Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 10


    "మీ అమ్మకు తెలియకుండా నువ్వీ పనిచెయ్యటం మంచిదికాదు. ఇవ్వాల్టికిది మానేసేయ్. తరవాత ఆలోచించుకోవచ్చు," ఆదుర్దాగా అన్నాడు గోపాలం.
    "అదెలా బాబుగారూ?" అన్నాడు నాగేశ్ సాలోచనగా.
    "ఏముంది? ఎవరిడబ్బు వాళ్ళకిస్తే సరిపోయే? నీకు వంట్లో బాగా లేదని మీ కాంట్రాక్టరుచేత చెప్పించవచ్చును." అన్నాడు గోపాలం.
    "అలాచేస్తే ఇంత జనం ఆయాదగిరిని ప్రాణాలతో వదుల్తారా! ఆంజనేయస్వామివారు ఆ కుర్రాడిగుండెలమీద అంత దేదీప్యమానంగా వెలిగిపోతుంటే భయం దేనికి? ఆ స్వామి మహిమ నీలాంటి నాస్తికులకు అర్ధం కాదు. పైగా ఆ కుర్రాడి చేతిరేఖలు ఎంత స్పష్టంగా ఉన్నాయి! ఎనభయ్ సంవత్సరాలు ఢోకా లేకుండా బ్రతుకుతాడు. చాలా గొప్ప భవిష్యత్తు ఉంది" అవధానులు గబగబా అనేశాడు.
    నాగేశ్ కళ్ళలో కాంతిరేఖలు కదిలిపోతున్నాయి. శరీరంలోని ప్రతి అణువులో జీవితం నిండుగా ప్రవహిస్తూంది. గోపాలం ఆ కుర్ర వాన్నే రెప్పవాల్చకుండా చూస్తూ కూర్చున్నాడు. దూరంగా బావి దగ్గర ఉన్నజనంలో అల్లరి, నాగేశ్ ఉలిక్కిపడి టెంటులోనుంచి బయటకు చూశాడు.
    మైక్ లో నుంచి కంట్రాక్టరు యాదగిరి కంఠం బిగ్గరగా వినిపిస్తూంది :
    "త్వరపడండి! త్వరపడండి! ఐదు నిముషాలలో అతిలోక భయంకరమైన ఫీట్ జరుగబోతూంది ! ప్రవేశం ఒక్క పావలా మాత్రమే ! ఇరవై అయిదునయాపైసలు ! త్వరపడండి! త్వరపడండి! వ్యవధిలేదు."
    నాగేశ్ లేచి నిల్చున్నాడు.
    అవధానులకు వళ్ళు పులకరించింది.
    గోపాలానికి ఒళ్ళు జలదరించింది.
    "ప్రపంచంలో అంతవరకూ కనీవినీ ఎరుగని వింత ! ముక్కు పచ్చలారని పదహారుఏళ్ళ బాలుడు- ఐదువందల గజాల ఎత్తునుంచి అగ్నిగోళంగా మారి, సరాసరి మృత్యుగహ్వరంలోకి ఎలా దూకుతాడో కనులారా చూడండి! ఒక్క పావలా మాత్రమే! వెల్ ఆఫ్ డెత్ ? ఒక కప్పు కాఫీ ధరకే! వెల్ ఆఫ్ డెత్ ! రెండు రబ్బరు బెలూన్ల వెల! ఇరవై అయిదు నయాపైసలు మాత్రమే! త్వరపడండి! కొద్దిక్షణాల్లో షో బిగిన్ కాబోతోంది! వెల్ ఆఫ్ డెత్!" యాదగిరికంఠం తారాస్థాయిలో వినిపిస్తూంది.    
    "వెల్ ఆఫ్ డెత్ !" గోపాలం చెవుల్లో గింగురుమంటూంది యాదగిరి కంఠం. మెదడులో సన్నగా పోటు ప్ర్రారంభమయింది. లేచి రెండడుగులు ముందుకువేసి గబుక్కున నాగేశ్ చెయ్యి పట్టుకున్నాడు.
    అవధానుల గుండెలు గుబగుబలాడాయి.
    "బాబుగారూ! భయపడకండి. టైం అయిపోయింది ! మళ్ళీ అర్ధగంటలో వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. నాకు కనిపించకుండా వెళ్ళి పోకండీ!" అంటూ నాగేశ్ గోపాలానికి, అవధానులకూ నమస్కారంచేసి బయటకు వెళ్ళిపోయాడు. నాగేశ్ వెనకే గోపాలం టెంటుబయటికివచ్చి నిలబడ్డాడు.
    దూరంగా బావిదగ్గర నిచ్చెన ముందు నిలబడ్డ నాగేశ్ ను తదేక దృష్టితో చూస్తున్న గోపాలాన్ని భుజంతట్టి"రావోయ్ గోపాలం! మనం కూడా వెళదాం" అన్నాడు అవధాన్లు.
    "నేను ఇక్కడే వుంటాను. మీరు వెళ్ళండి?" అన్నాడు గోపాలం నూతిలోనుంచి మాట్లాడుతున్నట్లు.
    గోపాలం ముఖంలోకి ఓ నిముషం ఆశ్చర్యంగా చూసి అవధానులు గబగబా ముందుకు జనాన్ని తోసుకుంటూ వెళ్ళిపోయాడు.
    మరో రెండు నిముషాలకు నిచ్చెనమెట్లలా కట్టివున్న ఇనపమెట్లను గబగబా ఎక్కిపోతున్నాడు నాగేశ్ వేలకొద్దీ కళ్ళు ఆ కుర్రాడితోపాటు పైకి ఒక్కొక్క మెట్టే ఎక్కుతున్నాయి. అందరూ గాలి పీల్చుకోవటంకూడా మర్చిపోయినట్లు చూస్తున్నారు.
    గోపాలం మెడవిరుచుకొని పైకి చూశాడు. చుక్కల్లో చందమామలా నాగేశ్, విశాలమైన ఆకాశంలో తెల్లని నల్లని మబ్బులకింద ఇనపచట్రంలో నిలబడివున్నాడు. పదహారేళ్ళ నాగేశ్ ఐదేళ్ళ కుర్రాడి కంటే చిన్నగా కనిపిస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS