Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 10


    "వారం... వర్జ్యం...."
    "గోంగోర! అవన్నీ ఆ అబ్బాయికి నచ్చవట.... రేపు అమావాస్య...... అందులో తిధి బాగాలేదు... మరి వాళ్ళు వస్తున్నారు.... ఏం చేస్తాం. పిల్లను చూపాలి... తప్పదు....'
    "సరె, దానిగీత ఎలాగున్నదో ...మనమేం చేస్తాం."
    "నీలవేణి ఇదంతా విన్నది. ఆ అమ్మాయికి ఆ పట్టని అబ్బాయిని చూడాలనిపించింది.
     రేపు రానేవచ్చింది.
     కారులోంచి దిగారు. ఆ అబ్బాయి చాలా అందంగా వున్నాడు. చాలా పొడుగున్నాడు. ... ఆ అబ్బాయి చేతిలో నల్లని బొచ్చుపిల్లి వున్నది.
      పెళ్లికిపోతూ పిల్లిన చంకన పెట్టుకొచ్చినట్లుగా వచ్చాడు.
    అంతా కూర్చున్నారు.
     ఆపిల్లిని చూసినప్పుడల్లా - అవధానిగారి గుండెల్లో కలుక్కు వెంకటకృష్ణమూర్తి గుండెల్లో భయం - కాంతమ్మ  గుండెల్లో రైళ్లు.
     నీలవేణికి ఆపిల్లి ముద్దుగా వున్నది.
     కాఫీ ఫలహారాలయ్యాయి.
     ఆ అబ్బాయిపేరు షాష్ట్రి. పెద్ద చదువులు చదివాడు. ఈమధ్యనే ఫారిన్ వెళ్లొచ్చాడు. ఇక్కడే పెద్ద ఉద్యోగం.... మంచి అమ్మాయిని చేసుకోవాలని షాష్ట్రి ఉద్దేశ్యం!
`     షాష్ట్ర్రి, షాష్ట్రి ఫాదర్, మదర్, పిల్లి (నాల్గొ మెంబర్ గా పిల్లిని సరిపెట్టుకున్నారు షాష్ట్రిఫాదర్) వచ్చాడు పెళ్లిచూపులకు.
     ఇక పిల్లను చూపెట్ట మన్నారు.
     నీలవేణి వచ్చింది వయ్యారంగా. ....
     షాష్ట్రి నీలవేణిని చూశాడు. తన ఫ్రెండ్ పిల్లికీ చూపాడు. షాష్ట్రి ఫాదరు, మదరుగూడా చూశారు.
    "షాష్ట్రిని ఏమన్నా అడుగుతావా?" అని అడిగారు.
    షాష్ట్రి 'యా' అని.... "మీకు పిల్లులంటే ఇష్టమా!' అని అడిగాడు.
     నీలవేణి షాష్ట్రి వైపు చూసి.... 'పిల్లులంటే ఇష్టమే - కానీ ఎదురొస్తె ఇష్టముండదు.' అంది ముద్దుగా.
     'ఏం.....?'
    "పనులు కావట - కార్యాలు చెడిపోతాయట" అంది మెల్లిగా నీలవేణి.
    "నాన్ సెన్సు. ఇది నా పిల్లి. దీన్ని పారిన్ నుంచి తెచ్చాను. దీని పేరు హిమ. ప్రొద్దున్నే లేచి దీనిముఖం చూడందే..... నాకే పనికాదు..." అన్నాడు పిల్లితల నిమురుతూ. అవునన్నట్లు మ్యావ్.... మ్యావ్... మని వూరుకొంది అది.
     "మీరేం చదివారు......"
    'ఇంటర్ మీడియెట్'
    'అందుకే చాదస్తపు భావాలు!'నిర్మొహమాటం లేకుండా అన్నాడు షాష్ట్రి
    దానికి కోపంవచ్చి 'మా అన్నయ్య ఎమ్. ఎ. ' అంది నీలవేణి.
     "వాట్... మిస్టర్ వెంకట్ కృష్ణమూర్త్.... నువ్వూ అంతేనా....." షాష్ట్రి ఆశ్చర్యం ప్రకటచించాడు.
    'ఏవో.... ఆచారాలు...' అంటూ గొణిగేశాడు. వెంకట కృష్ణమూర్తి.
    షాష్ట్రి ఏమనుకున్నారో ఏమో!' యస్. బయలు దేరదామా! ఫాదర్! అన్నాడు. ఫాదర్ మదర్ బయలుదేరారు షాష్ట్రి పిల్లీ లేచారు.
     మిగతావారు వీడ్కోలు చెప్పారు.
     షాష్ట్రి కళ్లతో నీలవేణికి ఏదో చెప్పాడు. ఆభామ నీలవేణికి అర్దం కాలేదు పాపం!
                                       4
    'ఇదెక్కడి సంబంధమండీ!' అంది కాంతమ్మగారు వాళ్లటు పోగానే.
    'పిల్లి సంబంధం!' అన్నాడు వెంకట కృష్ణమూర్తి అక్కసుగా.
     అవదానిగారు మాట్లాడలేదు.
    'మాట్లాడరేం!' అని రెట్టించింది కాంతమ్మగారు.
    "ఏం మాట్లాడను. అబ్బాయి మంచివాడు. పదిహేడు వందలు జీతం. అయితే కాస్త జంతుప్రేమ కలవాడు....."
    'కాస్తేమిటి నాన్నా! పెళ్ళికివస్తూ పిల్లిని తెచ్చుకుంటారా ఎవరన్నా..." అన్నాడు వెంకటకృష్ణమూర్తి.
     "ఏదో అయిపోయింది - అయినా పిల్ల వారికి నచ్చొద్దూ" అని గొణిగారు అవధానిగారు.
     'పిల్ల వారికి నచ్చేదేమిటీ? ముందు చెల్లాయికి నచ్చొద్దూ....!' అని 'నీలూ!' అని చెల్లెల్ని పిలిచాడు వెంకట కృష్ణమూర్తి.
     'దాన్ని అలా అడిగితే చెప్పటానికి అదేమన్నా మొగపిల్లాడనుకొన్నావురా....' అంది కాంతమ్మగారు.
     'సరే, నువ్వు కనుక్కో అమ్మా!' అన్నాడు అతను.
     తర్వాత వారానికి చెప్పింది 'ఇష్టమేనని ' నీలవేణి.
    తర్వాత వారానికి వాళ్లదగ్గర నుండి ఉత్తరం వచ్చింది 'అమ్మాయి నచ్చిందని.'
    అంతా సంతోషించారు. అయితే లెటరులో కొంత భాగం  వాళ్లను బాధపెట్టింది. ఆ భాగం ఇది....
     "పెళ్లికి మంత్రాలూ! చింతకాయలూ వుండరాదు. పెళ్లి రిజిస్ట్రారు ఆఫీసులో - మొదటి ఆశీస్సులు మా బామ్మ నుండి తర్వాత అందరినుండి. పిల్లిముందు రిజిస్ట్రారి టేబిల్ మీద సంతకాలు చేసి - దండలు వేసుకొంటాం. వెంటనే మేం హనిమూన్ కు పోతాం. భోజనాలూ- పందిళ్లూ - భాజాలు - బజంత్రీలూ - గుడ్డలు - చదివింపులు - కట్నాలు - గిట్నాలూ - జాంతానై ఇలా ఇష్టమైతే శనివారం సాయంత్రం ఐదులోగా మీ జవాబు మాకందేటట్లు వ్రాయండి. ఇట్లు షాష్ట్రి.
     "ఇదే విడ్డూరం!' కాంతమ్మగారి ఆశ్చర్యం.
     'ఇరవైయవ  శతాబ్దం' అవధానిగారి ఆలోచన.
     'డేరింగ్ ఫెలోలాగున్నాడే!' వెంకట కృష్ణమూర్తి భావన.
    "భలే మనిషి. చేసుకొంటే ఇటువంటి వాడ్నే చేసుకోవాలి...." నీలవేణి ఆంతర్యం.
     'ఇప్పుడేం చెద్దామండీ!' ఆదుర్దాగా ప్రశ్నించింది కాంతమ్మగారు.
     'ఏముందీ! చేయుటకు.... 'అన్నారు అవదానిగారు.
     'ఏమిటీ!' కాంతమ్మగారు.
    'పెళ్లి!' అవధానిగారు.
    "ఏమ్మా?ఏమంటావ్...." అంటూ కూతురివైపు తిరిగింది.
    నీలవేణి అక్కడనుండి పారిపోయింది.
     "ఏమిటో పిచ్చిపిల్ల! తెగసంబరపడి పోతుంది. దాని భవిష్యత్ ఎలా వ్రాసిపెట్టి వుందో...."
    "మనమేం చేస్తాం కాంతం! అంతా ఆ దేవుడికి వదిలేద్దాం. అబ్బాయి కాస్త క్రొత్తభావాలుగల వ్యక్తి. అతని తల్లిదండ్రులే భరిస్తుంటే... మనం భరించటానికేం!పెద్ద ఉద్యోగం - చదువూ - కలవాడు. సంస్కారమంటావా అదే వస్తుంది. ఇకపోతే కట్నాలు లేవు - భోజనాలు లేవు- పందిళ్లూ లేవూ - మేళాలూ లేవు - గుడ్డలూ లేవు. ఇంతమంచి పెళ్లి కొడుకుని మనం తేగలమటే - ఆ భగవంతుడే పంపించాడు...." అని అన్నారు అవదానిగారు తిరిగి కొడుకును అడిగారు 'ఏరా! అబ్బాయ్! నీ ఉద్దేశ్యం?'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS