శ్రీచరణ్ పెదవుల మధ్య నవ్వు కదలాడింది. ఈ ఆఫీసుకు రకరకాల వ్యక్తులు వస్తారు. కొందరు చార్జీ వివరాలు అడిగితే మరికొందరు మీరు కన్సెషన్ ఎంతిస్తారు? మీ ట్రావెల్స్ లనే వెళ్తే మాకొచ్చే అదనపు బెనిఫిట్స్ ఏమిటని ప్రశ్నిస్తారు.
యింకొందరు ఆయా ప్రదేశాల విశేషాలు అడుగుతారు. వాటన్నింటికీ ఓపికతో సమాధానం చెప్పడమే తన డ్యూటీ.
'ఎక్కడికి వెళ్దామనుకుంటున్నారు?" అడిగాడు శ్రీచరణ్.
'అమెరికా వెళ్దామని..." చెప్పాడతను గర్వంగా తన భార్యవంక చూస్తూ.
అమెరికాకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు దాకా ట్రావెల్ స్కీమ్ లను నడుపుతాయి అనేక ట్రావెల్ ఏజెన్సీలు. అందులో క్లాసిక్ ట్రావెల్ కూడా వుంది.
"వెరీగుడ్ ఐడియా...అక్కడున్న వారెవరైనా మిమ్మల్ని ఇన్వయిట్ చేస్తూ స్పాన్సర్ లెటర్ పంపించారా?" "అంటే ఏమిటి?"
"అఫిడవిత్ ఆఫ్ సపోర్ట్...తప్పనిసరిగా అవసరం అలా అయితేనే మీకు వీసా తేలిగ్గా వస్తుంది"
'వీసానా...అదెందుకు?" అప్పటిగ్గానీ అర్ధం కాలేదు శ్రీచరణ్ కి. ఆ యువకుడికి అమెరికా ఎలా వెళ్ళాలో బొత్తిగా దాని గురించి కనీస అవగాహన కూడా లేదని. కొత్తగా పెళ్ళయింది. భార్యకు అమెరికా తీసుకెళ్ళాలనుకుంటున్నాడు.
"మీదేవూరు?" అడిగాడు శ్రీచరణ్.
"విజయవాడ దగ్గర 'కంకిపాడు అని ఓ పల్లెటూరు" చెప్పాడతను.
"అమెరికా వెళ్ళాలనే ఐడియా మీకెవరిచ్చారు?"
'మా బామ్మర్ది.... బావా.... నువ్వూ, అక్కా హనీమూన్ కు అమెరికా వెళ్ళండి.... రమ్మంటే నేను కూడా వస్తానని అన్నాడు. వీలైతే ఆడినికూడా తీసుకెళ్తామండి. ఇంతకీ ఎన్నివేలు ఖర్చవుతాయండీ"
ఆ యువకుడి బామ్మర్దిని తీసుకొచ్చి అతని బుర్ర బద్దలుకొట్టాలన్న ఐడియా వచ్చింది శ్రీచరణ్ కు."
"అమెరికా వెళ్ళడం చాలా ఖర్చుతో కూడుకున్న పని"
"నా దగ్గర ఇరవై వేలున్నాయండీ...సరిపోతాయా?"
ఆ యువకుడి మీద జాలేసింది. కొత్త మోజులో వున్నాడు, పైగా అమాయకత్వం.
'ఆ డబ్బు సరిపోదు"
"అయ్యో పోనీ మరో అయిదారు వేలు కావాలన్నా సరే, నేను రేపు అమెరికా వెళ్ళాలండీ..... మా ఆవిడతో...." అన్నాడు భార్యవైపు చూసి ఆ యువకుడు.
విదేశాలకు వెళ్ళాలంటే వీసా, పాస్ పోర్ట్ కావాలని, 'దాని వెనుక చాలా తతంగముందని అతనికి తెలియదు. ఇలాంటి అనుభవాలు అప్పుడప్పుడు తారసపడతాయి శ్రీచరణ్ కు. అలా అని వాళ్ళని హర్ట్ చేయకూడదు.
"మీరు ఊటీకో, కొడై కెనాల్ కో వెళ్ళండి. బెంగుళూరు మంచి ప్లేస్, ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చు. హాయిగా మీ దంపతులు ఎంజాయ్ చేయాలంటే ఇండియాలోనే బోల్డు ప్లేసులున్నాయి' అంటూ మొదలెట్టి, ఎక్కడెక్కడ విజిటింగ్ ప్లేసులున్నాయి, ఎక్కడికి ఎంత చార్జీ అవుతుంది, ఏ హోటల్స్ లో స్టే చెయ్యొచ్చు... లాంటి పూర్తి వివరాలు అరగంటపాటు వివరించి చెప్పాడు. అతడు కన్విన్స్ అయ్యాడు.
'అయితే అమెరికా వెళ్ళడం వేస్టంటారు...అంతేనా?" ఆ యువకుడు చివరిసారిగా అడిగాడు.
"మామూలు వేస్టేగాదు పరమ వేస్ట్.....మీకు పదుహేనువేలలోనే బ్రహ్మాండమైన హనీమూన్ ట్రిప్ అరేంజ్ చేస్తాను. మిగతా ఐదువేలల్లో బ్రహ్మాండమైన షాపింగ్ చేసుకోవచ్చు. కాకపోతే..." అని ఆపి ఆ యువకుడ్ని దగ్గరకు రమ్మని.....'మీ బామ్మర్దిని మాత్రం తీసుకెళ్ళకండి..." చెప్పాడు మెల్లిగా.
మరో అరగంటలో వాళ్ళు తమ హనీమూన్ ట్రిప్ ఫిక్స్ చేసుకున్నారు.
ఆ యువకుడు లేచి, శ్రీచరణ్ కు షేక్ హ్యాండిచ్చి "థాంక్యూ సార్..." అన్నాడు.
"వెల్ కమ్" అన్నాడు శ్రీచరణ్.
అప్పుడు తలెత్తి శ్రీచరణ్ వైపు చూసింది ఆ యువతి. కొత్త పెళ్ళికూతురి కళ ఉట్టిపడుతోంది.
శ్రీచరణ్ కి ప్రనూష గుర్తొచ్చింది. దెయ్యం పెళ్ళయినప్పటినుండీ ఫైటింగే తనతో...
'హు! దేనికైనా పెట్టి పుట్టాలి...' అనుకున్నాడు.
ఆ జంట వెళ్ళగానే రిసెప్షనిస్ట్ శశికళ శ్రీచరణ్ క్యాబిన్ లోకి దూసుకు వచ్చింది.
'హలో..... బాసూ....ఏంటీ.....ఆ కపుల్ ఎలా ఉన్నారు? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా వున్నారు కదూ! అంది.
'అవును అయినా శశీ! పైకి అలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా వున్నా జీవితంలో ఎప్పుడూ దెబ్బలాడుకోరంటావా?" డాట్ పుస్ గా అడిగాడు శ్రీచరణ్.
శశికళ అందరితోనూ ఫ్రీగా మూవ్ అయ్యేటైప్. ఫ్రెండ్లీగా, జోవియల్ గా ఉండే శశి అంటే అందరూ లైక్ చేస్తారు.
"ఎందుకు దెబ్బలాడుకోరూ....మొగుడూ....పెళ్ళామ్స్ అన్నాక అవన్నీ మామూలే. అయినా పెళ్ళయిన వాడివి నీకు నేను చెప్పాలా...." అంది అతని టేబుల్ మీద వున్న పెన్ తీసి బాగ్ లో వేసుకుంటూ, అది ఆమె వీక్ నెస్. ఎన్నిచెప్పినా ఆఫీస్ లోని ఏదో ఒక ఐటమ్ ని ఇంటికి తీసుకువెళ్ళందే ఆమెకు నిద్ర పట్టదు. అందరూ సరదాగా నవ్వుతూ తీసుకుంటారు. కానీ ఈసారి శ్రీచరణ్ మాత్రం...
"ఏంటీ? ఈరోజు పెన్ సెటప్ చేస్తున్నావా?" మర్యాదగా అక్కడ పెట్టు అన్నాడు.
"మహా గొప్పేలే..." అంటూ పెన్ ఎక్కడ వుందో అక్కడ పెట్టేసింది.
'అయినా శశీ నీకీ పాడు అలవాటు ఏంటి చెప్పు. రోజుకో గుండు సూదయినా ఇంటికి తీసుకెళ్ళందే నిద్రపట్టదా?"
'అవును బాసూ అదే కదా నా వీక్నెస్..." అంది నవ్వేస్తూ. అందరూ అదేంటని ప్రశ్నించినా నవ్వుతూ తీసిపారేస్తుందంతే శశి.
చిన్న చిన్న వస్తువులే కాబట్టి! ఎవ్వరూ ప్రొప్రయిటర్ దృష్టికి తీసుకెళ్ళలేదు.
శ్రీచరణ్ కు మాత్రం శశి అంటే ఓ ప్రత్యేకమైన ఇష్టం లాంటిది ఉంది. ఎప్పుడూ చలాకీగా, మోడ్రన్ డ్రెస్ లో ఉంటూ అందరితో ఫ్రెండ్లీగా మెలిగే శశి అంటే ఇష్టమే కాదు అమ్మాయంటే ఇలా ఉండాలి" అనుకునేవాడు.
