కారు నెల్లూరు టౌన్ దాటి శివార్లలో ఆగింది. అందరం కాఫీలు తాగాం. కాఫీ తాగుతుంటే "నీ ఎంగిలి కాఫీ తాగాలనిపిస్తోంది" అన్నాడు ఆనంద్. మా చిన్నాన్న వింటాడోమోనని కళ్ళతోనే ఆయనవేపు చూపించాను.
నిజానికి అంత సరసుడయిన భర్త దొరకడం నా అదృష్టమని మనుసు ఆనందంతో గంతులేస్తోంది.
కారు తిరిగి బయల్దేరింది. దానిలోని చిన్న లైట్ తప్ప చుట్టూ చీకటి. గాలి కొత్త జంటను చూడటానికన్నట్టు లోనికి దూసుకొచ్చేస్తోంది.
"ఈకారులో అనవసరంగా ఒకటుంది" అన్నాడు ఆనంద్.
"మా చిన్నాన్నా?"
"కాదు మధ్యలో వెలుగుతున్న లైట్"
అది లేకుంటే ఏం చేసేవాడో ఊహించుకుంటేనే ఐస్ ముక్కల మధ్య నా గుండెను వుంచినట్లయింది.
లైట్ ను కొంచెం సేపటికి మరిచిపోయినట్లున్నాడు. అతని వేళ్ళు ఎక్కడెక్కడో కదులుతున్నాయి. కానీ అతనికి నా పట్టుచీర తప్ప మరేమీ తగలడం లేదు. అతని అవస్థ చూస్తుంటే నాకు నవ్వొస్తోంది.
కారు మా ఊరిని సమీపిస్తోంది.
"మీ చిన్నాన్నా, డ్రయివర్ మాయమైపోయి, ఈ కారు ఇలానే పోతుంటే ఎంత బావుందో" అన్నాడు.
"కారు ఇలానేపోతే బంగాళాఖాతంలో పడిపోతుంది" అన్నాను నవ్వుతూ.
అంతలో కారు ఆగింది. కల ఏదో చెదిరినట్లనిపించింది.
"అమ్మా నిరుపమా! మీరిద్దరూ వెళ్ళి విఘ్నేశ్వరుడికి మొక్కుకురండి" చిన్నాన్న చెప్పడంతో నేను పరిసరాలను గమనించాను.
మేం విఘ్నేశ్వరుడి గుడి దగ్గరికి వచ్చాం. మా ప్రాంతంలో ఆ గుడి చాలా ఫేమస్. ఎవరు ఏ పని చేయాలన్నా ఆ దేవుడికి మొదట మొక్కాల్సిందే.
చిన్నాన్న కారు దగ్గరే వుండిపోయాడు. నేనూ, ఆనంద్ గుడి దగ్గరికి వెళ్ళాం. మమ్మల్ని చూడగానే పూజారి ఆహ్వానించాడు. హారతి ఇచ్చాడు.
"మూడు ప్రదక్షిణలు చేయండమ్మా"
గుడిముందే లైటు వుండడం వల్ల వెనుక భాగమంతా చీకటిగా వుంది. గుడి అంతా నాకు బాగా పరిచయమైన స్థలం కావడం వల్ల నేనే ముందు నడిచాను.
గుడి వెనక్కి వచ్చాను. మసక చీకటిలో అడుగులేస్తున్నాను. అదిగో అప్పుడు పడింది ఆనంద్ చేయి నా నడుంమీద కోరికనంతా పిడికిలిగా చేసినట్టు అక్కడ గట్టిగా అదిమాడు.
అలానే నిలబడిపోయాను. ఒంట్లోని నరాలన్నీ నడుం దగ్గరే కేంద్రీకృతమైనట్లు జల్లుమంది. అక్కడ మొదలయిన సంచలనం శరీరాన్ని ఊపుతోంది.
అతడు వెనుక నుంచే నామీద వాలి, తన పెదవుల్ని నా పెదవులపై అదిమి పెట్టాడు. యుగాలుగా ఘనీభవించిన విరహం అప్పుడే దృవీకరించడం మొదలుపెట్టినట్లు తడి మొదలైంది.
అతని చేయి అక్కడి నుండి కిందకు దిగుతుంటే అప్పుడు మేల్కొన్నాను. సుతారంగా అతని చేతిని విడిపించుకొని ముందుకు నడిచాను.
ఒక్క ప్రదక్షణతోనే సరిపెట్టేశాను పూజారికి కూడా విషయం అర్ధమైందో ఏమో బలవంతం చేయలేదు.
తిరిగి కారు బయలుదేరింది.
ఇంటికొచ్చేసరికి ఎనిమిదైంది.
బాగా అలసటగా వుందనిపించి గదిలోకి వెళ్లి అలా నడుం వాల్చాను.
భోజనాలు ప్రారంభమయ్యాయి. బంధువుల వేళాకోళాలతో, సంభాషణలతో హడావుడిగా వుంది.
అప్పుడప్పుడు వూర్లోని స్త్రీలు వచ్చి పెళ్ళి కూతురి అలంకరణతో వున్న నన్ను చూసి వెళుతున్నారు.
మా అమ్మ వచ్చి "భోజనానికి లేవవే" అంటే అలసటనంతా పక్కకు నెట్టి లేచాను. నన్ను ఎగాదిగా చూస్తున్న అమ్మ కంగారుగా "వడ్డాణం ఎక్కడే" అని అడిగింది.
నా గుండెల్లో పెద్ద బండరాయి పడ్డట్టు అదిరిపోయాను. ఆందోళనతో నా నడుం వేపు చూసుకున్నాను.
వడ్డాణం లేదు - ఎక్కడో పడిపోయింది.
క్షణంలో ఈ వార్త అంతా పాకిపోయింది.
వడ్డిస్తున్న వాళ్ళు కూడా చేష్టలుడిగి నిలుచుండిపోవడంతో భోజనాలు ఆగిపోయాయి. భోజనం చేస్తున్న వాళ్ళు అంతటితో సరిపెట్టుకుని లేచారు.
ఆకలి, నిద్ర, అలసట అన్నీ ఎగిరిపోయాయి నాకు. అటూ ఇటూ వెదుక్కుంటూ ముందు గదిలోకి వచ్చాను.
శోభనం కోసం దాన్ని ఏర్పాటు చేసినట్లున్నారు.
మల్లెపూల దండలు మంచం నాలుగు వేపుల నుంచీ కిందకు జార్చారు. బెడ్ మీదంతా మల్లెపూలు పరిచారు. అంతా సవ్యంగా జరిగివుంటే మరో గంటకు ఫస్ట్ నైట్ మొదలయ్యేది.
ఇది జరిగిన తర్వాత భోజనాలు తిరిగి ప్రారంభం కాలేదు. ఎవరికయినా ఆకలేస్తేగదా అందరూ అలా డీప్ షాక్ లో పడిపోయారు.
వరదవచ్చి వేళ్ళను పెకలిస్తే పడిపోయిన చెట్టులాగా నేను మంచంమీద పడిపోయాను.
నా కళ్ళల్లో నీళ్ళు.
మా అమ్మ ఏడుపు లకించుకుంది. "అది మనది కాదే - జాగ్రత్తగా వుండమంటే నా మాటను ఖాతరు చేశావా? ఇప్పుడు పెదరాయుడికి ఏం చెప్పమంటావే" అంటూ శోకాలు ప్రారంభించింది.
ఆ వడ్డాణం మాది కాదు - మా వూర్లోని మోతుబరి పెదరాయుడి భార్యది. మొత్తం పాతిక సవర్లు. అంటే దాదాపు ఎనభైవేల రూపాయలు. దాన్ని తిరిగి చేసి ఇచ్చే స్తోమత మాకులేదు. నాకు తెలియకుండానే ఏడుపు తన్నుకొచ్చింది.
క్షణంలో ఈ వార్త ఇల్లంతా పాకిపోయింది. పెళ్ళికళ మాయమై ప్రేతకళ వచ్చేసింది. మా నాన్న అయితే ఏ ఏవిషయం వినగానే స్పృహ తప్పిపడిపోయాడు. వరండాలో పడుకోబెట్టి, గుండెను మర్దనం చేశాకగానీ లేవలేదు.
అంతవరకూ చిన్నపిల్లలా ఆనందంతో గెంతిన మా ఇల్లు ఠక్కున అవిటిధై పోయినట్లు నిశ్శబ్దం పేరుకుపోయింది. ఎవరి ముఖంలోనూ కత్తివెతుకు నెత్తురు చుక్కలేదు.
అంతా బావుంటేనే మనిషి. ఏ మాత్రం గాడితప్పినా మనిషి కుదేలై పోతాడు. జలుబు చేసినా మనం భరించలేం. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం.
మనం తప్ప ప్రపంచమంతా బావున్నట్లు బాధపడిపోతాం. అలాంటిది స్థాయికి మించిన వస్తువు పోగొట్టుకుంటే ఎలా వుంటుందో అలా తయారయింది మా ఇల్లంతా.
అంతవరకూ అంత మంచివాడితో పెళ్ళి అయినందుకు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నాలో కూడా దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. ఈ పెళ్ళి జరక్కుండా వుంటే ఈ విషాదం జరిగి వుండదు కదా. ఈ పెళ్లెందుకు జరిగిందిరా భగవంతుడా అనుకుంటూ ఓ మూల మాసిపోయిన బట్టల మూటలా కూర్చుండిపోయాను. ఈ పెళ్ళి జరగడానికి ప్రధాన కారణమైన మా వదినను తిట్టుకున్నాను. జాణ కాబట్టే అలా పెళ్ళిచూపుల్లో అతనివెంట వెళ్ళమన్న ఐడియా ఇచ్చిందని తిట్టుకున్నాను.
