారు."
"ఆఁ తరవాత?" అవధానులు కుతూహలంగా ప్రశ్నించాడు.
"కనీసం ఈ రెండు నెలల్లో మూడువేలయినా సంపాదిస్తాను. నేను చిన్నవాణ్ణి కాబట్టి ఈ ప్రదర్శనలకు ఇంత డబ్బు వస్తుంది! నాకో అక్కయ్యవుంది. అక్కయ్యకు పెళ్ళికాలేదని అమ్మ రోజూ బాధపడుతూ ఉంటుంది. ఈ డబ్బుతో అక్కయ్యకు పెళ్ళిచేస్తాను. నా చదువుకు కావాల్సింది మధ్య మధ్య శెలవల్లో ఈ ప్రదర్శనలిచ్చి సంపాదిస్తాను." గబ గబా ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు నాగేశ్. నయాగరాజులపాతాలు ఎన్నయితే నాగేశ్ లో ఉరకలు తీస్తున్న ఉత్సాహంతో సమానంఅవుతాయి!
"మరి ఈ విద్యను మీ నాన్న దగ్గర నువ్వు నేర్చుకోలేదు. ఎలా చేస్తావు? ఒకవేళ__?" గోపాలం గొంతులో అపశృతి పలికింది.
"నాకే అపాయం జరగదు. ఇదుగో చూడండి. ఈ ఆంజనేయ స్వామివారి బిళ్ళ! దీన్ని మా నాన్న ఈ ప్రదర్శన లిస్తున్నప్పుడు ధరించే వాడు. మా తాతకూడా ధరించేవాడు. ఇప్పుడు నేనూ వేసుకున్నాగా. నాకే అవాంతరం జరగదు." అంటూ షర్టుగుండీలు ఊడదీసి, నల్లదారంలో వేలాడుతున్న అరచేతివెడల్పునున్న రాగిబిళ్ళనుచూపించాడు. దానిమీద సంజీవిపర్వతాన్ని అరచేతిలో ఎత్తుకొని ఎగురుతున్న ఆంజనేయ స్వామి బొమ్మ స్పష్టంగా కనిపిస్తూంది. ఆ బిళ్ళను కళ్ళకద్దుకొని, షర్టు లోపలకు వేసికొని గుండీలు పెట్టుకోసాగాడు.
సిద్దాంతి గోపాలం మొహంలోకి సగర్వంగా చూశాడు.
"మీ నాన్న చచ్చిపోయినరోజు ఇది వేసుకోలేదూ?" గోపాలం వేసిన ప్రశ్నకు అవధాన్లుకు వళ్ళు మండింది.
"ఊహుఁ మర్చిపోయాడు. ఆ రోజు ఉదయమే మా అమ్మ ఆ బిళ్ళను చింతపండుతో బాగా తోమి తుడిచి, గూట్లోపెట్టి పూజచేసిందట. మా నాన్న మర్చిపో
"అయినా ఈ ఒక్క బిళ్ళే రక్షించదు. ఈవిద్యకు సంబంధించిన సులువులు ఏమైనా ఉండివుంటాయి. బట్టలుకూడా మామూలువి అయివుండవు. అయినా మీ అమ్మగారిని అడిగి చూడకపోయావు?" గోపాలం దిగులుగా అన్నాడు.
"మా అమ్మకు తెలవదుగా? శెలవల్లో ఫ్రండ్ ఇంటికి హైదరాబాద్ వెళుతున్నానని చెప్పాను. అమ్మకు తెలిస్తే చచ్చినా ఒప్పుకోదు." అన్నాడు నాగేశ్ టెంటులోనుంచి బయటికి చూస్తూ.
