'నమస్కారం సార్..." అన్నాడు వడివేలు. అర్ధమైంది శ్రీచరణ్ కు. అసలు వడివేలు. అర్ధమైంది శ్రీచరణ్ కు అసలు వడివేలు పొద్దున్నే రావడానికి కారణం టిఫిన్, కాఫీలు దొరుకుతాయని.
వడివేలు చూపులు "కిచెన్ వైపే ఉన్నాయి.
"కాఫీ తాగుతారా?" అడిగాడు శ్రీచరణ్.
"రొంబ సంతోషం...టిఫిన్ కూడా చేద్దును మీరు చేయమంటేనే సార్..." అన్నాడు అతివినయం పోతూ...
కిచెన్లోకి వెళ్ళి తను తినగా మిగిలిన ఉప్మాను ఓ ప్లేటులో పెట్టి తీసుకొచ్చి అతనికి వచ్చాడు.
"వణక్కమ్ సార్....అన్నాడు టిఫిన్ ప్లేటు అందుకుంటూ ఓర్నాయనోయ్...అయిదు నిమిషాలకోసారి నమస్కారం పెట్టేలా ఉన్నాడు" అనుకున్నాడు శ్రీచరణ్.
ఉప్మా పుష్టుగా తిని చెంబుడు మంచినీళ్ళు తాగి....
"కాపీ యిస్తే తాగిపెడుదును సార్." అన్నాడు వడివేలు.
కిచెన్లోకి వెళ్ళి ఫ్లాస్క్ లో కాఫీ పోసుకుని తీసుకొచ్చి ఇచ్చాడు. కాఫీ కూడా తాగి ఓ త్రేన్పు త్రేన్చి...." మళ్ళీ రొంబ సంతోషం సార్..నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలి...." అన్నాడు.
శ్రీచరణ్ ఓ బలవంతపు నవ్వు నవ్వి ఊర్కున్నాడు.
"రెంటు ఎప్పుడు యిత్తురా...రేపు రమ్మందురా..." అడిగాడు.
తనిప్పుడు ఇచ్చేస్తే, ప్రనూష ఇవ్వాల్సిన సగం? అసలు నిన్ననే రెంట్ గురించి అడగాల్సింది. బెడ్రూమ్ లో బ్లౌజ్ సీన్ వల్ల, అంతా తల్లకిందులైంది అనుకున్నాడు.
"నీకెందుకు వదివేలూ...రేపు నేనే మీ ఇంటికి వచ్చి యిస్తాన్లే..." అన్నాడు.
"వద్దు సార్....మీరు పెద్దవారు. నేను చిన్నవాడిని....నేను వత్తును. చార్జీలు యిచ్చివేస్తే చాలు..." అంటూ గది నాలుగుమూలలా చూడసాగాడు.
ఇల్లు మొత్తం చూసి ఎక్కడ ప్రశ్నలవర్షం కురిపిస్తాడేమోనని భయమేసి...
"నేనింక ఆఫీసుకు వెళ్ళాలి....బయలుదేరుదామా?" అని అన్నాడు.
"అయ్యయ్యో అట్టానే సార్ నేను వుండేదా?" అన్నాడు.
"నువ్వెక్కడుంటావ్..." అయోమయంగా అడిగాడు శ్రీచరణ్.
"అయ్యో అదికాదు సార్....వెళ్ళేదా అని అర్ధం" అన్నాడు.
'ఆ వుండు. అదేలే వెళ్ళు..." అన్నాడు కన్ ఫ్యూజింగ్ గా శ్రీచరణ్. వడివేలు వెళ్ళిపోయాడు.
ప్రనూష ఆఫీసుకు వెళ్ళేసరికి...ఆఫీసంతా నిశ్శబ్దంగా వుంది.
స్టాఫ్ వంచిన తలలు పైకి ఎత్తడం లేదు. ఏమైందో అర్ధంకాలేదు ప్రనూషకు, వెళ్ళి తన సీటులో కూచొని ప్రసూనాంబవైపు తిరిగి...
'ఏమైందండీ..." అని అడిగింది ప్రనూష.
ప్రసూనాంబ ఏదో మాట్లాడబోయి ఆగిపోయింది. సరిగ్గా అప్పుడే....
ఛాంబర్లో కంపెనీ ఎం.డి.మేనేజర్ వేదాచలంతో సీరియస్ గా మాట్లాడుతున్నాడు.
"ఇదంతా మీ ఇనెఫిషియన్సీయే. మన అమ్మకాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. మార్కెటింగ్ నెట్వర్క్ వుండి కూడా మనం ఎందుకు మన టార్గెట్ ని చేరుకోలేకపోతున్నాం..? సీరియస్ గా అడిగాడు యం.డి.
'అదీ....అదీ...." నీళ్ళు నమిలాడు వేదాచలం.
"చెప్పండి. నాకు మీ ఆన్సర్ కావాలి. యిలా అయితే ఈ బ్రాంచికి మేనేజర్ని మార్చాల్సి ఉంటుంది." కటువుగా హెచ్చరించాడు యం.డి.
'సార్ ప్రనూష అనే అమ్మాయి ఆఫీసుకు చాలా లేట్ గా వస్తూంది. మేనేజర్ అని కూడా లెక్కచేయదు. ఫైల్స్ త్వరగా క్లియర్ చేయదు. చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంది" చెప్పాడు మేనేజర్.
యం.డి కోపాన్ని ప్రనూష మీదికి షిఫ్ట్ చేయాలనీ ఆలోచన. 'ఈ దెబ్బతో తను ప్రనూషమీద ప్రతీకారం తీర్చుకోవచ్చు" అన్న ఆలోచన అది.
'మీరేం చెబుతున్నారో మీకు అర్ధమవుతోందా? నేనడిగిన మార్కెటింగ్ కూ, ఆ అమ్మాయి ఆలస్యంగా రావడానికి ఏంటి సంబంధం...." అని ఒక్క క్షణం ఆగి, 'ఆఫీసులో ఇర్రెగ్యులారిటీని, డిసిప్లిన్ లేకపోవడాన్ని సహించను. ఆ అమ్మాయిని పిలిపించండి" అన్నాడు యం.డి.
వేదాచలం హుషారుగా ఫ్యూన్ని కేకేసి ప్రనూషను పిలవమన్నాడు. ఆరోజు కూడా ప్రనూష ఆలస్యంగా వచ్చిందన్న విషయం అతనికి తెలుసు.
ప్రనూష ఛాంబర్లోకి అడుగుపెట్టండి. యం.డి సీరియస్ గా ఫైల్స్ చూస్తున్నాడు. మేనేజర్ వేదాచలం చేతులు కట్టుకుని గోతికాడ నక్కలా వున్నాడు.
"గుడ్మాణింగ్ సర్" విష్ చేసింది ప్రనూష.
యం.డి తలెత్తాడు. నలభై అయిదేళ్ళు వుంటాయతనికి. స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి.
ప్రనూష వైపు తిరిగి "వెరీగుడ్ మాణింగ్...మీరు ఈ కంపెనీలో జాయినై ఎంత కాలమైంది?"
'జస్ట్....వన్ అండ్ ఆఫ్ మంత్ సర్..." వినయంగా అంది ప్రనూష.
"ఈ వన్ అండ్ ఆఫ్ మంత్లో కరెక్టుగా పదిగంటలకు ఎన్నిరోజులు వచ్చారు?"
"దాదాపు రాలేదు సర్..." చెప్పింది తడుముకోకుండా ఆశ్చర్యంగా చూసాడు యం.డి. నీళ్ళు నములుతుందని, సారీ సర్ చెబుతుందని అనుకున్నాడు. నిజాయితీగా, ధైర్యంగా, 'రాలేదు సార్" అని చెప్పడాన్ని మనసులోనే అభినందించి....
"చూడమ్మాయ్...ఈ ఆఫీసులో పనిచేసేవాళ్ళు ఆఫీసు రూల్స్ పాటించాలి....లేట్ పర్మిషన్ పెట్టాలి అది రోజూ లేటుగా వచ్చేవాళ్ళకు వర్తించదు...."
"సారీ సర్..నేను లేట్ గా రావడానికి కారణాలున్నాయి. అయితే అవి మీకు సహేతుకంగా అనిపించకపోవచ్చు. లేదా మీకు అవసరం లేనివి" కావచ్చు...."
"అఫ్ కోర్స్...కారణం ఏదైనా...మీరు పనిచేసే ప్రతీ గంటకూ, ప్రతి నిమిషానికీ, మేము ప్రతి నెలా జీతం ఇస్తున్నాం....'
