Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 9


    'అవున్సార్..మీరు మీ పనిగంటలకు జీతం ఇస్తున్నారు. దాంతోపాటు మా సిన్సియారిటీని కూడా గుర్తించి వుంటే మరింత సంతోషం కలిగేది..." నిర్భయంగా అంది ప్రనూష.
    "వాడ్డూ యూ మీన్." ఆశ్చర్యపోవడం యం.డి వంతయింది.
    'నేను పావుగంటో, అరగంటో లేటుగా వస్తున్నాను. నిజమే. కానీ, నా పనిని ఫాస్ట్ గా, అవసరమైతే లంచ్ కు వెళ్ళకుండా కూడా చేస్తున్నాను. ఉదయం పదినుంచి అయిదువరకు ఓ అయిదారు ఫైళ్ళు క్లియర్ చేయాలనుకోండి. నేను గంట ఆలస్యంగా వచ్చినా నాపని పూర్తిచేసి వెళ్తాను".
    ఆమె లాజిక్, కన్విన్స్ చేసే పద్దతి ముచ్చటేసింది యం.డి.కి. అయినా బెట్టుగా...'
    "అంటే..ఆలస్యంగా వచ్చినా ఫర్వాలేదంటావు..." అన్నాడు.
    "కాదు సార్...ఆలస్యంగా వచ్చినా పనిని సిన్సియర్ గా అనుకున్న టైంలో పూర్తిచేస్తే తప్పులేదంటాను".
    "వెల్ సెడ్....యింత సిన్సియారిటీ ఉండి కూడా మన ఆఫీసులో సేల్స్ ప్రోగ్రెస్ వెనక్కు వెళుతోంది..." అన్నాడు యం.డి.
    "అది ఏ ఒక్కరి సిన్సియారిటీవల్లో అయ్యేది కాదు సార్,,,,సమిష్టి కృషి అవసరం...సరైన ప్రాసెస్ అవసరం."
    "అంటే....నేను సరైన ప్రాసెస్లో వెళ్ళడం లేదని అర్ధమా?" వేదాచలం కోపంగా అన్నాడు.
    "అది నాకు సంబంధించిన విషయం కాదు" అంది నిర్మొహమాటంగా.
    'సార్..దీనికి పొగరు... రోజూ బోయ్ ఫ్రెండ్ తో ఆఫీసుకు వస్తూ..."
    యింకా ఏదో అనబోయేంతలో.
    'ష....ట.....ప్..." అంటూ గట్టిగా అరిచింది ప్రనూష. ఆమె మొహం అప్పటికే ఎర్రబడింది.
    'నా స్వవిషయం గురించి అనవసరంగా పేలితే, పళ్ళు రాలతాయి" తీవ్రంగా అంది ప్రనూష. అక్కడ యం.డి ఉన్నాడన్న విషయం కూడా మరిచి.
    "ఎంత పొగరే...." కోపంగా అన్నాడు వేదాచలం.
    యండి అలా చూస్తూండిపోయాడు. వెంటనే తేరుకునే "స్టాపిట్.
    ఏంటీ న్యూసెన్స్..." అన్నాడు.
    'సార్....దీన్ని...."
    "వేదాచలంగారూ...బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళు మన సుపీరియర్ అయినా, సబార్దినేట్ అయినా సరే..." కోపంగా అన్నాడు యం.డి.
    'సారీ. సర్." అన్నాడు వేదాచలం.
    మేనేజర్ వైపు చూసి "మీరు వెళ్ళండి..." అన్నాడు యం.డి.
    వేదాచలం ప్రనూషవైపు కోపంగా చూసి బయటకు వచ్చాడు.
    లోపల యం.డి, ప్రనూష మాత్రమే ఉన్నారు.
    "చూడండి ప్రనూషగారూ....మీ పర్సనల్ విషయాలు కంపెనీకి అనవసరం. మీకూ మేనేజర్ కు మధ్య సఖ్యత లేదని అర్ధమైంది. స్టఫ్ కు, బాస్ కు మధ్య ఎప్పుడూ మంచి రిలేషన్స్ వుండాలని కోరుకునే వ్యక్తిని నేను. మేనేజర్ కు, మీకు మధ్య వున్న ఈ "గ్యాప్" కు కారణం ఏమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ కంపెనీ యం.డి.గా నాకుంది" యం.డి అన్నాడు.
    ప్రనూష ఊర్కోలేదు. వేదాచలం గురించి పూర్తిగా చెప్పింది. అతని ప్రవర్తన, స్టాఫ్ తో ప్రవర్తించే తీరు....!
    యం.డి ఒక్క క్షణం ఆలోచించాడు!
    స్టాఫ్ కు, బాస్కు మధ్య "సరైన సంబంధాలు "లేకపోతే జరిగే పరిణామం ఆలోచించాడు.
    ఇప్పుడతనికి కావాల్సింది తప్పెవరిది ఆ తప్పును సరిదిద్దుకోవడం ఎలా? అని.
    వెంటనే స్టాఫ్ ని ఒక్కొక్కరిని పిలిచాడు.
    చాలామంది, ముఖ్యంగా లేడీస్ స్టాఫ్ వేదాచలం తమనెలా వేధిస్తున్నాడో చెప్పారు.
    యం.డి.కి అర్ధమైంది.
    ఫలితంగా ఆ కంపెనీకి మేనేజర్ మారాడు.
    వేదాచలం స్థానంలో ప్రభాత్ వచ్చాడు.
    చాలా కంపెనీ మేనేజ్మెంట్లు ఇలాంటివిషయాలు చూసీ చూడనట్లు వదిలేయడం వల్లే, ఆ కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగినులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
    అలాంటిది తన కంపెనీలో పునరావృతం కాకుండా ఆ కంపెనీ యండి వేదాచలాన్ని మరో బ్రాంచికి ట్రాన్స్ ఫర్ చేసి వివేకవంతమైన పనిచేశాడు.
    కానీ, ఆ కంపెనీ యం.డి. తనకు తెలియకుండానే ఓ పొరపాటు చేశాడు. అది ప్రభాత్ ని మేనేజర్ గా ఈ బ్రాంచ్ కి పంపించడం.
    'క్లాసిక్ ట్రావెల్ ఆఫీసు రద్దీగా వుంది.
    నగరంలో వున్న టాప్ టెన్ ట్రావెలర్స్ లో ఒకటి క్లాసిక్ ట్రావెల్ ఆఫీస్.
    మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు, ముఖ్యమైన ప్రదేశాలకు, విజిటింగ్ ప్లేస్ లకే కాకుండా, విదేశాలకు కూడా పంపించే అతి పెద్ద ట్రావెల్ ఆఫీసది.
    విశాలమైన ఆ భవనంలో ఓ క్యాబిన్ లో కూచొని తాపీగా వేడివేడి కాఫీ తాగుతున్నాడు శ్రీచరణ్.
    ఆ ఆఫీసులో అతని డ్యూటీ కస్టమర్లను ఆకర్షించేలా మాట్లాడ్డం. వాళ్ళ మెంటాలిటీలను బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళకు సరైన గైడెన్స్ ఇవ్వడం. అంతేకాకుండా కొసమెరుపుగా వాళ్ళని టెంప్ట్ చేసి తమ సంస్థ ద్వారానే వాళ్ళని విదేశాలకి, విజిటింగ్ టూర్స్ కి పంపించాలి. అతను చేయాల్సింది అంతే....
    'ఏ దేశం ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చవుతుంది, ఎక్కడెక్కడ ఏయే ప్రదేశాలను చూడాలి. అలాంటి విషయాలు అనర్గళంగా మాట్లాడగలడు. ఎదుటి మనిషిని తన చూపుల్తో ఆకర్షించి, తన మాటల్తో ఆకట్టుకునే శ్రీచరణ్ ని అక్కడి వారందరూ అభిమానిస్తారు. అమ్మాయిలైతే అడ్మైరింగ్ గా చూస్తారు. ఆరోజు కాఫీ తాగి, రిలాక్స్ గా కూచున్నాక.....ఓ జంట వచ్చింది.
    'మేము హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశాం. దానికి మీ సలహా కావాలి! పాతికేళ్ళ లోపు వయసున్న ఆ యువకుడు అడిగాడు. ఇరవయ్యేళ్ళ వయసున్న యువతి భర్తను ఆనుకుని బుద్దిగా  కూచుంది. ఆ జంటకు కొత్తగా పెళ్ళయిందనడానికి గుర్తుగా ఆమె మెళ్ళో పచ్చటి పసుపుతాడు మెరుస్తోంది. చేతులకు గోరింటాకు ఆకుపచ్చని గాజులు, తలనిండా జాజి పూలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS