Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 9

   

    "అంటే ఒప్పుకుంటున్నావన్నమాట."

 

    "యస్! ఓడిపోతావన్న నమ్మకంతో."

 

    "అదిగో...." టక్కున అంది సామ్రాజ్యం. "నీలోని ఇంకో  నువ్వు నిన్ను శాసించటానికి , నిన్ను నీనుంచి వేరుచేయటానికి ప్రయత్నిస్తుంది. జీవితం వేరు, జీవించటం వేరు అని నేను గానీ, మీ నాన్న లాంటి వ్యక్తులు గానీ అనేది అందుకే ధన్వి."

 

    "నో....."వెనకడుగువేసి ఓటమి పాలుకావడం ఇష్టంలేనట్టు అన్నాడు ధన్వి. "నేను గెలుస్తాను సామ్రాజ్యం. అప్పుడు నువ్వు నాకేమి ఇవ్వనవసరంలేదు. ఒకవేళ నువ్వు గెలిస్తే రాజీపడకుండా, నటించకుండా మనస్పూర్తిగా నీ బిడ్డకి తండ్రినవుతాను. ఓ.కే.! సరిగ్గా మూడు నెలలు....అంటే .....జూలై ఇరవై మూడు....."

 

    చిత్రమైన అనుభవం లాంటి సంఘటనతో బయటికి నడిచాడు ధన్వి.

 

    అప్పటికే స్వేదంతో తడిసిపోయిన 'సామ్రాజ్యం జరిగిందేమిటో తెలుసుకున్నట్టు సన్నగా కంపించింది.

 


    ఏమిటిది?

 

    ఎందుకిలా తొందరపడింది తాను?

 

    ధన్వి మారితే తప్ప మాములు మనుషుల్లో ఒకరు కాలేడనే నిన్న మొన్నటి ఆలోచనలు ఇలా తనను ప్రోత్సహించాయా?

 

    రెండు సంధ్యల గట్ల మధ్య పారే నదిలా , కళ్ళు తడి అవుతుంటే చాలాకాలం తర్వాత ఒక ఓటమి లాంటి భావంతో చిక్కుకుని తన వ్యక్తిత్వం కోల్పోయినట్టు కలవరపడింది.

 

    తను నిజంగా నిబ్బరం గల ఆడదేనా?

 

    అయితే ఎందుకిలా జారింది!

 

    ఇప్పుడు ఒలికించిన అక్షరాలు రేపు ఏ కోరని చరిత్రలో పుటలు కావాలనుకుంటుంది?

 

    అసలు ధన్వి మీద కోరికే లేకపోతె సరిగ్గా మూడు నెలల అంటూ గడువునే కుదించిందేం?

 

    జులై ఇరవై మూడు.....

 

    గుండె అరల్లో పిడుగుపడ్డట్టు అదిరిపడింది.

 

    జూలై ఇరవై మూడు అంటే ఒకనాటి సామ్రాజ్యం పెళ్ళిరోజు.

 

 

                                                          *    *    *    *

 

    అపరాత్రి కావస్తుండగా____

 

    ఇంట్లో అడుగుపెట్టిన ధన్వి తన గదిలోకి వెళ్ళబోతూ చూశాడు.

 

    అమ్మ, నాన్నగారి పాదాల దగ్గర కూర్చుని కాళ్ళు పడుతుంది...... ఈమద్య అర్త్రటిస్ ప్రాబ్లంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం తల్లి చెప్పింది ధన్వికి.....

 

    "ధన్వీ.....భోంచేయవు" అంది బడలికగా చూస్తూ. బయట ఇరానీ కేఫ్ లో సమోసాలు తిన్న ధన్వి.

 

    "ఆకలిగా లేదమ్మా" అన్నాడు.

 

    "నాన్నగారి మీద కోపం వచ్చిందా?"

 

    ధన్వి నవ్వాడు మృదువుగా ......ఎక్కడో చదివింది గుర్తుకొచ్చింది అమ్మని చూస్తుంటే.

 

    "ఈ ప్రపంచంలో మగాడికి బానిసగా పడివుండేది ప్రేమించిన ఆడది. అయితే అలాంటి ఆడవాళ్ళలో అందరికన్నా పెద్ద బానిస అమ్మ"

 

    ఆ మాట అనలేదు ధన్వి.

 

    కాని ప్రేమించడమనే ఒకే ఒక్కగుణం కల తల్లిని సమీపించి "బాగా నీరసంగా వున్నావమ్మా" అన్నాడు.

 

    సావిత్రి ఆ చిన్న పరామర్శకే ఎంత పులకించిపోయిందని.....

 

    "నువ్వు భోంచేసావా అమ్మా?"

 


    ఏ కళ నున్నాడో ధన్వి తల్లి పక్కన కూర్చున్నాడు.

 

    "లేకపోతే నాన్నా నేను కీచులాడుకున్నామని నువ్వు తినటం మానేసావా?"

 

    అప్పుడు రాలిపడింది ఆమె కళ్ళ నుంచో నీటిబొట్టు.

 

    నవ్వి అడిగింది అమ్మ కాబట్టి కాదు....ఒక మంచి కొడుకు అనిపించుకోటానీకో లెదూ అమ్మని సంతృప్తి పరచటానికో అలా మాట్లాడడు.....మనసుపుట్టాలి.....బుద్ది ప్రేరేపించాలి.

 

    "నువ్వెళ్ళి పడుకో" ధన్వి అన్నదేమిటో ముందు అర్ధం కాలేదు....."నేను నాన్నకి కాళ్ళు పడతాను."

 

    ఇలాంటి విషయాల్లో ధన్వి తలదూర్చడం కూడా ఆమెకు కొత్త కాదు కాని ఇలా కాళ్ళు పట్టడం అన్నది తొలిసారి. పైగా అంతటా గొడవ పడ్డాక.

 

    "వెళ్ళమంటుంటే...."

 

    ధన్వి మొండితనం ఆమెకి తెలుసు....ఇంకా చర్చ కొనసాగిస్తే అయన నిద్ర లేచిపోతాడు. అయినా మనసు తమాయించుకోనట్టు ధన్విని పక్కగదిలోకి లాక్కుపోయింది. "ఇంత ప్రేమున్నవాడివి ఆయనతో ఎందుకలా గొడవపెట్టుకుంటావ్?"

 

    తల్లికెలా చెప్పాలో బోధపడలేదు ధన్వికి.

 

    "నాన్నగారికి నా ఆలోచనా విధానం నచ్చకపోవచ్చు కాని నాకేదన్నా ప్రమాదం జరిగిందే అనుకో చూస్తూ కూర్చుంటారాఅమ్మా.....దేనికదే! ఇంతకన్నా నీకు అర్ధమయ్యేట్టు చెప్పలేను."

 

    తల్లి జవాబుతో పనిలేనట్టు వెళ్ళి తండ్రి పాదాల దగ్గర కూర్చున్నాడు. కాళ్ళు పిసుగుతూ నిద్రపోతున్న తండ్రి మొహంలోకి చూశాడు.

 

    నీరసం నిస్త్రాణల్లాంటివి అయన వయసుని ఓడించటానికి ప్రయత్నిస్తున్నా మోహంలో కళ తగ్గలేదు. ఒకప్పుడు చాలా అందగాడయ్యుంటాడనిపించే ఫీచర్స్ మెరుపులా మరకల్లా అతడిలో ద్యోతకమవుతుంటే తల తిప్పి అద్దాల కిటికీల కేసి చూసాడు.....ఎప్పుడో నాటకరంగంలో తండ్రి సాధించిన రంగు వెలసిన వెండి కప్పులు.....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS