శకునాలు మంచివాయె
----శ్రీమతి కె. ప్రతిభారవీంద్ర, B.A
పిల్లి ఎదురొచ్చింది. పని కాదనుకొని తిరిగి ఇంట్లోకి వెళ్లి, కాళ్లుకడుక్కొని కాస్సేపు కూర్చుని, తిరిగి బయటకొచ్చాడు వెంకటకృష్ణమూర్తి.
తిరిగి భాగీరధీ సమానురాలైన ఎదురింటి బామ్మగారు కృష్ణమూర్తి ఇంటికే ఎదురు రాసాగింది.
ఆమె గుండుమీద సూర్యుడు ప్రతిబింబం చూసుకొంటున్నాడు. అక్కడ అతని కిరణాలు విష్ణుమూర్తి ఆత్మ చక్రంలా ఆమె తలచుట్టూ మెరిసిపోతున్నాయి.
బామ్మగార్ని చూసి వెంకటకృష్ణమూర్తి హతాశుడై పోయాడు. తిరిగి లోపలకు వచ్చాడు రుసరుసలాడుకొంటూ.
"ఏరా! వెంకటాయ్! మళ్లా ఏమోచ్చింది ఎదురు?" అని అడిగారు అవధానిగారు.
"విధవ వచ్చింది......?
'ఇక పోకు. నీ ఉద్యోగం ఏ వెధవకో పోయివుంటుంది....'
"బోడి బామ్మరాకుంటే వచ్చేదేమో!"
'ఏమో! అయినా మూడోసారి బయలుదేరు. ....'
'మూడోసారి బయలు దేరితే ఎక్కడన్నా పనిజరగటం చూశావా నాన్నా!' అంది నీలవేణి.
అవధానిగారు మాట్లాడలేదు.
తిరిగి వెంకటకృష్ణమూర్తి కాళ్ళూచేతులు సబ్బు(కొత్తగా వచ్చిన లిరిల్) తో పెట్టి కడుక్కొని - బయలుదేరబోయాడు - కాస్సేపు కూర్చొని లేచి.
'ఉండరా అన్నాయ్ .... నే నెదురొస్తాను....' అనేసి నీలవేణి ఎదురొచ్చింది - వెంకటాయి లేదా వెంకటకృష్ణమూర్తి ఇంటర్వ్యూకు బయలుదేరాడు.
'ముందె నీవు రాకూడదా తల్లీ!' అవధానిగారు అడిగారు.
'వాడికి ఉద్యోగం రాకుంటే, నీ వెదురొచ్చావ్..... రాలేదని నన్నర్రూ!' అంది నీలవేణి.
'మీ అమ్మవస్తె బావుండేది. ....'
'అమ్మనూ అంటారు...... అమ్మ ఎదురొస్తే పనికాలేదని మీరెన్నిసార్లు అమ్మమీద విరుచుకుపడలేదూ?' అని అడిగింది.
కూతురుకు సమాధానం చెప్పలేక పోయారు అవధాని గారు.
ఆ ఇంట్లో 'మడీ, ఆచారం, చాంధస అలవాట్లు చాలా వున్నాయి. ఏపనికోసమన్నా బయలుదేరాలంటే ముందుగా అరగంటనుంచీ శకునాలు - అవీ ఇవీ చూసుకొని గాని బయలుదేరరు ఎవరూ ఆ ఇంట్లో.
అవధానిగారు ఆఫీసుకు పోవాలన్నా, నీలవేణి కాలేజీకి పోవాలన్నా. వెంకటకృష్ణమూర్తి ఇంటర్వ్యూలకు పోవాలన్నా శకునాలే!
శకునాలు మంచివి కావాలి. అప్పుడే బయలుదేరుతారు శకునాలు బాగుండనిచో తిరిగి వెనక్కి వచ్చి కాళ్లు చేతులు కడుక్కొని కాస్సేపు కూర్చుని తిరిగి శకునం చూసుకొని పోతారు. మరీ ఎమర్జెన్సీ వుంటె ఇక పెళ్లాన్నో కూతుర్నో అవధానిగారు ఎదురు రమ్మంటారు తల్లినో కూతుర్నో ఎదురు రమ్మంటాడు వెంకటకృష్ణమూర్తి.
అవధానిగారు ఓల్డు బి. ఏ. చదివారు. వో ఆఫీసులో హెడ్ (తల) గుమాస్తా - ఆయనంటే ఆఫీసంతటికీ గౌరవం. అన్నీ తెలిసిన వ్యక్తి అని గౌరవిస్తారు. దానికి తగ్గట్లు బొట్టూ విభూతి - జంథ్యం అన్నీ అట్టహాసంగా వుంటాయి ఆయనకి. వెంకటకృష్ణమూర్తి ఎమ్. ఏ. ఫిలాసఫీ. అయితే ఇవన్నీ నమ్ముతాడు. ఫిలాసఫీ ఎమ్. ఏ. ఫిలాసఫీ. అయితే ఇవన్నీ నమ్ముతాడు. ఫిలసఫీ ఎమ్. ఎ. తో ఉద్యోగం దొరక్క..... చివరికి ఏ ఉద్యోగానికైనా సరె, అప్లికేషన్లు పెట్టేస్తున్నాడు.
నీలవేణి ఇంటర్ మీడియట్. అందమైన అమ్మాయి. చిన్నఅమ్మాయి - చివరి అమ్మాయి. వొక్కగానొక్క అమ్మాయని ముద్దుగా మురిపెంగా చూసుకొంటారు.
మరో మనిషి కాంతమ్మ. పూర్వకాలం మనిషి - అందరికీ అనువుగా -ఎవరేమన్నా పట్టించుకోని శాంత స్వభావి కాంతమ్మ.
అదీ కుటుంబం.
చిన్న కుటుంబమే! కానీ చింతలున్న కుటుంబం!
వెంకటకృష్ణమూర్తి ఉద్యోగం - నీలవేణికి మంచి సంబంధం - ఆ చింతలు.
2
'ఎట్లా వుందిరా వెంకటాయ్!ఇంటర్వ్యూ?"
"ఇంటర్వ్యూ మోసం నాన్నా! కాండేటు సెలక్టు అయ్యెవున్నాట్ట!"
"ఎస్. టి. నా... ఎస్. సి. నా......"
"రెండూ కావు మేనేజింగ్ డైరెక్టర్ మేనమామ కొడుకట....."
"తెలుసు! అయినా వెళ్లకుండా వుండలేం కదా!"
'పిల్లి ఎదురు వచ్చినప్పుడే అనుకొన్నాను. ఈ ఉద్యోగం రాదని.....'
'దానికి తెలిసే అది ముందొచ్చింది.'
'మళ్ళా నీవు బయలుదేరావు. తిరిగి బామ్మగారు....'అంది నీలవేణి నవ్వి - తండ్రి కొడుకుల సంభాషణ వింటూ చటుక్కున.
'పిల్లికి కోపమొచ్చి - బామ్మగార్ని పంపి వుంటుంది....' అన్నాడు అమాయకంగా వెంకటకృష్ణమూర్తి.
'నువ్వెట్లా పాసయ్యావురా అన్నాయ్ ఎమ్. ఏ....' అంది నీలవేణి తిరిగి నవ్వుతూ.
వెంకటాయ్ మాట్లాడలేదు. మొఖం చిన్నబిచ్చుకున్నాడు.
'సరే ... కానీయండి. ఇంతకీ మనకు ప్రాప్తం లేదు...' అన్నారు అవధానిగారు.
కృష్ణమూర్తి తన రూంలోకి నడిచాడు భారంగా.
నీలవేణి తల్లి దగ్గరకు వెళ్లింది.
అవధానిగారు ఆలోచిస్తున్నారు. "పిల్లలకు దివ్యదృష్టి వుండి వుండాలి. లేకపోతే ఆకార్యం అలా ఎందుకు చెడిపోతుందీ?"
అలా పిల్లులగుఱించీ ఆలోచిస్తూ - బామ్మగార్ని గుఱించి ఆలోచించటం మర్చిపోయారు. బామ్మగారిలోగూడాకార్యం చెడగొట్టటానికి ఏదైనా దివ్యదృష్టి గట్రా వుండాలికదా!
అవధానిగారికి పిలుపువస్తె భోజనానికి పోయారు లోపలికి.
"అమ్మాయికి వెళ్లివారు వస్తున్నారు!" అవధానిగారికేక.
కాంతమ్మగారు ఆదరాబాదరాగా వచ్చి- అన్ని విషయాలూ సేకరించింది భర్తనుండి.
'ఎప్పుడు వస్తారటా?' అడిగింది.
"రేపే....."
