Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 9

 

    "చచ్చినా ఒప్పుకోను....నాకిష్టం లేని పని నేను చేయను. అసలు నేను ఈ రాజకియలంటే పరమ చిరాకు" అన్నాడు సర్వోత్తమరావు.

    "అయ్యా సోమసుందరం.....నువ్వే ఎలాగైనా అన్నగార్ని ఒప్పించాలి ఆ బాధ్యత నీదే" అన్నాడు కరణం బీడి దమ్ములాగుతూ.

    "చీ వెధవ బీడిలు.....పక్కనే కాబోయే ప్రెసిడెంటు గారిని పెట్టుకొని ఈ బీడీలు తగుతున్నానేంటి.....ఏది బావగారు ఓ చుట్టముక్క ఇటు పారేయండి" అన్నాడు కరణం.

    సర్వోత్తమరావు చికాగ్గా లాల్చి జేబులోంచి ఓ చుట్ట తీసి కరణానికి ఇస్తూ తానొకటి తీసి నోట్లో పెట్టుకున్నాడు.

    "ఆ వచ్చేదెవరు మన సురేంద్రబాబు లాగుతున్నాడే" అన్నాడు కరణం.

    "అవును సురేంద్రే...." అంటూ
    "ఏంట్రా ఇప్పుడు పట్నం వెళ్ళి వస్తున్నావేంటి ? దేనికి?" అన్నాడు సోమసుందరం.

    "పురుగులమందు అయిపోయింది మావయ్యా, తీసుకురావటానికి వెళ్ళాను." అన్నాడు సురేంద్ర ఎడ్లబండి ఆపి.

    "కొన్నావా?" అన్నాడు సోమసుందరం.

    "కొన్నాను మావయ్యా! పోయిన నెలకంటే ఈనెల అయిదురూపాయలు పెరిగింది" అన్నాడు.

    "అట్టావుంది మన ప్రభుత్వం పెరగటమే గాని తరగటం లేదు. అందుకే బావగారూ నిన్ను పోటీ చేయమంటుంది" అన్నాడు కరణం చుట్టను తన్మయత్వంతో కాలుస్తూ.

    "ఏంటి నేను ప్రెసిడెంటుగా పోటిచేస్తేనే ధరలు తగ్గిపోతాయా?" అన్నాడు సర్వోత్తమరావు.

    "ఏంటి మావయ్యా ప్రెసిడెంటుగా పోటిచేస్తున్నాడా? భలే భలే....మా కుర్రోళ్ళంతా మీకే వోటేస్తాము మావయ్యా...." అన్నాడు సురేంద్ర.

    "అది మాటంటే అన్నాడు కరణం.

    "అరేయ్...పోటిలేదు గిటిలేదు నువ్వింటికెళ్ళు...." అన్నాడు సర్వోత్తమరావు.

    సురేంద్ర తల గోక్కుంటూ అలాగే మావయ్యా అంటూ ఎడ్లను అదిలిస్తూ వెళ్ళిపోయాడు.

    "చిన్నపిల్లవాడి నోరైతే మూయించగలిగారు రేపు ఉరంతటి నోరు మూయించగలరా?" అన్నాడు కరణం.

    "ఇదిగో కరణం నేను ముందుగానే చెపుతున్నా, నేను పోటిచేయను నన్ను బలవంతపెట్టకు" అన్నాడు సర్వోత్తమరావు.

    సోమసుందరం కరణం వేపు చూసి కన్నుగిటుతూ "అన్నగారికి ఇష్టంలేకపోతే మనం ఏంచేస్తాం కరణంగారూ ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది" అన్నాడు.

    "అయ్యా....అట్లాగట్లాగే...." అన్నాడు కరణం సోమసుందరం అంతర్యం గ్రహించి ఆనందంగా.

    "బావగారూ కాఫీ చెప్పండి. తాగి వెళ్ళిపోదాం" అన్నాడు కరణం మళ్ళి.

    "వెధవ కాఫీదేముందయ్యా నువ్వే చెప్పు ...." అన్నాడు సర్వోత్తమరావు.

    "అరేయ్ అబ్బి! మూడు స్ట్రాంగ్ కాఫీ పట్టుకురారా." అరిచి చెప్పాడు కరణం.

    "అన్నయ్యా! రేపు మెయిన్ బజారు రోడ్డు విషయమై టెండర్లు పిలుస్తున్నారట. అది పెద్ద కాంట్రాక్టు అవుతుంది. ఎట్లాగైనా సరే ఈసారి అది మనకు రావాలి. కిందటిసారి ఆ గోపాలరావు కొట్టేశాడు. ఆ టెండరు" అన్నాడు సోమసుందరం.

    "అలాగే చూద్దాంలే నువ్వు తొందరపడి ఎవరితో చెప్పకు. మనం టెండర్లు వేస్తున్నట్లు" అన్నాడు సర్వోత్తమరావు.

    "అదేంటండి! మీరు మన ఊరికే పెద్ద కంట్రాక్టరు మీరు వేయరని ఎవరనుకొంటారు? ఎవరితో చెప్పొద్దని అంటారేమిటి?" అన్నాడు కరణం
    "పెద్ద కాంట్రాక్టరయితే మాత్రం అన్ని టెండర్లు వేయాలని వుందా? మనకిష్టంలేదు ఆ రోడ్డు టెండరు వేయటంలేదు అంతే" అన్నాడు సర్వోత్తమరావు.

    "ఏదోలే బావగారు ఈ టెండర్ల గొడవ నాకెందుకు గానీ, కాఫీ తీసుకోండి" అంటూ అప్పుడే హోటల్ కుర్రాడు తెచ్చిన కాఫీ గ్లాసు అందిస్తూ అన్నాడు కరణం.

    "అలా అన్నావ్ బావుంది. ప్రతిదాన్లో తలదుర్చకు" అన్నాడు సర్వోత్తమరావు.

    "నేను దుర్చకపోయినా, ఊరి సమస్యలే నన్ను తలదుర్చేలా చేస్తాయి బావగారూ! ఏం చేద్దాం....నా పోస్టు అలాంటిది....అందుకేగా మిమ్మల్ని ప్రెసిడెంటుగా పోటీ చేయమంటుంది" అన్నాడు కరణం.

    సర్వోత్తమరావు అతనివేపు సీరియస్ గా చూశాడు.

    "మీకు యిష్టం లేకపోతే వద్దులెండి...." అన్నాడు మెల్లిగా నసుగుతూ.

    "నేను వెళుతున్నాను అన్నయ్యా! రామాలయం దగ్గిర కాస్త పని వుంది. అది చూసుకుని ఇంటి కెళతాను" అన్నాడు సోమసుందరం.

    "అలాగే....పెందలాడేరా.....ఇంటికి...." అన్నాడు సర్వోత్తమరావు.

    "ఆహా....చిన్నపిల్లవాడికి చెప్పినట్లు చెపుతున్నారు కదండీ.....ఈ రోజుల్లో తమ్ముళ్ళపైన ఇంతప్రేమ ఎవరుకుంటుంది? అలాగే ఆ తమ్ముళ్ళకు కూడా అన్నయ్యలంటే భయం. భక్తి రెండు వున్నాయి. నిజంగా మీది బంగారం లాంటి ఉమ్మడి కుటుంబం బావగారూ!" అన్నాడు కరణం.

    సరే సర్లే....నేవ్వెంతగా గ్యాస్ ఎక్కించినా నా దగ్గర మరో చుట్టలేదు. ఉన్నదొక్కటే. అది నేను వెలిగించుకుంటున్నాను" అన్నాడు సర్వోత్తమరావు.

    "ఎంతమాట.....వెధవ చుట్టకోసం కక్కుర్తిపడి పొగడాల్సిన ఖర్మ నాకేంటి బావగారూ! ఉన్నమాట అన్నాను. నా దగ్గర బీడి కట్టుంది కదా....అది కాల్చుకుంటాను....." అన్నాడు కరణం బీడి నోట్లో పెట్టుకుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS