"రాజకుమారుడికి పెట్టినట్టూ నాకూ ఏదయినా పరీక్ష పెడతారా?"
అతడు నవ్వుతూ "సెంటిమెంటే అనూ లేక నా పిచ్చే అనూ! నాకు తెలిసిన పోటీ ఒక్కటే! కొరియన్ చక్కర్. అది సరిగ్గా ఆడగలిగినవాడు జీవితంలో నెగ్గుకుపోగలడని నాకు నమ్మకం" అన్నాడు.
"కొరియన్ చక్కరా!" అన్నాడు బాలూ ఆశ్చర్యంగా చిన్నప్పుడెప్పుడో పక్కింటి పిల్లల్తో ఆడిన గుర్తు. "కేవలం ఒక్క ఆటతో నా అర్హతలు నిర్ణయిస్తారా?"
"ఎవడి పిచ్చి వాడికి ఆనందం- ఎప్పుడూ వినలేదా?"
"నేను గెలిస్తే?"
"సౌదామినిని ఆనందంగా నీకు ఒప్పుచెపుతాను."
"నేను ఓడిపోతే?"
"ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి. సౌదామినిని మరి కలుసుకోనని మాటివ్వాలి. అంతేకాదు, ఆమె నీకు చెప్పిన రహస్యాలన్నీ యిక్కడే మర్చిపోవాలి."
"మాచ్ డ్రా అయితే?"
అతడు క్షణంసేపు కన్ఫ్యూజ్ అయ్యి "డ్రా అయ్యే ప్రసక్తే లేదు" అన్నాడు.
"ఎందుకు లేదు" అంటూ బాలు ఏదో చెప్పబోతూ వుంటే అతడు కట్ చేసి "డ్రా అయినా నీదే గెలుపు. సరేనా?" అన్నాడు.
ఇద్దరూ ఒక విశాలమైన గదిలో ప్రవేశించారు. గది మధ్యలో చిన్న టేబిల్ చెరో వైపునా రెండు కుర్చీలూ వున్నాయి.
"అన్నీ రెడీగా అమర్చి ఉంచారే....!" అన్నాడు బాలూ కూర్చుంటూ.
"ఎప్పుడూ ఇది అలాగే ఉంటుంది. నేను ఒక్కన్నే వున్నప్పుడల్లా ఆడుకుంటూ ఉంటాను. మెదడుకి బాగా మేత పెట్టే ఆట ఇది" అన్నాడు.
తనలో తానే నవ్వుకున్నాడు బాలు. తను కాలేజీ చదరంగ ఛాంపియన్ అదొచ్చిన వాళ్ళకి కొరియన్ చక్కర్ చాలా సులభం.
బల్లవైపు చూశాడు బాలూ. దంతంలో చెక్కబడ్డ పావులు అందంగా ఉన్నాయి. కింగ్ పిన్ నల్లగా మెరుస్తూ ఉంది.... అతనిని నలుపూ, బ్రహ్మానందవి తెలుపు...
బ్రహ్మానంద ముందు ఓపెన్ చేశాడు.
బాలూకి అతడి ఎత్తు సరిగ్గా అర్ధంకాలేదు.
మొట్టమొదటే అతడు తన కోట ద్వారం తెరవటం....
తన కింగ్ పిన్ ముందుకు గెంతడానికి రంగస్థలం సిద్దం చేసుకుంటూ ఒక పావును నిచ్చెన మెట్టులాగా ముందుకు పెట్టాడు బాలు.
అతడు తన కోట ముందునుంచి మరో పావుని అడ్డు తొలగించాడు.
బాలూకి ఆశ్చర్యంతో మతిపోయింది. ఈ లెక్కన మరో పది ఎత్తుల్లో తన కింగ్ పిన్ అతని కోటలో ప్రవేశించటమేకాక అతడి సింహాసనాన్ని అధిష్టిస్తుంది. తన పావుని జరపబోయాడు బాలూ.
సరిగ్గా అదే సమయానికి ఒక వికృతమైన కేక వినబడింది. పావుని పట్టుకోబోతున్న అతని చేయి వణికింది. బ్రహ్మానంద భుజంమీద వున్న చిలుక మరోసారి ఆ గది ప్రతిధ్వనించేలా అరిచింది.
చిన్నపిల్ల ఏడుస్తున్నట్టూ, ఆపదలో వున్న స్త్రీ ఆర్తనాదం చేస్తున్నట్టూ వుందా అరుపు బాలూ ఏకాగ్రత చెదిరింది. అతని మనసంతా ఆటమీదే కేంద్రీకరించవలసి వచ్చింది. తన కింగ్ పిన్ వెళ్ళడానికి మరింత ఖాళీ చేసుకున్నాడు.
బాలూ పావును కదపగానే చిలక అరవటం మానేసింది. బ్రహ్మానంద దాన్ని ప్రేమగా నిమురుతూ బాలూకి మరో నిచ్చెన మెట్టు ఏర్పాటు చేశాడు. మళ్ళీ చిలక అరవటం మొదలుపెట్టింది. ఆ అరుపుల మధ్య అతడి వ్యూహం అంతుబట్టలేదు బాలూకి. అయినా దాని గురించి అతనంతగా పట్టించుకోలేదు. తను గెలవటానికి ఒక పిచ్చివాడిలాగా మార్గం సుగమం చేస్తున్నాడు బ్రహ్మానంద! ఇంకొక రెండు ఎత్తులుగానీ అతడిలా వేశాడంటే తన కింగ్ పిన్ ని తీఉస్కువెళ్ళి ఎకాఎకిని అతడి కింగ్ పిన్ స్థానంలో గుచ్చటంతో ఆట పూర్తయిపోతుంది.
బాలూ ఇంకో ఎత్తువేయబోయే టైంలో పెద్ద చప్పుడుతో ధడేలున తలుపు తెరుచుకుంది. గుమ్మం దగ్గిర సౌదామిని రొప్పుతూ నిలబడి వుంది. తమ గురించి ఆశ్రమం అంతా హడావిడిగా వెతికినా అలసట ఆమె మొహంలో కనబడుతుంది. బాలూని చూడగానే ఆమెలో అదోలాంటి రిలీఫ్ గోచరమైంది. కాని అది క్షణం సేపే వాళ్ళ మధ్య వున్న బల్లమీద ఆమె దృష్టి పడగానే ఆమె అరవబోయింది. ఎందుకో బాలూకి అర్ధంకాలేదు.
ఇంతలో బ్రహ్మానంద "రా అమ్మారా! నేనూ, ఇతడు ఒక పెద్ద పందానికి ఇది ఆడబోతున్నాం. మధ్యలో ఎవరూ సలహాలు చెప్పకూడదు. మాట్లాడకూడదు కూడా అలా మాట్లాడిన వాళ్ళని చిత్రహింస లెవెల్లో శిక్షించటానికి నిర్ణయించుకున్నాం."
అంతే అన్నట్టు తలూపాడు బాలూ.
సౌదామినిలో ఏది తెలియని అనూహ్యమైన మార్పు కనబడుతోంది. పళ్ళ చక్రం మధ్యలో శరీరమంతా ఇరుక్కుపోతే నోటి నుంచి బయటికి రాలేని ఆక్రందనలా....
ఆమె ఏదో అనబోయింది. బ్రహ్మానంద ఆమెవైపు చిత్రంగా చూశాడు. "అదేమిటి సౌదామిని! యీ రోజు అదోలా ప్రవర్తిస్తున్నావు. ఏదన్నా విషయం ఒకసారి చెప్తే గ్రహించేదానివి. అదృష్టాన్ని పరిశీలించుకుంటావా? అంతా పోగొట్టుకుంటావా?"
ఏదో అదృశ్యశక్తి నోటిని నొక్కేసినట్టు ఆమె శిలాప్రతిమలా వుండిపోయింది.
"ఆడు బాలూ!" అన్నాడు బ్రహ్మానంద.
ఇంక రెండు యెత్తులే మిగిలివున్నాయి. బాలూ కింగ్ పిన్ కదిపి అతడి కింగ్ పిన్ తీసేసి ఆ రంధ్రంలో గుచ్చటంతో ఆట పూర్తయిపోతుంది. బాలూ తన పావుని కదిపాడు. బ్రహ్మానందం తన హాన్ని కదిపాడు. సౌదామినీ, చిలక అరుపులూ అతని మనోపథం నుండి తప్పుకున్నాయి. మరొక యెత్తు వేశాడు. ఆఖరి పావుని తన కింగ్ పిన్ ముందునుంచి అడ్డు తొలగించాడు బ్రహ్మానంద.
బాలూ రాజుకీ, అతడి రాజుకీ మధ్య నిచ్చెన మెట్లులాగా పావులున్నాయి. వాటిని అధిరోహిస్తూ వెళ్ళి అతడి రాజును చంపటమే! విజయం వరించబోతోంది. బాలూ సౌదామిని వైపు చూశాడు. ఆమె మొహంలో ఏదో అర్ధంకాని ఆందోళన కనబడుతోంది. ఆమె దేనికోసమో వెతుక్కుంటోంది. నిస్సహాయంగా చూస్తూంది.
ఇక ఆఖరి ఎత్తు మిగిలి వుంది. తన కింగ్ పిన్ ని ముందుకి కదిలించటం...
బాలూ చెయ్యి కింగ్ పిన్ వైపు వెళ్తూవుండగా కాలిమీద ఏదో పడినట్టయింది. చూశాడు!
పిన్ను....
తలెత్తాడు.
బ్రహ్మానంద ప్రక్కనే కూర్చుని వున్న సౌదామిని అలా తలవంచుకుని కూర్చునే బల్లకోడుమీద చూపుడు వేలితో ఏదో రాస్తూ వుంది. అతని కాలి దగ్గర వున్న పిన్ను మీద పడింది. దాని మొనకి రక్తం అంటుకుని వుంది. చప్పున తలెత్తి చూశాడు బాలూ. చిలక ఇంకా అరుస్తూనే వుంది. ఏదో ఆలోచిస్తున్నవాడిలా తల గోక్కుంటూ దృష్టి క్రిందకి మరల్చాడు. బొటనవేలుతో చూపుడు వేలిని నొక్కుతూ బొట్లు బొట్లుగా వస్తున్న రక్తంతో సౌదామిని బల్లకోడుమీద వ్రాస్తూ వుంది.
ఆమె వ్రాసింది అర్ధం చేసుకోవటానికి కొంచెంసేపు పట్టింది. చూపు నెమ్మదిగా తన పావుమీదికి మరల్చాడు. నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తోంది.
కింగ్పిన్.
కానీ దాన్ని పట్టుకునే చోట చిన్న లోహపు ముక్కదానికి తాపడం చెయ్యబడి వుంది. రంగులో రంగు కలిసిపోయి ఎంతో పరీక్షగా చూస్తే తప్ప కనబడకుండా వుంది.
అతని ఒళ్ళు జలదరించింది.
బ్రహ్మానంద ప్రత్యర్ధిని ఆటలో గెలవనిచ్చి, బ్రతుకులో ఓడగొట్టే పథకం ఇదన్నమాట.
మొహంలో ఏ భావమూ కనబడనివ్వకుండా కళ్ళు పైకెత్తాడు. బ్రహ్మానంద బాలూ ఆడటం కోసం చూస్తున్నాడు. తాపీగా ఒక పావుని తీసి తనముందు దారిని బ్లాక్ చేశాడు బాలూ. ఎంతో పెద్ద ఎక్స్ పెక్టేషన్ తో ఉన్నవాడు ఏమీ జరక్కపోతే ఎలా వుంటాడో అలా మారింది బ్రహ్మానంద మొహం. బాలూవైపు అనుమానంగా చూశాడు. బాలూ ఏదో ఆలోచిస్తున్నట్టు కనపడ్డట్టున్నాడు. అతడూ ఆడాడు.
తనేం చెయ్యాలో ఆతని ఎలా ముగించాలో వ్యూహం పన్నసాగాడు బాలూ. చాలా కష్టమే! కానీ తప్పదు. సర్వశక్తులూ కేంద్రీకరించి ఆడాలి. అందులోనూ తన కింగ్ పిన్ ని ముట్టుకోకుండా! బల్లమీద పావులపైపు చూశాడు.
అతన్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నది చిలక అరుపు. సరిగ్గా ఎత్తు వెయ్యటానికి ఆలోచించబోయేసరికి అది వికృతంగా అరుస్తుంది. దాంతో ఆలోచనలు చెదురుతున్నాయి. ఇంతకు ముందంటే ఫరవాలేదు. కానీ ఇప్పుడు కష్టం. దానివైపు కసిగా కోపంగా చూశాడు. బ్రహ్మానంద మాత్రం దాన్ని ఒళ్ళోపెట్టుకుని వేళ్ళతో మెడ నిమురుతున్నాడు.
అంతలో చిలక అరుపు ఆగిపోయింది. చకితుడై దానివైపు చూసి సౌదామిని వంక తల తిప్పాడు బాలూ. ఆమె దానివైపు చూస్తోంది. ఆమె కళ్ళల్లో ఏదో శక్తి దాన్ని ఆజ్ఞాపిస్తున్నట్టూ కనిపించింది. అంత అల్లరిచేసి ఒక్కసారి మౌనం వహించేసరికి ఆ గదిలో ఏర్పడిన ప్రశాంతత ఎంతో రిలాక్సింగ్ గా వుంది.
చకచకా పావులు కదపసాగాడు. బ్రహ్మానందలో తొట్రుపాటు స్పష్టంగా కనిపించింది. ఒళ్ళో వున్న చిలకవైపు రెండు మూడుసార్లు దృష్టి సారించాడు కూడా. సౌదామిని మాత్రం ఏమీ ఎరగనట్టు ఎటో చూస్తూ కూర్చుని వుంది.
సరిగ్గా పదహారు ఎత్తుల్లో ఆట పూర్తయింది. బ్రహ్మానంద కింగ్ పిన్ చుట్టూ బాలూ పావులూ, బాలు పిన్ చుట్టూ అతడి పావులూ వేరు వేరు స్థానాల్లో ఆక్రమించుకుని వున్నాయి. అతను వ్యూహం మార్చిన పది నిముషాలకి బ్రహ్మానంద ఆ ఆలోచన పసిగట్టినట్టున్నాడు. ఓడిపోయే ఆలోచన మానుకుని గెలవటానికి శాయశక్తులా ప్రయత్నించసాగాడు. ఈ హోరా హోరీ పోరాటంతో దాదాపు గంటసేపు ఆట సాగింది. చివరకెలాగైతేనేం అనుకున్నది సాధించగలిగాడు బాలూ. పావులు కదలటానికి వీలులేని స్థితిలో చిక్కుబడిపోయాయి.
ఆట డ్రా అయింది.
"ఆట డ్రా అయినా మన ఒప్పందం ప్రకారం నేను గెలిచినట్టేగా" అన్నాడు నవ్వుతూ.
బ్రహ్మానంద కూడా బిగ్గరగా నవ్వుతూ "కంగ్రాట్యులేషన్సోయ్. ఇంతవరకూ ఈ ఆటలో నన్ను గెలిచినవాడు లేడు. నీకు మనస్ఫూర్తిగా మా అమ్మాయినిచ్చి పెళ్ళి చెయ్యవచ్చు." అతడి మొహంలో పూర్వపు టెన్షన్, కసి ఇప్పుడు లేవు. చాలా రిలాక్సింగ్ గా కనబడ్డాడు.
బాలూ లేచి నిలబడుతూ "థాంక్స్" అని సౌదామినివేపు చూశాడు. అతనికి ఆశ్చర్యం అనిపించింది. ఆమె మొహంలో ఆనందంలేదు. కానీ ఆ క్షణంలో అతను దాని గురించి పట్టించుకోలేదు. బ్రహ్మానంద ఆమెవేపు తిరిగి "సౌదామినీ! నీ బట్టలు సర్దుకో!" అన్నాడు...... "పెంచుకున్న అనుబంధం తెంచుకోవటం కష్టమే. కానీ తెంచుకోవటం ఎలాగో తప్పనిసరి అయినప్పుడు వాటిని ఎంత తొందరగా తెంచుకుంటే అంత మంచిది. ఈ క్షణమే నువ్వు నీ కాబోయే భర్తతో కలిసి వెళ్ళిపోవలసి వుంటుంది.....అలా తీసుకెళ్ళటానికి బాలూకి అభ్యంతరం లేకపోతేనే సుమా!"
"నాకు? నాకు అభ్యంతరమా! ఆనందంగా తీసుకెళ్ళిపోతాను" అన్నాడు బాలు. నిజానికి ఈ కోటనుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బాగుండుననిపిస్తోంది. ఇక్కడ వాతావరణమే అదోలా.... ఎప్పుడూ ఏదో ఆపద పక్కనే పొంచి వున్నట్టూ వుంది.
