"అది....అది...." అంది మళ్ళి జయంతి.
"ఏదే...ఇందాకటినుంచి అది..అది.....అంటారు అసలు విషయం చెప్పవే" అని విసుక్కుంది గిరిజ.
"జయంతి భోంచేద్దాం రండి. గిరిజా! నువ్వు కూడా పిన్నిని కూడా పిలుచుకురండి" అంటూ లోపలనుంచి కేకేసింది కస్తూరి.
"పదపద " భోంచేస్తూ కబుర్లు చెప్పుకుందాం" అంది గిరిజ.
"నేనిప్పుడే వస్తాను" అంటూ వెళ్ళింది దాక్షాయణి.
"ఏంటి దాక్షాయణి! భోజనం పెట్టి అలా వెళ్ళిపోతే ఎలా?" అన్నాడు మాధవరావు.
"చాల్లే ఊరుకోండి, మీరు చేసిన వెధవ పనికి నేను తలదించుకోవలసి వస్తుంది" అంది విసుగ్గా.
"వెధవ పనా? నేనా? నేనేం చేశానే....నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం ఏముంది? పరాయి ఆడదానివంక కన్నెత్తి కూడా చూడనని నీకు తెలుసు కదా?" అన్నాడు అమాయకంగా నటిస్తూ.
"చాల్లెండి....సంబడం....పరాయి ఆడదానివంక కన్నెత్తి చూస్తే పళ్ళు రాలగొడతా" అంది దాక్షాయణి.
వెంటనే మళ్ళి "సర్లే.....లెండి బయటకెళ్ళి పడుకోండి. ఆరుబయట మంచం వేశాను. చల్లగా బాగుంది. నేను భోంచేసి వస్తాను" అంది.
"ఏంటి అరుబయటా? అంత పెద్ద శిక్ష వేస్తున్నావెందుకే.....అసలే ఈ రోజు నిన్ను చూస్తుంటే కొత్త పెళ్ళికూతురిలా వున్నావ్. నేనూరుకోను" అని పెద్దగా అరిచాడు.
"అబ్బా! సర్లే ముందు కాసేపు పిల్లల దగ్గిర పడుకోండి. తరువాత లోపలికి వద్దురు....అలా పెద్దగా అరవకండి. ఇంట్లో పెళ్లీడు కొచ్చిన పిల్లలున్నారు" అంది దాక్షాయణి.
మాధవరావు నిశ్సబ్దంగా నవ్వుకుంటూ వెళ్ళాడు.
* * * *
గిరిజ, జయంతి పక్కపక్కనే కూర్చుని భోంచేస్తున్నారు. ఇద్దరూ దాక్షాయణి వేపు చూస్తూ నవ్వుకుంటూ భోంచేస్తుంటే దాక్షాయణి గిల్టీగా ఫీలవుతుంది.
"ఏంటి దాక్షాయణి! అలా మౌనంగా వున్నావేంటే?" అడిగింది కస్తూరి.
"అబ్బే ఏం లేదక్కా?" అంది కంగారుగా.
"సినిమా బాగుంది కాదక్కా.....అబ్బా ఎన్టిరామారావు అచ్చుగుద్ది నట్లు శ్రీరాముడిలాగానే వున్నాడు" అంది శివపార్వతి.
"అబ్బో శ్రీరాముడ్ని ప్రత్యక్షంగా చూసినట్లే చెపుతుందే పిన్ని." అంది జయంతి.
ఆ మాటలకు అందరూ నవ్వారు.
"దానికి ఈమధ్య నోరెక్కువైంది......పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతోంది..." అంది భ్రమరాంబ.
"థాంక్స్" అంది జయంతి.
గిరిజ మళ్ళా పెద్దగా నవ్వింది. వెంటనే పోరాపోవటం వల్ల నెత్తి మీద కొట్టుకుంది. పక్కనే వున్న శివపార్వతి నీళ్ళు అందించింది. గబగబా రెండు గుక్కలు తాగి.....
"అమ్మయ్య....అబ్బ ఈరోజు భలే ఎంజాయ్ చేశాంకదా పిన్ని....మనం కనీసం నెలకు రెండు సినిమాలకైనా వెళ్ళాలి" అంది గిరిజ.
"ఆది మ్యాట్ని సినిమాకు కాదు. తొలి ఆటకే వెళ్ళాలి....ఎంచక్కా వెన్నెల్లో ఎడ్లబండిలో ప్రయాణం.....అబ్బా ఎంత బావుందో" అంది గిరిజ.
నిజానికి అందరూ బానే ఎంజాయ్ చేశారు. భ్రమరాంబగారితో సహా అందరూ ఈరోజు హుషారుగానే వున్నారు. ఎందుకంటే, అలా అందరూ కలిసి సినిమాకి వెళ్ళి దాదాపు మూడునెలలు అవుతుంది.
అందరి మనసులోనూ అదే వుంది. కాకపోతే గిరిజ పైకి చెప్పేసింది.
"అవునే గిరిజ ఈరోజు నిజంగా చాలా మంచి రోజు నువ్వన్నట్లు నెలకు రెండుసార్లు కాదుగాని, నెలకోసారి వెళ్దాం" అంది శివపార్వతి.
"వదినమ్మా! మజ్జిగ పోసుకోండి అసలే ఎండాకాలం" అంది కస్తూరి భ్రమరాంబతో.
"పోయ్యమ్మా అబ్బాయి భోంచేశావా" అంది.
"చేశారు వదినమ్మా అందరూ భోంచేశారు..... ఈరోజు చాలా పొద్దుపోయింది త్వరగా తినండర్రా మళ్ళి పెందలాడే లేవాలి" అంది కస్తూరి.
5
"ఈసారి ప్రెసిడెంటు ఎన్నికల్లో నువ్వు పోటి చేయాల్సిందే అన్నయ్యా..." అన్నాడు సోమసుందరం.
"మనకెందుకురా ఈ ఎలక్షన్ల గొడవలు....మన కాంట్రాక్టు పనులు మనం చూసుకుంటే చాలు" అన్నాడు
సర్వోత్తమరావు.
"అమ్మమ్మా అలాగని తేలిగ్గా కొట్టిపారేయకండి బావగారూ తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదన్నట్లు దివ్యమైన మాట చెప్పాడు. తమరు ఒప్పుకు తీరాల్సిందే" అన్నాడు కరణం.
"ఇదిగో కరణం వాడేదో చిన్నవాడు తెలియక మాట్లాడాడు నువ్వు కూడా వాడి మాటలకు వంతపాడతావే" అని చిరాకుపడ్డాడు సర్వోత్తమరావు.
"వంతపాడవలసిన విషయం అందులో వుంది కనక పాడానండి. ఏం తప్పా? అసలు తమ్ముడు అన్నదాన్లో తప్పేముంది? ఏ....ఏంటి మీకేం తక్కువ? ఆ గోపాలరావుకంటే మీరేం తక్కువ తిన్నారు? వరుసగా రెండుసార్లు ప్రెసిడెంటుగిరి ఎలగబెట్టాడు. ఊరికి ఏమైనా మంచి చేశాడా?" అన్నాడు కరణం
"బాగా చెప్పారు కరణంగారూ" అన్నాడు సోమసుందరం.
"నేనెప్పుడూ బానే చెప్తాను తమ్ముడుగారూ......అన్నయ్యే నన్ను పట్టించుకోడు....పట్టుమని రెండునెలలు కూడా లేవు ఎన్నికలు, ఇదిగో బావగారూ మీరు మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటిచేయాల్సిందే ఆ..." అన్నాడు కరణం జేబులోంచి బీడికట్ట తీస్తూ.
