ఇంతకీ వడ్డాణం ఎక్కడ పోయిందో ఎంత గింజుకున్నా తట్టడంలేదు.
కారులో సత్రం నుంచి బయల్దేరాక నెల్లూరులో ఓ టీ బంక్ దగ్గర ఆగాం. ఆ తర్వాత గుడి దగ్గర దిగాం. ఈ రెండుచోట్లే పడిపోయే అవకాశం ఉంది. ఇది తెలుసుకున్న అన్నయ్య అదే కారులో నెల్లూరు బయల్దేరాడు. నాన్న, మరో నలుగురు లాంతర్లు తీసుకుని కాలినడకన వెళ్ళారు.
అందరం వాళ్ళకోసం చూస్తూ ఏడుస్తున్నాం ఎవరికయినా శోభనం మాట గుర్తు వచ్చుంటే ఒట్టు. పెళ్ళికొడుకును పట్టించుకొనే నాధుడు లేడు. పెళ్ళి పందిట్లో నానా జోక్ లు వేసిన అతను యింత బాధలో ఒక్కసారయినా వచ్చి పలకరించలేదు. దాంతో అతనిమీద నాకు విపరీతమయిన కోపమూ, అసహ్యమూ కలిగాయి.
వడ్డాణం పోయిందని వినగానే నా దగ్గరికి వచ్చి 'పోతే పోయిందిలే డియర్ ఆఫ్ట్రాల్ అదెంత? రేపు సాయంకాలానికి కొత్తది తీసుకొచ్చి రాయుడి ముఖాన కొడదాం' అని అతను అని వుంటే హీరోలా ఫీలయ్యేదాన్నేమో.
మనకు ఎంత వయసొచ్చినా కొన్ని భ్రమలు పోవు. ఆయన కేవలం చిన్న ఉద్యోగి అనీ, ఎనభయ్ వేల రూపాయలను చెల్లించడం అతడికి అసాధ్యమనీ నాకు తట్టలేదు. ఆ విషాదం నుంచి ఎంత తొందరగా బయటపడతామా అన్న ఆత్రుత తప్ప మరొకటి లేదు. క్షణం క్రితం హీరోలా కనిపించిన అతను ఇప్పుడు జీరోలా అనిపించాడు. పరిస్థితుల ప్రభావం అలాంటిది.
బాధతో, టెన్షన్ తో ఎవరికీ నిద్ర రావడం లేదు. అలా గుడ్లప్పగించి చూస్తోంది అమ్మ. వదిన ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారిపోయింది. మా మేనత్త అయితే శవం ముందు కూర్చోని ఏడుస్తున్నట్లు ఏవేవో చెప్పి ఏడుస్తోంది. ఇక నాసంగతి చెప్పనక్కరలేదు. నెల రోజుల నుంచీ లంఖణాలు చేస్తున్నట్లు తీసిపోయాను.
ఒంటిగంటప్పుడు మా అన్నయ్య వచ్చాడు. అందరం ఒక్కసారిగా చుట్టూ మూగాం.
"సత్రమంతా వెదికాను. హోటల్ దగ్గర కూడా చూశాను. ఎక్కడా దొరకలేదు. ఎందుకయినా మంచిదని పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను."
ఆ కబురుతో అందరం మరింత కుంగిపోయాం. ఇక దొరకదన్న నమ్మకం ఏర్పడిపోయింది. ఏం చేయాలో ఎవరికీ తోచడం లేదు.
రెండు దాటుతుండగా నాన్న వచ్చాడు. ఆయన ముఖం చూస్తేనే విషయం అర్ధమయింది.
"గుడి దగ్గర వెదికాం, రోడ్డంతా వెదుక్కుంటూ పోయాం. ఊహూఁ లాభం లేకపోయింది" అని కూలబడిపోయాడు.
అంతమంది ఉన్నా ఎవరూ మాట్లాడుకోవడంలేదు. అప్పుడప్పుడూ ఎవరికీ తోచింది వాళ్ళు చెబుతున్నారు.
ఆ రాత్రంతా జాగారమే అయ్యింది మాకు. అమ్మ ఓ పక్క నేను ఓ పక్కా, మా వదిన మరోపక్కా కూర్చుని మాలో మేమే ఏడ్చుకుంటున్నాం. నిద్ర మధ్యలో ఉలిక్కిపడి లేచినట్లుంది వదిన. అమ్మ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే నామీద నాకే అసహ్యం వేసింది. నా నిర్లక్ష్యం వల్ల యిదంతా జరిగిందన్న గిల్టీ ఫీలింగ్ నన్ను పీక్కుతింటోంది.
నాలుగున్నర ప్రాంతంలో పందిట్లో ఏదో హడావుడి మొదలయింది. అందరం నిస్సత్తువతోనే పైకి లేచాం.
మా మేనత్త పరుగు పరుగున అక్కడినుండి వచ్చి నన్ను వాటేసుకుని "వడ్డాణం దొరికిందే" అంటూ ఊపేసింది.
మంత్రించినట్టు బాధ మాయమై, దాని స్థానంలో ఆనందం పెల్లుబుకుతోంది.
"ఎక్కడ?"
"గుడివెనక వుందట. రాత్రి మీ నాన్న, పూజారి ముందే వెదికారటగానీ వెనక ఎవరూ చూడలేదట. ఇప్పుడు పూజారి లేచి నీళ్ళు తోడడానికి వెనుక వున్న బావి దగ్గరికి వెళుతుంటే కనిపించిందట"
అమ్మా, వదినా చిన్నపిల్లలే అయిపోయారు. ఎక్కడ చేతుల్ని వదులుగా వుంచితే పైకెగిరిపోతుందేమోనన్నట్లు అమ్మ అయితే వడ్డాణాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది.
అక్కడ ఎవరూ లేకుంటే నాన్న సంతోషం పట్టలేక పల్టీలు కొట్టి వుండేవాడు. అన్నయ్య అందరికీ మరోమారు లడ్లు పంచి పెట్టాడు.
అంతవరకు వున్న టెన్షన్, బాధ మంత్రించినట్లు మాయమయ్యాయి.
వడ్డాణం ఎప్పుడు పడిపోయిందో తెలిసింది. గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ అతను నా నడుం మీద చేయి వేసినప్పుడు అది నడుం పులకింతకో ఒంటి జలదరింపుకో ఊడి పడిపోయుంటుంది. ఇదంతా ఆయన మూలంగానే జరిగింది.
అప్పుడొచ్చింది నిద్ర. కనురెప్పల మధ్య అడ్డంగా వున్న స్టిక్స్ ను తొలగించినట్లు వాటంతటవే మూసుకుపోయాయి. మగతగా నిద్రలోకి జారిపోయాను.
ఎవరో నా పెదవుల మీద వేళ్ళ కొసలతో రాస్తున్నట్లనిపించి కళ్ళు విప్పాను. ఎదురుగా నా భర్త ఆనంద్.
"నిద్రా" అని అడిగాడు.
"ఆఁ"
"మన ఫస్ట్ నైట్ ఏ ముచ్చటా తీరకనే ముగిసిపోయింది. యీ రాత్రికైనా..." అంటూ వాలబోయాడు.
నాకు చిర్రెత్తుకొచ్చింది. "ఇదిగో యూ యావవల్లే రాత్రంతా టెన్షన్ తో నరాలు నలిగిపోయాయి. వదలండి - గుడి దగ్గర అంత యావ ప్రదర్శించక గుట్టుగా వుంటుంటే ఈ అనర్ధమే జరగకపోవును అంతా మీ నిర్వాకమే ముందు ఇక్కడినుంచి వెళ్ళండి - మీరు చేయి వేస్తేనే కంపరం పుడుతుంది" అని ఈసడించుకున్నాను.
పాపం మానవుడు ఖంగుతిన్నాడు. ఫస్ట్ నైట్ జరక్కపోగా భార్యచేత అలా తిట్లు తినడంతో చిన్నబుచ్చుకున్నాడు. మౌనంగా వెళ్ళిపోయాడు.
నేను తిరిగి పడుకుండిపోయాను.
ఉదయం ఏడుగంటల వరకు ఎవరూ నిద్ర లేవలేదు. అంత పొద్దెక్కే వరకూ పడుకోవడం మా ఇంట్లో అదే మొదటిసారి. స్నానం చేసి టిఫిన్లు ముగించేసరికి పదయింది.
"అలా నెల్లూరుకు వెళ్లి మ్యాట్నీ చూసి రండి. ఇక్కడ పెళ్ళి కొడుక్కి బోర్ కొడుతూ వుంటుంది" అన్నాడు అన్నయ్య.
దాంతో నేనూ, ఆనంద్ బయల్దేరాం.
తెల్లవారుజామున విసుక్కోవడాన్ని పూర్తిగా మరిచిపోయినట్లు నేను ప్రవర్తించాను.
మొదట్లో ఆయన కొంత విముఖత ప్రదర్శించినప్పటికీ తర్వాత సర్దుకున్నాడు.
హోటల్ లో భోజనం చేసి థియేటర్ కి వెళ్ళాం. చిరంజీవి సినిమా. జనం బాగానే వున్నారు.
