Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 10

   
    ఓ గంటదాకా ఏకాగ్రతగా తండ్రి కాళ్ళు పట్టి తన గదిలోకి వచ్చాడు. అప్పటికే అమ్మ నవారు మంచం పరిచి సిద్దంగా వుంచింది....అది కాదు ధన్వికోపం తెప్పించింది.

 

    వెళ్ళి పడుకోమని చెబితే ఇంకా నిద్రపోకుండా బెడ్ పక్కన కూర్చుని వుంది."నీకేం చెప్పానమ్మా."

 

    మంచంమ్మిద కూర్చోగానే కొడుకు తల నిమురుతూ ఆర్తిగా చూసింది....అంతటితో సరిపెడితే ఫర్వాలేదు.....మాటల్లో వ్యక్తం చెయ్యలేని ఏ భావాన్నో కన్నీళ్ళతో వ్యక్తం చేసి అలా తన ఆనందాన్ని ప్రకటించాలనుకుంటుంది.

 

    "వద్దమ్మా" అన్నాడు ఆమె కళ్ళ నుంచి రాలిపడుతున్న నీళ్ళని చూస్తూ వద్దన్నది దేని గురించో అర్ధం కాని సావిత్రి విభ్రమంగా చూస్తుండగానే అన్నాడు.

 

    "ఈ బుల్లి పాపలున్నాయ్ చుశావ్! అవేనమ్మా, నీ కళ్ళలోని నీటి బొట్లు.....వురికనే వురికి వురికి వస్తుంటాయి కదూ? అందులో నీకైతే మరీను."

 

    ఎగతాళి చేస్తున్నాడని బోధపడి మూతి ముడుచుకుంటూ అంది "వస్తే ఎమిటట?"

 

    రెండు చేతుల్తో తల్లి తలని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంకా అరని కంటి తడి....ఓ ఉర్దు కవిత చదివానమ్మా! నీ కళ్ళలో చిప్పిలినీళ్ళు కంటి వాకిట దగ్గరే ఆగిపోతే ముత్యాలు.....నేలపైనే ఉబికితే అవి కన్నీళ్ళునట."

 

    ఎప్పుడో గాని ధన్వి ఇలాంటి మూడ్ లో వుండడు, ఇదిగో యింత కాలానికి మళ్ళీ అల్లరిగా మాట్లాడుతున్నాడు.

 

    "ఏంటమ్మా! ఏమిటి చూస్తున్నావ్?"

 

    "ఎప్పుడో పద్దెనిమిదేళ్ళ క్రిందట ఆరేళ్ళ నా వరాలకొండ ధన్వి...." సావిత్రి గొంతు గద్గదికమైపోయింది. "గుర్తుకొచ్చాడ్రా.....అప్పుడు ఇంతేగా! చాక్ లెట్ కొనుక్కోమని డబ్బులిస్తే చేగోడీలు తెచ్చుకునేవాడు.....చేగోడిలకి డబ్బులిస్తే ముష్టివాళ్ళకి దానం చేసేవాడు. అయినా ప్రతి పనిని సమర్ధించుకునేవాడు! నువ్వు చిన్నప్పటినుండి ఇంతేగా నీకిష్టమైందే నువ్వు చేసేవాడివి......బలవంత పెడితే తిరగబడేవాడివి.....నా మీదనే అనుకో!"

 

    రెప్పలార్పకుండా చూశాడు.

 

    ఎన్నో నదుల సంగమం తర్వాత కూడా యింకా తన అస్తిత్వాన్ని వదులుకోని ఉప్పునీటి సముద్రంలా అన్పించే ప్రాణి ఈ ప్రపంచంలో అమ్మ ఒక్కతేనా?

 

    నేరస్తుడని ప్రపంచం వెలివేసినా చివరికి దేవుడొచ్చి తూలనాడినా గుండె అరల్లో బిడ్డని దాచుకుని వాడితో పంచుకున్న అనుభూతుల్ని శ్లోకాలుగా మార్చుకుని భగవద్గిత గా అనిపించటం అమ్మకి మాత్రమే సాధ్యమా.....

 

    లౌకిక జగత్తు కల్పించిన వ్యత్యాసాలని, విశ్వసాల్ని అతితుడిగా భావించటానికి కారణం అమ్మ స్థానంలో నిలబడటమే దేవుడిచ్చిన వరంగా 'ఆమె' బావించడమా!

 

    ఎంత గర్వం అమ్మ కళ్ళల్లో.....

 

    చెప్పగలిగే శక్తే వుంటే తెల్లారేసరికల్లా తన మీదున్న ప్రేమని నాలుగు వేదాల కన్నా బలంగా వివరించేదేమో!

 

    "నాన్నగారు చాలా అందంగా వుండేవారా అమ్మా?"

 

    ఏ జ్ఞాపకాల నీడలో ఆమె మస్తిషాన్ని కదిపి అయినంత కుదిపేసినట్లయి." అది మాములు అందమట్రా....." కావ్యంలా వర్ణించేదే కాని భాష దొరకలేదేమో.

 

    "చిన్న కుటుంబంలా నా ఒక్కడితోనే అపేసారే కవాలనేనా? లేకపొతే నాన్నగారు నాటకాల కోసం పగలూ రాత్రి వూర్లు పట్టుకు తిరగడమా?"

 

    ఇలాంటి ప్రశ్నలు కూడా ధన్వి చిలిపిగా కాక సిన్సియర్ గా అడగడం ఆమెకు కొత్త కాదు.

 

    "మీ నాన్నగారు నువ్వు పుట్టగానే......తొలిసారి నిన్ను చూసి ఎంత గర్వపడ్డారో తెలుసా.....ఆకాశంలో చందమామ నీ కడుపున పడింది సావిత్రి! ఇంక మనకి పిల్లలోద్దు అని ఆ క్షణంలోనే నిర్ణయించేసుకున్నారు.

 

    సావిత్రి చెబుతూ టక్కున ఆగింది....."ఆ తర్వాతేమన్నారో తెలుసా?"

 

    ధన్వి అడగలేదు. కాని చెరిగిపోని స్వప్నం గుర్తుకొస్తుంటే-

 

    "నిన్ను చందమామ అన్నారా ఆ తర్వాత నటరాజు తలమీద చంద్రుడు తన ఇంట అడుగుపెట్టాడు కాబట్టి నిన్ను తనకన్నా పెద్ద నటుడ్ని చేస్తానన్నారు" అంది ఇక నటుడు కావడం మిగిలిందన్నట్లుగా....

 

    నవ్వాడు తల్లి తల నిమురుతూ.

 

    "ఎందుకా వెధవ నవ్వూ నువ్వూను....నేనేం అబద్దం చెప్పడం లేదు."

 

    "నేను నవ్వింది అందుక్కాదమ్మా! ఒకనాడు మంచి నటుడిగా చెలామణి అయిన నాన్నగారు అప్పుడప్పుడూ నన్ను జీవితంలో అయినా నటించి పైకి రావాలంటుంటారే అది గుర్తుకొచ్చి" క్షణం ఆగాడు. "సరే......వెళ్ళి పడుకో అమ్మా."

 

    వెంటనే ఆమె వెళ్ళలేదు. భర్తా బిడ్డలు వాదులాటకు దిగినప్పుడు తరచుగా ఆమె ప్రేక్షకురాలిగానే వుండిపోతుందే తప్ప ఏ ఒక్కర్ని సమర్ధించదు.....అసలు అంత పరిజ్ఞానం తనకి లేదన్నది ఆమె నమ్మిన సత్యమే.

 

    అయినా ఈరోజు కొడుక్కి ఓ విషయం చెప్పాలని నిర్ణయించుకుంది. అది యిందాకేప్పుడో భర్త తనను అనునయించి అంతా అర్ధమయ్యేట్టు చెప్పాకనే......"నీ విషయంలో నాన్నగారి భయం ఒకటే. నువ్వు జగమొండిగా అలోచిస్తావని, అయన మనసు నీకు అర్ధం కాలేదు. నీతి , న్యాయం, ధర్మం అన్నీ ఆచరించాల్సిన విషయాలేనని తనకి మాలిన ధర్మం మంచిది కాదంటారు. ఇంతకన్నా నేను సరిగా చెప్పలేను గానీ అయన నువ్వు నీ పద్దతుల్తో ప్రమాదంలో యిరుక్కుంటాననే, భయపడుతుంటారు."

 

    తన భాదని మరింత స్పష్టంగా అర్ధమయ్యేట్టుగా చెప్పే ప్రయత్నం చేసేదే కాని అవకాశం యివ్వలేదు ధన్వి. "ఒక్కమాట చెప్పనా అమ్మా" క్షణం నిట్ట్టుర్పు తర్వాత అన్నాడు. "నైతిక విలువల్ని గౌరవిస్తాను. న్యాయంగా నడవటాన్ని కోరుకుంటాను. కాని నాన్నగారు అనుకున్నట్టు నేను కోరి సమస్యల్లో అడుగుపెట్టను. అనుకున్న గమ్యం ఒక్కటే కాదు. ఆ గమ్యానికి చేరే మార్గాన్ని కూడా రాజీపడని పద్దతిలో ఎన్నుకుంటాను అన్నదే నా ప్రిన్సిపుల్. అది కూడా కాదమ్మా. నన్నెందుకు మీరు అర్ధం చేసుకోరు, నేను ఎన్నుకునేది నేను నమ్మిన మార్గం అంటున్నానే తప్ప నేను నడిచే బాటలోకి హటాత్తుగా ఏ విషసర్పమో అడుగుపెడితే మొండిగా నిలబడి కోరి కాటు వేయించుకుంటానని ఎందుకనుకుంటున్నారు. నేను అంత మూర్ఖుడిలా అనిపిస్తున్నానా లేక నేను పిచ్చిపట్టిన వాడిలా కనిపిస్తున్నానా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS