Previous Page Next Page 
మమత పేజి 10

"బాబాయ్ కోపంతో ఏదో అనేశాను. మనసులో పెట్టుకోకు. నా ఉద్యోగం ఎలాగో ఊడింది. ఇక్కడేం చేస్తానూ.... వస్తే నా భార్యని తీసికెడతా, లేకపోతే విజయవాడ వెళ్ళిపోతా, ఏదో బతికేస్తా, లేకపోతే చస్తా....!" అన్నాడు దీనంగా.
సుధాకర్ ని చూస్తే జాలేసింది చంద్రయ్యకి.
చంద్రయ్య మంచివాడేకానీ దురాశపరుడు....
"అబ్బాయ్, అలా మాట్లాడకురా....నిన్ను చూసుకునే నేనూ, పిన్నీ ఆనందిస్తుంటాం మీ పిన్నికి అక్క కొడుకువైనా, కొడుకువైనా నువ్వేకదా....?! ఎక్కడికీ వెళ్ళద్దు....!" అంటూ చంద్రయ్య గుమ్మంలోకి చూశాడు.
లోపల గదిలో ఎవరో ఏదో సర్దుతున్నారు.
"ఎవరూ...? తులసమ్మా...?" అన్నాడు.
"నేనే....!!" అంది నెమ్మదిగా గదిలోంచి బయటికి వస్తూ.
సుధాకర్ కి అర్ధం కాలేదు.... ఏం చేస్తోందో లోపల....
"ఏం చేస్తున్నావ్....?" అంది లీల.
తులసమ్మ లీలకేసి చూసి కనుసైగ చేసింది.
కిందపడ్డ కాగితాలు గలగల్లాడాయి.
చంద్రయ్య ఫక్కున నవ్వాడు.
'ఇంక దాపరికం అనవసరం..' అనుకుంది తులసమ్మ.
సుధాకర్, లీల కళ్ళప్పగించి చూస్తున్నారు.
చంద్రయ్యకి అంతా తెలుసు.
"చూడు తులసమ్మా.... ఆ ముసల్ది ఛస్తూ ఏం చెప్పింది నీకు?" అన్నాడు.
"ఇల్లు లీల పేర రాసింది. ఆ కాగితాలు నన్ను భద్రం చేయమంది" అంది తులసమ్మ.
చంద్రయ్య మళ్ళా నవ్వాడు.
"ఎప్పుడు చెప్పింది?" అన్నాడు.
"నర్సింగ్ హోమ్ లో...!" అంది తులసమ్మ.
క్షణం నిశ్శబ్దం!
చంద్రయ్య ఏం చెప్తాడోనని అందరూ ఎదురు చూస్తున్నారు.
"ఆ విల్లు చించిపారేయి..! చించేయమని నాకు చెప్పింది. అంతే కాదు లీలా....! విను ఆ ఇల్లు....ఇంట్లో వున్నవన్నీ అల్లుడు సుధాకర్ కి చెందాలని.... అతనే కొడుకైనా, అల్లుడైనా, తనకి తలకొరివి పెట్టాలి కనక ఈ ఏర్పాటు చేస్తున్నట్లు రాసింది. ఆ విషయం నీకు చెప్పలేదా...?"
"అబద్దం...!" అరిచింది తులసమ్మ.
"అన్యాయం" అరిచింది లీల.
సుధాకర్ ఆశ్చర్యంగా వింటున్నాడంతే.
"తులసమ్మా, నువ్వు అనవసరంగా ఆవేశపడిపోకు. ఆరోజు నువ్వు వచ్చేసరికి మహాలక్ష్మమ్మకి నీళ్ళ గ్లాసు నోటికందిస్తున్నాను....చూసావుగా....అప్పటికి ఆ ఇంటికి నేనొచ్చి చాలాసేపయింది..... ముందు విల్లు రాయించటం అయ్యాక నీ దగ్గరకొచ్చి నిన్ను వెంట తీసుకొద్దామనుకున్నా.... ముందు నన్ను వెళ్ళమన్నావు - వచ్చి మంచినీళ్ళ గ్లాసుతో తాగించా ... అప్పటికే ఒకసారి గుండె నొప్పి వచ్చింది - ఇంక నువ్వు ఎంత మొత్తుకున్నా, ఏ కోర్టుకి వెళ్ళినా చేసేదేమీ లేదు.... ఫో..!" అన్నాడు చంద్రయ్య.
లీల భగభగ మండిపోయింది- చంద్రయ్యని చూస్తుంటేనే కాదు....
సుధాకర్ ని చూస్తుంటే..!
అంత మోసగాడి చేతికి చిక్కిన భర్తవైపు చూస్తూ-
"మీ కోరిక తీరిందిగా..? ఇల్లు మీ పేర మోసం చేసి రాయించుకున్నారుగా...ఇంకేం కావాలీ..? నా కర్మ ఎలాగు కాలిపోయింది.... నా పిల్ల ఏమైపోయిందో, ఏమో!!"
లీల పెద్దగా ఏడుస్తూ పడిపోయింది.
సుధాకర్ లేవదీసి ఒళ్ళో పెట్టుకున్నాడు...
చంద్రయ్య స్కూటర్ వేసుకు వెళ్ళిపోయాడు.
ఆ సాయంత్రం తులసమ్మ లీలని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది.
ఆ సాయంత్రమే సుధాకర్ ఊరు వదలి విజయవాడ స్నేహితుడి దగ్గర పనిచేయటానికి వెళ్ళిపోయాడు. ఒక్క వ్యక్తి దురాశ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసింది.
"మీ పాదాలదగ్గర పిల్లని పెట్టి అప్పుడు చస్తాను- అంతవరకు అంతే!" అంది ఏడుస్తూ లీల.
"ఆరోజు మీమూలాన్నేగా పిల్లతో బయటకెళ్ళిపోయాను"
- లీల ఏడుపు గొంతు- సుధాకర్ వెడుతున్న బస్సు రొదలో కూడా గుండెల్లో కదులుతోంది.  
                                      *    *    *
సింగపూర్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారు క్లబ్బు స్నేహితులంతా.
షాపింగ్ చేసి రకరకాల వస్తువులు కొనుక్కొచ్చిన జానకి, ఇంట్లో అవన్నీ చూస్తూ మురిసిపోయింది. ఇంటికొచ్చిన వాళ్ళందరికీ సింగపూర్ కబుర్లు చెప్తూ, వస్తువులు చూపిస్తూ గలగల మాట్లాడుతోంది జానకి- స్నేహితురాళ్ళతో అక్కడ తీసిన ఫోటోలు ఎన్నో!
"భలేగా వున్నాయి కదూ!" అంది అవి చూస్తూ భర్తతో ఆ రాత్రి జానకి.
"ఎందుకు బావుండవూ- ఎంత ఖర్చయిందో తెలుసా..?" అన్నాడు.
"ఆ... ఎంతయితేనేం-హాయిగా ఎంజాయి చేసామా, లేదా.... అదీ కావలసింది! అయినా డబ్బున్నప్పుడు అనుభవించకపోతే ఎలా"? లేనివాడూ ఏడ్చి, వున్నవాడూ ఏడిస్తే ఎలా? లోకంలో రెండు రకాల ధనవంతులట- ఒకరు లక్ష్మీ పుత్రులు, ఒకరు లక్ష్మీ సేవకులు! లక్ష్మీపుత్రులు హాయిగా జీవితంలో అన్ని సుఖాలూ అనుభవిస్తారు. లక్ష్మీ సేవకులు డబ్బు లెక్క పెట్టుకుంటూ, దానికేసి చూస్తూ ఆనందిస్తారు. ఒకరికి దానం చేయాలన్నా, వారు అనుభవించాలన్నా మనసొప్పదు. వాళ్ళు సేవకులు కదామరి. అందుకు!"
"ఐతే... మనం ఎవరమంటావూ..?" అన్నాడు మాధవరావు అటు తిరిగి ఒత్తిగిలి పడుకుంటూ-
"ఇంతసేపు విన్నాక. నేను చెప్పాలా- మనం పుత్రులమే! డబ్బుతో హాయిగా సుఖపడాలి. అందుకేగా- ఈ జనవరిలో యూరప్ ట్రిప్ ఆలోచిస్తున్నా!" అంది జానకి ఆవులిస్తూ.
"నిజమేలే, మనం దాచి ఎవరికీ పెట్టాలీ?" అన్నాడు భర్త.
జానకి ముఖం ఒక్కసారి వెలవెలపోయింది.
తనకి పిల్లలు లేరు. తను గొడ్రాలు- అతను పిల్లల్ని పెంచుకునే పద్దతి ఒప్పుకోడు! అంటే... ఇక తన బతుకు..?!
జానకి గబుక్కున మంచం మీదనుంచి లేచింది. మాధవరావు చూస్తున్నాడు. చూడనట్లూరుకున్నాడు. పెట్టెలో అట్టడుగుణ దాచిన చిన్న గౌను బయటికి తీసి చూసి పెట్టేసింది. అది ఎవరికోసం కొందో తెలుసు మాధవరావుకి!
చటుక్కున వీణ గుర్తొచ్చింది ఆ రాత్రి జానకికి. ఆ ఫ్రాకు మమత కోసం తను కొంది. రేపు ఇచ్చి రావాలి. అంతేకాదు.... ఆ పిల్లని ఏ అనాధ ఆశ్రమం నుంచి తెచ్చిందో, ఆ ఆశ్రమం వాళ్ళ రూల్సు ఏమిటో అన్నీ కనుక్కోవాలి. ఎంత డబ్బు కట్టాలో తెలుసుకోవాలి. ఆరోజు ఏమీ కనుక్కోలేదు తను.... సింగపూర్ లో షాపింగ్ చేస్తుంటే చిన్న చిన్న గౌన్లు చాలా ముద్దుగా కనిపించాయి. కొంటున్నపుడే నవ్వాడు భర్త- అదీ గుర్తొచ్చింది జానకికి. తనేం తప్పు పని చేయటం లేదు!! 'రేపే వెడతాను. వీణతో మాట్లాడతాను' అనుకుంటూ క్షణాల్లో నిద్రలోకి జారుకుంది జానకి ఎంతో సంతోషంతో.
తులసమ్మ నడిపే ఆశ్రమంలో చాలామంది వున్నారు. ఆ వృద్దుల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఎందుకిక్కడుంటారు?
'- మా అబ్బాయి ఏమీ అనడు. మా కోడలే నన్నిక్కడ చేర్పించేవరకూ వాడి ప్రాణం తీసేసింది' అంటుంది ఒకామె.
'అత్త గారు పనికిరాదు, అమ్మ పనికొస్తుంది, ఇంతకీ తప్పు మాదే. ఉన్నప్పుడు పిల్లలు, పిల్లలని అంతా ఊడ్చిపెట్టాం- ఇప్పుడనుభవిస్తున్నా!' అంటుంది ఇంకో ఆమె.
'ఏదో తులసమ్మ దయదలచబట్టి ఇక్కడ తలదాచుకున్నాం అంటారు. పిల్లలు లేరని ఏడుస్తాం, ఎందుకూ పిల్లలు? పిల్లలు లేనివాళ్ళే అదృష్టవంతులు!' అంది ఇంకో ఆమె.
ఆ మాట చెట్టుకింద గట్టుమీద కూచున్న లీల చెవిన పడింది. పిల్లలు లేనివాళ్ళు అదృష్టవంతులా - లీల మనసు అప్పటికీ బెదిరిపోయింది.
తను ఎవరు? - లీల గట్టిగా నవ్వింది. పిచ్చిపట్టినట్టుగా నవ్వింది. అంతలోనే వెక్కివెక్కి ఏడ్చింది.
"ఎవరూ నమ్మరా... పిల్ల చచ్చిపోలేదంటే!" అని అరిచింది.
లోపల పనిలో వున్న తులసమ్మ గబగబా వచ్చిందక్కడికి.
అందరూ పోగయ్యారు.
లీల గబగబా వచ్చి తులసమ్మ పక్కన నిలబడింది. "చూడు పిన్నీ, నేను అబద్దం చెప్తున్నానట, నా పిల్ల చచ్చిపోయిందిట, వీళ్ళంటున్నారు!" అంది ఏడుస్తూ.
తులసమ్మకి అర్ధమైపోయింది పరిస్థితి. లీల మనసు పాడైపోతోంది. ఏం మాట్లాడుతోందో తెలియటం లేదు. ముందు మనసుకి విశ్రాంతి కావాలి అనుకుంది. రకరకాల కారణాలు అడ్డుతగిలి, ఆనాడు ఎక్కడికెళ్ళావని అడగటమే కుదరలేదు తులసమ్మకి లీలని.
"నువ్వు నీ ఇంట్లో వుండణీయనన్నావు కదా ఆ రోజు. ఆ వర్షంలో పిల్లని తీసుకుని అమ్మ దగ్గరకెళ్ళాలని బయలుదేరా తీరా నాలుగడుగులు వేసేసరికి వర్షం ముంచుకొచ్చింది. గబగబా నడుస్తున్నా రోడ్డున జనమంతా అటు ఇటు పరిగెడుతున్నారు. నా చేతిలో పిల్ల జారిపోతుందేమోనని భయంగా నడుస్తున్నా అంతలో పెద్ద వరద! తోసేస్తున్నట్టే- నాతో ఎవరో అన్నారు-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS