Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 8


    "ఖబడ్దార్...." అంటూ ఖరానా ఫోజు పెట్టింది కోమలాంగి.
     "ఆపదలో వున్నవుగదా అని రక్షిస్తే - నామీదే దాడి చేసేటట్లున్నావే?"
    "నీ ఆట కట్టిందిరా - బ్రూట్ - ఈరోజుతో నీ కార్యకలాపాలు నిల్చిపోతాయ్."
    "ఏమిటి మీరంటున్నది?
    "మీ గాంగ్ నంతటిని రౌండ్ ఆఫ్ చేస్తాం!"
    'ఏమనుకుంటున్నారు మీరు - కాలయాపన చేయకండి - నేను డిటెక్టివ్ కృష్ణను దొంగల నాయకుడ్ని కాదు. యిదిగో నా ఐడెంటిటీ' అంటూ జేబులోంచి ఓప్లాస్టిక్ కవర్ తీసి చూపించాడు.
     'ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? రండి త్వరగా - స్కూటర్ మీద వెళ్లి పోలీస్ స్టేషన్ లో చెప్పేద్దం. ఆ గాంగ్ అక్కడ నుంచి తప్పించుకునే  లోపల అందర్నీ పట్టిద్దాం- కారులో మీ మద్య జరిగిన  సంభాషణ అంతా రికార్డు అయి వుంది. ఆలస్యం అయితే వాళ్లు పారిపోగలరు.'
    'మిస్టర్ కృష్ణా! చాల శ్రమపడ్డారు - అయితే యిది చూడండి' అంటూ మెడలోని లాకెట్టును ఓ యాంగిల్లో చూపించింది.
     ఆ లెటర్స్ చూచి నోరు వెళ్లబెట్టాడు కృష్ణ. దాని మీద.
     'లత - సెంట్రల్ సి. ఐ. డి. ' అని వుంది.
     'అయితే మీరు.....' మాటలు రావటంలేదు కృష్ణకు.
    'అవును. యిక్కడ అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని వయసులో వున్న ఆడవాళ్ళు సాయంత్రం అయితే వీధిల్లోకి రావటానికి భయపడుతున్నారని - వచ్చిన వాళ్ల మాన ప్రాణాలు దక్కవని తెల్సి ....నన్ను స్పెషల్ గా యిక్కడకు పంపారు....'
    'మరి మీ సేఫ్టీ మీకు మాత్రం ప్రాణం... మానం.'
    'నేను భయపడాల్సిన పనిలేదు-  యీ లాకెట్టు నా మెడలో వున్నంతవరకు నాకే దిగులు అఖ్ఖర్లా.... .యీ లెటర్స్ ఓ యాంగిల్లోగాని కనబడవు - అందుకని నేనెవరో ఎవరికీ తెలియదు. యిక యిందులో యిండికేటర్ కమ్ ట్రాన్శ్ మిషన్  సెట్ వుంది. దాని మూలంగా నేను ఎక్కడ వున్నది - ఎవరితో ఏమి మాట్లాడుతున్నది అంతా పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఎప్పటికప్పటికి తెలుస్తుంది. ఆచూకీ తెలిసేటట్లు నేను మాట్లాడుతాను. అందుకని  జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటూనే వుంటారు. మీరు నన్ను వెంబడిస్తున్నట్లు - వాళ్లు నన్ను రింగ్ రోడ్డులోని అప్సర గెస్ట్ హౌస్ కి తీసుకువెళుతున్నట్లు అంతా పోలీసులకు తెలుసు. యీపాటికి మా బలగం గెస్ట్ హౌస్ లోని వాళ్లందర్ని రౌండ్ ఆఫ్ చేసేవుంటారు. యిక బెజవాడకు వైర్ లెస్ పంపి - నువ్వు పంపిన ముగ్గుర్ని - అక్కడవున్న వాళ్ల ఏజంటుతో సహ కస్టడీలోనికి తీసుకోవాలి పద - స్కూటర్ స్టార్ట్ చెయ్.'
    ఇంకా జాగ్రదవస్థలోకి రాలేదు కృష్ణ.
     ఆపదలో  అమ్మాయిని ఆదుకుంటున్నానని సంబరపడ్డ కృష్ణను పెద్ద దెబ్బే తీసింది లత.
     ఆలస్యం భరించలేక లతే స్కూటర్ స్టార్ట్ చేసి 'వెనుక కూర్చోండి - నేను కంట్రోల్ రూమ్ కి వెళ్లాలి. మీ స్కూటర్ అక్కడ తీసుకుందురుగాని....' డిటెక్టివ్ కృష్ణ అచేతనంగా బాక్ సీటుపై కూర్చోవటం తడవుగా కంట్రోల్ రూమ్ కేసి దూసుకు పోయింది స్కూటర్.
                                              *   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS