Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 8


    అందుకే ఏమీ ఆలస్యం చేయకుండా అతనివంక చూసి నవ్వాను.
    
    "అంటే నచ్చానన్నమాట" అతను రిలీఫ్ గా ఫీలవడం తెలుస్తూనే వుంది.
    
    మా మాటలకు స్పీడ్ బ్రేకర్ లాగా పంటకాల్వ అడ్డొచ్చింది.
    
    కాల్వదాటుతూ అతను తూలిపడబోయాడు. అనాలోచితంగానే ఠక్కున చేయి అందించాను. నా చేతి ఆసరాతో నిలదొక్కుకున్నాడు. నా చేయి వదలకుండానే కాల్వ దాటాడు.
    
    అప్పుడు నేనేమైపోయానో నాకిప్పటికీ గుర్తే. పూరేకుల మధ్య నా శరీరాన్ని వత్తేసినట్లు పులకింతలాంటిది ఒళ్ళంతా పాకినట్లు నాకిప్పటికీ జ్ఞాపకమే.
    
    తిరిగి నడక సాగించాం.
    
    మా పొలాలకు కంచెలాగా రైల్వే ట్రాక్ వుంది. అక్కడి కెళ్ళి వంతెన కింద నిలబడ్డాం.
    
    "ఇదిగోండి - ఇవే మా పొలాలు" అన్నాను.
    
    ఆయన నానుంచి బలవంతంగా కళ్ళు తిప్పి చూసాడు.
    
    "ఇది వంతెనలా లేదు. మనకోసం దేవతలు వేసిన పందిరిలా వుంది" అన్నాడు.
    
    నేను చిన్నగా నవ్వాను.
    
    "మీ నవ్వు ఎంత బావుందో తెలుసా? పౌర్ణమిరోజున మంచు శిఖరం మీద ఒంటరిగా నిలబడి వున్నప్పుడు ఆకాశంలోని మల్లెపూల వాన కురిస్తే ఎలా వుంటుందో అలా వుంది" అన్నాడు.
    
    సిగ్గుతో ముఖాన్నంతా ఎరుపు చేసుకున్నాను.
    
    అతని చూపులు నన్ను తడుముతున్నట్లే వుంది. నాకు బట్టలు లేని చోట్ల అతని నాలుకతో అద్దుతున్నట్లే వుంది నాకు ఇక అక్కడ వుండడం సాధ్యం కాదనిపించింది. "రండి! వెళదాం" అన్నాను.
    
    ఏవో రెండు మూడు పొడిమాటలతో ఇల్లు చేరుకున్నాం.
    
    అప్పటికి బస్సు టైమైంది.
    
    "ఉండండి శకునం బాగా లేనట్టుంది. నీళ్ళు తీసుకొస్తాను" అని చెప్పి వదిన లోపలి కెళ్ళింది.
    
    అలా అతన్ని ఊరకనే వీధిలో నిలబెట్టడం బాగుండదనిపించి "ఏమైనా మరిచిపోయారేమో చూసుకోండి" అన్నాను.
    
    అతను సీరియస్ గా చొక్కా జేబులు, ప్యాంటు జేబులూ తడుముకుని "అవును చాలా విలువైనది మరిచిపోయాను" అన్నాడు.
    
    నేను కంగారుగా "ఏమిటి?" అని అడిగాను.
    
    "మనసు" అన్నాడు నా ముందుకి జరిగి చిన్నగా.
    
    "అదయితే పెళ్ళిపీటల మీద ఇచ్చేస్తాన్లెండి" అన్నాను.
    
    అంతలో వదిన వచ్చింది. అతను నీళ్ళు తాగి "వెళ్ళొస్తానండి" అని బయల్దేరాడు.
    
    వీధి మలుపు తిరిగేవరకూ అక్కడే వుండి, ఆ తర్వాత లోపలికి వచ్చాం.
    
    "పొలాల వెంబడి షికారు కెళ్ళారు కదా! ఏం మాట్లాడుకున్నారు?" అనడిగింది వదిన.
    
    "ఏవో రెండు మూడు మాటలు"
    
    "మీ ఇద్దరికీ ఏకాంతం కల్పించడానికే అలా పంపించాను. పెళ్ళికి ముందు ఎంతో కొంత పరిచయముంటేనే ఎదుటి వ్యక్తి మీద ఆకర్షణ పుడుతుంది. రెండు నిముషాలు పెళ్ళి చూపుల్లో గుర్తుంచుకోవడానికి, నెమరువేసుకోవడానికి ఏం వుంటుంది? అందుకే పెళ్ళి చూపుల్లో ఇద్దరికీ ఏకాంతం కల్పించాలి, వాళ్ళిద్దరి మధ్యా ఏదో జరిగినప్పుడే ఇద్దరూ పెళ్లెప్పుడా అని ఎదురు చూస్తారు. రెండు నిముషాల పరిచయమే అయినా రెండు జన్మల అనుబంధాలా తోస్తుంది కానీ చాలా ఇళ్ళల్లో యిలాంటివి అనుమతించరు. అందుకే పెళ్ళన్నా అమ్మాయిలో కానీ, అబ్బాయిలో కానీ ఉత్సుకత వుండదు. ఏదో యిది తప్పని తతంగంలా అనిపిస్తోంది.
    
    వయసులో చిన్నదే అయినా బుర్రలో పెద్దదనిపించింది మా వదిన. ఆమె చెప్పింది అక్షరాలా నిజం. మేం అలా షికారు కెళ్ళడం ప్రతిక్షణమూ గుర్తు వచ్చేది.
    
    తల వంచుకుని ఇల్లు ఊడుస్తుంటే నిశ్శబ్దంగా నా వెనకే అతను వచ్చి బొడ్లో దోపుకున్న పైటకొంగును లాగినట్లే వుండేది. ముంగిట్లో ముగ్గులు పెడుతుంటే వెనకే వచ్చి నా కళ్ళను మూసినట్లే తుళ్ళిపడేదాన్ని బావిలోంచి నీళ్ళు తోడుతున్నప్పుడు అతను నా ఎదురుగా నిలబడి నీళ్ళు పోయామని దోసిలి పట్టినట్టే ఊహించేదాన్ని.
    
    రాత్రి చంద్రవంక కింద పడుకున్నప్పుడు అతను నా నడుం మడతల్లో ముత్యాలను కుమ్మరించి చక్కలిగింతలు పెట్టినట్లే భ్రమించేదాన్ని.
    
    కాల్వదాటుతున్నప్పుడు అతను చేయి పట్టుకోవడం గుర్తు వస్తే ఇక ఏ పనీ చేయాలనిపించేది కాదు. రక్తమంతా దేనికోసమో శరీరంలో ప్రదక్షిణలు చేసేది. ఎద అంతా బరువుగా శృంగార ప్రబంధాన్ని అక్కడ ఒత్తుకున్నట్లు అనిపించేది. కళ్ళు మరో లోకంలో తెరుచుకుని ఊహల పట్టుచీరకు కలల జరీ అంచును నేసేవి.
    
    ఇటువంటి రెండు ఉత్తరాలు అటు వెళ్ళడం - అటునుంచి రెండుజాబులు ఇటు రావడంతో పెళ్ళి ఫిక్సయి పోయింది.
    
    నా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
    
    చాలా రోజుల్నుంచే పెళ్ళి హడావుడి మొదలయింది. నెల్లూరులోని ఓ సత్రంలో పెళ్ళి. ఆ రోజు సాయంకాలం నాలుగు గంటలకల్లా మేము నెల్లూరుకు చేరుకున్నాం. సత్రంలోని ఓ గదిలో మకాం. అతన్ని చూడాలన్న బలమైన కోరిక నేను కట్టుకున్న పట్టుచీర కంటే బరువుగా తయారయింది.
    
    కానీ వీలుపడలేదు.
    
    రాత్రి పదిగంటలప్పుడు ఆయన్ని నలుగు పెట్టడానికి పెళ్ళి పందిట్లోకి తీసుకొచ్చారు. అప్పుడే చూశాను. ఏదో ఆత్మీయతా భావం జీవితంలో మొదటిసారిగా ఫీలయ్యాను.
    
    తెల్లవారుజమున మూడుగంటలకి పెళ్ళి. పెళ్ళి పీటలమీద కూర్చున్నప్పుడు మధ్యలో ఆయన "ఏది నా మనసు? పెళ్లి పందిట్లో తిరిగి ఇచ్చేస్తానన్నావ్" అని అడిగాడు.
    
    "ఈ రాత్రికి శోభనం గదిలో తమలపాకు చిలకతో చుట్టి ఇచ్చేస్తాన్లెండి" అన్నాను.
    
    "ఈ పెళ్ళి పందిరి కాస్తా పట్టెమంచం అయిపోయి, ఆహుతులంతా అదృశ్యమైపోతే బావుండు" అన్నాడు.
    
    "ఎవరు మాయమై పోయినా మన పెళ్ళి జరిపిస్తున్న పురోహితుడు మాత్రం అదృశ్యం కాడు. దక్షిణ ఇచ్చేదాకా కదలడు"
    
    ఇలా మేమిద్దరం పెళ్ళి పందిరిలోంచే మాట్లాడడం మొదలుపెట్టాం. మేమిద్దరం కొత్తవాళ్ళం కామన్న ఫీలింగ్ పెళ్ళిచూపుల్లో మామధ్య జరిగిన రెండుమూడు సంఘటనలవల్ల ఆ భావం కలిగిందనుకుంటాను. మా వదినకు మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాను.
    
    మధ్యాహ్నం భోజనాలయ్యాక బంధువులంతా వెళ్ళిపోయారు. నాన్న, అమ్మ, అన్నయ్య, వదినలు మొదటిరాత్రి ఏర్పాట్లు చూడడానికి మావూరు చేరుకున్నారు.
    
    రాత్రి ఏడుగంటల ప్రాంతాన మేము సత్రం నుంచి వూరికి కారులో బయల్దేరాం. నేనూ, ఆనంద్ వెనక సీట్లో కూర్చున్నాం. డ్రయివర్ ప్రక్కన మా చిన్నాన్న కూర్చున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS