తను లోపలికి వస్తున్నాడని అతడికి తెలుసు. ముందే అతనికి ఆ విషయం మనిషొచ్చి చెప్పాడు. అయినా తను రాగానే అతడు చూడలేదు. ఏదో పనిలో వున్నట్టు నిర్లక్ష్యమైన ఏకాగ్రతతో తన ఉనికిని గమనించడం ఆలాస్యం చేశాడు. ఇలాటి చిన్న విషయాలే అవతలివ్యక్తి మనస్తత్వం మీద గొప్పగా ఆడుకుంటాయి. 'నువ్వు నా కన్నా తక్కువలో వున్నావు' అని అన్యాపదేశంగా చెప్పడం అది!
"నేనే వచ్చి మిమ్మల్ని కలుసుకుందామనుకున్నాను సాబ్. అనవసరంగా మీరే శ్రమ తీసుకున్నారు."
"శ్రమ ఏం వుంది? ఇది మా డ్యూటీ కదా. ఛార్జీ తీసుకోగానే ఆ వూరి ప్రముఖుల్ని కలుసుకోవడం-" అంటూ కుర్చీలో కూర్చుంటూ టేబిల్ మీద వున్న విస్కీ గ్లాస్ ని కొద్దిగా తోశాడు. అది దొర్లి వీరదాస్ మీద ద్రవించి, క్రిందపడి బ్రద్దలైంది.
"అరెరె, సారీ వీరదాసు" తుడవబోయాడు.
"ఫర్వాలేదు" వీరదాసు లుంగీమీద పడిన విస్కీని తుడుచుకుంటూ అన్నాడు. అతడి కృత్రిమమైన రిజర్వ్ డ్ నెస్ పోయింది. రాణాకి కావాల్సింది అదే.
"చెప్పండి సార్ ఏం తీసుకుంటారు? విస్కీ, బీర్, ఇంపోర్టెడ్ కూడా వుంది."
"థాంక్యూ డ్యూటీలో వుండగా తాగను."
"అదేమిటి సార్- మొదటిసారి ఈ బీదవాడి అడ్డా కొచ్చారు. ఏవీ తాగరా?"
"బ్లడీ మేరీ వుంటే తెప్పించు".
"బ్లడీ మేరీ -హ్హహ్హ -లేద్సార్- ఉట్టి మేరీ కావాలంటే తెప్పిస్తాను!"
"సారీ డ్యూటీలో వుండగా వ్యభిచారం చెయ్యను" నిజాయితీగా చెప్పాడు రాణా.అందులో ఏదైనా వ్యంగ్యం వుందేమో అన్నట్టు చూశాడు. అటువంటిదేమీ కనపడలేదు. దాంతో తిరిగి నవ్వేడు.
"యస్. పురం పోలీస్ స్టేషన్ కి ఏ ఇన్ స్పెక్టరొచ్చినా వచ్చి కలవడం న కలవాటు సార్! ఫ్రెండ్ షిప్....! ఫ్రెండ్ షిప్ కి నేను ప్రాణం ఇస్తాను. మీరేమో వచ్చీ రాగానే మా మనిషి మస్తాన్ ని బొక్కలో తోశారు. ఆహా డ్యూటీ.... డ్యూటీ చెయ్యాల్సార్. మీరు కరెక్టుగా చేశారు. రాగానే అసలు మనం ఏమిటో చూపించాలి కదా" అతని కంఠంలో మార్పు వచ్చింది. "....మీ గురించి చాలా విన్నాను సార్. నాయుడుగారు చెప్పారు."
"ఏం చెప్పాడు. ఆయన్ని కూడా బొక్కలో తోశానని చెప్పాడా?"
అతఃడు కన్నార్పకుండా చూశాడు. రాణా కూడా సూటిగా చూశాడు. అతడు నవ్వేడు "ఏం తీసుకుంటారు సార్? లెమన్ సోడా అయినా కనీసం తీసుకోండి."
"థాంక్స్ మళ్ళీ కలుద్దాం" వెనుతిరుగుతూ అన్నాడు.
"మళ్ళీ కలుద్దామా? అమ్మో! పోలీసుల్తో 'మళ్ళీ కలుద్దాం' అంటే డేంజర్."
రాణా ఆగాడు "ఎవరికి? నీకా- పోలీసులకా?"
"మాకే సాబ్"
"అలా కలవకుండా వుండాలంటే మీ వాళ్ళని ఉపాధ్యాయ కాలనీవైపు తిరగొద్దని చెప్పు"
వీరదాస్ చప్పున కళ్ళెత్తి చూశాడు. రాణా అన్నాడు- "అలా తిరిగితె ఏమవుతుందో రేపు మస్తాన్ బయటకొచ్చాక అడుగు"
"అంటే-" అన్నట్టుగా చూశాడు వీరదాస్.
"సంఘంలో మర్యాదగా బ్రతికేవాళ్ళ జోలికి వెళ్ళకుండా వుండే పాఠాలు ఒకటి - రెండు ఈ రాత్రి మస్తాన్ కి చెపుతాను."
వీరదాస్ వెంటనే మాట్లాడలేదు. క్షణం ఆగి, నెమ్మదిగా, తాపీగా అన్నాడు- "మస్తాన్ అయిదు నిముషాల క్రితమే మీ సెల్ నుంచి బయటి కొచ్చాడు సాబ్."
చల్లటి నీళ్ళు మొహం మీద కొట్టినట్టయింది రాణాకి. వీరదాస్, అతడిని ఆ ఇబ్బందికరమైన స్థితినుంచి తప్పించడానికా అన్నట్టు- "మనమంతా ఒకటేసాబ్. ఒకరికొకరు సాయం చేసుకాకపోతే పనులెలా జరుగుతాయి? మొదటిసారొచ్చారు. ఈ బీద అడ్డాలో టీ కూడా తాగకుండా వెళ్తున్నారు. ఏదైనా అవసరంవస్తే చెప్పండి సాబ్. మన దగ్గర చాకుల్లాంటి కుర్రాళ్ళున్నారు. నన్ను రమ్మంటే నేనే వస్తాను. స్నేహమంటే ప్రాణమిస్తాను సాబ్ నేను." అతడి మాటలు మధ్యలో కట్ చేస్తూ "మస్తాన్ ని వదిలెయ్యమని ఎవరు చెప్పారు?" కటువుగా ప్రశ్నించాడు రాణా.
"డి. యస్పీ సాబ్. మనకి పెర్సనల్ ఫ్రెండ్"
రాణా కోపాన్ని అతికష్టం మీద అణుచుకుని "ఆయనతో నేను మాట్లాడతాను" అన్నాడు.
"ఆయనిప్పుడు మాట్లాడే పొజిషన్ లో లేరు సార్"
"నీకెలా తెలుసు?" అనుమానంగా అడిగాడు.
"చూస్తే తెలియడం లేదా సాబ్"
రాణా వీరదాస్ చూపిన వైపు తల తిప్పాడు. మత్తు కాస్త తక్కువై మరో గ్లాసుకోసం ఇటు తిరుగుతున్నాడు-
ఆ ఏరియా డిప్యూటీ సూపర్నింటెండెంట్ ఆఫ్ పోలీస్!
5
రాణాకి ఆ ఇల్లూ, ఇంట్లోవారూ బాగా నచ్చారు. కానిస్టేబుల్ శర్మకి ఒక కూతురు, ఒక కొడుకు భార్య చాలా నెమ్మదస్తురాలు. కొడుకు టెన్త్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు ఇంటర్మీడియెట్ పరీక్షలు వ్రాశాడు. అతని పేరు శ్రీనివాస్. చాలా నెమ్మదస్తుడు. చూడగానే రాణాకి ఆ కుర్రవాడు బాగా అనిపించాడు. తన స్టూడెంట్ లైఫ్ లో తనెప్పుడూ అంత బ్రిలియెంట్ గా, నెమ్మదిగా లేడు.
మొట్టమొదటిసారి తన పోర్షన్ లో ప్రవేశిస్తూ రాణా చాలా ఆశ్చర్యపోయాడు. గది మధ్యలో ముగ్గేసి వుంది. చూరునుంచి క్రిందికి గుమ్మడికాయ వ్రేలాడగట్టబడి వుంది. కిటికీ గట్టుమీద ఆరు నిమ్మకాయలున్నాయి. గోడకి పన్నెండు- వివిధ దేవుళ్ళ ఫోటోలు వున్నాయి.
"ఏమిటిది? నాకు ముందు ఈ పోర్షన్ లో ఎవరైనా క్షుద్ర దేవతో పాసకుడు వుండేవాడా?" విస్మయంగా అడిగాడు రాణా.
"మా అక్కయ్యకి భక్తి ఎక్కువ. శనిని పారద్రోలడానికి ఇలా పెట్టాలని మొన్న సిద్దాంతిగారు చెప్పారట" అన్నాడు శ్రీనివాస్.
"మీ అక్కయ్యగారికి ఎంతమంది పిల్లలు?"
"పిల్లలా భలే తనకింకా పెళ్ళే కాలేదు."
"ఇంట్లో కనబడటం లేదేం?"
"దేవీ నవరాత్రులు కదా. హరికథా కాలక్షేపానికి వెళ్ళి వుంటుంది."
"మీ అక్కయ్య పేరు?"
"అలక్ నంద"
అతడికిదంతా విచిత్రంగా కనిపించింది. కానీ ఎక్కువ ప్రశ్నలు వేయలేదు.
అతడి పోర్షన్ కి బయట్నుంచి విడిగా దారి వుంది. పెరడు, బాత్ రూమ్ మాత్రం కామన్.
అతడు తన కొద్ది సామానూ సర్దుకుని తిరిగి బయటపడ్డాడు.
ఇరవై కిలోమీటర్ల దూరంలో వుంది పట్నం అక్కడి ఇన్ స్పెక్టర్ ని కలుసుకున్నాడు.
"భరత్ అనే జర్నలిస్ట్ ని లాకప్ లో పెట్టారు కదా. అతడి కోసం వచ్చాను." "మీ పోలీస్ స్టేషన్ వారే కదా, అతడు ఎక్కడున్నదీ ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వుంచమని మా అడగ్గర దాచారు."
"అవును ఇప్పుడు నేను డ్యూటీ తీసుకున్నాను కదా నేను తీసుకు వెళ్తాను."
"జాగ్రత్త అతను రాడికల్ అట. చాలా అపాయకరమైన మనిషి అని యస్సై సుధాకర్ చెప్పాడు."
భరత్ ని తీఉస్కుని అతడు తిరిగి తన వూరు బయల్దేరాడు.
"ఎవరు మీరు?" భరత్ అడిగాడు.
"పోలీసు డిపార్ట్ మెంట్ మనిషిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న వాణ్ణి. నా పేరు రాణా.... ఇన్ స్పెక్టర్ రాణా" అంటూ ట్రెయిన్ లో అతడి భార్య, కూతురు కనపడిన సంగతి చెప్పాడు. అంతా చెప్పి-
"ఇప్పుడు చెప్పండి. మిమ్మల్ని మా వాళ్ళెందుకు అరెస్ట్ చేశారు?" అని అడిగాడు.
"నాకు తెలీదు" అన్నాడు భరత్ నవ్వుతూ "నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ని రకరకాల వ్యాసాల కోసం పరిశోధన చేస్తూ వుంటాను. అది ఎవరికయినా బాధాకరంగా పరిణమించి వుండవచ్చు."
"ప్రస్తుతం మీరు ఏ టాపిక్స్ మీద వ్రాస్తున్నారు?"
"ఫుట్ పాత్ బ్రతుకుల మీద ఒకటి వ్రాస్తున్నాను. 'దేవుడి సంపద" అని ఒక ఆర్టికల్ వ్రాస్తున్నాను."
"దేవుడి సంపద ఏమిటి?"
"మన వూళ్ళో వున్నా భావనారాయణ గుడిలో విగ్రహానికి వున్న ఆభరణాల సంగతి తెలుసు కదా. దాదాపు యాభై లక్షల విలువచేసే ఆభరణాలు అవి. పురాతన కాలం నుంచీ వస్తున్నాయవి. వాటి చరిత్ర, ఖరీదు మొదలైన వివరాలన్నీ సేకరించి వ్యాసం వ్రాయాలని నా ఉద్దేశ్యం."
"అది ఎవరికీ హాని చేయదే?"
"రెండోది ఫుట్ పాత్ బ్రతుకుల గురించి"
"అదికూడా ఎవరికీ హాని చేయదు!"
"అలా అనకండి. దీనిలో చిత్రమైన మెలిక వుంది. అర్ధరాత్రి వరకూ హోటల్లో టీ కప్పులు కడిగి, రాత్రి చలిలో, వానలో ఫుట్ పాత్ ల మీద పడుకునే కుర్రాళ్ళ జీవితాలు అవి."
"అయితే?"
"కొద్దిగా మంచి జీవితాన్ని రుచి చూపించి, సౌకర్యాలు కల్పించామంటే వాళ్ళు మనం ఏం చెప్తే ఆహ్ది చేసే అల్సేషన్ డాగ్స్ లా తయారవుతారు. ఆటంబాంబ్ కన్నా హైడ్రోజన్ బాంబ్ కన్నా భయంకరమైన మారణాయుధం 'మనిషి' గురి తప్పకుండా పని చేసుకొచ్చే అణ్వాస్త్రం అతడు".
రాణా అర్ధంకానట్టు చూశాడు.
"ఫుట్ పాత్ ల మీద బ్రతికేవాళ్ళకు జీవితం నిస్సారంగా కనిపిస్తుంది. భవిష్యత్తు తెలీదు. అంతా ఫ్రస్టేషనే అలాటి కుర్రాళ్ళని పట్టుకుని జాగ్రత్తగా దువ్వి వాళ్ళకి ట్రైనింగ్ యిస్తే...."
భరత్ ఆగి అన్నాడు-
"మంచి గూండాలుగా తయారవుతారు. సామాన్యుల్ని భయపెట్టడంలో వుండే ఆనందం ఏమిటో కాస్త రుచి చూపిస్తే చాలు. ఆ థ్రిల్ లో వుండే ఆనందం మరెందులోనూ లేదు. బాల్యంలో తాము అనుభవించిన నరకం వాళ్ళని రాక్షసుల్ని చేస్తుంది. అంతేకాదు, ఆ నరకం నుంచి తమని తప్పించిన ఆ యజమాని పట్ల వాళ్ళు కృతజ్ఞులై వుంటారు. అతడికోసం వాళ్ళు ఏ పని చేయటానికైనా సిద్దంగా తయారవుతారు. దానికి ప్రతిఫలంగా ఆ యజమాని కూడా వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెపుతాడు."
రాణాకి- తను ఇంతకుముందు పనిచేసిన పోలీస్ స్టేషన్ దగ్గిర టీ లందించే 'రాజాచంద్ర' గుర్తొచ్చాడు. అకస్మాత్తుగా వాడు మాయమయ్యాడు. ఎవరూ వాడి అదృశ్యం గురించి పట్టించుకోలేదు. సాధారణంగా పట్టించుకోవలసిన అవసరం లేదుకూడా.
భరత్ అన్నాడు- "ఈ కుర్రాళ్ళందరూ ఏమవుతున్నారు? ఎవరో తెలివైన కాపిటలిస్టు తన పెట్టుబడిగా వీళ్ళని చేరదీస్తున్నాడన్నది నిర్వివాదాంశం. అతడెవరో తెలుసుకుందామని నేను కాస్త ప్రయత్నించాను. ఈ లోపులో పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు."
