తులసమ్మ మాట్లాడలేదు.
పది నిమిషాల్లో ఆటో వచ్చింది.
ఇంటికి తాళం వేసి తాళం జేబులో పెట్టుకుని, "మీరు నర్సింగ్ హోమ్ కి పదండి, నేను సుధాకర్ ని తీసుకొస్తా...." అంటూ స్కూటర్ మీద వెళ్ళిపోయాడు చంద్రయ్య.
నర్సింగ్ హోమ్ మెట్లు ఎక్కి లోపలికెళ్ళగానే చెప్పింది మహాలక్ష్మి-
"ఆ విల్లు రాసేసాను.... మొన్ననే.... నా కూతురి పేర! అది దాందే....!" అంది రహస్యంగా తులసమ్మతో.
* * *
చీకట్లో గేటు బయట నిలబడింది చాలాసేపు లీల.
సుమతి మాటలు ఈటెల్లా గుండెల్లో నాటుకున్నాయి. చీకట్లో అలా నడిచింది. ఎంతవరకూ నడవగలదూ, ఇంతకీ పిల్ల ఏదీ!! ఎక్కడ వుంచారూ, ఈ ఇంటివాళ్ళెవరో, తనెవరో!! ఎవర్ని అడుగుతుంది? లీల కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి.
ఇంటికెళ్ళిపోతే..! వెళ్ళిపోవాలి, గబగబా నడిచింది - ఒళ్ళు తూలిపోతోంది!
అసలు ఎందుకీ పరిస్థితి!! ఆ వరదేమిటీ తన పాలిట శత్రువులా, తన జీవితాన్ని పాతాళానికి అణచేసింది!!
ఇంటికెలా వెడుతుంధీ, పిల్లలేకుండా - సుధాకర్ ఇంట్లోకి రానిస్తాడా!! పోనీ, సుధాకర్ ని వెంటపెట్టుకుని ఈ ఇంటికొచ్చి తన పిల్లని తనకిమ్మని అడిగితే బాగుంటుందిగా!! ఏదో ఆశ మనసులో మెదిలింది. అంతలోనే గుండెల్లో భయం - కోపంగా ఇంట్లోంచి బయట కొచ్చేసిన తనని, ఈ రోజు పిల్లని కూడా లేకుండా వెడితే సుధాకర్ రానిస్తాడా?
లీల తిన్నగా వెళ్ళి ఆ పెద్ద భవనం ముందు ఆగింది. అప్పుడే కారు బయటికి తీస్తున్న జానకి లీలని చూసి- "రావే... అలా నిలబడిపోయావేమిటీ? ఏమిటీ రూపం, ఏమిటా చూపులూ..!" అంటూ ఆప్యాయంగా స్నేహితురాలిని లోపలికి తీసుకొచ్చింది.
"ఏమైందీ....నీ భర్తా, పాప అంతా బావున్నారా? ఎక్కడినించి వస్తున్నావ్?" అంది వేడి కాఫీ చేతికందిస్తూ.
లీల నోట మాట రాలేదు- 'భర్తకి, పిల్లకి దూరమైన దిక్కులేనిదాన్ని నేను!' అని చెప్పాలి- ఎలా? దీర్ఘంగా నిట్టూర్చింది లీల.
ఏమీ అర్ధంకాక కంగారుపడిపోయింది జానకి. "లోపలికొచ్చి పడుకో కాసేపు!" అంటూ గదిలోకి తీసుకెళ్ళింది.
గుండె పగిలేలా ఏడుస్తున్న లీలని చూస్తుంటే జానకికి ఏంచేయాలో తోచలేదు.
"గుప్పెడన్నం తిని పడుకో.... రేపు చెబుదువుగాని అన్నీ!" అంది జానకి.
లీల వెక్కివెక్కి ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియక, అసలు ఎం జరిగిందో తెలియక భయపడిపోయింది జానకి. లీల ఏడుపు ఆపింది.
రాత్రి 10 గంటలైంది.
క్లబ్బుకెళ్ళిన మాధవరావు ఇంకా రాలేదు. గదిలోంచి లీల ఏడుపు సన్నగా విన్పిస్తోంది. 'పిల్ల ఏదీ....' అనే భావం జానకి మనసుని వదలటంలేదు. పిల్ల చచ్చిపోయిందా, అందుకా దీని బాధ!!
కారు పోర్టికోలో పెట్టి లోపలకొచ్చిన మాధవరావు భార్య జానకి వైపు చూసాడు. వెళ్ళేప్పుడు కోపంగా వున్నా జానకి ఇప్పుడు విచారంగా వుంది.
"జానీ.... ఏమిటీ, ఇంకా పడుకోలేదా?" అన్నాడు.
జానకి మాట్లాడకుండా భర్తని పడగ్గదిలోకి తీసికెళ్ళి తలుపేసింది.
జానకి చెప్పే మాటలు అర్ధంకాలేదు మాధవరావుకి! లీల మాధవరావుకి బాగా తెలుసు- జానకి స్నేహితురాలిగా... అంతే! కానీ, పిల్ల పుట్టాక ఒకటి రెండుసార్లు పిల్లతో జానకి ఇంటికొచ్చింది లీల.
"పాపం- చూసారా... మా లీల భర్త ఎంత దుర్మార్గుడో! అమ్మ ఇల్లు నాకు రాసిమ్మని ఒకటే గొడవట! ఎవరికిస్తుంది లెండి- వెళ్ళేప్పుడు పట్టుకెడుతుందా? అయినా ఇప్పుడే అన్నీ ఊడ్చి యిచ్చేయమంటే ఎలా? పాపం.... మా లీల ఎం చెప్పాలో తెలియక ఏడుస్తోంది!" అంది.
ఒకసారి మాధవరావు హాయిగా నవ్వాడు.
"ఏమిటా నవ్వు..?" అంది జానకి.
"లేకపోతే ఏంటీ... మీ స్నేహితురాలి కష్టాలన్నీ నీకేనా? ఆ అమ్మాయి తేల్చుకుంటుంది ఎం చేయాలో! - నీకేమిటి మధ్య? రాత్రిడిన్నరు- తంబోలా క్లబ్బులో ... పద పద!" అంటూ మనసుకేమీ పట్టించుకోలేదు. అసలు ఎవరి కష్టాలూ వినటం మాధవరావుకి ఇష్టం వుండదు. ఎవరి సమస్యలు వాళ్ళవీ... అనేది అతని పద్దతి.
పాపం... జాలిపడిపోయి, తనేం సహాయం చేయగలదో అది చేసేయాలని తాపత్రయ పడిపోతుంది జానకి. అదీ ఇద్దరి స్వభావాల పద్దతి!
ఆ రాత్రి జానకి మాటలకి మళ్ళీ నవ్వాడు మాధవరావు.
"రాత్రికి హాయిగా నిద్రపోనీ! పొద్దున్నే ఆవిడ ఇంటికి ఆవిడ్ని పంపించేయి...అంతే!" అన్నాడు డ్రెస్ మార్చుకుంటూ.
"అలా కాదు, ఆ పసిపిల్ల..." ఏదో చెప్పబోయింది.
"నోరు మూసుకో, ఆ పసిపిల్ల గురించి ఏం తెలుసు మనకి?! మనకెందుకు... ఒకవేళ ఆ పిల్ల మరణిస్తే, పాపం- నీ ఫ్రెండును ఓదార్చి పంపేయి. డబ్బు కావాలంటే ఓ నాలుగొందలు ఇచ్చి పంపేయి - అంతే! ఇంకా ఆ విషయం మాట్లాడకు- నాకు చిరాగ్గా వుంది" అంటూ మంచంమీద వాలిపోతూ, భార్యని కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి చేసాడు మాధవరావు.
ఆ రాత్రంతా నిద్రపట్టక అటూ ఇటూ కదులుతూ గడిపింది జానకి.
"తెల్లవారకుండానే, మళ్ళీ వచ్చి చెప్తా అన్నీ!" అంటూ జానకికి కనిపించి వెళ్ళిపోయింది లీల.
తిన్నగా ఇంటి దగ్గర ఆగింది.
తనింటికి తాళం..! 'ఎక్కడికెళ్ళారో...' అనుకుంటూ గబగబా తల్లి యింటివైపు నడిచింది. ఇంటికి తాళం!! అదేమిటి.... ఎవరూ ఎక్కడా లేరేమిటీ!! ఏమయ్యారంతా - తులసమ్మ పిన్ని దగ్గరకెడితే తెలుస్తాయి విషయాలు!- అనుకుంటూ, నాలుగడుగులేసిందో లేదో, ఎదురుగా ప్రత్యక్షం..!
"ఎక్కడికెళ్ళిపోయావ్? - మీ అమ్మని నేను, తులసమ్మ ఆ నర్సింగ్ హోమ్ లో చేర్పించాం... అయినా చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా? రా... స్కూటర్ పై కూచో, తీసికెడతా"
లీల మరో మాట లేకుండా చంద్రయ్య స్కూటర్ వెనక కూచుంది. సుధాకర్ ఎక్కడున్నాడని అడగాలనుకుంది. పిల్ల గురించి అడిగితే ఏం చెప్పాలి? అమ్మ ముఖం ఎలా చూడాలీ? మైండ్ మొత్తం పాడైపోయింది లీలకి. దిక్కులు చూస్తూ ఆ స్కూటర్ వెనక అలానే కూర్చుంది.
నర్సింగ్ హోమ్ లో అడుగుపెట్టడం ఆలస్యం- తులసమ్మ ఎదురైంది. గొల్లున ఏడ్చింది. 'మహాలక్ష్మమ్మ మరణించింది.... కార్డిక్ అరెస్ద్ అన్నారు. గుండె ఆగిపోయి మరణించింది అన్నారు డాక్టర్లు..!
లీల పిచ్చి చూపులు చూస్తోంది. మందులు తీసుకువచ్చిన సుధాకర్ లీలని చూసి ముఖం తిప్పుకున్నాడు.
"ఏ మందులతోనూ ఇక పనిలేదు" అంది తులసమ్మ కన్నీళ్ళు తుడుచుకుంటూ.
కాలం ఎవరితోనూ పనిలేకుండా పరిగెత్తుతుంది. సుధాకర్ కి, చంద్రయ్యకి ఆ రోజు పెద్ద పోట్లాట జరిగింది.
"నీ మూలంగానే నా కుటుంబమంత చెల్లాచెదురై పోయింది" అన్నాడు సుధాకర్.
"ఏమిటీ- ఇంత విశ్వాసఘాతకుడవని అనుకోలేదు. పాపం- నాలుగు అక్షరం ముక్కలు చదివిద్దామండీ.... అంటూ నీ పిన్ని నన్ను వేధించేసింది."
"పోన్లే అని నీ చదువుకి ఖర్చు చేసా..! మీ నాన్న వ్యాపారంలో నష్టపోయాడంటే పోన్లే అని నా డబ్బు అడ్డం వేసా! మీ పనులన్నీ, అయ్యాక నేను చెడ్డవాడినా? - పైగా ఆ ముసలిది ఇల్లు నీ పేరా రాస్తే, నాకున్న అప్పులూ తీర్చుకోవచ్చు. నువ్వు నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని నీ మేలుకోరి చెప్పా..!" చంద్రయ్య ఊరందరికీ వినిపించేలా అరుస్తున్నాడు.
"కాదు బాబాయ్- ఆ ఇంటి గొడవల్తోనే నా భార్య నాకు కాకుండాపోయింది. నా పిల్ల ఆ వరదలో ఎక్కడ కొట్టుకుపోయిందో! అయినా, నీకున్న డబ్బంతా ఏం చేస్తావు? నీకు పిల్లజెల్లా లేరు, నన్ను పెంచుకుంటున్న, దత్తత చేసుకుంటున్నా అని అందరికీ చెప్పావు. ఇప్పుడు ఆ ఇంటిమీద నీ ఆశ ఏమిటీ - అది నేను అమ్మి నీకు డబ్బివ్వటమేమిటీ- నీలాటివాళ్ళే పయోముఖ విషకుంభాలు... ఛీ!!" అరిచాడు సుధాకర్.
చంద్రయ్య మాట్లాడలేదు. కాసేపాగి -
"ఒరేయ్... నా మాట విను. నీ మనసు ఎంత బాధగా వుందో నాకు అర్ధమవుతోంది..... ఆ పిల్లని ఎక్కడ వదిలిపెట్టిందో నీ భార్యని అడుగుదాం. ఆ ఇంటి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమలాడదాం - అంతే కానీ, ఇలా వ్యవహారం చెడగొట్టుకుంటే ఎలా..?" అన్నాడు ఓదార్పుగా చంద్రయ్య.
"నేనొస్తా నీతో ఆ యింటికి! లీలని చూపించమను, దాని పిల్లని దానికిప్పిస్తా!" అన్నాడు దైర్యంగా.
సుధాకర్ కి ఈ మాటలు ఏవీ నమ్మబుద్ది కాలేదు. ఆ భయంకరమైన వరదలో పిల్ల కొట్టుకుపోయి వుంటుంది. లీల చెప్పే మాటల్లో నిజం లేదు.
ఒకవేళ నిజంగా ఓ గుమ్మంలో దించినా, ఎవరికి పట్టింది..ఆ పసిగుడ్డుని రక్షించడానికి...?!
ఆ కుటుంబం వాళ్ళు పరువు మర్యాదలు గలవాళ్ళయితే, "మా పిల్లని మీరు దాచారు" అంటే, ముందే గెంటేస్తారు - అంతే.
'ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సతాలయాత్' అని ఏనాడో చెప్పారు.' ఆ పిల్ల చచ్చిపోయిందని మనసు రాయి చేసుకోవా'లంతే.....! సుధాకర్ ఆవేశం చల్లారింది.
