"రైట్, పద వెళదాం...." అంటూ లేచాడు సర్వోత్తమరావు.
6
"వనజా! ముగ్గుడబ్బా తీసుకురా" చెల్లెల్ని కేకేసింది గిరిజ.
"అప్పటివరకూ అరుగుమీద కూర్చుని అక్క కళ్ళాపి జల్లుతుంటే చూస్తూ కూర్చున్న వనజ లోపలికి పరుగుతిసింది. ముగ్గుడబ్బా తీసుకుని వస్తూ సురేంద్ర మంచం దగ్గిర ఆగింది.
సురేంద్ర గాడనిద్రలో వున్నాడు. వనజ మెల్లగా నీళ్ళ తొట్టి దగ్గరకు వెళ్ళి చేత్తో నీళ్ళు తీసుకుని సురేంద్ర ముఖం పైన జల్లి పరుగుతీసింది.
"ఏయ్....ఎవరే అది?" అంటూ దిగ్గున లేచాడు సురేంద్ర.
వనజ వీధిగుమ్మం దగ్గర వెక్కిరిస్తూ నిలబడింది.
సురేంద్ర కోపం వనజను చూడగానే చప్పున చల్లారిపోయింది.
గిరిజ మాత్రం ఇదేం పట్టనట్లు దీక్షగా ముగ్గు వేస్తోంది.
సురేంద్ర తలగడ మర్చి కాళ్ళవేపు దిండు వేసుకుని పడుకుని దీక్షగా గిరిజనే చూస్తున్నాడు.
అప్పటికే తలస్నానం చేసి తలకు టవల్ చుట్టుకుని పచ్చని పరికిణిని నడుం చుట్టూ బిగించి, అదే రంగు జాకెట్టు వేసుకుని కుందనపు బొమ్మలాగా వున్న గిరిజలో సురెంద్రకు ఎందుకో ఈరోజు కొత్త అందాలు కనిపిస్తున్నాయి.
చిన్న ముక్కు, పెద్దపెద్ద కళ్ళు, చామనచాయ రంగు, కింద ఒక కాలు మడతపెట్టి కూర్చుని , ముగ్గు వేస్తున్నప్పుడు నడుముపైన పడిన సన్నని వంపు మరింత ఆకర్షణియంగా వుంది.
"నేను ఇన్నాళ్ళు ఇంత అందాన్ని కళ్ళెదుట పెట్టుకుని గమనించలేదేంటి? వనజ చిన్నపిల్ల అయినప్పటికీ ఇన్నాళ్లూ గాడనిద్రలో వున్న నన్ను నీళ్ళు జల్లి నిద్రలేపింది.
అయినా ఏంటి ఈరోజు నాకేమయింది? మనసు గిరిజచుట్టూ తిరుగుతుందేమిటి? ఇన్నాళ్ళు గిరిజని , జయంతిని కేవలం ఆటలుపట్టించానే గానీ మరో ఉద్దేశంతో చూడలేదు.
జయంతి గిరిజకంటే చిన్నపిల్ల కావటంవల్లనేమో....జయంతిపై మరో అభిప్రాయం లేకుండాపోయింది. "ఇది నీ పెళ్ళాం" అని అమ్మా అత్తయ్యలు అంటున్నా నాకు ఏమి అనిపించలేదు. గిరిజ విషయం ఎవరూ నాతో 'ఇది నీ పెళ్ళాం'అని అనలేదు.
అందుకేనేమో నాకిప్పుడు ఆ ఉద్దేశం కలుగుతోంది. గిరిజ నిజంగా అందగత్తే సుమా....ఇన్నాళ్ళు నేను గమనించలేదు!
ముగ్గు పూర్తిచేసి లేచి చుట్టూ తిరుగుతూ గమనిస్తోంది.
నేను వెంటనే మంచం పైనుంచి లేచి కూర్చున్నాను. గిరిజ ఇంకా వీధిలోనే వుంది.
నేను మెల్లగా లేచి వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళి గిరిజనే గమనిస్తున్నాను.
"ఏంటి బావా అలా చూస్తున్నావ్?" అంది గిరిజ నవ్వుతూ.
"అదే అర్ధంకావటంలేదు. ఏంటి ఈరోజు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు?" ఆశ్చర్యంగా అడిగాడు సురేంద్ర.
"ఈరోజు అక్క పుట్టినరోజు" అంది వనజ.
గిరిజ అందంగా సిగ్గుపడింది.
'ఓహో....అదా విషయం! అమ్మాయిగారు పొద్దుటే కొత్తబట్టలు ధరించింది. అయితే పదహారు పోయి పదిహేడో సంవత్సరంలో అడుగు పెట్టిందన్నమాట!" అన్నాడు సురేంద్ర.
"అబ్బో.....నా వయసు బానే గుర్తుందే మొద్దబ్బాయికి. ఎప్పుడూ పొలం పనులు చూడటం, ఎద్దులకు మేత వేయటమే అనుకున్నాను, ఆడపిల్లల వయసు కూడా గుర్తుందన్నమాట....." అంది గిరిజ ఎగతాళిగా.
సురేంద్ర మౌనంగా నవ్వాడు.
"అదే నేను చేసిన పొరపాటు గిరిజా! ఎదురుగా ఇంత అందాన్ని ఇన్నాళ్ళు గమనించకపోవటం. నిజంగా నేను మొద్దబ్బాయినే! కరెక్టుగా చెప్పావు' అనుకున్నాడు.
* * * *
అప్పుడే పూజ ముగించుకుని బయటకొచ్చారు కస్తూరి గిరిజ.
"ముందు నాన్నగారి కాళ్ళకు దణ్ణం పెట్టుకోమ్మా...." చెప్పింది కస్తూరి.
గిరిజ తండ్రి రామశేషు కాళ్ళకు దణ్ణం పెట్టింది. తర్వాత సర్వోత్తమరావుకు, మిగిలిన ఇద్దరు బాబాయ్ ల దగ్గరకు వెళ్ళి కాళ్ళకు దణ్ణం పెట్టింది.
వాళ్ళు ఆప్యాయంగా అక్షింతలు వేసి దీవించారు.
"మీ అత్తయ్య ఏది కనిపించటంలేదు? ఎక్కడికెళ్ళింది పొద్దుటే వెళ్ళింది?' అంది కస్తూరి.
అంతలో వీధి గుమ్మంలోనుంచి వస్తోంది భ్రమరాంబ.
"ఎక్కడికెళ్ళారు వదినమ్మా, ఇంత పొద్దుటే వెళ్ళారు?" అంది కస్తూరి నవ్వుతూ.
"మా కోడలుపిల్ల పుట్టినరోజు పండగకదా.....గుడికెళ్ళి అర్చన చేయించి వస్తున్నాను. ఇదిగో ప్రసాదం..." అందించింది.
"అమ్మా గిరిజా. ఇటురా తల్లీ! మీ అత్తయ్య దీవెనలు కూడా తీసుకో. నీకోసం అంతదూరం వెళ్ళి అర్చన చేయించుకొచ్చింది" అంది కస్తూరి.
గిరిజ నవ్వుకుంటూ వచ్చి భ్రమరాంబ కాళ్ళకు మొక్కింది.
"దిర్ఘయుషుభవ....శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తూ" అంటూ దివించింది భ్రమరాంబ.
"కళ్యాణందేముంది వదినమ్మా....అది నీ చేతుల్లోనే వుంది! సురెంద్రకు మంచి జోడు" అంది కస్తూరి వెంటనే.
భ్రమరాంబ ఆ మాటలకు ఆశ్చర్యంగా చూసింది. అంటే తను కూతుర్ని ఇవ్వదన్నమాట. పరోక్షంగా చాలా తెలివిగా తన ఉద్దేశాన్ని చెప్పేసింది కస్తూరి అనుకుంది భ్రమరాంబ.
దాక్షాయణి, శివపార్వతి ఇద్దరూ కూడా కస్తూరి మాటలకు ఆశ్చర్యపోయారు.
వెంటనే రామశేషుకు బసవయ్య మాటలు గుర్తొచ్చాయి, నిన్న కాలవ గట్టుమీద అతను అన్న మాటలు గుర్తొచ్చి.
