Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 10

 

    రాధమ్మ తన పమిట కొంగుతో అతని కళ్ళు తుడుస్తూ , "ఏమండీ! ఏమైందండీ?" డాక్టర్ని పిలుస్తాను ఒద్దనకండీ. నాకేదో భయంగా ఉంది" అంది వొణుకుతున్న కంఠంతో దుఃఖాన్ని దిగమింగుకుంటుంది కింది పెదవిని మునిపంటితో నొక్కి పెడుతూ.
    "రాధా! నువ్వు కూడా ఏమిటి ఆ కన్నీళ్ళు చిన్నపిల్ల లాగా? నాకేమీ కాలేదు. కాస్త తల తిరిగిందంతే!" అన్నాడు సుధాకర్.
    పానకాలు లోపల కెళ్ళి "కౌసల్యా! కౌసల్యా!" అని పిలవడంతో సుధాకర్ చేతులోదిలి, లోపలి కెళ్ళింది కౌసల్య. అతని దగ్గరగా కూర్చుంది రాధ సుధాకర్ తల నిమురుతూ.
    లోపల్నుంచి కేకలు వినిపించడంతో సుధాకర్ రాధలు శ్రద్ధగా ఆ మాటలు వినసాగారు.
    "ఏమిటా చేతులు పట్టుకుని అలా నుంచోవటం?  పరాయి మొగవాడి చేతులనే జ్ఞానం కూడా లేదా?"
    "ఎవరండీ పరాయి మొగాడు? అతడు మా అన్నయ్య!"
    "అన్నయ్య అయితే మొగాడు కాదా?"
    "అయితే మిమ్మల్ని కన్నతల్లి కూడా ఆడదే. తల్లి వొళ్ళో కూర్చున్నా మీకు మరో ఆడదాని ఒళ్ళో కూర్చున్న పీలింగ్ వొస్తుందా? తల్లినీ తోబుట్టువుని కూడా పరాయి వాళ్ళతో పోల్చే హీనులను కోలేదు కౌసల్య గొంతు.
    "నోర్ముయ్! నాకు పాఠాలు చెబుతున్నావా?"
    "నీకు పాఠాలు చెప్పడం కాదు, నీతో మాట్లాడాలంటేనే అసహ్యం నాకు.
    "ఎమన్నావే? నేనంటే అసహ్యమా? దొంగ.....ముం......"
    "షటప్! నీ పిచ్చి పిచ్చి బాష నా ముందర వాడకు.' ఆవేశంతో రేచ్చిపోతూ అంది కౌసల్య.
    వినలేక ఇక భరించలేక పోయారు సుధాకర్ రాధమ్మ. గబగబా లోపలికెళ్ళారు . "ఏం జరిగింది? ఎందుకు ఘర్షణ పడుతున్నారు?" అన్నాడు సుధాకర్. కోసల్య అన్నయ్యకి మొహం చూపించలేనట్టుగా చేతుల్లో ముఖం దాచుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది.
    "ఎందుకో ఘర్షణ పడుతున్నాం. మీకు చెప్పాలా? ఏం మాట్లాడుకున్నాం ఎందుకు పోట్లాడుకున్నాం అన్నీ మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. నా పెళ్ళాం నా ఇష్టం" అన్నాడు కటువుగా పానకాలు,
    సుధాకర్ వెన్నులో పొడిచినట్టనిపించింది.
    "అది ఈ రోజు నీ పెళ్ళాం కావొచ్చు మిస్టర్ పానకాలు! కానీ ముందు నా చెల్లెలు. దాని కంట నీరు కారినా , దాని మనసు కలత చెందినా , తోబుట్టువుగా డానికి కారణం ఏమిటో తెలుసుకునే హక్కు నాకుంది. మీ మాటలు అక్కడనుంచి విన్నాను. ఇంత సంస్కార హీనుడివని కల్లో కూడా అనుకొలేదు. పవిత్రమైన అన్నా చెల్లెళ్ళ బంధాన్ని కూడా అనుమానించే నువ్వు మనిషివి కాదు" అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ.
    "షటప్ మిస్టర్ సుధాకర్! మర్యాదగా మాట్లాడు" అన్నాడు పళ్ళు కొరుకుతూ పానకాలు.
    "మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. పెళ్ళయి పది రోజులయినా కాలేదు నీ నిజ స్వరూపం ఇప్పుడు బైటపడింది . ఈ విషయాలు ఒక్క పది రోజుల ముందు తెలిస్తే నా చెల్లెలు ఇలా దీనంగా నీ ముందూ నా ముందూ నుంచునేది కాదు. తాళి కట్టేంతవరకూ క్షణం క్షణం నా చుట్టూ తిరిగి కాకమ్మ కబుర్లేవో చెబుతూ నన్ను నమ్మించి నా చెల్లెలు గొంతు కోశావు. ఇప్పుడే నా చెల్లిలిని నాతొ తీసుకు పోతాను" అంటూ కౌసల్య చెయ్యి పట్టుకొబోతున్న భర్తని చెయ్యి పట్టి లాగి "ఏమండీ! మీకేమన్నా మతి పాయిందా? పెళ్ళితోరాణాలింకా వాడనైనా వాడలేదు అప్పుడే బతుకును మోడు చేసుకుని ఒచ్చేయమంటారా? తెలిసో తెలియకో చిన్నవాళ్ళు తప్పు చేస్తే అలాక్కాదు ఇలా అని చెప్పి మందలించాలి గానీ, తెగతెంపులు చేసుకొనిస్తారా?" అంది రాధమ్మ.
    సుధాకర్ కి మతిపోతోంది. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అర్ధం కావటం లేదు అతడికి. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఎవరి నోటంటా మాట పెగలడం లేదు. కాస్సేపటికి "బాబూ! నన్ను క్షమించు. ఏదో ఆవేశంలో మాట్లాడాను. నా చెల్లెలు చాలా మంచిది. అది నా చెల్లెలు అని చెప్పడం కాదు. బంగారం లాంటి పిల్ల. దాన్ని నీ చేతుల్లో పెట్టాను. ఇన్నాళ్ళూ డానికే కష్టమూ కలగకుండా చూసుకునే బాధ్యత మామీదుంది. కాని ఇప్పటి నుంచీ అది నీ మీదుంది బాబూ! మీరిద్దరూ పిల్లా పాపల్తో పది కాలాలు చల్లగా ఉండాలని మా కోరిక. అంతకన్నా నాకేం కావాలి బాబూ! కౌసల్య నాకు చెల్లెలే కాదు. నా కన్నా బిడ్డ లాంటిది! దాని కంట కన్నీరు కారితే నా హృదయం ముక్కలై , నా కంట్లో రక్తం చిమ్ముతుంది బాబు! ఇవి చేతులు కావు....." బతిమిలాడాడు సుధాకర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS