Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 8

  

      "హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మానందాన్ని! సాయంత్రం అటొస్తా ఓ వంద తీసుంచు. నువ్వు లేకపోతే మీ నాన్నని కలుసుకుంట" అని ఫోన్ పెట్టేసి బిగ్గరగా నవ్వి శర్మతో, "గురూగారూ బ్రహ్మాండమైన లాటరీ పట్టేసేనండీ" అన్నాడు.    
    "ఏమిటి బాబూ అది?"    
    "మన స్టేషన్ నెంబరు మారి, సీతా లాడ్జిది మనకొచ్చింది. ఇక చూస్కోండి. ఈ వూళ్ళో ఒక్కొక్క నా కొడుకు జాతకమూ బైటపడిపోద్ది. సాయంత్రమయ్యేసరికి మనకీ అయిదారొందలు మిగులుద్ది" అంటూండగా ఫోన్ మ్రోగింది. ఎత్తి "సీతా లాడ్జి సార్" అన్నాడు.

    "రాంబాయమ్మ వుందా?"    
    "లేద్సార్ ఇంకా యంగ్ సరుకుంది."    
    "ఓల్డ్ ఈజ్ గోల్డ్ మన టేస్టు సంగతి తెలుసుండీ అలా అడుగుతావేంటి"    
    "ఎవరండీ అబ్బాయిగారూ మాట్లాడేది?"    
    "నేనే సుబ్బారావ్ ని"    
    "ఏ సుబ్బారావండీ?"    
    "కానిస్టేబుల్ బ్రహ్మానందం కొడుకుని".    
    చిన్న చప్పుడవటంతో, రైఫిల్ తుడుస్తూన్న శర్మ తల తిప్పి చూశాడు. బ్రహ్మానందం ఫోన్ పక్కనే ఒరిగిపోయి వున్నాడు. "ఏవైంది బ్రహ్మానందం?" శర్మ అడిగాడు.    
    "ఆ నాకొడుకు, నా కొడుకేనండీ" నూతిలోంచి వచ్చినట్టుంది బ్రహ్మానందం స్వరం. అంతలో అడుగుల చప్పుడు వినబడింది. యస్సై కర్రా లోపలికి వచ్చాడు. అతడి అసలు పేరు సుధాకర్. అతడు లాఠీ నిరంతరం నిందితుల వీపు మీదనాట్యం చేస్తూనే వుంటుంది. అందుకని అందరూ అతడికి పెట్టిన పేరు కర్రా.    
    కర్రా వచ్చిన ఐదు నిముషాలకి ముగ్గురు బ్యాచి లీడర్లూ వచ్చారు. ఆ వూళ్ళో ప్రముఖంగా మూడు బ్యాచీలున్నాయి. సోడా బ్యాచి, చైను బ్యాచి, బ్లేడు బ్యాచి. ఎవరికి వాళ్ళు వారానికొకసారి పోలీసు మామూలు స్టేషన్ కే తెచ్చి ఇస్తారు. ఈ మూడు బ్యాచీలను వీరదాస్ 'కంట్రోలు' చేస్తాడు.    
    వీరదాసు కేవలం లోకల్ లీడరే కాదు. ఆ జిల్లాలోనే ప్రముఖుడు ఎమ్మెల్యే నాయుడికి అతడు కుడిభుజం. వీరదాసులో నాయుడికి నచ్చినదేమిటంటే, అతడికి రాజకీయ కాంక్షలేదు. తన కుడిభుజానికి తన రంగంలో ఇంటరెస్ట్ లేకపోవటం కన్నా కావల్సింది ఏముంది? అందువల్లే నాయుడు- వీరదాసుల 'రిలేషన్స్' చాలా కాలం నుంచి నిరాటంకంగా జరిగిపోతున్నాయి.    
    యస్. పురం పోలీస్ స్టేషన్ కి 'బంగారు స్టేషన్' అని ముద్దు పేరు. అక్కన్నుంచి బయల్దేరిన దొంగలు రాష్ట్రంలోనే కాక పొరుగు రాష్ట్రాలయిన కర్ణాటక- తమిళనాడులలో కూడా దొంగతనాలు చేసి వస్తూ వుంటారు. బంగారం దొంగిలించగానే ముక్కలు చేసి, ఆకారం ముందు మర్చేస్తారు. చివరి ముక్క పోలీసులకి సమర్పించుకుంటారు. అందుకే దాన్ని బంగారు స్టేషన్ అంటారు.    
    యస్. పురం పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ ఫర్ కావాలని పోలీసులు ఉవ్విళ్ళూరుతూ వుంటారు. అదొక జాక్ పాట స్టేషన్. అయితే కొందరు నిజాయితీ ఆఫీసర్లు అక్కడకు బదిలీ అయివచ్చినా వాళ్ళు ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. అక్కడ కొనసాగాలంటే వీరదాస్ తో 'మంచి సంధి' ఏర్పరచుకోవాల్సిందే. లేకపోతే నాయుడికున్న రాజకీయ పలుకుబడి వారిని బంతిని తన్నినట్టు తంతుంది.    
    యస్. పురానికి పదిమైళ్ళ దూరంలో ఒక పట్నం వుంది. అక్కడ నలుగురు గోల్డ్ బ్రోకర్లున్నారు. వాళ్ళలో రామాచారి ప్రథముడు. దొంగ బంగారాన్ని సగం ధరకి కొని, కరిగించి, అమ్మేస్తూ వుంటాడు. తమకు బంగారం అమ్మిన దొంగల ఆచూకీ చెప్పకపోవటం, బంగారం రవాణా లాంటి బాధ్యతలన్నీ ఈ బ్రోకర్లవే. అప్పుడప్పుడు ఈ దొంగలు 'ప్రముఖుల' ఇళ్ళల్లో చోరీచేసి సరుకు తీసుకువస్తూ వుంటారు. అప్పుడు పోలీసులమీద వత్తిడి ఎక్కువ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఈ బ్రోకర్లమీద రైడ్ చేసి, సంప్రదింపులు కొనసాగిస్తారు. పోయిన ఆభరణాలు దొరికితే సరే-లేకపోతే అంతే విలువగల మరో ఆభరణాలు ఇచ్చుకోవలసి వుంటుంది. ఇంత రిస్కు వుంది కాబట్టే దొంగ బంగారం ధరలో సగం విలువ మాత్రమే దొంగలకి లభిస్తుంది.    
    యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి బయటకు వచ్చిన వాళ్ళకీ, దారుణమైన నేరాలు చేసి సమాజంలో స్థానం కోల్పోయిన వాళ్ళకీ ఆ వూళ్ళో  ప్రభుత్వం శాశ్వతమైన నెలవు కల్పించింది. భూములిచ్చి పోషణ కల్పించింది. వీళ్ళని 'సెటిల్ మెంట్ గ్యాంగ్' అంటారు. వీళ్ళు పోలీస్ స్టేషన్ కొచ్చి రిజిష్టర్ లో సంతకం పెట్టాలి. తాము వూరొదిలి వెళ్ళడం లేదని నిరూపించుకోవాలి.    
    ఎక్కడైనా ఏదైనా పెద్ద దొంగతనం జరిగినా, బస్సు దోపిడీ జైర్గినా పోలీసుల దృష్టి ఈ సెటిల్ మెంట్ గ్యాంగ్ మీద పడుతుంది. అయితే వాళ్ళని, ఆ ప్రదేశంలో ఎదుర్కోవటం కష్టం. కారం కళ్ళలో కొట్టి బరిసెల్తో ఎదుర్కొంటారు.    
    ఈ సెటిల్ మెంట్ గ్యాంగ్ లు పౌర్ణమి రోజుల్లో 'జల్సా' చేసుకుని అమావాస్య రోజుల్లో పనికి బయల్దేరతాయి. మంచి లాభసాటి అవకాశం దొరికిందంటే పోటేలుని కోసి విందు చేసుకుంటారు. సారా ధారగా ప్రవహిస్తుంది.    
    ఈ సెటిల్ మెంట్ గ్యాంగ్ లో కొందరు నిజాయితీపరులు లేకపోలేదు. ఎప్పుడో చేసిన నేరానికి శిక్ష అనుభవించి, ప్రభుత్వం ఇచ్చే సంస్కరణలని ఉపయోగించుకుని, పొలాన్ని దున్నుకుంటూ మంచి మార్గంలో జీవిద్దామనుకునేవాళ్ళు వీళ్ళు.    
    వీళ్ళ జీవితాలు దుర్భరం.    
    బ్లేడ్ బ్యాచ్, సోడా బ్యాచ్ లు చేసే దురాగతాలకు, వీరదాస్ అక్రమాలకు, సెటిల్ మెంట్ గ్యాంగ్ లో మిగతావాళ్ళు చేసే దొంగతనాలకూ వీళ్ళే జవాబుదారి అవుతారు. పోలీసులు నిజ నిర్ధారణ కోసం వీళ్ళని చితకబాదుతూ వుంటారు.    
    అలాంటి ఒక జీవచ్చవం చరిత్రే ఈ కథాంశం.    
                                             *    *    *    
    మళ్ళీ ఫోన్ మ్రోగింది.    
    ఆ సమయానికి యస్సై కర్రా రెండు బ్యాచీల వాళ్ళ దగ్గరా కమిషన్ లు లెక్క చూస్తున్నాడు. "అరేయ్ బాలకిషన్. ఆ ఫోను చూడు" అన్నాడు.    
    బహ్మానందం (బ్రహ్మానందం బాలకిషన్ అతని పూర్తిపేరు) విశాలంగా నవ్వి, "సీతా లాడ్జినెంబర్ మనకొచ్చింది సార్. అనసూయుందా? సావిత్రుందా అని అడుగుతున్నారు" అంటూ రిసీవరెత్తి "ఎవరు కావాలి? రత్తాలా- రాంబాయమ్మా" అని అడిగాడు ధీమాగా.    
    "నేను డియస్పీని మాట్లాడుతున్నాను. ఎవరు? నువ్వేనా బాలకిషన్?"    
    బ్రహ్మానందం బాలకిషన్ ముందుకు తూలిపడబోయి తమాయించుకుని "సార్- అవును సార్" అన్నాడు. ఆ డియస్పీ ఎప్పుడూ ఈ బంగారు స్టేషన్ చుట్టూ తిరుగుతూ వుంటాడు. కాబట్టి పోలీసుల పేర్లన్నీ బాగా తెలుసు. అతడి తొందర అతడిది. అందుకే అరగంట కొకసారి "ఇన్ స్పెక్టర్ గారొచ్చారా?" అని అడుగుతున్నాడు.    
    "ఇంకా రాలేద్సార్".    
    "రాలేదా- అర్జెంటు పనుందే"    
    "అర్జెంటయితే రాగానే చెప్తాను సార్"    
    'అర్జెంట్' అనగానే ఇక సస్పెన్స్ బావోదని, లాకప్ సెల్ లో వున్న రాణా, "ఆ ఫోన్ ఇలా అందివ్వు బ్రహ్మానందం బాలకిషన్ నేనే ఇన్ స్పెక్టర్ని రాణాని" అన్నాడు.    
    ఒక్కసారిగా ఆ గదిలో నిశ్శబ్దం వ్యాపించింది. డబ్బు లెక్కపెడుతున్న కర్రా తలెత్తేడు- సెంట్రీతో సహా పోలీసులందరూ శిలాప్రతిమలై చూస్తూ వుండిపోయారు.    
    రాణా బయటకొచ్చి, ఫోన్ లో డియస్పీతో మాట్లాడాడు. జరిగిన విషయం ఏమీ చెప్పలేదు. తను ఛార్జీ తీసుకోవడం ఆలస్యమయిందని మాత్రం చెప్పాడు.    
    అతడు ఫోన్ పెట్టేసి అందరివైపూ చూశాడు. అందరి మొహాలు వాడిపోయి వున్నాయి. ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తో నిండివున్నాయి.    
    అతడు సన్నగా నవ్వి, "పొరపాట్లు ఎవరికైనా జరుగుతూ వుంటాయి. నా లైఫ్ లో ఇంత జోకు ప్రాక్టికల్ గా జరగటం ఎప్పుడూ చూడలేదు" అన్నాడు. ఇన్ స్పెక్టర్ దీన్ని అంతా తేలిగ్గా తీసుకోవటంతో అందరూ రిలీఫ్ అయ్యారు.    
    అక్కడి వాతావరణం తేలికైంది.    
    "ఈ పోలీస్ స్టేష ను మీద మస్తాన్ పెత్తనం చాలా వున్నట్టుందే" అన్నాడు రాణా.    
    "మస్తాన్ దేముంది సార్. అంతా వీరదాసే."    
    "బాబోయ్ మస్తానే నన్నిలా కొట్టాడంటే ఆ వీరదాస్ ఇంకా బలవంతుడై వుండాలి" గెడ్డం నొక్కుకుంటూ అన్నాడు రాణా.    
    తమ బస్ 'వీరదాస్' గురించి ఇన్ స్పెక్టర్ అలా పొగడడంతో గర్వంగా నవ్వుకుంటూ బ్యాచీల తరపు నుంచి డబ్బు తీసుకు వచ్చిన వాళ్ళు కర్రాకి దాన్ని ఇచ్చేసి, రాణాని విష్ చేసి వెళ్ళిపోయారు. రాణా ఛార్జీ తీసుకున్నాడు. పోలీస్ స్టేషన్ చాలా దారుణమైన పరిస్థితిలో వుంది. లాకప్ రూమ్ లో బొద్దింకలు. ఆ రూమ్ కి తాళం లేదు. పుల్ల అడ్డు పెట్టారు. నీళ్ళు లేవు. ఖైదీలతోనే వూడ్పిస్తారు.    
    రాణా మరో విషయం గమనించాడు.    
    ఆ స్టేషన్ లో పోలీసు బలగం చాలా తక్కువ. వాళ్ళలో చాలామందికి ధైర్యం లేదు. దొరికిన దొంగని చావబాదగలరేగానీ దొంగల దగ్గిర ఆయుధం వుందని తెలిస్తే మాత్రం చొరవగా చీకట్లోకి చొచ్చుకుపోలేరు. మేకపోతు గాంభీర్యం మాత్రం ఎక్కువ వుంది.    
    ఉన్నవాళ్ళలో కానిస్టేబుల్ శర్మ మాత్రం నిజాయితీగా కనిపించాడు. కానీ అతడో వృద్దుడు. రేపో మాపో రిటైరవబోతున్నాడు.
        రాణా పెండింగ్ కేసుల ఫైలు పరిశీలిస్తూ వుండగా సీటు దగ్గరికి కర్రా వచ్చాడు.    
    "ఇల్లు దొరికిందా సార్?"    
    "ఇంకా లేదు."    
    పక్కనే వున్న శర్మ "మా ఇంట్లో పోర్షన్ ఖాళీగా వుంది సార్. మీ ముందున్న ఇన్ స్పెక్టర్ అక్కడే వుండేవారు" అన్నాడు.    
    "ఒంటరిగాడిని. నాకెందుకోయ్ పోర్షను? గది చాలు"    
    "అద్దె చాలా తక్కువ సార్."    
    కర్రా కల్పించుకుని "అంటే ఇన్ స్పెక్టర్ గారు డబ్బుల కోసం వెనుకాడి పోర్షను వద్దంటున్నారనుకుంటున్నావురా దొంగముండాకొడకా" అన్నాడు. శర్మ మొహం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు.    
    రాణాకి బాధేసింది. డిపార్ట్ మెంట్ లో దొంగల్తో ఆ తిట్లు మామూలేగానీ, పై అధికారి క్రింది వాళ్ళని తిట్టడం అతడు చూడటం అదే ప్రధమం. ముఖ్యంగా ఆ వయసు మనిషిని.    
    కానిస్టేబుల్ వెళ్ళిపోయాక కర్రా అసలు విషయం ప్రస్తావించాడు. వచ్చిన దాంట్లో పది శాతం ఇన్ స్పెక్టర్ కి చెందుతుంది. వారం వారం సెటిల్ మెంట్ లు జరుగుతూ వుంటాయి.        
    "సాధారణంగా ఎంతొస్తుంది?"    
    "చెప్పలేం ఏదైనా పెద్ద దొంగతనం జరిగితే బాగా వస్తుంది. లేకపోతే బ్యాచి కమీషన్లే. ఇప్పుడు వాళ్ళు తెచ్చిచ్చారు ఇమ్మంటారా?"    
    "ఎంత?"    
    "మీ వాటా పన్నెండొందలు" అని అందించాడు. రాణా అందుకుని జేబులో పెట్టుకున్నాడు. యస్సై ఇంకా కదలక పోవడంతో ఏమిటన్నట్టు చూసాడు.    
    "జరిగిన దానికి మస్తాను చాలా బాధపడుతున్నాడు. మీరు ఎవరో వీధి సైడు కొత్తగా వచ్చిన గూండా అనుకుని దెబ్బలాడాడట."    
    "అదేమిటి సుధాకర్. ఈ దేశంలో ప్రతీ పౌరుడికీ దెబ్బలాడే హక్కుంది! నన్నుకొట్టి, పోలీస్ వ్యాన్ లో పడేసి, స్టేషన్ కి తీసుకొచ్చి తనే స్వయంగా లాకప్ లో పెట్టేటంత శ్రమ మస్తాన్ లాటి ఒక సాధారణ పౌరుడు తీసుకున్నాడంటే మన భారతదేశం గౌరవించాలి కదా."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS