Previous Page Next Page 
స్వర్గంలో ఖైదీలు పేజి 8


    సంజయ్ తనని మరిచిపోయి ఆమె ప్రతి కదలికనీ గొప్ప ఆసక్తితో చూస్తూ కూర్చున్నాడు. సడిలేని నడిరేయిన ఎగసిపడే జ్ఞాపకంలా అలజడిగా వుంది ఆమె నడక!
    ప్రేమంటే ఒక ఉల్కాపాతం, ఉద్వేగం, ఆనందం, భయం, అసంతృప్తి కలిసి కట్టుగా కలిగేది!
    కొమ్మమీద కూర్చుని తన కర్తవ్యాన్ని నిర్వహించే కోయిలకేం తెలుసు ఎన్ని మనస్సు పొరలను చీల్చుకొంటూ తనరాగం....అనురాగ వర్ణాలని అద్దుతోందో! నలిగి, జీర్ణమై, కాలంలో కలిసిపోయే గడ్డిపువ్వు అనుకొంటుందా తన భంగిమ ఓ చిత్రకారుడికి ప్రేరణ అవుతుందని!
    ఏ కమనీయసుందరి రూపం ఏ కవి భావననురసాతల చేస్తుందో కదా! మురళి పాటకు రగిలి...మరుగు నీ వెన్నెలలు, ఎంత తియ్యని భావం? నిజంగా నిజం! అందానికి కాల్చేసే గుణం వుంది. సౌఖ్యానికి ప్రాణంతీసే శక్తి వుంది!
    "తీసుకోండి" వర్ష అతని ముందుకి వంగింది.
    సంజయ్ ఒక్క క్షణం చలించి ఆమె బుగ్గమీద చెయ్యివేయబోయాడు.
    "వర్షా.....సాయంత్రం ఐస్ క్రీం పంపించమని ఫోన్ చేశాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పిలు...." విద్య తన గదిలోంచి అంది.
    "అలాగే అమ్మా...." వర్ష అటువెళ్ళబోతుంటే సంజయ్ ఆమెచేతిని గట్టిగా పట్టుకుని "సాయంత్రం యాంకీడూడిల్ కలుసుకుందాం" రహస్యంగా అన్నాడు.
    ఆమె కలవరపడింది. తల్లి వింటుందేమోనని కంగారుపడింది. మొదటిసారి ఆమె ఇరవై ఏళ్ల జీవితంలో తల్లికి వినిపించకూడనిమాట, ఆమెకి తెలియకూడనిచర్య జరిగాయి!
    ఈ రహస్యాన్ని ఇలా మోయగలనా....అమ్మ దగర నాకు రహస్యాలా? అని వర్ష మీమాంసలో పడింది.
    ఆమెని అలాంటి సందిగ్ధస్థితిలో వదిలేది "ఎగ్జాట్లీ ఎట్ ఫైవ్ థర్టీ.... నీకోసం వెయిట్ చేస్తుంటాను....ఆ...... చెప్పడం మర్చిపోయాను, నువ్వు గోధూళివేళ రేపు విప్పుకునే చంద్రికాంతలా ఉన్నావు. యూ ఆర్ రియల్లీ బ్యూటీఫుల్!" అతని పెదవులు ఆ పదం ఉచ్చరించే పద్దతి ముద్దుపెడ్తున్నట్లుగా ఉంది.
    వర్షచేష్టలు దక్కి అతను వెళ్ళినవైపే చూస్తూ నిలబడిపోయింది. అతను మామూలుగా వెళ్ళలేదు. మంత్రగాడు కళ్ళముందే బుట్టలో పెట్టిపూవుల్ని మాయంచేసినట్లుగా అతిలాఘవంగా ఆమె శరీరంలో నుండి అతి ముఖ్యమైన మనసుని తనతో పట్టుకెళ్ళిపోయాడు.
    అతని సమక్షంలో మనసుతో మాట్లాడటం, మిగతా అందరి దగ్గరా యాంత్రికంగా ప్రవర్తించడం ఇదేగా ప్రేమంటే! సైకతతీరాన రాధపాదముద్రల నుండి ఎగసిన ధూళికూడా కృష్ణుని మురళిగుండా ప్రవహించి విరహ తాపాన్ని చల్లార్చుకునేదిట!
    వర్ష అతను పట్టుకున్న తన చేతిని అతి మృదువుగా పెదవులతో స్పృశించింది.
    "అద్భుతం!" విద్య ఆనందోద్వేగాలని దాచుకోలేక ముందుకి వచ్చి కూతుర్ని కౌగిలించుకుంది.
    "వర్షా.....నువ్వు ఒప్పుకోవుకానీ......ఫోటో సెషన్ పెట్టి అన్ని మేగజైన్స్ కి పంపిస్తే మన వర్షా ఫ్యాబ్రిక్స్ పేరు మారుమ్రోగిపోతుంది. తల్లిని కాబట్టి అతిగా పొగడకూడదు! వరమ్మా.... పాపకి దిష్టితియ్యి" అని పనిమనిషికి పురమాయించింది.
    వర్షకి తల్లి మాటలువినిపించడం లేదు. అసలు ఆమె మాటే ఆమె మనసు మననిస్థితి!
    "సాయంత్రం......నేను...." మాటలుకూడబలుక్కుంది.
    "ఆ.....ఎవరెవర్ని పిలవదలుచుకున్నావు?" మురిపెంగా అడిగింది విద్య.
    "ఎవరూ వద్దు. నేను తరళా వాళ్ళింటికెళ్ళి ఆమెతో ఐస్ క్రీం పార్లర్ కి వెళ్తాను."
    "ఓ.కే. డియర్.....దీనికింత మొహమాటం ఎందుకూ? నేను జాయిన్ అవలేక పోతున్నానని బాధగా వుందిరా!" తేలిగ్గా అనేసింది విద్య.
    "త్వరగా వచ్చేస్తాను" గిల్టీగా ఫీలయి చెప్పింది వర్ష.
    "ఫరవాలేదు నాకు చెయ్యవలసినపనులున్నాయి. టైంపాస్ కాదన్న దిగులులేదు" అంది.
    'పనీ.....పనీ' విద్యకి అస్తమానం అదే ధ్యాస! తల్లిమీద ఆ విషయంలో అంతులేని జాలి కలిగింది వర్షకి. అసలు నిన్న పరిచయం అయిన ఓ అపరిచితుడికోసం తను తన ప్రాణసమానమైన తల్లిని మోసగించవచ్చా....అని బాధ కూడా కలిగింది.
    కానీ....మెల్లగా......మెల్లగావచ్చి......తనువుని రెచ్చగొట్టి ఆపై మనసుని ఉక్కిరిబిక్కిరి చేసి ఉసిగొల్పేఅద్భుతశక్తి...... ప్రేమ! ఔనా, కాదా సందిగ్దాలూ...... తప్పా, ఒప్పా తర్కాలు దాని ముందు బలాదూర్!
    ఆ సాయంత్రం అతని ఎదురుగా ఆమె.....ఆ ఇద్దరి ఎదురుగా ఓ ఎర్రగులాబీ!
    అతను గులాబీని చేతిలోకి తీసుకుని చెప్పాడు "ప్రేమ తాలూకు కమనీయభావన గులాబీపరిమళంలా ఉంటుంది వర్షా! సన్నగా, మత్తుగా.....ఒంటిని చుట్టుకుని ఒకంతట వీడదు. అందుకే ఇది నీకు కనుకగా ఇస్తున్నాను"
    వర్ష తన చెయ్యి జాపి అది అందుకుంది.
    "ప్రొద్దుట్నుండీ సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాను తెలుసా? నిన్ను చూసిన కళ్ళతోలోకంలో ఇంకేదీ చూడాలని అనిపించలేదు" అన్నాడు.
    'ప్రొద్దుట్నుండీ సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాను తెలుసా? నిన్ను చూసిన కళ్ళతోలోకంలో ఇంకేదీ చూడాలని అనిపించలేదు" అన్నాడు.
    'ప్రొద్దుట కాఫీలో ఉప్పువేసానని, ఫోన్ మ్రోగితే డోర్ వైపు నడిచాననీ, పేపర్ అబ్బాయొస్తే ఉతకాల్సిన బట్టలు తీసుకెళ్ళి వేసాననీ.....'వర్ష చెప్పలేదు! కానీ 'నా పరిస్థితీ అదే!' అని మనసులో అనుకుంది.
    అతను ఆమె చేతిమీద తన చేతిని ఉంచి "ఐ లవ్ యూ!" అన్నాడు.
    ప్రతి కన్నెపిల్ల మనసూ ఆనందభైరవి ఆలపించే అపురూప క్షణం! ఎంత తియ్యని వాక్యం!! సృష్టిలోని మాధుర్యం అంతా ప్రోదిచేసి మనిషికి భగవంతుడు అందించిన అపురూపమైన కానుక!
    "నిన్నటిదాకా నేను ఎందుకు బ్రతికానోనాకు అర్ధం కావడం లేదు! కానీ ఈ రోజునుండీ ఎందుకు బ్రతకాలి అన్నపరమార్ధం తెలిసింది" అనిపించింది.
    "మాట్లాడవేం వర్షా? డూ యూ లవ్ మీ?" అడిగాడు సంజయ్.
    వర్షకి గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది.
    ఈ నిర్ణయం తీసుకునే హక్కు తనకుందా? తను ఏం తినాలో, ఎక్కడ చదవాలో, ఏం చెయ్యాలో ప్రతి విషయం తన బాగోగులు ఆలోచించి చేసి అమ్మ వుండగా.....ఈ అతిముఖ్యమైన నిర్ణయం తను తీసుకోవచ్చా?
    కానీ సంజయ్.....అతని పరిచయం తనకి చందమామకథల్లో కీలుగుర్రంమీద వచ్చిన రాజకుమారుడిని కలుసుకున్నట్లుగా ఫాంటసీగా ఉంది! అతను తన ముందు నుండి కదిలితే.....లోకం అంతా చీకటి అయిపోతుందేమో అన్నంత దిగులుగా ఉంది. ఆ నోట్లోంచి వస్తున్న ఒక్కొక్క పలుకూ పంచదార అద్దిన జున్ను ముక్కల్లా ఉన్నాయి! విన్నకొద్దీ వినాలనిపిస్తున్నాయి. అతని చూపులు తన అందాలని త్రాగుతుంటే జన్మ చరితార్ధం అయినట్లు తోస్తోంది!
    ఆమెకి భరించలేని ఆనందం వల్ల ఆపుకోలేని దుఃఖం వచ్చింది! సంజయ్ చేతిమీద టపటపమనిరాల్తున్న కన్నీటిబొట్లు చూసి అతను ఆశ్చర్యంగా ఆమె మొహంలోకి చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS