అంతలోనే వినోద్ బొమ్మ పట్టుకుని ముందు గదిలోకొచ్చాడు.
"పాప..!" అన్నాడు.
ఒక్క నిముషం వీణ, రవి ఒకరిముఖాలొకరు చూసుకున్నారు.
లోపల ఏడుపు ఎక్కువైంది. గబుక్కున లోపలకెళ్ళి పోయింది వీణ.
"చుట్టాలొచ్చారా..?" అంది జానకి.
రవి నవ్వేశాడు.
"అవును... కొత్త చుట్టం- మమత!" అంటూ లోపలకెళ్ళి పిల్లని తెచ్చాడు.
"అదేమిటి..?" అన్నారు భార్యాభర్తా ఆశ్చర్యంగా.
వీణ టీ తెచ్చి బల్ల మీదుంచింది.
"ఎక్కడ నుంచి తెచ్చారూ..?" అంది పసిదాన్ని రెప్పవేయకుండా చూస్తూ జానకి.
మళ్ళా రవి, వీణ ఒకరిముఖాలొకరు చూసుకున్నారు.
మాధవరావు, జానకి వీళ్ళ మాటలు అర్ధం చేసుకోలేకపోతున్నారు. అయినా-అంత అవసరమేమొచ్చింది పిల్లని తెచ్చి పెంచుకోవడానికీ?! ఒక కొడుకున్నాడు.... కావాలంటే మరొకరు పుట్టరా?
జానకి వీణ ముఖంలోకి చూస్తోంది.
"మీ సహృదయత్వానికి జోహారులు! అనాధాశ్రమాల నుంచి పిల్లల్ని తెచ్చి పెంచుకోటం మంచి పనే..! మరి, సేవాధర్మం లేకపోతే మదర్ థెరిస్సా జీవితం అనాధ పిల్లల రక్షణకి అంకితం చెసిందంటారూ..!" అంది జానకి.
మాధవరావు, జానకి కాసేపు కూచుని వెళ్ళిపోయారు.
వీణ లోపలకెళ్ళి ఉప్పు తెచ్చి పిల్లకి దిష్టి తీసింది.
"ఏమో బాబు... ఎవరి చూపు ఎలాటిదో..? చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలాగే మా అమ్మకి కూడా దిష్టి తీసేది. 'అంత పెద్దవాళ్ళకి దిష్టేమిటీ...' అంటే- 'నీకు తెలియదులే' అనేదావిడ..! అంటూ లోపలకెళ్ళింది వీణ.
* * *
కారు ఇంటి పోర్టికోలో పెట్టి లోపలకొచ్చిన మాధవరావు జానకితో అన్నాడు. చాలా గంభీరంగా-
"ఏదో వుంది ఇందులో..!" అని.
"నాకూ అలానే అనిపిస్తోందండీ! లేకపోతే ఎప్పుడూ ఎంతో హాయిగా తిరిగే వీణ- ఇంత బాధ్యత నెత్తికెత్తుకుందంటే నమ్మబుద్ది కావటం లేదు..!" అంది జానకి.
అలా అంటుంటే జానకి ముఖంలో విచారం నిండింది.
పిల్లలు లేనివాళ్ళకి ఇలాంటి పిల్లలు! ఆ ఆలోచన రావడమే ఆలస్యం- మనసు ఏదో చెప్పింది.
మాధవరావు టీవీ చూస్తున్నాడు. 'వీళ్ళా పిల్లని ఎందుకు పెంచుతున్నట్టు?' అనే విషయం అతని మనసులోనూ కదులుతోంది.
జానకి భర్త పక్కన సోఫాలో కూచుంది. ఇంత సంపద- ఎవరనుభవించాలి తమ తర్వాత!! కళ్ళలో నీటిపొర అడ్డం పడింది.
"ఇదిగో... మనం ఒక పిల్లని తెచ్చుకుందామండీ..!" అంది.
కానీ, ఈమాట చాలాసార్లు అంది జానకి, మాధవరావు ఎప్పుడూ అంగీకరించలేదు.
"పిల్లలు లేనివాళ్ళు లోకంలో లేరా..?" అంటాడు ఎప్పుడూ. "తెచ్చుకు పెంచుకుంటే ఆ కొరత తీరదా..!" అంటుంది జానకి.
పెళ్ళయి పదేళ్ళు కావస్తోంది. జానకికి పిల్లలు లేరు. అన్ని పరీక్షలు భార్యాభర్తా చేయించుకున్నారు. 'ఏ లోపమూ లేదు..!' అంటారు డాక్టర్లు. ఏమిటో... మాతృత్వపు తీయదనం భగవంతుడు తనకెందుకియ్యలేదో!!- జానకికి ఈ రోజు చాలా కోపమొచ్చింది.
"మీరు ఇష్టపడకపోయినా సరే... నేను ఏ అనాధాశ్రమంకో వెళ్ళి ఒక ఆడపిల్లని తెచ్చుకుంటాను..!" అంది గట్టిగా.
"ఆ క్షణమే నీకూ నాకూ బంధం తెగిపోతుంది- అది గుర్తుంచుకో..!" అన్నాడు మాధవరావు.
జానకి కన్నీళ్ళాగలేదు. ఎంత మొండితనం... ఎంత అహం... ఎంత నిర్దాక్షిణ్యం! భార్య మనసు అర్ధంచేసుకోడేం?! ఈ కార్లూ, భవనాలూ, ఆస్తులూ... అన్నీ ఎప్పుడు గొప్పగా వుంటాయి? ఓ పసిగుడ్డు ఇంట్లో వుంటే! అయినా- ఈరోజుల్లో పిల్లలు లేని వాళ్ళు- పెంచుకోటం తప్పనుకోటం లేదు.
తన స్నేహితురాలు బొంబాయి వెళ్ళి పిల్లాడిని తెచ్చుకు పెంచటం లేదా! చెప్తేకానీ తెలియదు- వాడు వాళ్ళ పిల్లాడు కాదని!! జానకి భర్తకేసి చూసింది.
"నాకు పిచ్చి ఎక్కేట్టుంది. 'పిల్లలు లేని కొంప- పిశాచాల కొంప!' అంటారు. మనకి పుట్టకపోతే హాయిగా పెంచుకోవాలంతే! మీరేమన్నా చెప్పండి..... నేను రేపు వీణ ఇంటికెళ్ళి అన్ని వివరాలూ కనుక్కుంటాను" అంది ఖచ్చితంగా.
ఆ మాటలేవీ పట్టించుకోకుండా టీవీ వంక చూస్తూ కూచున్నాడు మాధవరావు. తనకిష్టం లేని పని వ్యతిరేకంగా చేసే ధైర్యముందా? అయినా, ఎవడి పిల్లనో తను పెంచుకోటమేమిటీ- కులం, గోత్రం ఏమీ తెలియకుండా.... ఛీ!!
మాధవరావు భార్యకేసి చూసాడు.
"మన తర్వాత ఈ ఆస్తంతా అనాధలకి చెందాలని రాద్దాం.... అదా నీ బాధ?" అన్నాడు.
"అదికాదు నా బాధ! ఒక దిక్కులేని దానికి దిక్కు చూపిద్దాం, దేముడు మెచ్చుకుంటాడు..!" అంది.
"ఏమిటీ- దేముడూ, దయ్యమూ...? నాన్ సెన్స్- చూడు జానీ, ఈ విషయం చాలాసార్లు మాట్లాడుకోటం, పోట్లాడుకోటం అయిందిగా! ఈ ఆలోచనకిక ఫుల్ స్టాఫ్ పెట్టేయి. అంతే..!" మాధవరావు గబుక్కున లేచాడు.
"నేను క్లబ్బుకెడుతున్నా... వస్తావా?" అన్నాడు కారు తాళాలు తీసుకుంటూ.
"రాను..!" జానకి అలానే కూచుండిపోయింది సోఫాలో.
* * *
మహాలక్ష్మమమ ఇంటికెళ్ళిన తులసమ్మ విస్తుపోయింది.
చంద్రయ్య మంచి నీళ్ళ గ్లాసు నోటికి అందిస్తున్నాడు మహాలక్ష్మికి.
"జ్వరం..! ఒళ్ళు తెలియకుండా పడుంది. పైగా- లీల చూడ్డానికి రాలేదేమని నన్ను అడుగుతోంది. ఏం చెప్పనూ..?" అన్నాడు చంద్రయ్య తులసమ్మని చూస్తూ.
"వస్తుంది- ఎలా వుంది లక్ష్మీ..?" అంది మంచం మీద కూచుంటూ తులసమ్మ.
కళ్ళనిండా నీళ్ళు! మాటాడలేకపోతోంది. కానీ, ఎదురుగా చంద్రయ్య వుండటంతో ఏదో చెప్పాలనుకుని చెప్పకుండా ఆగిపోయింది మహాలక్ష్మి.
చంద్రయ్య పరిస్థితి గమనించి, బయటకెళ్ళి నిల్చున్నాడు.
మహాలక్ష్మి మంచంమీద కూచుంది.
"ఈ ఇల్లు అతనికి రాయమంటాడు చంద్రయ్య! అతను మాత్రం ఎవరు అల్లుడిగా... అంటాడు! లీల విషయం నాకేం అర్ధం కాదు. ఆరోజు పిల్ల నెత్తుకొచ్చింది. 'ఆ ఇంట్లో ఇంక వుండలేనమ్మా...' అని ఏడ్చింది. చెప్పు తులసమ్మా- ఏం చేయమంటావు నన్ను?" అంది దీనంగా మహాలక్ష్మి.
"చివరకి నా పిల్లని నేను రోడ్డున పడేసినదాన్ని అవుతానేమోనని భయంగా వుంది!" అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ మహాలక్ష్మి.
వీధిలోంచి లోనికొచ్చాడు చంద్రయ్య.
'ఈ ఇల్లు సుధాకర్ పేర రాయించాలి.... ఆ తర్వాత ఇల్లు అమ్ముకుని కొంత డబ్బు తను తీసుకోవాలి. అలా కాకపోతే, తనకి అప్పు ఇచ్చిన వాళ్ళు తనని తన్నడానికొస్తున్నారు... అది తప్పించుకోవాలంటే ఇదే మార్గం.'
తులసమ్మ ఆలోచిస్తోంది...'ఈ ఇల్లు అమ్మేస్తే మహాలక్ష్మికి నిలువనీడ వుండదు. కూతుర్ని రకరకాలుగా ఏడిపిస్తున్న అల్లుడు అత్తగార్ని గౌరవంగా చూస్తాడా? అలాఅని ఇల్లు ఎవరి పేరా రాయకుండా వూరుకుంటే లీల కాపురం పూర్తిగా పాడైపోతుంది. ఆ పుట్టిన దాని బతుకేమిటి?' తులసమ్మకి ఏం చెప్పాలో తోచటం లేదు.
"మహాలక్ష్మీ..! ఇప్పుడెందుకవన్నీ..? నీ ఆరోగ్యం బాగుపడనీ, తర్వాత ఆలోచిద్దాం" అంది.
మనసంతా కలతగా ఉంది తులసమ్మకి.
"లీల, పిల్ల ఏమయినట్టు? ఉన్నట్టుండి ఈవిడ చనిపోతే, ఎవరి గతి ఏమిటీ-అయినా ఆ లీలకి బుద్ది లేదు. కన్నతల్లి మీదైనా ప్రేమలేదా? వరద తగ్గింది కదా- ఏ స్నేహితురాలింట్లో వున్నా, ఇంటికి రావద్దూ! లీల వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం..!" అంది.
"లీల ఎక్కడికెళ్ళిందీ..? ఇంట్లో లేదా..?" కోపంతో అంది.
"దానింటికది వెళ్ళిపోయిందనుకుంటున్నా..?" అంది.
"కోపమొచ్చి పిల్లనెత్తుకు వెళ్ళింది. మరి వస్తుందిలే... కోపం పోదా ఏమిటీ..!" అన్నాడు లోపలికొస్తున్న చంద్రయ్య.
మహాలక్ష్మికి- 'ఆ చంద్రయ్య ఎప్పుడు వెళ్ళిపోతాడా..!?' అని వుంది.
తులసమ్మకీ అదే వుంది మనసులో.
"సాయంత్రం లాయర్ని తీసుకొస్తాను. ఆ విషయం సుధాకర్ మీకు చెప్పమన్నాడు. అందుకే... నేను వచ్చింది..!" అన్నాడు చంద్రయ్య.
ఎవరూ మాట్లాడలేదు.
మహాలక్ష్మికి మళ్ళీ ఆయాసం ఎక్కువైంది.
"నర్సింగ్ హోమ్ లో చేర్చటం మంచిది. ఎవరు చూస్తారిక్కడ? లీల వస్తే చూద్దాం" అన్నాడు చంద్రయ్య.
