'మైగాడ్' అనుకున్నాడు తడి ఆరుతున్న గొంతుతో హిట్లర్ రిప్లికా గుర్తొచ్చింది. అకస్మాత్తుగా అంతా మంచు విడినట్టూ విడిపోయింది బాలూకి.
సౌదామిని భయానికి కారణం ఇదన్నమాట! ఆఖరికి తను టెంట్ దగ్గిర వేసిన గ్రామఫోన్ పాటలతో సహా సమాచారం ఇతడికి చేరుకున్నదంటే ఎంత బలమైన నెట్ వర్క్ ఇతడికుందో అర్ధమౌతుంది. తన మనుషులు ప్రతి ఒక్కరిమీదా ఇంత నిఘావేసి వుంచుతాడన్నమాట.
"అమ్మాయ్! ఈ కోటలో నా అంత తెలివైనదానివి, నాతోపాటూ సమానంగా పనులు నిర్వర్తించగలదానివీ నీవ్వొక్కత్తివే. అఫ్ కోర్స్ ఆంజనేయులు కూడా వున్నాడనుకో. మీ ఇద్దరికీ కొద్ది కొద్దిగా అంతా ఒప్పజెప్పేసి నేను తప్పుకుందామనుకున్నాను. ఇప్పుడేమో నువ్వు ప్రేమ అంటున్నావ్. పెళ్ళి చేసుకుని వెళ్ళి పోతానంటే యెవరాపగలరు? నిన్ను ఆపలేం-కానీ నీకు తెలిసిన రహస్యాలు మాత్రం ఆపాలి. ఏదో ఒక దారి కనబడకపోదనుకో... వెళ్ళమ్మా వెళ్ళు. ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావ్? .... అదే ... వెళ్ళటానికి..."
ఆమెను చూస్తూ వుంటే అక్కడే స్పృహ తప్పి పడిపోయేలా వుంది. ఉన్నట్టుండి ముందుకి వంగి అతడి కాళ్ళమీదకి వాలిపోతూ "వెళ్ళను... నేనెక్కడికీ వెళ్ళను.... ఇక్కడే వుంటాను" అంటూంది రుద్దమైన కంఠంతో.
ఇక రంగప్రవేశం చెయ్యవలసిన సమయం వచ్చిందనుకున్నాడు బాలూ ముందుకు వచ్చి తలుపు తెరచి లోపలికి ప్రవేశిస్తూ "హలో గుడ్మార్నింగ్" అన్నాడు.
బ్రహ్మానంద అదిరిపడతాడనుకున్నాడు. అలాటిదేమీలేదు. "హలో" అన్నాడు చాలా మామూలుగా అదిరిపోవటం బాలూ వంతైంది. భయమూ, ఆశ్చర్యమూ లాంటి ఫీలింగ్స్ కి ఇతడు అతీతుడా! "రావోయ్ రా! నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే సౌదామిని చెప్తోంది. నువ్వు తనని చాలా అల్లరి పెడుతున్నావట కదా!"
బాలూ ఆమెవైపు తిరిగి "అలా చెప్పావా?" అన్నాడు.
ఆమె ఏదో చెప్పబోతూ వుంటే, "సర్లే దానికేముంది లేవోయ్! ఇంతకీ లోపలికి నువ్వెలా వచ్చావ్?" అంటూ సౌదామిని వైపు చూసాడు బ్రహ్మానంద.
"ఆమెకేం సంబంధం లేదు" అన్నాడు బాలూ.
"అయితే వాచ్ మేన్ కి పాఠం చెప్పాల్సిందే!"
"అతడిదేం తప్పులేదు. విరిగిన గోడమీద నుంచి వచ్చాను".
"అయినా పాఠం చెప్పాల్సిందేనోయ్! వాచ్ మేన్ ని పెట్టుకున్నది ఒక్క ద్వారాన్ని కాపలా కాయటానికే కాదు. విరిగిన గోడల మీదనుంచీ, కూలిన గోడల మధ్యనుంచీ కూడా మనుషులు రాకుండా చూడటం కోసం.... ఏమంటావ్?"
బాలూ మాట్లాడలేదు.
"ఏది ఏమైనా మా అతిథివి చెప్పు ఏం కావాలో?"
"నాకు సౌదామిని కావాలి."
"ఇదేమన్నా వస్తువటయ్యా తీసుకుపోవటానికి."
"ఆమెని పెళ్ళి చేసుకుని తీసుకు వెళ్దామనుకుంటున్నాను."
"దానికామె ఒప్పుకోవద్దూ!"
"ఆమె ఒప్పుకుంది."
అతడు లిప్తకాలం బాలూవైపు చూసి చటుక్కున సౌదామిని వైపు తిరిగి చేతులు సాచి దగ్గరకు వెళ్తూ "ఎంత మంచి వార్తమ్మా! నువ్వో ఇంటిదానివౌతున్నావంటే నా కెంతో సంతోషంగా వుంది" అన్నాడు మొహంనిండా ఆనందం నింపుకుని!
అంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టూ చటుక్కున ఆగి.... "అన్నట్టూ మరి ఆంజనేయులూ నువ్వూ...." అంటూ బాలూ అక్కడ వుండటంతో చప్పున మాట ఆపుచేసి "ఓ సారీ! నువ్వు ఇతన్నే వివాహం చేసుకోదలచుకుంటే..." అంటూ ఏదో చెప్పబోయాడు.
ఆమె గాలిలా అతడి దగ్గరకు దూసుకు వచ్చి "లేదు, లేదు నేనీ వివాహానికి ఒప్పుకోలేదు. అసలు నేనితన్ని ప్రేమించటం లేదు" అంది కంగారుగా.
"మొదటిది నిజమైతే అయివుండొచ్చు గానీ, రెండోది మాత్రం అబద్దం" అన్నాడు బాలూ తాపీగా.
"అంటే మా అమ్మాయి అబద్దం చెప్తుందంటావా?"
"కాదు, మిమ్మల్ని చూసి భయపడుతోంది."
అతడు బిగ్గరగా నవ్వేడు. "నన్ను చూసి ఈ లోకంలో భయపడేవాళ్ళు కూడా వున్నారన్నమాట. నాకు చాలా ఆనందంగా వుంది సుమా!"
బాలూ ఆ మాటలు పట్టించుకోకుండా ఆమెవైపు తిరిగి "నిజం చెప్పు సౌదామినీ! నన్ను ప్రేమించడం లేదూ!" అని అడిగాడు.
ఆమె మొహం పక్కకు తిప్పుకొని "లేదు" అంది. హతాశుడయ్యాడు బాలూ. ఆమె అతికష్టంమీద ఏడుపు బిగపట్టుకుంటున్నట్టు కనబడింది.
అతనికేం చెయ్యాలో తోచలేదు. సౌదామిని ఎందుకింత తటపటాయిస్తోందో అర్ధంకాలేదు అతనికి. కొద్దిగా విసుగేసింది కూడా. ఒక నిర్ణయానికి వచ్చినట్టు "సౌదామినీ! కేవలం ఏదో కారణంవల్ల నువ్వీ వివాహాన్ని వద్దంటున్నావని నాకు తెలుసు. ఏదీ నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిజం చెప్పు. నేనంటే నీకు నిజంగా ఇష్టంలేదూ? ఈ కోటనుంచి బయటికి వచ్చి నాదంటూ ఒక ఇల్లు నిర్మించుకోవాలని లేదూ!" అన్నాడు.
ఆమెలో ఒక్కసారిగా ఏదో అనూహ్యమైన మార్పు వచ్చింది. హిస్టీరిక్ గా ఉంది... ఉంది" అని అరిచింది.
అతని మాటలు ఆమె మీద సరియైన ప్రభావాన్ని చూపించినట్లున్నాయి. ఆమె తన చుట్టూ నిర్మించుకున్న కృత్రిమమైన గాజు గోడ పగిలిపోయింది.
"నా కిష్టమైనా..... యీ వివాహం జరగకూడదు. అది మీకే....మీకే ప్రమాదం" అని అంతలోనే నోరు జారినట్టూ అంత దుఃఖంలోనూ బ్రహ్మానందవైపు భయభ్రాంతురాలై చూసింది.
గొప్ప విజయం సాధించినట్టు తేలిగ్గా వూపిరి పీల్చుకుని చిరునవ్వుతో బ్రహ్మానందవైపు చూశాడు బాలూ బ్రహ్మానంద మొహంలో అంతకుముందు ఎప్పుడూ కనబడని రౌద్రపు ఛాయ లీలగా మెరిసి మాయమైంది. కాని క్షణకాలం మాత్రమే. అతని పెదాలమీద నవ్వు ఆగిపోయింది.
బ్రహ్మానంద ఆమెను వదులుకోవటానికి ఎంత అయిష్టంగా వున్నాడో ..... ఆ ఒక్క క్షణంలోనే తెలిసింది బాలూకి!
"అమ్మా! నువ్వు బయటికి వెళ్ళు మీరు పరస్పరం ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో మిమ్మల్ని చూస్తూంటేనే అర్ధం అవుతోంది. నువ్వు నా కూతుర్లాంటి దానివి. నేను నా కాబోయే అల్లుడితో కొంచెం మాట్లాడాలి" అన్నాడు బ్రహ్మానంద.
ఆమె కంగారుగా "నేనూ ...." అంది.
అతడు "ఏమిటమ్మా! ఒక విషయాన్ని రెండోసారి చెప్పటం అనేది నాతో మొట్టమొదటిసారి చెయ్యిస్తున్నావు?" అన్నాడు కఠినంగా అతడిని చూస్తున్నకొద్దీ బాలూ మనసులో అలజడి కలగసాగింది. ఇతడో నరరూప రాక్షసుడై ఉండాలి" అని అతని మనసెందుకో చెప్తోంది.
సౌదామిని నిశ్శబ్దంగా అక్కడనుండి తప్పుకుంది. ఆమె పూర్తిగా వెళ్ళిపోయిందని నిశ్చయించుకున్నాక బాలూవైపు తిరిగి "నిన్నెలా అభినందించాలో తెలియటంలేదోయ్! సౌదామినిలాంటి అమ్మాయిని నీవైపు తిప్పుకున్నావంటే అది గొప్ప విషయమే. కానీ ఆమెని వదులుకోవటం నా కిష్టం లేదు. ఆమె నా కుడిభుజం లాంటిది" అన్నాడు. "అదేమిటండీ! ఆడపిల్లని ఎంతకాలం మీతో వుంచుకుంటారు?" అన్నాడు బాలూ, కంఠంలో వెటకారం కనబడకుండా అమాయకంగా అతడు దాన్ని గుర్తించాడో లేదోగాని బాలూ దగ్గరకు వచ్చి రహస్యంగా "ఒక స్నేహితుడిగా చెపుతున్నాను విను. ఆమెను చేసుకున్నా నువ్వు సుఖపడలేవు. దయచేసి 'ఎందుకు?' అని అడక్కు" అన్నాడు.
ఇతడు నటుడై వుంటే గొప్ప పేరు తెచ్చుకునేవాడు.
"చూడండి ధర్మరాజుగారూ!"
"నా పేరు బ్రహ్మానంద."
"రెండింటికీ పెద్ద తేడాలేదు గానీ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా జీవితం ఏమౌతుందో నాకు తెలుసు. మీ కూతుర్ని నేను చేసుకోవాలనుకుంటున్నాను. కష్టపడి ఆమెను వొప్పించాను. ఇప్పుడిక మీరు సామదాన భేదోపాయాలతో అడ్డుపడకండి. అది మీకే మంచిదికాదు. పైగా మీ రహస్యాలన్నీ తెలుసు నాకు" అన్నాడు. అతని ఉద్దేశంలో బ్రహ్మానంద కేవో బలహీనతలున్నాయి. అవి సౌదామినికి తెలుసు. అక్రమ సంబంధమో, నల్లమందు వ్యసనమో అలాటివి! పొరపాటున అవి బయటపడితే ముప్పు వస్తుందని ఇతను భయపడుతున్నాడు. అందుకే ఈ రహస్యం నాక్కూడా తెలుసులే అని ధ్వనించేలా అన్నాడు బాలూ. అతను ఊహించిన మార్పు బ్రహ్మానంద మొహంలో కనబడింది."
"రహస్యాలా?" అన్నాడు.
"అవును, సౌదామిని అన్నీ చెప్పింది."
"ఏం చెప్పింది?" అనుమానంగా అడిగాడు.
బాలూ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. నిజానికి అతనికేమీ తెలీదు. బ్రహ్మానందకి రహస్యంగా తాగే అలవాటుంటే తను పొరపాటున 'మీకే స్త్రీతో సంబంధం వుందో నాకు తెలుసులెండి!' అంటే మొదటికే మోసం వస్తుంది. అందుకని తెలిసిన విషయాలే చెప్పదలచుకున్నాడు.
అదేదో అతి సాధారణ విషయం అయినట్టూ "పెద్ద పెద్ద విషయాల వరకూ ఎందుకులెండి? మీ బోన్ మిల్ సంగతి చూసుకుందాం. లేకపోతే కోడిగ్రుడ్ల డొప్పల సంగతి కూడా మాట్లాడుకోవచ్చును" అన్నాడు లోపాయికారిగా.
"ఇవి.... ఇవన్నీ సౌదామిని చెప్పిందా? నమ్మను..." బ్రహ్మానంద కంపించిపోయాడు.
'దొరికావు గురూ!' అనుకున్నాడు బాలూ.
"ప్రేమంటే అంతే మరి. ప్రేమికుల మధ్య రహస్యాలుండవు. ఇంకా చెప్పమంటారా?"
"అక్కర్లేదు" అన్నాడు బ్రహ్మానంద. "నువ్వు చెప్పిన విషయాలబట్టే ఆ అమ్మాయి నిన్నెంత ప్రేమిస్తోందో అర్ధమౌతోంది. మీ లాంటి ప్రేమికుల్ని విడదీయాలనుకోవటం నాదే తప్పు. నాతో రా."
తను వేసిన బాణం సరిగ్గా తగిలినందుకు లోలోపలే ఆనందించాడు బాలూ ఇంత సులభంగా తెలిపోయే సమస్య గురించి సౌదామిని ఎందుకంత భయపడిందో అతని కర్ధంకాలేదు. అతనికా క్షణంలో తమ వివాహం కన్నా ఆమెను ఈ భయంనుంచి తప్పిస్తున్నాను అన్న ఆలోచనే ఎక్కువ ఆనందాన్నిచ్చింది.
ఇద్దరూ వరండాలో నడుస్తూండగా బ్రహ్మానంద చెప్పసాగాడు. "ఈ కోటని ఇంతవరకూ తీసుకురావటానికే నేనెంత కారణమో.... సౌదామినీ అంతే కారణం. చిన్నతనం నుంచి పెంచిన తనని ఇప్పుడు నీతో పంపించటానికి నా మనసొప్పటం లేదు. కానీ తప్పదు కదా!" అతను అంటూ ఉండగా పెద్దగా అరుచుకుంటూ ఒక చిలక వచ్చి అతడిమీద వాలింది. "ఇదిగో ఈ చిలక, ఆ లేడిపిల్ల, మా ఆంజనేయులూ, సౌదామినీ, నేను- మేమంతా కుటుంబంలాగా ఇంతకాలం మెలుగుతూ వచ్చాం. ఈ రోజు రాజకుమారుడు వచ్చి ఎత్తుకుపోయినట్లు తీసుకుపోతున్నావు...." అంటూ నవ్వాడు.
బాలూ కూడా నవ్వి ఊరుకున్నాడు.
"నీ పేరేమిటన్నావ్?" అన్నాడు బ్రహ్మానంద.
చెప్పాడు బాలూ.
"చూడు బాలూ! ప్రేమించుకున్నారు కాబట్టి మీ యిద్దరికీ పెళ్ళి చెయ్యాల్సిన బాధ్యత నా మీద వుంది. కానీ ఆ అమ్మాయి హితోభిలాషిగా రాబోయే వరుడు ఎంత తెలివైనవాడో, తనని సరిగ్గా పోషించగలడో లేదో తెలుసుకోవలసిన బాధ్యత కూడా నా మీద వుంది కాదంటావా? పైకలా కనబడుతుంది గానీ సౌదామిని చాలా తెలివైంది. నా రహస్యాలన్నీ నీకు తెలుసు కాబట్టే చెపుతున్నాను. కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇంకా నేనైనా బయటపడతానేమో కాని తనసలు పైకి తేలదు. అటువంటిదాన్ని చేపట్టే అర్హత, తెలివితేటలూ నీకున్నాయో లేదో నేను తెలుసుకోవాలనుకోవటంలో తప్పులేదనుకుంటాను."
