Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 10


    "ఇలా బలి అయిపోయిన వెలమవారి ఆడపడుచుల ఆంతర్యాలు అగ్నిగోళాల్లాగ కాలగర్భంలో కరుడు కట్టి నిలుస్తాయి అవి యెప్పుడో ప్రేలుతాయి. మగవాడి ఆలోచనల వెనుక వున్న మకిలను నడివీధికి యీడుస్తాయి. కాలాన్ని నిలదీసి న్యాయం చెప్పమని అడుగుతాయి.
    "చరిత్ర పుటలమీద మగవాడుపూసిన మాయ జలతారును కరిగించి కాలరాస్తాయి. మగవాళ్ళు సృష్టిస్తున్న అపోహల్ని చీల్చి, పేల్చి, కాల్చి థూ అని వుమ్మి అవతలకు గిరాటువేస్తాయి.
    "ఆడదాని ఆంతర్యమనే ఆ అగ్నిగోళం నేలంత అయి, సూర్యుడంత అయి, ఆకాశమంత అయి, విశ్వమంత అయి నిజానికి . అప్పుడు తెలుస్తుంది చరిత్ర యేమిటో? అప్పుడు తెలుస్తుంది ఆడదంటే యేమిటో? అబల అంటే యేమిటో?" అంటూ అరుస్తోంది మిస్ మార్లిన్ కాదు మహాదేవి మల్లమ్మ.
    ఆమె మనోబలం ముందు నా శరీరబలం తూలిపోయింది. నేను మీద పడ్డాను. ఆమె నన్ను మగజాతికి ప్రతినిధిగా భావించుతోంది కాబోలు.
    కాళీశక్తిలా కాలెత్తి నా పొట్టమీద పెట్టింది. తిన్నదంతా వెళ్ళుకొస్తోంది. వూపిరి అందటం గగనం అయిపోయింది. పెనుగులాడుతున్నాను.
    నిద్రతల్లి ఒడిలో మూడు ముద్రవేసిన పనివాళ్ళకి ఆ కేకలకు తెలివి వచ్చింది. అందరూ కంగారుగా వచ్చేశారు.
    అంతమంది పట్టి లాగినా కాలు కదిలించటం అసాధ్యమయింది నాకు స్పృహ తప్పేలా వుంది. నా తెలివి వుయోగించాను చివరిసారి "తప్పంతా మగవాడిదే. నన్ను క్షమించి వదిలిపెట్టు" అని, ఆ మాటకు మార్లిన్ శాంతించి కాలు తీసింది.
    అంతమంది పట్టి లాగినా రాని కాలు అప్పటికి నన్ను వదిలిపెట్టింది. వూపిరి అందుతోంది. నా సమయస్ఫూర్తి కాపాడింది నా ప్రాణాలనే కాబట్టి నన్ను నేనే అభినందించుకున్నాను. అభినందనలు అయ్యాక మళ్ళీ నాకు నేనే థాంక్స్ చెప్పుకున్నాను.
    రంగారావుగారు యీ గొడవకు లేచారు. నిద్ర మధ్యలో లేపితే చిర్రెత్తిపోయే వ్యక్తుల్లో ఆయన ఒకరు. అర్ధంతరంగా నిద్రలేపితే యెదురుగా వున్న వ్యక్తిని కొట్టటం ఆ వెలమ దొరగారికి అలవాటు. అటువంటిది అర్దరాత్రి యింత గొడవ అవటంనించి ఆయన యేకంగా తుపాకి తీసుకుని వచ్చేశారు మేమున్న గదిలోకి.
    "ఆచార్లుగారూ, మీరు అనవసరంగా యీ పీడ నెత్తికి యెక్కించు కున్నారు. ఏది ఎవరైతే మనకెందుకు? పిచ్చెక్కింది మనుషుల్ని చంపుతోంది కాల్చేస్తాను." అంటూ బారల్ మిస్ మార్లిన్ వైపు పెట్టారాయన.
    వెలమదొరల పరాక్రమానికి తొందరపాటు ఒక అలంకారం కాబోలు అనుకున్నాను. తీరిపోయిన కధ  మళ్ళీ తిరగబడుతోంది.
    చస్తూ, బ్రతుకుతూ లేని ఓపిక తెచ్చుకుని లేచి బారల్ కు యెదురుగా పోయాను. "అంత పని చెయ్యకండి. యిది యిరవయ్యవ శతాబ్దపు వుత్తరార్ధం. ఆమెను చంపితే కేసు అవుతుంది ఒకటి తెలియవలసిన సంగతులు తెలియకుండాపోతాయి రెండు. మరణశిక్ష విధించేటంత నేరం ఆమె యేమీ చెయ్యలేదు మూడు. మనిషిని చంపటం అనే నేరం మీరు చెయ్యటం ఘోరం నాలుగు. యింకా చెప్తే అంకెలతోపాటు కారణాలూ పెరిగి పోతాయి. యింతటికి చాలు. ఆగండి. ట్రిగ్గర్ నొక్కకండి ప్లీజ్" అన్నాను.
    రంగారావుగారి ఆవేశం చల్లారిపోయింది.
    కాని గన్ చూడగానే మహాదేవి మల్లమ్మకు గోపాలకృష్ణ రంగారావు ప్రాణాలను బలి తీసుకున్న ఒక సామాన్య ఫౌజ చేతిలోని త్రీనాట్ త్రీ రైఫిల్ గుర్తుకువచ్చింది. ఆమె రెచ్చిపోయింది మళ్ళీ.
    మిస్ మార్లిన్ కనిపించకుండా పోయి మహాదేవి మల్లమ్మే కన్పిస్తోంది. మేము అలాగ నిశ్చలమయిన ఆలోచనమీద నిలిచేందుకు ఆమె ధరించిన గౌను కాని, బాబ్డు హెయిర్ కాని, నీలిరంగు కళ్లుకాని అడ్డుకాలేదు. ఆ అధునాతన ఫ్రెంచి వనిత మహాదేవి మల్లమ్మే అనిపిస్తోంది.
    "ఎవడురా నువ్వు?" అన్నది రంగారావుగారికేసి గుడ్లురివి చూస్తూ.
    "రా అన్నావంటే కాల్చేస్తాను" అంటూ రంగారావుగారు మళ్ళీ తుపాకి యెత్తారు.
    వీళ్ళిద్దరి మధ్య నాకు పిచ్చియెత్తేలా వుంది.
    "సర్! ఆమె యిప్పుడు మామూలు మనిషికాదు. మరో ప్రపంచం నించి మహాప్రస్థానం చేసిన మనిషి. మహాదేవి మల్లమ్మ. దయచేసి ఆమెను రెచ్చగొట్టకండి. ప్లీజ్! ఆమెమీద దయ చూపండి" అన్నాను.
    వెలమ దొరకు నా మాటలు శాంతిసూక్తం అయినాయి. యెద్దు కన్నులా విశాలమయిన నేత్రం రెప్పలచాటుకు తప్పుకుంది.
    "ముందు ఆ తుపాకి యిలా యివ్వండి" అంటూ తుపాకి లాక్కుని దానిని మిస్ మార్లిన్ దృష్టికి అందనిచోట మరో గదిలో దాచివేశాను.
    ఈ గొడవ అంతా విని గాయత్రీదేవికూడా వచ్చారు. పనివాళ్ళు ఆమెకు పరిస్థితి అంతా వివరించారు.
    "ఆచార్లుగారికి ఆమె కాళ్ళు తగిలినాయా? గోపాలదేవా! (బొబ్బిలి కోటలో గోసాలస్వామి ఆలయం వుండేదిట) వెంటనే వేడినీళ్ళు కాచండి ఆయన స్నానం చేస్తారు అన్నారు గాయత్రీదేవి.
    ఆమెకు నామీద వుండే వాత్సల్యానికి కరిగిపోయాను.
    "అమ్మా! నన్ను కాళ్ళతో తొక్కింది మిస్ మార్లిన్ కాదు. మహాదేవి మల్లమ్మ! తెల్లవారు ఝామున తూర్పున మెరిసే వెన్నముద్ద చుక్కలా చరిత్ర పుటల్లో వెలుగు వెల్లువలు నింపుతున్న మల్లమ్మ మహాదేవి. మగవారి తూష్ణీభావానికి, అనాలోచనకు గురి అయి కాలిపోయిన అద్భుత స్త్రీమూర్తి యీమె నిజంగా మల్లమ్మ అయి, ఆమె కాలికి అంటిన ధూళితో ఈ శరీరం పవిత్రం అయితే- నా జీవితంలో యెంతో వుత్తేజకరమయిన క్షణాలు యివి అనుకుంటాను. స్నానం శరీరాన్ని పవిత్రం చెయ్యవచ్చు కాని. మహాదేవి మల్లమ్మ కాలిస్పర్శ నా మనస్సునూ, నా జీవితాన్ని అర్ధవంతం చేసింది" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS