"ప్రేమంటే అలా ఉంటుందన్నమాట" మనసులో అనుకోబోయి పైకి అన్నాడు.
"ఏమిటీ?"
"ఏం లేదు డాక్టర్! ఏం లేదు."
సరీగ్గా ఆ సమయానికి సౌదామిని ఆ గదిలోకి రొప్పుతూ పరుగెత్తుకు వచ్చింది. ఆమె కాలేజీకి వెళుతూ ప్రతిరోజులాగే టెంట్ కేసి చూసేసరికి అది ఖాళీగా వుంది. ఒకమ్మాయి, నల్లబాడ్జీ పెట్టుకుని తిరుగుతూంది. బాలూ మరణశయ్య మీద ఉన్నాడని చెప్పింది. సౌదామినికి ఏవో బంధాలు తెగినట్టు అనిపించింది. అక్కడినుంచి ఒక్క ఉరుకులో ఆస్పత్రికి వచ్చింది.
బాలు కాళ్ళ దగ్గిర సుబ్బారావు బాల్చీ ఏర్పాటు చేస్తున్నాడు.
"ఎలా వుంది?" అని అడిగింది. ఆమె ఏ క్షణమైనా ఏడ్చేసేటట్టు వుంది.
"లాభం లేదు. అంతా అయిపోవచ్చింది" అన్నాడు సుబ్బారావు నిర్లిప్తంగా.
ఆమె ఒక్క ఉదుటున బాలు దగ్గిరకి వెళ్ళింది. అతడి చెవి దగ్గిర నోరుపెట్టి కంపిస్తూన్న కంఠంలో "ఐ లవ్యూ" అంది.
బాలూ కనురెప్పలు కదిలాయి.
ఆమె ఇంకా చెపుతూనే వుంది. "....నిజంగానే ఐ లవ్యూ ఇప్పుడే కాదు, ఎప్పట్నుంచో... కానీ చెప్పటానికి భయం వేసింది. నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను."
అంతే బాలూ చేతికి కట్టివున్నా గ్లూకోజ్ బాటిల్ లో ద్రవం వొక్కసారి తగ్గిపోయి, శరీరంలోకి ప్రవహించింది.
గుండె చుక్క కార్డియోగ్రామ్ లో వేగంగా కదలసాగింది.
బాలూ కళ్ళు విప్పాడు.
"పళ్ళరసం - పళ్ళరసం" అరిచాడు డాక్టర్.
"మౌత్ టు మౌత్ ఇస్తే బావుంటుంది. డాక్టరుగారూ!" అన్నాడు బాలూ అంత నీరసంలోనూ సౌదామిని వంక రవ్వంత ఆశగా చూస్తూ.
సౌదామిని సిగ్గుతో ముసిముసిగా నవ్వింది.
* * *
సౌదామిని- బాలుల ప్రణయ వృత్తాంతం, సుబ్బారావు తన చెల్లెలికి చెప్పిన నలభై అయిదు నిముషాల్లోగా కాలేజీ మొత్తం అది తెలిసిపోయింది.
బాలు ఎవరికోసం నిరాహారదీక్ష చేశాడో అమ్మాయిలకి అర్ధం అయింది. మొదటి అయిదు నిమిషాల్లో సుబ్బారావు చెల్లెలు మరో ఇద్దరికి చెపుతుంది. మొత్తం ముగ్గురికి ఈ విషయం తెలుస్తుంది. ఆ ఇద్దరూ మరో ఇద్దరికి చెపుతారు. పది నిమిషాల్లో 3 + (2 x 2) = 7 మందికి తెలుస్తుంది.
15 నిముషాల్లో 7 + (4 x 2) = 15 మందికి.
20 నిముషాల్లో 15 + (8 x 2) = 31 మందికి. అలా అలా
45 నిముషాల్లో 511 + (256 x 2) = 1023 మందికి తెలుస్తుంది.
రూమర్లు ఇంత వేగంగా వ్యాప్తి చెందుతాయి.
4
కోట...! రోడ్డు పక్కనే ఆనుకుని వున్న దాని గోడ కొన్ని మైళ్ళ దూరం వరకూ వ్యాపించి వున్నట్టూ కనబడుతోంది. లోపలనుంచి చెట్ల కొమ్మలు గోడమీదనుంచి ఇవతలికి వాలి వున్నాయి. ఎత్తుగా వున్న గుట్టమీద పెరిగిన రెల్లుగడ్డి చిన్న అడవిలా కనిపిస్తోంది. దూరంగా ఎక్కడనుంచో లీలగా వేటినో కొడుతున్నట్టు, ఏదో విరుగుతున్నట్టూ శబ్దం వస్తోంది. ఇక్కడేదో బోన్ మిల్లు ఉన్నట్టూ గుర్తు. బాలూ దృష్టి గోడపైన వున్న చిన్న బోర్డుమీద పడింది. అతని అంచనా నిజమే.
"యంగ్ మెన్ బోన్ మిల్".
అతనికి నవ్వొచ్చింది. యువకులందరూ కలిసి స్థాపించిన బోన్ మిల్లా? యువకుల ఎముకల మిల్లా? అర్ధం చూసుకోకుండా పెడతారు. గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. దేవాలయానికి ముందుండే సింహద్వారంలా వుంది. పన్నెండు అడుగుల నిలువెత్తు తలుపులు వేసివున్నాయి. ఎడమవైపుకి తలుపు తోసి మనిషి లోపలకు వెళ్ళబోయాడు.
"ఎవరది?" అన్న గొంతు కర్కశంగా వినబడింది. తల తిప్పి చూశాడు. పక్కనే స్టూలుమీద గూర్ఖాలాంటి వాడు కూర్చుని వున్నాడు. మాంసం అమ్మే దగ్గర కనబడితే కసాయి వాడిగానూ, మల్లయుద్ధం జరిగేచోట కనబడితే పోటీకి వచ్చిన వాడిగానూ అనుకుంటారు వాణ్ణిచూసి. ఇంత పవిత్రమైన ఆవరణలో వాడో దిష్టిబొమ్మలా కనబడ్డాడు. "ఏం కావాలి?"
"బ్రహ్మానందగారిని కలుసుకోవాలి?" అన్నాడు బాలు.
"దేనికి?"
"ఒక పెళ్ళి సంబంధం మాట్లాడడానికి."
వాడి మొహం కూడా భావాల్ని ప్రతిబింబించగలదని తెలిసింది. "ఏమిటీ?" అన్నాడు.
"ఎందుకిన్నిప్రశ్నలు? వెళ్ళి చెప్పలేకపోతే కబురంపించు" అన్నాడు బాలు విసుగ్గా.
"అప్పాయింట్ మెంట్ వుందా?" అని అడిగాడు.
కొంచెం ఆశ్చర్యం వేసింది బాలూకి.
"చూడటానికి అప్పాయింట్ మెంట్ ఏమిటి? ఆయనేమన్నా ప్రధానమంత్రా? ప్రెసిడెంటా? వెళ్ళి ఎవరో వచ్చారని చెప్పు" అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు.
కాని వాడి మొహంలో ఏ మార్పూలేదు. మీలాంటి వాళ్ళని చాలామందిని చూశాం అన్నట్టూ అలాగే తాపీగా కూర్చుని "ముందు చెప్పకుండా ఆయన ఎవర్నీ కలుసుకోరు" అన్నాడు.
"ముందంటే ఎవరికి చెప్పాలి?" అన్నాడు బాలు. ఇదేదో కోడి ముందా గుడ్డు ముందా అన్న సమాధానంలా వుంది.
"ఆంజనేయులుగారికి గానీ, చిన్నమ్మగారికి గానీ చెప్పి పర్మిషన్ తీసుకోవాలి."
"చిన్నమ్మగారంటే ఎవరు?"
"సౌదామినమ్మ గారు."
బాలు చిన్నగా విజిల్ వేసి "ఓ, ఆవిడే నాకు అప్పాయింట్ మెంట్ ఇచ్చింది" అని వాడికి టోకరా ఇవ్వబోయాడు. కాని వాడు ఇటువంటివి చాలా చూసినట్టున్నాడు. చేయిసాచి "ఏదీ ఆ పర్మిషను కాగితం?" అని అడిగాడు.
లేదని చెప్పి బైటకి వచ్చేశాడు బాలు. ఇంక వాడితో వాదన అనవసరం అనిపించింది.
బ్రహ్మానందాన్ని కలుసుకోవటానికి పర్మిషన్ ఇవ్వగల వారిలో సౌదామిని కూడా ఒకరంటే ఆమెకి ఈ ఆశ్రమంలో పెద్ద స్థానం ఉందన్నమాట.
ఆమెతో పెళ్ళికోసం వెళ్తూ ఆమె అనుమతి తీసుకోవటం నామర్ధాగా తోచింది. పర్మిషన్లూ, అప్పాయింట్ మెంట్లతో తప్ప మామూలుగా కలుసుకోలేని బ్రహ్మానంద గాడికి హఠాత్తుగా ఎదురుపడి చిన్న షాక్ ఇవ్వాలనుకున్నాడు. గేటు దగ్గర్నుంచి కొంత దూరం వెనక్కి నడిచి గోడ విరిగి ఎత్తు కాస్త తక్కువగా ఉన్న చోటనుంచి లోపలికి దూకాడు.
తను ఆ క్షణం చేసిన తొందరపాటు చర్య భవిష్యత్తులో తనని ఇన్ని బాధలు పెడుతుందని, ఇంత వ్యధ కలిగిస్తుందని బాలూకి తెలీదు. ఇంత దారుణమైనఫలితం అనుభవించవలసి వస్తుందాని ఆ క్షణమే తెలిసివుంటే సౌదామిని మాట మన్నించి ఆమె ఛాయలకి గానీ, ఆ కోట దరిదాపులకి గానీ వెళ్ళి వుండేవాడు కాదు. అతను దూకినచోట దాదాపు మనిషి ఎత్తున గడ్డి మొలిచి వుంది. దూరంగా అక్కడక్కడా విసిరేసినట్టున్న పాకలూ, కుడివైపు ఒక పురాతన భవంతిలాంటి ఇల్లూ వున్నాయి. బోన్ మిల్ శబ్దం ఇక్కడికి స్పష్టంగా వినిపిస్తోంది. వాటికితోడు కోళ్ళ అరుపులు! శత్రు రహస్యాన్ని కనుక్కోవటానికి వాళ్ళ కోటలోకి ప్రవేశించిన గూఢచారిలాగా వుంది అతని మనోపరిస్థితి. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ భవంతివైపు బయలుదేరాడు. అతనికి ఆశ్చర్యం గొలిపే విషయం ఏమిటంటే అంత పెద్ద ఆవరణలోనూ మనుష్య సంచారం అతి తక్కువగా వుండటం. తనలో తాను ఆశ్చర్యపడుతూనే భవంతిని సమీపించాడు బాలు.
ముందువైపు పొడవాటి వరండా వుంది. కాలేజి హాస్టల్ కుర్రవాళ్ళ గదుల్లా ఉన్నాయవి. గదుల వెనక భాగం అంతా ఎత్తుగా పెరిగిన పిచ్చి మొక్కలు వున్నాయి. ఎదురుగా ఎవరన్నా కనపడితే బ్రహ్మానంద ఎక్కడుంటాడో అడుగుదామనుకున్నాడు. కాని ఎవరూ కనపడలేదు. అంతలో అతని దృష్టి మొట్టమొదటి గది కిటికీ మీద పడింది. ఆ కిటికీ రెక్క కొద్దిగా తెరిచి వుండటంతో లోపలికి తొంగి చూశాడు.
లోపల టేబిల్ ముందు ఒక నల్లటి వ్యక్తి కూర్చుని వున్నాడు. అతడు అలా ఏకాగ్రతగా పనిచేస్తున్నాడు. టేబిల్ మీద కోడిగ్రుడ్లున్నాయి. అతడేం చేస్తున్నాడా అని పరీక్షగా చూశాడు. చిన్న రంధ్రంతో డొల్లచేసి వాటిని శుభ్రం చేస్తున్నాడు. ఎంత చిన్న రంధ్రంచేసి అతడు వాటిని ఖాళీ చేస్తున్నాడంటే మామూలుగా చూస్తే అది నిండు గ్రుడ్డులాగే వుంటుంది. కోడిగుడ్డు డొప్పలమీద బొమ్మలు వేసేవాళ్ళు కూడా ఆశ్రమంలో వున్నారన్నమాట అనుకున్నాడు.
అలాగే నడుచుకుంటూ రెండో గది దగ్గరకు వెళ్ళాడు. మిగతా వాటికి విరుద్దంగా వుంది ఆ గది. గుమ్మం పక్కనే బోర్డు మీద బ్రహ్మానంద అని వ్రాసి వుంది. తలుపు కొట్టబోయేటంతలో లోపల్నుంచి తన పేరు వినబడింది.
అతని ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించటం మొదలు పెట్టింది. తలుపు తట్టే ఉద్దేశం మానుకున్నాడు. గదుల వెనుకవైపు వున్న కిటికీల సంగతి జ్ఞాపకం వచ్చింది. చప్పున వరండా కిందికి దిగాడు. దూరంగా ఎవరో ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అతన్ని పట్టించుకోలేదు. అదే వేగంతో గదుల వెనక్కి వెళ్ళి కిటికీలోంచి లోపలి జాగ్రత్తగా వంగి చూశాడు. లోపల ఒక ఎత్తయిన కుర్చీలో బ్రహ్మానంద కూర్చుని వున్నాడు. ఎదురుగా తలవంచుకుని బిక్కమొహంతో నిలబడివుంది సౌదామిని.
"అయితే నీకూ అతడికీ ఏ సంబంధమూ లేదంటావ్?"
లేదన్నట్లు ఆమె తలూపింది.
"నువ్వూ అతడూ ఎన్నిసార్లు కలుసుకున్నారు!"
"ఒకేసారి".
"ఎప్పుడు?"
"ఇంటర్ కాలేజీ కాంపిటీషన్లలో."
"తరువాత కలుసుకోలేదా?"
"లేదు".
అతడు నెమ్మదిగా తలెత్తి ఆమెవైపు నవ్వుతూ చూశాడు. ఎందుకో తెలీదుగానీ ఆమె చిగురుటాకులా విపరీతంగా వణికిపోతోంది. అంత భయపడవలసిన అవసరం ఏముందో అర్ధం కాలేదు బాలూకి.
అతనన్నాడు- "అదేమిటి సౌదామినీ! నీకూ ఈ మధ్య జ్ఞాపకశక్తి నశిస్తుందా ఏమిటి? మొన్నేగా అతణ్ణి ఆస్పత్రిలో కలుసుకున్నావ్! అంతకుముందు ఓ పదిహేను రోజుల క్రితం నిన్నో గంటసేపు కన్విన్స్ చెయ్యటానికి ప్రయత్నించాడు కూడానూ. ఇంత పెద్ద పెద్ద విషయాలే మర్చిపోయినదానిని అసలు క్లాస్ పాఠాలు జ్ఞాపకం ఉంచుకుంటున్నావా? పరీక్షపోతే అది అవమానం సుమా.... పోనీ 'వసంత యామినీ..... జీవిత సౌదామినీ' అన్న పాట జ్ఞాపకం లేదూ! ఈ వయసులోనే అన్నీ మర్చిపోతే ఎలాగమ్మా!" పిడికిలి బిగించి మొహంమీద కొట్టినట్టయింది బాలూకి.
