"వర్షా.....ఇలా వర్షిస్తున్నావేంటి? నేనేమైనా తప్పుగా మాట్లాడతానా?" అడిగాడు.
ఆమె తల అడ్డంగా తిప్పింది.
"కొంపదీసి నువ్వు నా నుండి ఈ రకమైన ప్రేమలూ, దోమలూ కాకుండా పవిత్రమైన స్నేహం, నిర్మలమైన భావం ఆశిస్తున్నావా? అలాంటి ఉద్దేశాలు మనసులో ఉంటే తుడిచేసెయ్! మన వయసువాళ్ళకి అవి పనికిరావు!" ఆట పట్టిస్తున్నట్లుగా అన్నాడు.
ఈసారి ఆమె టేబుల్ మీద దోసిట్లో తలఆన్చి భోరుమని ఏడ్చింది.
"ఏయ్....ఏంటిది? నలుగురూ చూస్తే నేనేదో ఏడిపోస్తున్నాననుకొని ఈవ్ టీజింగ్ కింద బొక్కలో తొయ్యగలరు. ఏం జరిగిందో చెప్పి ఏడు.....కొంపదీసి ఫ్లాష్ బ్యాక్ లు ఏమీ లేవు కదా!" కంగారుగా అడిగాడు.
వర్షకి ఏడుపు తగ్గి లైటుగా చిరునవ్వు వచ్చింది.
"ఆపుకోలేని ఆనందం కలిగితే ఇలాగే ఏడుస్తాను" అంది.
"బాబోయ్! పెళ్ళయ్యాక హనీమూన్ అంతా ఏడుస్తూనే గడిపేస్తావా? కర్చీఫ్ సరిపోదేమో, కానీ ఈ టేబుల్ క్లాత్ లాగి ఇస్తాను కళ్ళు తుడుచుకో!" అన్నాడు.
"సంజయ్....నువ్వు ఇందాక అన్నమాట నిజంగానే అన్నావా? లేక ఇంతకు ముందు నా చెవిలో పువ్వులు పెట్టినట్లే ఈసారీ పెడ్తున్నావా?" వర్ష అనుమానంగా అడిగింది.
సంజయ్ మాట్లాడలేదు. ఆమె చేతిని తన పెదవులకి ఆన్చుకుని "ఐ లవ్ యూ....నిన్ను పోయినసారి నీ బర్త్ డే రోజున మొదటిసారిచూశాను. అప్పటినుండీ ఇంట్రెస్ట్ కలిగింది కానీ....అది ప్రేమగా మొన్న ప్లేన్ లో మొదటిసారిగా మార్పు చెందింది. నువ్వు ఈ రోజుల్లో అమ్మాయిల్లా కాదు.....చాలా సెన్సిటివ్ వి! ఎందుకు ఎప్పుడూ అంత భయం భయంగా చూస్తుంటాయి ఆ కనుపాపలు? కాలేజ్ కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడూ కూడా అటు ఇటూ అసలు చూడవెందుకూ? అప్పుడు నాకేం అనిపిస్తుందో తెలుసా? జింకల గుంపులోంచి పొరపాట్న బయటకొచ్చేసి తన వాళ్ళకోసం వెతుక్కుంటున్న భీతహరిణేక్షణలా కనిపిస్తావు! ఎందుకా అభద్రతాభావం?"
అతని స్పర్శ ఆమెకి ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా తోచి ఆ చేతిని గట్టిగా పట్టుకుంది వర్ష.
"మాట్లాడు వర్ష...." అన్నాడు.
"సంజయ్.....నీకు నా గురించే ఈ ప్రపోజల్ చేస్తున్నావా? నేను అందరి లాంటి ఆడపిల్లనికాదు...." అంది.
"ఏది ఓ సారి నిలబడు.....చూసి ఔనో కాదో తేల్చుకుంటాను!" అల్లరిగా అన్నాడు.
"జోక్ కాదు సీరియస్ గా విను. నాకు నాన్న లేడు!" అంది.
"కాళ్ళూ చేతులూ మెదడూ లేకపోతే ఆలోచించాలి కానీ నాన్న లేకపోతే అదో లోపమా? నాకూ లేడు!" తేలిగ్గా అన్నాడు.
"అదికాదు సంజయ్....." వర్ష ఎలా చెప్పాలో తెలీక అవస్థపడింది. "నీకు నాన్న చనిపోయాడు కానీ నాకు అసలు లేడు!" అంది.
సంజయ్ పెద్దగా నవ్వి "సృష్టి విరుద్దమైన మాటలు చెప్పకు! నాన్న లేకపోతే ఎలా పుడ్తావు? ఉండే ఉంటాడు కానీ ఎక్కడ ఉన్నాడో నీకు తెలీదు......ఏమ్ ఐ రైట్!" అడిగాడు.
అతను ఆ విషయాన్నీ అంత లైట్ గా తీసుకోవడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. చిన్నప్పటినుండి, జరిగిన అవమానాలు, ఎదురైన అవహేళనలు ఆమెకి మనుషులంటే భయం కలిగేలామార్చాయి.
అసలు సంజయ్ ఈ విషయం వినగానే మొహం ఎలా పెడ్తాడా అని ఆలోచిస్తేనే ఆమెకి ఊపిరి అందనట్లుగా అయింది. అలాంటిది అతనువిని, అర్ధం చేసుకుని కూడా మామూలుగా మాట్లాడడం ఆమెకు పెద్ద బరువేదో నెత్తి మీద నుండి తీసేసినట్లుగా హాయిగా ఫీలయింది.
"నాకు నీ గురించి, మీ అమ్మ గురించీ మొత్తం వివరాలు తెలుసు. మా వసుంధర అక్కతో మీ అమ్మకి పదిహేనేళ్ళ పరిచయం అని తెలుసా? నేను ఉద్యోగరీత్యా ఈఊరు వచ్చిన కొత్తల్లోనే అక్క తనకి జీవితాలంబనగా నిలుస్తున్న టైలరింగ్ గురించి, అందుకు మీ అమ్మ ఇస్తున్న ప్రోత్సాహంగురించి చెప్తూ, ఆవిడ వ్యక్తిత్వం గురించి కూడా చెప్పింది. నువ్వింత ఫీలవవలసిందేంలేదు వర్షా..... చాలామంది పొరపాట్లు చేసిదిద్దుకుంటారు. కానీ మీ అమ్మ ఆ పోరపాటుకి చింతించకుండా, దాన్ని ఓ రకంగా స్ఫూర్తిగా తీసుకుని జీవితాన్ని మలుచుకుంది. నిన్ను ధైర్యంగా ఈ ప్రపంచంలోకి తెచ్చి, ఓ మగాడి తోడులేకుండానే అన్నీ సక్రమంగా నిర్వర్తించగలనని నిరూపించింది. ఐ ఎడోర్ హర్! ఆవిడంటే నాకు చాలా ఆరాధన!" సిన్సియర్ గా అన్నాడు.
వర్షకి అతని నోటినుండి వచ్చే ఒక్కొక్క మాటా ఓ అమృత గుళికలా అనిపిస్తోంది. అది ఐస్ క్రీమ్ పార్లర్ అని కానీ, అందరూ చూస్తున్నారని కానీ ఆలోచించకుండా ఆపుకోలేని ఉద్వేగంతో అతని తలమీద చెయ్యివేసి వంచిగబుక్కున జుట్టునిముద్దాడింది.
"ఛ! ఏం పని చేశావు?" చిరాగ్గా అన్నాడు.
వర్ష చిన్నబోయింది. తను తొందరపడటం అతనికి చిరాకు కలిగించిందా? ఆమె మొహంలో కళ తగ్గిబెదురుగా చూసింది.
సంజయ్ ముందుకి ఒంగి విస్పరింగ్ గా.... "తొలిముద్దు పెట్టవలసిన చోటు అదా?" అడిగాడు.
వర్షకి అతని భావం అర్ధమయి బుగ్గల్లో గులాబీలు పూసాయి.
"ఇంతకీ నా ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పలేదు.....డూ యూ లవ్ మీ?" అడిగాడు.
"అదంతా నాకు తెలీదు! ఈ క్షణం ఇక్కడే నిలిచిపోతే బావుండ్ను అని మాత్రం అనిపిస్తోంది. కల కాదుగా.....కరిగిపోదుగా....." బేలగా అడిగింది.
సంజయ్ ముందుకి ఒరిగాడు. ఆమెకనులు మూసి పెదవులు అతనికి అందించింది. అతను ఆమె చెంప తాకుతూ, చెవి అంచు అందుకుని చిన్నగా కొరికాడు.
"ఏయ్......టైసన్ లా ఏమిటా పని?" చిరు అలకగా చూసింది.
"కలకాదు నిజమేనని నిరూపించాను" అన్నాడు.
వర్షకి అతనితో అడుగులు వేస్తుంటే స్వర్గంలో తేలిపోతున్నట్లుగా అనిపించింది. బయటికి రాగానే తన మారుతీ థౌజెండ్ వైపు అడుగులు వేసింది.
సంజయ్ తన హీరో హోండా దగ్గర ఆగిపోయి, "బై.....బై...." అన్నాడు.
వర్ష రివ్వున వెనక్కి పరిగెత్తుకొచ్చి "నా కార్లో రావా?" అంది.
సంజయ్ తన బైక్ మీద చెయ్యి వేసి "నా పంచకళ్యాణి ఉందిగా......" అన్నాడు. వర్షదిగులుగా చూసింది.
సంజయ్ ఆమె నడుం మీద చెయ్యివేసి దగ్గరగా తీసుకుని "ఇంకెంత కాలం..... పెళ్ళవగానే మనం ఇద్దరం ఇలా విడివిడిగా కాకుండా కలిసి ఎంచక్కామన పంచకళ్యాణి మీద మా ఇంటికి ఎగిరిపోవచ్చు!" అన్నాడు.
వర్ష చిన్నగా నవ్వి "బై సంజయ్!" అంది.
అతను ఆమెని కారుదాకా తీసుకువచ్చి ఆమె ఎక్కాక చెయ్యి ఊపి వెనుతిరిగాడు. వర్షకి ఇంటికొచ్చేదాకా సంజయ్ తో తనుగడిపిన క్షణాలే మధురంగా జ్ఞాపకంరాసాగాయి.
ఇంట్లోకి అడుగుపెడ్తుండగా ఫోన్ మోగడం వినిపించింది.
