అందులో ఏదైనా సెటైర్ వుందేమో అని కర్రా ఓరగా రాణావైపు చూసి, అటువంటిదేమీ కనపడక పోవడంతో, తేలిగ్గా వూపిరి పీల్చుకుని అక్కడనుంచి వెళ్ళాడు.
నాయుడు రాజకీయంగా తనని ఎలాంటి చోట ఇరికించాడో అర్ధమైంది. లంచగొండితనం, నిర్లిప్తత, బద్దకం, భయం ఇక్కడ పునాదులు. నాణేనికి రెండు వైపులున్నట్టే, పోలీసు బలగంలో కూడా రెండు రకాలు. ఒక మంత్రిని చంపటానికి ధైర్యంగా తుపాకులు ఎత్తిన పోలీసులూ వున్నారు. దొంగల్నుంచి వాటాలు పంచుకునే వారూ వున్నారు. తనమీద చాలా బాధ్యత వుంది. నాయుడిని దెబ్బ కొట్టాలంటే ముందు వీరిని చక్కదిద్దాలి.
అతడు మధ్యాహ్నం సమయంలో శర్మ ఇంటికి వెళ్ళి పోర్షను చూసి వచ్చాడు. సాయంత్రం వచ్చి చేరిపోతానన్నాడు. శర్మ వరాహమూర్తికి అన్నయ్య.
సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది.
ఊరికి తూర్పున వున్న ఉపాధ్యాయ కాలనీవాళ్ళు ఓ ఆరుగురు వచ్చారు. కాలనీలో జరిగే దుండగాల గురించి చెప్పుకుపోయారు. మహిళల్ని వేధించటంతో మొదలైంది. శ్రీరామనవమికి జబర్దస్తీగా చందాలు వసూలు చేస్తారు. కాలనీలో ఖాళీస్థలాలుంటే మొన్న జబర్ధస్తీగా ఆక్రమించి కొట్లు పెట్టారు. 'ఇదేమిటి' అని అడిగితే పెద్దవాళ్ళు దిగారు. చివరికి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదే కాలనీ వాళ్ళు బ్రతకాల్సిన స్థితి ఏర్పడింది.
రాణా మొత్తం సావధానంగా విన్నాడు.
"దీని వెనుక ఎవరున్నారు?" అని చివరగా అడిగాడు. పోలీస్ స్టేషన్ లో తమ గొడు ఆ మాత్రం విన్నవాళ్ళు ఎవరూ ఇప్పటివరకూ లేరు. వాళ్ళు మరింత ఉత్సాహంతో "వీరదాసు సార్" అన్నారు. వాళ్ళలో ఒకరు "మా కాలనీమీద కొచ్చేది మస్తాన్ సార్. మా ఇళ్ళలోకి రాత్రుళ్ళు గోడదూకి వస్తారు. డ్రైనేజి ఇనుప కవర్లు, బాల్చీలు, ఇంకా ఏవైనా వస్తువులూ అవీ వుంటే కొట్టుకుపోతారు. ఒక రోజు కాపువేసి కుర్రాడిని పట్టుకున్నాం. గంటలో మస్తానొచ్చి తీసుకెళ్ళిపోయాడు సార్. ఈ కుర్రాళ్ళ బ్యాచీకి వాడు లీడరు. మధ్యాహ్నం పూట ఇల్లు తాళం వేసుకు వెళ్ళాలంటేనే భయంగా వుంది."
"మరి ఇంతకుముందు ఈ విషయం పోలీసు స్టేషన్ కొచ్చి చెప్పలేదా?"
"నాలుగైదుసార్లు వచ్చాం సార్. రిపోర్టు వ్రాసుకుని పొమ్మన్నారు."
"మరి అంతకన్నా ఏం చేస్తాం? ఆ బ్యాచీల వాళ్ళు వారాని కొకసారి మా మామూళ్ళు మా కిస్తున్నారుగా."
అప్పటివరకూ మామూలుగా ఆ సంభాషణ వింటున్న యస్సైతో సహా మిగతా పోలీసులు ఉలిక్కిపడ్డారు.
రాణా తాపీగా అన్నాడు-
"అవునండీ ఒక్కొక్క బ్యాచీకి ఒక్కొక్క లీడరు. ఆ లీడర్లందరికీ వీరదాసు లీడరు. అతడిపైన ఎమ్మెల్యే నాయుడు. మాకు కుక్కకి పడేసినట్లు బిస్కట్లు పడేస్తారు. ఇదిగో ఈ రోజే నా వాటా పన్నెండొందలు నా కిచ్చారు. ఇప్పుడేం చెయ్యను చెప్పండి?"
ఊహించని ఈ పరిణామానికి వాళ్ళు బిత్తరపోయారు. యస్సై నోట్లో తడారిపోయింది. చీమ చిటుక్కుమంటే వినపడేటంత నిశ్శబ్దం.
"మేమిలా దొంగలకీ, గూండాలకీ భయపడుతూ బ్రతకవలసిందేనా?"
"అది నిర్ణయించుకావాల్సింది నేను కాదు, మీరు."
"మరి మీకెందుకు జీతాలివ్వటం?"
"అది అడగాల్సింది నన్ను కాదు, ప్రభుత్వాన్ని."
"మీరు డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు."
రాణా విసురుగా కుర్చీలోంచి లేచాడు. "నేను కాదండీ.... మీరూ.... మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఉపాధ్యాయ కాలనీ అని పేరు పెట్టుకుంటే చాలదు. సమస్యని విశదీకరించి చూడాలి. ఆ రౌడీల్లో వున్న 'కట్టు' మీలో లేదు. ఒక చిన్న కుర్రాడు దొంగతనం చేసి పట్టుబడితే, వాడిని విడిపించటానికి పెద్ద రౌడీ వస్తాడు. వడి వెనుకున్న రాజకీయ నాయకుడు మిమ్మల్ని కంట్రోలు చేస్తాడు. మాకూ వాటాలు పంచుతాడు. లేకపోతే ట్రాన్స్ ఫర్ చేస్తాడు. వెళ్ళండి.....మీరడగాల్సింది మమ్మల్నికాదు. పొలిటికల్ లీడర్ ని! నాయుడిగార్ని నాతో ఒక్కమాట చెప్పమనండి. ఆ వీరదాస్ తో మొదలెట్టి అందరి ఎముకలూ విరగదీస్తాను."
"ఇన్ స్పెక్టర్ కి నేను చెప్పటం దేనికి? నాకేం తెలీదు అంటడాయన"
"మీరు ప్రెస్ కి రిపోర్ట్ చేయండి"
"వాళ్ళేం చేస్తారు?"
"రాజకీయ నాయకుడు భయపడేది కేవలం పత్రికలకే"
"మేం ప్రెస్ కి వెళ్ళామని తెలిస్తే ఆ గూండాలు మా ఇళ్ళమీద కొస్తారు"
"కనీసం మీలో ఆ మాత్రం చైతన్యం వస్తే, మీతోపాటు నేనుంటాను"
"ఎమ్మెల్యే నాయుడు తనకా గొడవతో ఏ సంబంధమూ లేదంటే"
"ఆ ఋజువులు నేను సంపాదించి పెడతాను"
యస్సై కర్రా చేతివేళ్ళు వణుకుతున్నాయి. మిగతా వాళ్ళందరూ అధో లోకంలో వున్నట్టు వింతగా చూస్తున్నారు.
అదే టైంకి మస్తాన్ లోపలికి వచ్చాడు. రాణా వైపు చూస్తూ విశాలంగా నవ్వాడు. "నమస్తే ఇన్ స్పెక్టర్ సాబ్. మీరు నన్ను క్షమించాలి..... సారీ మీరు ఇన్ స్పెక్టర్ అనుకోలేదు." అతడి మాట పూర్తికాలేదు. రాణా లేచి అతడి మెడమీద చెళ్ళున కొట్టి చెయ్యి వెనక్కి విరిచిపట్టుకుని, ఒక్క వూపుతో సెల్ లోకి తోశాడు. కనురెప్పపాటు కాలంలో జరిగిపోయిందది.
నిశ్చేష్టులై చూస్తున్న ఉపాధ్యాయ కాలనీ వాళ్ళవైపు చూసి రాణా అన్నాడు. "చూశారు కదా మీముందే వాడిని కొట్టి లోపల పెట్టాను. మీరందరూ కంప్లెయింట్ ఇస్తే రేపే కోర్టులో హాజరు పరుస్తాను. ఈ లోపులో నాయుడు ఈ విషయంలో కల్పించుకోకుండా మీరు అతని ఇంటిముందు ధర్నాయే చేస్తారో, మీ పలుకుబడి ఉపయోగిస్తారో మీ ఇష్టం. నేను ట్రాన్స్ ఫర్ కాకుండా చూసే బాధ్యత మీది."
"ఇవన్నీ జరిగే పనులేనా?"
"చెప్పాను కదా మీరెన్నుకున్న నాయకుడు మా పన్లకి అడ్డొస్తున్నాడు. మాతో పనులు చేసుకోవాలంటే అతడికి మీరే నచ్చచెప్పుకోవాలి. నా పని నేను పూర్తి చేశాను. మీ కవసరం లేదనుకుంటే, నా కెలాగూ ట్రాన్స్ ఫర్ అవుతుంది. వెళ్ళిపోతాను."
వాళ్ళు చాలాసేపు నిశ్శబ్దంగా వుండి, లేచారు. వాళ్ళలో ఏదో 'కదలిక' కనిపించింది. "సరే సార్ ఇదెలా జరుగుతుందో ఎంతవరకూ వస్తుందో చూద్దాం. మా ఫ్రెండ్ ఒకాయన వున్నాడు. జర్నలిస్టు మేం చందాలు వేసుకునైనా సరే, అసోసియేషన్ స్థాపిస్తాం. ఏదో దొంగతనం జరిగిందంటే వస్తువు పోయిందిలే అని వూరుకోవడమే తప్ప దీని వెనుక ఇన్ని గొడవలు, వాటాలు వుంటాయని మాకు తెలీదు."
రాణా టేబుల్ మీద వున్న డబ్బు ముందుకు తోశాడు. "ఇదిగో నా తరపు చందా పన్నెండొందలు. దీనితో ప్రారంభించండి" ఓరగా యస్సైవైపు చూస్తూ అన్నాడు. యస్సై తన మొహంలో భావాలు పైకి కనపడకుండా వుండడానికి చాలా కష్టపడుతున్నాడు. అయినా కూడా అలజడి తెలుస్తోంది.
వాళ్ళు వెళ్ళిపోయాక, లేచి మస్తాన్ దగ్గిరకు వచ్చాడు. బోనులో పులిలా వున్నాడు మస్తాన్.
"నేను మీ వీరదాసుని కలుసుకోవటానికి వెళ్తున్నాను. నీ తరపున ఏమైనా చెప్పాలా?" అని అడిగాడు.
మస్తాన్ మాట్లాడలేదు. "ఒక గంటలో వస్తాను" అని జనాంతికంగా అని రాణా బయటకు నడిచాడు. అతడి మోటార్ సైకిల్ వెళ్తున్నట్టు శబ్దం వినిపించగానే యస్సై ఫోన్ దగ్గిరకి వడివడిగా వెళ్ళి నెంబరు తిప్పి "నాయుడు గారున్నారా?" అని అడిగాడు.
"ఎమ్మెల్యే నాయుడుగారా?"
"అవును" విసుగ్గా అన్నాడు.
"ఆయన ఇక్కడి కెందుకొస్తారు బాబూ? సరుకు ఆయన దగ్గిరకే మేం పంపిస్తాంగా."
"ఆయనిల్లు కాదా ఇది."
"నెంబరు మారింది. ఇది సీతాలాడ్జి"
యస్సై ఫోన్ విసిరికొట్టి కుర్చీలో కూలబడ్డాడు.
4
రాణా వెంటనే వీరదాసు దగ్గిరకి వెళ్ళలేదు. ఇంటికెళ్ళి స్నానం చేసి సివిల్ దుస్తుల్లో బయల్దేరాదు. రాణా వీరదాస్ 'అడ్డా' చేరుకునే టైమ్ కి బాగా చీకటి పడింది.
ఇంటి ఉందే మెట్లున్నాయి. చెక్కమెట్లు పై అంతస్థుకి చెక్క రెయిలింగ్ వుంది అడ్డా బయట వేపచెట్టు, చుట్టూ చప్టా వున్నాయి.
చెట్టు నీడలో నలుగురు కూర్చుని క్యారంబోర్డు ఆడుతున్నారు. చెక్కమెట్ల కింద స్తంభాలకి ఆనుకుని ఇద్దరు సిగరెట్లు తాగుతున్నారు. ఇంటిముందు రెండు మూడు స్కూటర్లు, సైకిళ్ళు పార్క్ చేయబడి వున్నాయి. వేపచెట్టుకి కాస్త దూరంలో ఆంజనేయస్వామి విగ్రహం వున్న చిన్న గుడి వుంది. దాని వెనుకే వ్యాయామశాల వుంది.
దూరంనుంచి ఒక పసిపాప ఏడుపు ఆగకుండా వినిపిస్తోంది. రాణా మోటార్ సైకిల్ ఆపుచేసి రెండడుగులు వేసేసరికి మెట్లకింద కూర్చున్న ఇద్దరూ అతడి దగ్గరికి వచ్చారు.
"ఎవరు కావాలి?"
"వీరదాస్"
"నువ్వెవడివి?" కాస్త హేళనగా అడిగారు.
"రాణా....ఇన్ స్పెక్టర్ రాణా."
ఇద్దరూ చప్పున అటెన్షన్ లోకి వచ్చారు. "నమస్తే సాబ్" అన్నాడు. ఇద్దరిలోకి పెద్దగా వున్నవాడు- "వెళ్ళి చెప్పి రారా" అని పక్కవాడిని గద్దించాడు.
వాడు మేడమీదకు పరుగెత్తాడు.
"నీ పేరు?" రాణా ప్రశ్నించాడు.
"సింహం"
"పూర్తి పేరు చెప్పు" అధికారయుక్తంగా అడిగాడు.
"గజ్జెల నరసింహం సాబ్"
ఈ లోపులో పైకి వెళ్ళినవాడు పరుగెత్తుకువచ్చి "రమ్మంటున్నారు సాబ్" అన్నాడు. రాణా మెట్లెక్కి లోపలికి వెళ్ళాడు. ముందుగదిలో ఒక మూల ఆరేడుగురు గుండ్రంగా కూర్చుని పేకాడుతున్నారు. అక్కడంతా గొడవగా వుంది. 'ఇస్పేట్ రాజు' అంటున్నాడెవడో "అరగంటనుంచీ కార్డ్ షో గురూ" అంటున్నాడు మరొకడు. రాణా ముందుకి నడిచాడు. రెండో గదికి మాసిపోయిన కర్టెను వేలాడుతూ వుంది. గోడలు నల్లగా, దుమ్ముపట్టి వున్నాయి. పెయింటింగ్ వెలిసిపోయి వుంది. లోపల గదిలో టేబుల్ ఎదురుగా-
వీరదాస్ కూర్చుని వున్నాడు.
లాల్చీ, గళ్ళపంచె, అంగుళంకన్నా పెరగని జుట్టు, చెంపల నించి క్రిందకి పాకిన పలుచటి గెడ్డం....
రాణా అతని వైపే చూస్తున్నాడు.
వీరదాస్ రాణావైపు చూడడంలేదు. తన పనిలో నిమగ్నమై వున్నాడు. పనంటే పెద్ద పనికాదు. పేక ముక్కలతో ఒక్కడే పేషెన్స్ ఆడుకుంటున్నాడు. పక్కన ఇంకో మనిషి వున్నాడు గానీ మొహం అటు తిరిగి, పడిపోయి వున్నాడు. గ్లాసు మాత్రం టేబిల్ మీదే వుంది. వీరదాస్ మధ్య మధ్యలో గ్లాస్ సిప్ చేస్తూ పేకముక్కలు తిప్పుతున్నాడు. పది క్షణాలు గడిచాక తలెత్తి రాణాని చూసి "హల్లో, ఇన్ స్పెక్టర్ సాబ్ రండి" అన్నాడు నవ్వుతూ- కుర్చీలోంచి లేవకుండానే.
