యాదగిరి అవధానుల్నీ గోపాలాన్నీ, కుర్రాడితో టెంటులో వదిలేసి 'ఇప్పుడే వస్తా' నంటూ బయటకు వెళ్ళాడు.
"ఈ కుర్రాడు చచ్చిపోతే!" గోపాలం హృదయం కపించింది. "నీ పేరేమిటోయ్?" అవధానులు కుర్రవాడిని కుతూహలంగా ప్రశ్నించాడు.
"నాగేశ్!" కుర్రాడి కంఠంలోనుంచి మాటలు వెదురుబొంగు పగిలి గాలికి శబ్దం చేస్తున్నట్లు వచ్చాయి.
ఈ వయస్సులో ఉండే కుర్రవాళ్ళ స్వరం తమాషాగా ఉంటుంది అనుకున్నాడు గోపాలం.
"ఎంతకాలంగా ఈ ఫీట్సు చేస్తున్నావ్?" గోపాలం ప్రశ్నించాడు.
"ఇదే మొదటిసారండీ!" జవాబిచ్చాడు కుర్రవాడు.
"మొదటిసారా? భయం వెయ్యటంలేదూ?" గోపాలం నాగేశ్ కళ్ళలోకి లోతుగా జాలిగాచూస్తూ ప్రశ్నించాడు. ఎంతకళగల మొహం! చదువుకున్నవాడిలా ఉన్నాడు.
నాగేశ్ నవ్వాడు. నవ్వినప్పుడు నాగేశ్ ముఖం నూరుకాండిల్స్ బల్బ్ వేసినట్లు వెలిగిపోయింది. ఆ నవ్వులో గర్వం ఇమిడివుంది.
"భయమా? ఎందుకూ?" ఎదురు ప్రశ్నవేశాడు నాగేశ్ చిరునవ్వుతో విశ్వాన్ని జయించటానికి బయలుదేరిన సికిందర్ ను ఆ ప్రశ్న అడిగితే బహుశా నాగేశ్ లాగే నవ్వి, నాగేశ్ లాగే ఎదురు ప్రశ్న వేసి ఉండేవాడేమోననిపించింది గోపాలానికి.
"ఈ విద్యను నువ్వు ఎవరిదగ్గర నేర్చుకున్నావ్?" అవధానులు ప్రశ్నించాడు.
"ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. మా కుటుంబవృత్తే ఇది" అన్నాడు నాగేశ్.
"అంటే మీనాన్నకూడా ఇదేపని చేసేవాడా?" గోపాలం ఆత్రంగా అడిగాడు.
"అవును మా నాన్నేకాదు. మా నాన్న నాన్నా, వాళ్ళ నాన్నా కూడా ఇదేపని చేశారు." అన్నాడు నాగేశ్ ఉరకలుతీస్తున్న ఉత్సాహంతో.
"మీ నాన్న ఉన్నాడా?"
"లేడండీ, మా నాన్నపోయిన సంవత్సరం పూనాలో ఈ ప్రదర్శన ఇస్తూ చనిపోయాడు."
గోపాలం ఉలిక్కిపడ్డాడు. నాగేశ్ కళ్ళలోకి లోతుగా చూశాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకోవటంవల్ల నీరునిండిన ఆ కళ్ళలో ఏమీ కనిపించలేదు గోపాలానికి.
"మీతాత ఎలా చచ్చిపోయాడు?" గోపాలం- కంఠంలో బాధ ధ్వనించింది.
"మా తాతకూడా ఎంతోకాలం ఈ వృత్తిమీదే బ్రతికాడు. కాని చివరకు ఈ ఫీట్ చేస్తూనే చనిపోయడట."
"మరి వాళ్ళనాన్న!" ఆదుర్దాగా ప్రశ్నించాడు. అవధానులకు గోపాలం ప్రశ్నలు విసుగు పుట్టించాయి.
"ఆయన మామూలుగా ఏదో జబ్బుచేసే చచ్చిపోయాడట." చిరునవ్వుతో జవాబిచ్చాడు నాగేశ్.
గోపాలం నిట్టూర్పు విడిచాడు.
"ఇదంతా తెలిసే నువ్వీ సాహసం చేస్తున్నావా?" గోపాలం ప్రశ్న నాగేశ్ ను ఉద్దేశించి వేసినా తనకు తనే వేసుకున్నట్లుంది. దూరంగా నాగేశ్ భవిష్యత్తును చూట్టానికి ప్రయత్నిస్తున్నాడు.
నాగేశ్ కిలకిల నవ్వాడు. గోపాలం వెర్రిమొహంవేసి నాగేశ్ మొహంలోకి చూశాడు.
"బాబుగారూ? ఒకవేళ మీనాన్నగారూ, ఆయన నాన్నగారూ ఆఫీసులోపనిచేస్తూచేస్తూ చచ్చిపోయారనుకోండి. మీరు ఆఫీసులో పనిచెయ్యటానికే భయపడతారా?" నాగేశ్ ప్రశ్నకు ఏం సమాధానం ఇవ్వాలో గోపాలానికి తోచలేదు. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఓ క్షణం.
"అదీ ఇదీ ఒకటెలా అవుతుంది? మీనాన్నదగ్గర ఈ విద్య నువ్వెందుకు నేర్చుకోలేదు." ఈసారి ప్రశ్నించటం అవధాన్ల వంతయింది.
"మా నాన్నకు నేను ఈ వృత్తిచేసి బ్రతకటం ఇష్టంలేదు. మా నాన్న ఈ ఫీట్ చేస్తున్నప్పుడు అసలు నన్ను చూడనిచ్చేవాడే కాదు. ఒకటి రెండుసార్లు నేనే దొంగతనంగా వెళ్ళి జనంలో కూర్చొని చూశాను. అది తెలిసి మా నాన్న నన్ను బాగా కొట్టాడుకూడా."
"మీ నాన్నకు నువ్వు ఏంపని చెయ్యాలని వుండేది?" గోపాలం కుతూహలంగా ప్రశ్నించాడు.
"బాగా చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలని ఉండేది."
"ఏం చదువుకున్నావ్?" అవధాన్లు ప్రశ్నించాడు.
"మొన్ననే స్కూల్ ఫైనల్ పరీక్ష రాశాను."
నాగేశ్ జవాబుకు విస్తుపోయి చూశారు ఇద్దరూ.
"మరి అంత చదువుకొని ఇదేంపని? మీనాన్నకోరిక ప్రకారం ఏదైనా ఉద్యోగం చూసుకోకూడదూ?" అన్నాడు గోపాలం.
నాగేశ్ అదోలా, చాలా కాచి వడపోసినవాడిలా నవ్వాడు.
"బాబుగారూ, ఇంకా మీకుపరిస్థితులు తెలిసినట్లులేవు. ఈ రోజుల్లో ఎం.ఏలూ, బి.ఏలూ, ఉద్యోగాలు దొరకక తిరుగుతున్నారు. స్కూల్ ఫైనల్ చదివిన నాకు, ముఖ్యంగా రికమండేషన్ ఏమీ లేకుండా ఉద్యోగం ఎవరిస్తారు? వినలేదూ! ఈ మధ్య ఇంజనీరు పాసయిన ఒక యువకుడు యల్.డి.సీ గా చేరటానికి వెళితే ఆ ఆఫీసరు చేర్చుకోను పొమ్మన్నాడట. ఆ ఆఫీసరు ఏ బి.ఏ. పాసయినవాడో అయివుంటాడు. రాజకీయపక్షుల రెక్కలనీడలో ఆ కుర్చీని సంపాదించి ఉంటాడు. తనకంటే ఎక్కువ చదివినవాణ్ణి తనక్రింద ఉద్యోగంలో వేసుకోవటం ఏనాటికైనా తనకే ముప్పని భయమో ఏంపాడో!" ఉద్రేకంగా మాట్లాడుతున్న నాగేశ్ లేత బుగ్గల్లోకి రక్తం చిమ్మింది. గోపాలం ఆ కుర్రవాడి విజ్ఞానానికి విస్మయం చెందాడు.
