"రాధా!" పిలిచాడు సుధాకర్.
కౌసల్య వెనకాలే వెళుతున్న రాధమ్మ ఆగి భర్త దగ్గరకు వెళ్ళింది. సుధాకర్ గొంతు తగ్గించి, నెమ్మదిగా అడిగాడు. "కౌసల్య తొందర పడిందంటావా?" అని.
"తొందరపడ్డది కౌసల్య కాదండి. బహుశా మనమేనేమో!" అంది నెమ్మదిగా, భయం భయంగా భర్త కళ్ళలోకి చూస్తూ.
"అంటే?" ఆమె మొహంలోకి పరీక్షగా చూశాడు సుధాకర్.
"ఆ రోజు మీరు శుభలేఖలు వేయించుకొచ్చే ముందు కౌసల్య మనతో ఏదో చెప్పాలని ఆరాటపడ్డదనిపించింది నాకు.'
"అయితే అప్పుడే నాతొ ఎందుకు చెప్పలేదూ?"
అతని కాంఠంలో కోపపూ జీరను గుర్తించిన రాధమ్మకు ఏమి చెప్పాలో తెలీలేదు. అంతలో కాఫీ కప్పుతో బయటకు వచ్చింది కౌసల్య.
"మా కెందుకు పెట్టావమ్మా?" అంటూ ఆమె చేతిలోని కప్పు అందుకున్నాడు సుధాకర్, రాధమ్మ అందరూ కలిసి డ్రాయింగ్ రూంలో కెళ్ళి కూర్చున్నారు. కౌసల్య చేతిలో నుంచి కాఫీ కప్పు అందుకున్నాడు పానకాలు. నోట్లో పెట్టుకున్నాడో లేదో ఛీ! బొద్దెంక వాసనేస్తోంది కాఫీ కొపదీసి నువ్వు కాఫీ కలుపుతుంటే బొద్దెంక గాని పడలేదు కదా? లేదా కాఫీ పొడి డబ్బాలో ఏమైనా పడుండాలి" అన్నాడు కాఫీ ని తుపుక్కున ఉమ్మి, కప్పులోని కాఫీని సింకులో పారబోస్తూ కౌసల్య "ఛీ! పాడు! బొద్దెంకెందుకు పడుతుంది? పడితే నాకు కనిపించదూ?" అంది ముక్తసరిగా.
"మాకేం అలా అనిపించలేదే! మేమూ అదే కాఫీ తాగాంగా?" అన్నారు సుధాకర్ రాధమ్మ.
"ఏమో, మీకు వేరే కాఫీ ఇచ్చిందేమో!" అన్నాడు షర్టుకి చేతులు తుడుచుకుంటూ పానకాలు.
అతని మాటలూ, అతని చేష్టలతో సుధాకర్ కీ రాధమ్మకీ కడుపులో తిప్పింది. వాంతోచ్చినట్టుంది. కళ్ళు చీకట్లు కమ్మాయి. మనసునిండా చీకట్లు ముసురుకున్నాయి. సుధాకర్! నువ్వు పప్పులో కాలేసేవ్! ఘనంగా పెళ్ళి చేసి అమ్మ కిచ్చిన మాట నిలబెట్టుకున్నానని మురిసిపోయావ్? కాని ఆ అమాయకురాలి బతుకుని నాశనం చేశావ్! ఒక అనర్హుడికి కట్టబెట్టి ఆమె బతుకు బండలు చేశావ్! బాధ్యత తీర్చుకోవడమంటే ఎవరికో ఒకరి కిచ్చి తాళి కట్టించేసి , బలి పశువును పంపించినట్లు, అతని వెంట ఆమెను పంపించేయ్యడమేననుకున్నావా? అసలు అతను ఎటువంటివాడు? అతని పుట్టు పూర్వోత్తరాలేమిటి? అవన్నీ ఆలోచించక్కర్లేదా? అంత తొందరపడి అతను చెప్పిందల్లా నమ్మేసి , కొంప ముంచుకుపోయినట్లు వెంటనే పెళ్ళి చెయ్యవలసిన అవసరమేమొచ్చింది?
తల్లీ తండ్రి అన్నీ నువ్వే అని నిన్నే నమ్ముకుందే ఆ పిచ్చిపిల్ల! ఆమెని ఒక్కసారైనా అడిగానా ఈ పెళ్ళి ఆమెకి మనస్పూర్తిగా సమ్మతమో కాదో? నువ్వు స్వార్ధపరుడివి! నీ మాట చెల్లించుకున్నాననే తృప్తి , నీ గొప్పతనం చాటు కోవటానికి చాలా ఘనంగా చెల్లెలి పెళ్ళి చేశాడన్న పేరూ ఈ రెండే నువ్వు చుసుకున్నావు? పశువులా కనిపిస్తున్న ఈ వ్యక్తీని ఎంతో సంస్కారవంతంగా పెరిగిన కౌసల్య, ప్రేమిస్తుందని ఎలా అనుకున్నావ్?" మనసు గుండెని కోసే ప్రశ్నలు వేస్తోంది. సుధాకర్ కి కళ్ళు తిరుగుతున్నాయి.
"నో! నో! నేను స్వార్ధ పరుణ్ణి కాను. నా గొప్ప కోసం ఘనంగా వెంటనే ఈ పెళ్ళి జరిపించలేదు. నా చెల్లెలు మనసారా కోరుకున్న వ్యక్తితో ఆమె సంతోషించాలనీ , ఆమె సుఖ పడాలని ఈ పెళ్ళి వెంటనే జరిపించాను. అమ్మ కిచ్చిన మాట నిలబెట్టుకున్నా\ననే తృప్తి పడ్డాను. అతడి రూపు రేఖలు నాకు నచ్చకపోయినా నా చెల్లెలు అతని బాహ్య సౌదర్యము కాక అతని మానసిక సౌదర్యం చూసి మనసిచ్చింది అనుకున్నాను. అందుకే బాహ్య సౌందర్యానికి నేను ప్రాముఖ్యానివ్వలేదు. నన్ను నమ్ము బతిమాలుతున్నట్లుగా ప్రాధేయపడ్డాడు మనసుని!
మనసు ఎందుకనో అతనితో అంగీకరించలేదు. సుధాకర్ వొళ్ళు తూలిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటే కళ్ళు గట్టిగా మూసుకుని కుర్చీని పట్టుకున్నాడు.
"ఏమిటండీ/ ఏం జరిగింది?" ఆతృతగా లేచి భర్త భుజాలు పట్టుకుని కుదుపుతూ అడిగింది రాధమ్మ.
"అన్నయ్యా! ఏమైంది నీకు సడెన్ గా?! డాక్టర్ని పిలవ మంటావా?" అంటూ అతని చేతులు పట్టుకుంది కౌసల్య.
"ఏం కాలేదమ్మా! కొద్దిగా కళ్ళు తిరిగినట్టయింది. అంతే! అదే సర్దుకుంటుంది. ఏం ఫరవాలేదు" అంటూ కౌసల్య చేతులని గట్టిగా పట్టుకుని, మెల్లగా కళ్ళు తెరిచి ఆమెకేసి చూశాడు. ఆమె కళ్ళు నీటి కుండల్లా ఉండడం చూసి , "పిచ్చి తల్లి! కంగారు పడ్డావా? ఎందుకా కన్నీళ్ళు?" అంటూ ఆమె కన్నీళ్ళూ తుడుస్తూ , తన కళ్ళనుంచి కారుతున్న కన్నీటిని తుడుచుకోవడం మరచిపోయాడు సుధాకర్.
