Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 9


    అప్పటికి కోట ప్రాకారం పూర్తి అయింది. కోట నిర్మాణం పూర్తికాలేదు. ప్రాకారంలోపల అన్నీ మట్టియిళ్ళు పూరిపాకలు. తాటాకుతో కప్పిన ఇళ్ళు. అయిదువందల సైన్యంలో సగం బలి అయిపోగానే తాటాకు పాకల మధ్య అయిదువందలమంది ఆడవారిని వుంచి పాకల చుట్టూ 'ఎల'గీసి పాకాలకు నిప్పుపెట్టారు నిప్పుపెట్టినవారు ఎవరు? ఆ స్త్రీ మూర్తుల భర్త, తండ్రి, తనయులు, సోదరులు వాళ్ళే తమ ఆడవారిని ఎల మధ్య, పాకల మధ్య వుంచి పాకలకు నిప్పు అంటించారు. అందరూ అనివార్యంగా కాలి మసైపోవాలి. ఎల దాటివచ్చినవారు వెలమ కాంతలు కాదని ఆన చేశారు ఆ ఆనకు ఆ కాంతలు ఆహుతి అయిపోయినారు. యెంతటి దారుణం!
    మంటల వేడికి తట్టుకోలేక ఆడపడుచులు పసివారిని ఎల అవతలకు విసిరివేశారు. ఎల వెలుపల కాపుగా వున్న యాభైమంది వీరులు ఎల దాటివచ్చినవారిని నరికివేశారు. తిరిగి పసిపిల్లల్ని మంటల్లో వేశారు. యిదేమి పరాక్రమం? యిదేమి జాతి గౌరవం? శత్రువులకు యెవరూ ప్రాణాలతో చిక్కరాదు అన్న యుద్దనీతికి పర్యవసానం యింతటి దారుణమా?
    అటువంటి స్థితిలో మహామేధావిని, పరాక్రమశాలిని, నిండయిన స్త్రీమూర్తి అయిన మహాదేవిమల్లమ్మ మనోగతం యెలా వుండివుంటుంది? అని నేను అప్పుడప్పుడూ ఆలోచిస్తూ వుంటాను. అప్పటి ఆమె మనోగతం తెలుసుకుందుకు యీ మిస్ మార్లిన్ ఒక తూలిక కాగలదని నా ఆశ!
    ఆమె మాటతీరూ, ముఖవర్చస్సూ, కళ్ళల్లో కనిపించే వెలుతురూ చూస్తూంటే బాగా చదువుకున్నదానిలా వుంది. యెక్కడనించి వచ్చిందో? యెందుకు వచ్చిందో? అర్ధం కాకుండా వుంది. ఆమెకు తెలుగు మాట్లాడటం యెలా వచ్చింది? పోనీ నేర్చుకుంటే తెలుగు రావచ్చు. కాని బొబ్బిలి యుద్దకాలంనాటి సంగతులను యెలా చెప్పగలుగుతోంది. ఆ పాత్రల గుణగణాలను యెలా వివరించి చెప్పగలుగుతోంది? అదే నాకు అర్ధం కాకుండా వుంది.
    పునర్జన్మల గురించి అనేకం చదివాను. రేమండ్ వ్రాసిన లైఫ్ ఆఫ్టర్ డెత్ చదివాను. జార్జి హుర్కోస్ పోలెండులో సృష్టించిన సంచలనాన్ని గురించి చదివాను. యివాల్టి సైన్సు పునర్జన్మను అంగీకరిస్తోంది. దాని స్వరూప స్వభావాలను కొంతవరకూ వివరించగలుగుతోంది.
    పునర్జన్మ అసత్యం కాదని నిరూపిస్తోంది సైన్సు.
    ఇదికూడా అటువంటి కేసే అయి వుండవచ్చు. పునర్జన్మలు అసత్యం కాదు కాని చారిత్రక వ్యక్తులు మళ్ళీ పుట్టటం అరుదు.
    ఏది యేమయినా మిస్ మార్లిన్ విచిత్రమయిన యువతి ఆమె చెప్పే సంగతులు అసత్యాలని నిరూపించటం అసాధ్యం. దొరికే ఆధారాలను బట్టి నిజమే అని నమ్మాల్సి వస్తోంది.
    కళింగ కై ఫీయతులో తాండ్ర పాపయ్య విజయరామరాజును చంపిన దృశ్యం విపులంగా వ్రాసి వుంది. నేను ఆ కైఫీయతు చదివాను. దానికీ యిప్పుడు మిస్ మార్లిన్ చెప్పేదానికీ సరిగా సరిపోతోంది.
    కాబట్టి ఆనాటి బొబ్బిలి యుద్ద దృశ్యాలూ, వ్యక్తులూ ఆమెకు తెలుస్తున్నాయి. యీ అవకాశాన్ని పురస్కరించుకుని ఆనాటి యదార్ధగాధను నేను వినాలి. డబ్బుకి ఆశించి చరిత్రను కొందరు తమ యిష్టం వచ్చినట్లు వ్రాశారు. వారు చెప్పేది యెంత నిజం? యెంత అబద్దం అనే సంగతి మిస్ మార్లిన్ నాకు వివరించగలదు అన్న నమ్మకం కుదిరింది.
    ఆమె అన్ని విషయాలూ చెప్పదు. యెల్లుండి "బోనాల పండుగ" బొబ్బిలి మృతవీరులకు బల్లులూ, పొంగళ్ళూ యిచ్చే పండుగ. ఆరోజు అర్ధరాత్రి 1757 జనవరి యిరవైనాలుగు నాటి మంటలూ యేడుపులూ వినిపిస్తాయని జనశృతిలో చెప్పుకుంటాకు.
    అదే నిజమయితే సైకాలజీ ప్రకారం ఆ రోజుకు యీ మార్లిన్ మల్లమ్మదేవిగా పరిపూర్ణమయిన ఆలోచనకు లోను అవుతుంది. అప్పుడు యీ యదార్ధగాధ నేను తెలుసుకునే వీలుంటుంది.
    తెల్లవారితే సైక్రియాట్రిస్ట్ వస్తాడు విశాఖనించి ఆయనచేసే వైద్యం యెలా వుంటుందో యిప్పుడు నేను వూహించలేను. కాని అది నా ప్రయత్నానికి విఘ్నం కాకూడదు. ఆయన దీనిని పిచ్చిగా నిర్ణయించవచ్చు. మార్లిన్ కు సంకెళ్ళు వెయ్యండి, నిమ్మకాయ రుద్ది నీళ్ళు పొయ్యండి, మత్తు యింజక్షన్స్ యివ్వండి అని ఆదేశించవచ్చు.
    అటువంటి పరిస్థితులు యెదురు అయితే నేను చేయవలసిన పనులు యేమిటో ఆలోచిస్తూ అరకన్నుగా కోడినిద్ర పట్టించాను.
    అరగంట అయ్యాక కేకలూ, బొబ్బలూ విన్పించినాయి.
    ఉలికిపడి లేచాను. గదిలో మిస్ మార్లిన్ పెద్దగా అరుస్తూ తలుపు దడ దడ బాదుతోంది ఆ స్థితిలో తలుపు తీస్తే ఆమె నామీదికి దూకి నా పీక నులిమినా ఆశ్చర్యం లేదు. నా శరీరదార్ధ్యతతో నేను ఆమెను అదుపు చెయ్యలేకపోవచ్చు. ఓడిపోతే ప్రాణం పోవచ్చు.
    ఆడదాని మనోబలం ముందు మగవాడి శరీరబలం యెంత?
    అయినా నేను వెనుక అడుగు వెయ్యకుండా తలుపు తీశాను. మిస్ మార్లిన్ తలుపు తియ్యగానే నన్ను రెక్కపట్టి లోపలకు లాగింది. తూలి పడిపోయాను.
    "చావండి! మగపోడిమి తెలియని మూర్ఖులారా చావండి ఆడదంటే అబల కాదు. ఆదిశక్తి వెలమకాంతలు అంత తేలిక అయిపోయినారా మీకు. మేము యుద్దరంగంలో ప్రాణాలకు ఆశించి బందీలుగా చిక్కుతామని నీచంగా ఆలోచిస్తారా? దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించుకోవటంలో మగవారికి యెంత బాధ్యత వున్నదో ఆడవాళ్ళకు అంత బాధ్యత లేదా, మీతోపాటు మేమూ యుద్ధం చెయ్యవద్దా? మా స్త్రీత్వం, మా శౌర్య పరాక్రమాలు, స్వాతంత్ర్యంకోసం మేము పడే తపన అంతా తాటాకుమంటలకు ఆహుతి చేస్తారా? ఎలగీసి బలిచేస్తారా? నా బిడ్డ చైనా వెంకటరాయుడు అగ్నికి ఆహుతి  కావాలా? యిది అన్యాయం, యిది ఘోరం. యిది నీచం. యిది పిరికితనం యిది మురికితనం. యిది ఆలోచన కాదు అంధత్వం యిది ముందు చూపు కావు, క్రిందు చూపు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS