Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 8

 

    "మీ నాన్నగారితోనూ యిలాగే మాట్లాడి ఆయన్ను యిబ్బంది పెడుతుంటావ్ ధన్వీ! కాని తండ్రిగా అయన రిజర్వేషన్స్ ఆయన కుంటాయంటే ఒప్పుకోవు."

 

    హటాత్తుగా ప్రసక్తి అటు మళ్లేసరికి అదే స్పూర్తితో చెప్పాడు నిర్మొహమాటంగా. "ఈ ప్రపంచంలో ఏ మనిషి నీ మరో మనిషి మార్చలేడు రాజ్యం......ముందు ఆ విషయం నువ్వు అంగికరించాలి. బ్రతుక్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం దాకా నాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాగే బ్రతకాలి లేదా జీవితమంటే ఇలా బ్రతకడమే అని శాసించడాన్ని నేను అంగీకరించలేను" తండ్రితో జరిగిన చర్చ మనసులో మెదులుతుంటే. "నాన్నగారు నన్ను అంతగా ఫోర్స్ చేస్తున్నారు. అసలు నేనెందుకు రాజీపడాలి దేనికైనా?" అడిగాడు.

 

    తండ్రి కొడుకుల మధ్య తరచూ జరిగే చర్చ ఆమెకు తెలినిది కాదు. "వర్షం పడినప్పుడు గోడుగేసుకోవడం రాజీపడటం కాదు ధన్వి జాగ్రత్త తీసుకోవడం.

 

    "ఒప్పుకుంటాను రాజ్యం! కానీ చిల్లులు పడ్డ గొడుగుతో వర్షంనుంచి కాపాడుకోవాలనుకోవడం మాత్రం రాజీపడటమనిపించుకుంటుంది."

 

    "కావచ్చు ధన్వి....కొన్ని విషయాల్ని ఖండితంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధపెట్టకూడదు."

 

    "కొన్ని కూడని ఆదేశాలతో నన్ను అదుపు చేయాలని మా నాన్న లాంటి వాళ్ళు ప్రయత్నించకూడదు"  ఈ మొండివాడ్ని ఎలా ఒప్పించాలి అనుకుందేమో.

 

    "ఎదిగిన కొడుకేమాయిపోతాడో అన్న భయం ప్రతి తండ్రికి వుంటుంది."

 

    "కానీ నేనేదో అయిపోయేటంత తప్పుడు మార్గంలో నడవడం లేదు."

 

    "అయన చెప్పేది వినోచ్చుగా!"

 

    "విన దగ్గదికాకపోతే!"

 

    "ఇలా అర్గ్యు చేసే ఇంటర్వ్యూ నాశనం చేసుకున్నావ్" చెళ్ మని పించేట్టుగా అడిగింది సామ్రాజ్యం. "నాకా విషయం ఎలా తెలిసిందా అని ఆలోచించకు ధన్వి. ఓ స్టార్ హోటల్ రిసేప్షనిస్ట్ గా తెలుసుకోగలిగే సోర్సెస్ నాకుంటాయి."

 

    బాధగా అంది "రిటెన్ ఎగ్జామ్ లో పాసైన విషయం నాకు చెప్పలేదు. ఓ.కె.! కనీసం ఆ ఇంటర్వ్యూ పూర్తయ్యేదాకా అయినా కాస్త సహనం పాటించవోచ్చుగా?"

 

    ఓ మహత్తరమైన అవకాశం చేజార్చుకున్న ధన్విని ఆమె క్షమించలేకపోయింది. "మీ నాన్నగారి సాయం నీకు అవసరం లేదు......నాలాంటి స్నేహితురాలి అండతోనూ నీకు పనిలేదు.....అలాంటప్పుడు నీకు నువ్వయినా పదినిముషాలపాటు అణుకువని నటించొచ్చుగా?"

 

    "నటించటం నా వల్ల కాదు."

 

    ఇప్పుడు నీకు అర్ధం కాదు ధన్వి....మనిషి జీవితంలో జీవించే క్షణాల కన్నా , జివిస్తున్నట్టు నటించే క్షణాలే ఎక్కువని తెలుసుకోటానికి నీ వయసు చాలదు.....అసహనంగా కదిలింది. "అయినా బ్రతుకు యుద్దంలో ఆచరించాల్సిన ఒక వ్యూహాన్ని తెలివిగా భావించాలి గాని , అభిమానం చంపుకోవడంగా ఎందుకనుకుంటున్నావ్?"

 

    "నీ పరిభాషలో దాని పేరు ఏదైనా గానీ నువ్వు చెప్పిన వ్యూహం అన్నది నా దృష్టిలో రాజీపడడం."

 

    "ఏం మనిషివి నువ్వు?" ఉద్రేకం గొంతు దాటి వస్తుంటే నిగ్రహించుకోలేకపోయింది.

 

    "ద్వారబంధం ఎత్తు తక్కువున్నప్పుడు మొండిగా తల వంచకుండా వెడితే నుదురు పగులుతుందంటే అది తలవంచడంగా అలోచిస్తావెం? నీకు తెలిదు ధన్వి" కొండ కొనల నుండి జారిపడే జలపాతమైన గాని, నేలపై నదిగా మారేక కల్మషాన్ని నింపుకోక తప్పదని తెలిసినట్టు అంది సామ్రాజ్యం. "నటించడం నీవల్ల కదంటున్నావు గానీ నీకు తెలుసా? ఆ ప్రపంచం మాట అటుంచు .....ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తీ అవసరార్ధం నటించాలి. భర్త దగ్గర భార్య నటిస్తుంది. బిడ్డల దగ్గర తల్లి నటిస్తుంది. అంతెందుకు ఇష్టంలేని బాస్ నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి గౌరవం లేకపోయినా రోజు విష్ చేసుంటాను.....అది మోసం అని నువ్వంటావు. కాదు నటనతో మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాడమని నేనంటాను.....తప్పదు ధన్వి. కాలంతో పాటు మనం మారాలి."

 

    "నో.....నేను ఇలానే నెగ్గుకొస్తాను" అన్నాడు ధన్వి చాలెంజ్ లా.

 

    ఒక అన్న జూదం మహా భారత సంగ్రామానికి కారణమైన విషయం తెలిసిన సామ్రాజ్యం "ప్రామిస్!" అంటూ చేయి చాచింది. ఉద్విగ్నంగా ధీమాగా చేతిని కలిపాడు ధన్వి.

 


    "చెప్పు రాజ్యం.....ఒకవేళ నేను ఓడితే నీకేమిచ్చుకోవాలి?" సామ్రాజ్యం చూపులు ధన్విని పరిభ్రమించి అంతలోనే తమలోకి తామే ఒదిగిపోతున్నాయి.

 

    దారి మరిచిన ఆలోచనలు రాదారి పడవలై ఆమెను సన్నని ప్రకంపనకి గురిచేస్తుంటే......

 

    "నేను ఓడితే నీకేం కావాలి అని అడుగుతున్నాను. నువ్వు" టక్కున అంది సామ్రాజ్యం. సమీపంలో ఓ విస్పోటనం.

    "వ్వాట్?" రెట్టించాడు ధన్వి "నేను కావాలా?!"

 

    "మాట తప్పని మగాడిగా బ్రతకాలనుకుంటున్న వాడిని, అప్పుడే భయపడిపోతున్నావెం?"

 

    తొట్రుపడ్డాడు, "అది కాదు సామ్రాజ్యం....."

 

    "భయపడకు....."బిడియంగా అనిపించిందేమో దృష్టి మరల్చుకుంటూ అంది స్వగతంలోలా "నువ్వు ఓడినా నీనుంచి నేను కోరేది నీ బిడ్డకి తల్లి కావటం మాత్రమే. పెళ్ళి చేసుకోమనడంలేదు."

 

    హటాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. చుట్టూ సుదూరం దాకా అలుముకున్న నిశిధిలో ఇప్పుడతడు నిలబడ్డ విద్యుద్దిపపు కాంతి కాలుతున్న ఏ చితి వెలుగునో గుర్తుచేస్తుంటే బడలికగా కళ్ళు మూసుకున్నాడు.

 

    "బరితెగించిన ఆడదానిలా కన్పిస్తున్నానా ధన్వి?"

 

    "లేదు సామ్రాజ్యం " ఎక్కడో ఏ మనసు పొరల్లోనో ఇలాంటి ఓ చిత్రమైన పందెంలో ఇరుకున్నందుకు అణువంత బాధగా అనిపిస్తున్నా మృదువుగా అన్నాడు. "మనసులో కోర్కెల్ని అణుచుకుని మాటల్లో పవిత్రతని వ్యక్తం చేస్తూ ఆలోచనల ద్వారా మానసిక వ్యభిచారం చేసే వ్యక్తుల కన్నా నువ్వు ఉన్నతురాలివి సామ్రాజ్యం. నిజానికి నీలో నాకు వచ్చిన అంశం కూడా యిదే."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS