Previous Page Next Page 
స్వర్గంలో ఖైదీలు పేజి 10


    విద్య"వరమ్మా ఫోన్ చూడు..." అంది.
    వర్ష గుమ్మంలోంచే "వరమ్మా ఆగు..... నాకే అది" అంటూ అటు పరిగెత్తింది.
    విద్య కూతురి వైపు వింతగా చూసింది! వర్ష కార్డ్ లెస్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది.
    "హలో....." సంజయ్ గొంతు మార్దవంగా వినిపించింది.
    "నాకు తెలుసు నువ్వే అని" ఎక్సైట్ అయిపోతూ అంది.
    "వర్ష.....అప్పుడే నిన్ను చూసి పది నిమిషాలయిపోయింది...... మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని వుంది!" అన్నాడు.
    "నాకు అలాగే ఉంది...... ఇలా అయితే కష్టం కదూ!" బోలెడు బాధపడిపోతూ అంది వర్ష.
    "ఇప్పుడు గుర్తొస్తోంది. మనం ఇందాక బిల్లు కట్టాంకానీ తెప్పించి ఐస్ క్రీమ్ లు తినలేదు!" అన్నాడు.
    "పోనీలే....ఇప్పుడు వెళ్ళి తిందామంటే కరిగిపోయి ఉంటాయి!" వర్ష నవ్వింది.
    "ఐస్ క్రీమ్ నీ నవ్వుకన్నా తియ్యగా ఉంటుందా? నీ బుగ్గకన్నా మృదువుగా ఉంటుందా? బావుకతతో అన్నాడు.
    "మీరు మరీ కాళిదాసు అయిపోతున్నారనుకుంటాను!"
    "కాళిదాసునే కానీ ఖాళీదాసుని మాత్రంకాదు! ఆ రోజుల్లో ఈ ఫోన్లూ అవీ లేక ఎంతబాధపడిపోయేవారో మేఘసందేశం చదివితే తెలుస్తుంది"
    ఇలా వర్షా, సంజయ్ మేఘసందేశం నుండి స్వీట్ 'సందేష్ లు' ఎలా చెయ్యడంవరకూ, ఆవకాయనుండి అణుపరీక్షల వరకూ మాట్లాడుకుంటూ అలాగే రాత్రంతా జాగారం చేసేవాళ్ళే కానీవర్ష గలగలా నవ్వుతూ ఎందుకో వెనక్కి తిరిగేసైర్కి గుమ్మంలో తలుపుకి ఆనుకొని, ఎంత సేపట్నుండి చూస్తోంది కానీ తీవ్రంగా చూస్తూ విద్య కనిపించింది.
    వర్ష ఉలిక్కిపడి ఇహలోకంలోకి వచ్చి, "రేపు మాట్లాడదాం......బై.......గుడ్ నైట్!" అని ఫోన్ పెట్టేసింది. విద్య చూపులో అంతులేని విస్మయం!
    వర్ష నసుగుతూ "అమ్మ.......భోంచేద్దామా?" అంది.
    విద్య ఎదురుగా ఉన్న క్లాక్ వైపు దృష్టి నిలిపింది. సమయం తొమ్మిదిన్నర అవుతోంది. విద్య ఏ రోజూ ఎనిమిదిన్నర మించకుండా డిన్నర్ ముగిస్తుంది.
    వర్ష తప్పు చేసినట్లు తల వంచుకుని "సారీ అమ్మ......అదీ......అదీ......తరళా వాళ్ళిల్లుదూరం కదా......క్షేమంగా చేరిందోలేదోననీ!" అంది.
    "ఇట్స్ ఓ.కే.....పద భోంచేద్దాం!" క్రిందికి నడిచింది విద్య.
    వర్ష సరిగ్గా భోజనం చెయ్యకుండా తనలో తనే నవ్వుకోవడం ఆమె గమనించింది.
    "ఈరోజు నీ బర్త్ డే ఎలా గడిచింది తల్లీ!" అడిగింది విద్య.
    "ఏమిటీ?" వినిపించనట్లు మళ్ళీ అడిగింది వర్ష.
    "హౌ వాజ్ ద డే?" అడిగింది విద్య.
    "ఓ.....ఫైన్ అమ్మా.....ఐ లవ్డ్ ఇట్! ఎక్సెలెంట్.....మార్వలెస్!" మొహం వెలిగిపోతుండగా అంది.
    "గుడ్!" అంది విద్య.
    వర్షకి ఆ రాత్రి నిదురపట్టలేదు. సంజయ్ తనతోమాట్లాడిన మాటలూ, అతను తనని తాకడం, అన్నీ గుర్తొచ్చి పులకింతగా ఉంది. అన్నీ నెమరువేసుకుంటున్న ఆమె సడెన్ గా ఒకచోట ఆగిపోయింది!
    "ఇంకెంతకాలం? పెళ్ళవగానే ఇద్దరం ఇలా వేరువేరుగా కాక మనిద్దరం మా ఇంటికే ఎంచక్కా పంచకళ్యాణి ఎక్కి వెళ్ళిపోతాం!" అన్న సంజయ్ మాటలు మననం చేసుకుంది.
    అంటే.....తను పెళ్ళయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి! అమ్మని ఒంటరిగా ఈ ఇంట్లో వదిలిపెట్టి..... అమ్మో! తను అమ్మలేకుండా స్వర్గంలో అయినా ఉండగలదా? ఆమెకి ఆరోజు మొత్తం తను ప్రవర్తించిన విధానం గుర్తుకొచ్చింది!
    అమ్మలేకుండా సాయంత్రం మొత్తం గడిపింది. ఇంటికొచ్చాక కూడా అమ్మని పలకరించకుండా, ఆమెకి లేట్ అయినందుకు అపాలజీ చెప్పకుండా సంజయ్ తో తమకంగా కబుర్లలో పడిపోయింది!
    అప్పుడు అమ్మ ఎలా ఫీలయి వుంటుంది?
    వర్షకి ఒక్కసారిగా మత్తు దిగిపోయినట్లుగా అనిపించింది. అమ్మకి తను అబద్దం చెప్పడం....అదీ ఒకటికాదు! ఒకదాన్లోంచి ఇంకొకటి..... గొలుసుగా! అమ్మకి నిజం తెలిస్తే తనని క్షమిస్తుందా? ఏమీఅనదు. తిట్టడం తను కోపం తెచ్చుకోవడం ఆమెకి రాదు కూడా! కానీ..... తనకంటే నిన్న పరిచయంఅయిన ఆ కుర్రాడు ఎక్కువా అని బాధపడదూ!
    "ఏం చేయాలి? ఇప్పుడు కాకపోతే సంజయ్ విషయం రేపైనా తెలుస్తుంది. అదేదో ఇప్పుడే నిజాయితీగా చెప్పేస్తే.....
    అమ్మ ఒంటరిగా పడుకుని తన ప్రవర్తనని సమీక్షించుకుంటూ బాధపడుతోందేమో! అంతకంటే ఏం చేయగలదు? ఆమెకి తను తప్ప మాట్లాడుకోవడానికి వేరే స్నేహితులుకూడా లేరు! ఆ ఊహరాగానే వర్ష దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది.
    తనకిప్రాణం పోసి, గోరుముద్దలు తినిపించి వేలుపట్టి అడుగులు వేయించిన అమృతమూర్తి! తనదైవం..... తనప్రాణం! అటువంటి తల్లి నా తనుమోసం చేస్తున్నది! కేవలం తన స్వార్ధంకోసం! తన ఆనందంకోసం! నో....అది నేరం..... పాపం!
    వర్ష ఒక్క ఉదుటున లేచి విద్య గదిలోకి పరిగెత్తింది.
    విద్యగదిలోకి లైటువెలుగుతూనే ఉంది. ఆమె నుదుటికి మోచెయ్యి ఆన్చుకుని పడుకుని రూఫ్ కేసి చూస్తోంది. ఆమె ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్లుగా ఆమె భ్రుకుటిముడిపడి ఉంది!
    కాలిమీద ఏదో పడినట్లయి ఉలిక్కిపడిచూసింది.
    కన్నీళ్ళతో వర్ష కనపడింది!
    "ఏమైంది తల్లీ?" విద్య కంగారుగా అడిగింది.
    "నన్ను శిక్షించమ్మా...... నా చెంపలుపగలకొట్టు..... నన్ను బాగా తిట్టు!" వర్ష ఏడుస్తూ అంది.
    "ఎందుకూ!!" ఆశ్చర్యంగా అడిగింది.
    "దైవంలాంటినీముందు అబద్దాలాడాను. నీదగ్గర నిజాన్ని దాచాను. అందుకు" తల్లిపాదాలమీద పడి అంది వర్ష.
    విద్య ఆమెమీద చెయ్యివేసి నిమురుతూ "ఏం అబద్దం చెప్పావు?" అంది.
    వర్ష తల ఎత్తకుండానే "నేను తరళతోవెళ్ళలేదు! సంజయ్ తో వెళ్ళాను. సంజన్ వసుంధరా ఆంటీ తమ్ముడు.....అతను నన్ను ఐలవ్ యూ అన్నాడు. నాకూ అతను బాగా వచ్చాడు...." అంటూ మొత్తం పూస గుచ్చినట్లు వివరించింది.
    విద్యకూతురి తల నిమురుతూ ఉండిపోయింది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS