"గది వెలుపలా కోట చుట్టూ విచ్చుకత్తుల పహారా పెట్టారా? యీ బొబ్బిలి మహాసామ్రాజ్యం (బొబ్బిలి రాజ్యం వైశాల్యం మొత్తం 20 చదరపు మైళ్ళు అయిదుమైళ్ళు పొడవూ, నాలుగుమైళ్ళు వెడల్పూ వుండేది) చూచి విజయనగర రాజులకు అసూయగా వుంది. యెప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. జాగ్రత్తగా వుండమని చెలికాని వెంకయ్య మహాసేనానికీ, మంతెన బుచ్చెన్న సేనానికీ కబురు పంపండి" అని ఆజ్ఞ జారీచేసింది మార్లిన్.
"అలాగే అమ్మగారూ!" అన్నాను వినయంగా.
ఆలోచించాను. విజయనగర రాజులకు అసూయ యేమిటి? విజయ నగరం అప్పట్లో రేగులవాక అనే పేరుతో వుండేది యిప్పటి విజయనగరం కోటను ఫ్రెంచి యింజనీర్లు డిజైనుచేసి కట్టించారు అయినా ఆ కోట రేగులవలన శివార్లలో వుంది. విజయనగర రాజ్యం బొబ్బిలియుద్ధం నాటికి గోదావారినించి కటకం వరకూ వుండేది. కటకం అంటే యిప్పటి ఒరిస్సా రాష్ట్రంలోని కటక్. యిరవై చదరపుమైళ్ళ వైశాల్యం గల బొబ్బిలి మహాసామ్రాజ్యమట. అయిదువందలమంది వీరులున్న సైన్యానికి చెలికాని వెంకయ్య మహాసేనానిట నాకు తమాషా అనిపించింది. అప్పట్లో మల్లమ్మ దేవి అలా అనుకునేది కాబోలు యిరవై చదరపుమైళ్ళ వైశాల్యం వున్న బొబ్బిలిని చూచి గోదావరినించి కటకం వరకూ ప్రభువులైన విజయనగర రాజులు అసూయపడేవారా? కారణం యేమిటి? అని ఆలోచిస్తున్నాను.
నమ్మటానికి వీలు అయినవి అయినా కాకపోయినా యీమెనించి ఆనాటి వాతావరణం, మరికొన్ని వివరాలు రాబట్టవచ్చునని అనిపించింది. ప్రయత్నంచేసి చూద్దామనుకున్నాను.
నాకు చాలాకాలంగా ఒక సందేహం పీడిస్తోంది. తాండ్ర పాపయ్య బొబ్బిలి గోపాలకృష్ణ రంగారావుకూ, వెంగళరాయుడుకూ వరుసకు బావ అవుతాడు. బొబ్బిలి అంటే పాపయ్యకు ప్రాణం.
విజయరామరాజు, హైదరు జంగూ అబద్దాలు చెప్పి బుస్సీని నమ్మించి కోటను ముట్టడించారు. దేవులపల్లి చేరేనాటికి యుద్ధం అనివార్యం అనే సంగతి బొబ్బిలివారికి తెలిసింది. బుస్సీసైన్యం యాభై వేలు యనభై వేల సైన్యం అయిదువందల సైన్యంమీదికి యెత్తివస్తోంది. అటువంటి సమయంలో బొబ్బిలిని ప్రాణంగా భావించే రాజాం ప్రభువు అయిన తాండ్ర పాపయ్య సాయంగా ముందే యెందుకు రాలేదు. రాజ్య పతనం అయ్యాక, బొబ్బిలివీరులంతా చనిపోయాక రెండో రోజు రాత్రివరకూ బొబ్బిలి రాకుండా యెలా వుండగలిగాడు? యెందుకు అలా చేశాడు?____అనేది చరిత్రలో నాకు అర్ధంకాని అంశం. యింకొన్ని అనుమానాలుకూడా వుండేవి.
"బొబ్బిలికి యేదైనా వుపద్రవం వస్తే తాండ్ర పాపయ్య సర్వసైన్యాధ్యక్షుడు అవుతారు కదా! మహా పరాక్రమశాలి అయిన పాపయ్య నాయకత్వంలో మన(బొబ్బిలి) సైన్యాలకు పరాజయం అంటూ వుంటుందా?" అని మార్లిన్ అలియాస్ మల్లమ్మదేవిని అడిగాను వినయంగా.
మార్లిన్ పక పకా నవ్వింది.
"పాపయ్యపాటి వీరులు బొబ్బిలిలో ప్రతి గడపకూ వున్నారు. తాండ్ర పాపయ్య అన్నగారు బొబ్బిలిని ప్రేమిస్తారు. బొబ్బిలికోసం ప్రాణం యిస్తారు. బొబ్బిలితో బంధుత్వంకోసం పరితపిస్తారు. అంతమాత్రం చేత బొబ్బిలి సర్వసైన్యాలకీ అధ్యక్షుడయ్యేంత శౌర్యం ఆయనకెలా వస్తుంది. చెలికాని వెంకయ్యగారూ, మంతెన బుచ్చెన్నగారూ వంటి పరాక్రమవంతులు బ్రతికి వుండగా తాండ్ర పాపయ్య అన్నగారు మహాసేనాని కావటం అనంతరం" అన్నది మార్లిన్ మల్లమదేవిలా.
(ఇక్కడ పాఠకులు దేవిని క్షమించాలి. బొబ్బిలియుద్ధం గురించి అపూర్వమయిన గ్రంథాలు నేను చదివాను వాటినించి తెలిసింది యేమంటే తాండ్ర పాపయ్య యిప్పుడు ఆంద్రదేశం అనుకుంటున్నంత పరాక్రమశాలి కాదని. అలా నిరూపించటానికి ప్రామాణికమయిన సాక్ష్యాధారాలు లల్లాదేవి దగ్గర వున్నాయి)
మార్లిన్ అలా చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను. కాలానికి కదలిక ప్రధానమయినలక్షణం. కదలిక మార్పుకు మారు రూపం కాలంలో బొబ్బిలికధ మారిపోయింది. యెవరి యిష్టం వచ్చినట్లు వారు నాటకాలూ, బుర్ర కధలూ, పాటలూ వ్రాశారు.
వాటి ఆధారంగా నేను కొన్ని పొరపాటు అభిప్రాయాలు యేర్పరచుకున్నందుకు యెంతో సిగ్గుపడ్డాను.
ఎలాగైనా మల్లమదేవి (మార్లిన్) ని మంచి చేసుకుని ఆ రోజుల్లో జరిగిన యదార్ధమయిన కధ యేమిటో వినాలని అనిపించింది. అటువంటి అవకాశం కోసం యెదురుచూస్తూ తలుపులు దగ్గరగా వేశాను.
3
అంతటా నిశ్శబ్దంగా వుంది. అర్దరాత్రి అవుతోంది యెప్పుడు యేమి ముంచుకువస్తుందో యెదురుచూస్తూ వున్నాను. వాకిలి తలుపులు వెలుపలనించి బిగించి వరండాలో మడతమంచం వేసుకుని పడుతున్నాను బొబ్బిలి గురించీ మార్లిన్ గురించీ ఆలోచిస్తున్నాను.
చిలక సరస్సు పద్మనాభ యుద్దంలో విజయనగరంవారూ బొబ్బిలిలో పద్మనాయక (వెలమ) వీరులూ ఒకే విధంగా యుద్ధం చేశారు బొబ్బిలియుద్ధం ఆర్యులైన ఔత్తరాహులకూ ద్రావిడులయిన దాక్షిణాత్యులకూ మధ్య జరిగింది. ఆ యుద్దంలో స్వాతంత్ర్యం కోసం ద్రవిడజాతి ప్రాణాలను కోల్పోయింది మూకవుమ్మడిగా వింటేనే యేడుపు వచ్చే ఘట్టాలవి. గర్భిణీస్త్రీలు, బాలింతలూ, వృద్దులూ పసికందులూ ఆహుతి అయిపోయారు. పిల్లతల్లులు కడసారి మంటలు మధ్య తమ పేగు తెంచుకు పుట్టిన పసివారికి పాలు యిచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. చివరిసారిగా చిన్ని పాపలకు చన్ను యిచ్చుకోలేక పోయినారు. క్రొత్తగా పెళ్ళి అయిన ఆడపిల్లలు పారాణి చెరిగిపోకుండా ప్రాణాలు కోల్పోయినారు యెంతమంది వుత్తరాలు. యెంతమంది మగువ మాంచాలలు! కోమటివారి యింటి ఆడపడుచులు రాణి రుద్రమ్మదేవి అయ్యారు. ఝాన్సీలక్ష్మీబాయిని మరపించారు. కమలక్క మంటల్లో కాలిపోయింది.
మహాదేవి మల్లమ్మ శౌర్యపరాక్రమాలు, స్త్రీత్వం, స్వాతంత్ర్య పిపాస, ప్రేగు త్రెంచుకుపుట్టిన చిన వెంకటరాయుడు (ఆరు సంవత్సరాలు) మీది మమకారం అన్నీ కాలి మసి అయి, నుసి అయి, బుగ్గిపాలయి, బూడిద అయినాయి. చరిత్రా, కాలమూ, కధా ప్రపంచమూ కన్నీరు విడిచి నాయి.
