క్లబ్బులో భోజనం ఏమీ నచ్చలేదు శారదకి. 'ఇంటికెళ్ళి హాయిగా ఆవకాయ అన్నం తింటానులే అనుకుంది మనసులో ఇంటికెళ్ళి అనేమాట మనసులో అనిపించాక, రామం వచ్చాడో రానేలేదో అనిపించిందొక్కసరి. 'ఇంక ఇంటికెడతాను' అంది శారద లేస్తూ.
"ఉండుండు - ఐస్ క్రీమ్ తినాలి ఇంకా. పైగా నేను కొనబోతున్న ఫైవ్ స్టార్ హోటల్ నీకు చూపించవద్దూ' - నీరజ శారదను కూచోపెట్టింది.
'ఫైవ్ స్టార్ హోటలా - అంతడబ్బెక్కడిదీ అయినా నీకేం తక్కువ మీనాన్న ఉన్నారుగా బంగారు బాతు.
నీరజ పక పకా నవ్వేసింది. 'ఎందుకూ నవ్వుతావు' -
'మీ నాన్న అని నువ్వంటేనూ'
'అంటే'-
'అదే - నాన్నలంటే నాకు కోపం - అందులోనూ మానాన్న అంటే మరీను' -
'మంచివిషయాలు చాలా ఉండగా మానాన్నగురించి ఎందుకు నీరజ ఆ విషయం అక్కడితో ఆపింది. శారద ఇంటి వెళ్ళాలని తొందరపడటం ఎక్కువైంది.
* * *
తాళం వేసున్న ఇంటిని చూడగానే రామం ముఖం వెలతెల పోయింది. చేతిలోనున్న పూలపొట్లం, దోసె పొట్లం తననే చూసి వెక్కిరిస్తున్నట్లనిపించాయి. ఆ రెండూ ఆ రోడ్డు పక్కకి విసిరేశాడు రామం.
'ఎక్కడికెళ్ళి వుంటుందో తనుటైముకి రాలేదని ఏమీ తోచక లలిత ఇంటి కెళ్ళివుంటుంది. తను ఇటు వచ్చాడు, శారద అటువెళ్ళివుంటుంది -అంతే' - రామం ఆటోలోకూచున్నాడు.
ఆటో లలిత ఇంటి ముందు ఆగింది. జడ అల్లుకుంటున్న లలిత గబగబా వచ్చి తలుపుతీసింది.
'వచ్చిందా' ఖంగారుగా అడిగాడు రామం.
'ఎవరూ'-
'అదే - శారద - రాలేదా - ఇంటికి తాళం వుంది. ఇటు వచ్చిందేమోననుకున్నాను' - రామం సోఫాలో కూచుని సీలింగ్ ఫాన్ వేసి చూస్తున్నాడు.
'నువ్వు రాసిన ఉత్తరం అందలేదేమో!' లలిత జడ అల్లుకోటం అయింది.
'ఏమో' - నవ్వాడు రామం.
లలిత ఇంట్లో భోజనం చేసి నిద్రపోయాడు. మనసు, శరీరం కూడా బాగా బడలిక చెంది వున్నదేమో, అటునించి ఇటు ఒత్తిగిల్లకుండా పడుకున్నాడు. రామం.
మూడుగంటలకు మెలకువ వచ్చింది. 'ఏమిటిది - ఇక్కడ నిద్ర పోవటం అని మనసులో బాధ పడ్డాడు.
మరోమాటకి అవకాశం లేకుండా వెంటనే బయలుదేరాడు రామం గుమ్మంలో ఆటో ఆగుతుంటేనే ఎందుకోచిరాగ్గా వుంది. మనసు కుదుట పరుచుకుని ఇంట్లో కెళ్ళాడు రామం.
శారద విస్తుపోయింది రామాన్ని చూసి.....అతను రేపు వస్తాడనే అనుకుంటోంది.....ఒకవేళ తను అటు వెళ్ళగానే వచ్చాడేమో!
"ఇప్పుడు ఏ బస్సుందని వచ్చారూ"? - అంది మంచి నీళ్ళగ్లాసు అందిస్తూ నా ఉత్తరం అందిందా - రామంగొంతు చాలా గంభీరంగా వుంది.
ఒక్కనిముషం ఆలోచించింది....
"మీరు రాసిందికదూ - ఆ, అందింది" లేనినవ్వు ముఖాన పులుముకుంది.
'తాళం చెవి పక్కవాళ్ళకిచ్చాను......'నసిగింది శారద.
'నేను వస్తానని తెలిసే, తాళం పక్కవాళ్ళకిచ్చి వెళ్ళవా- ఏం తొందరొచ్చింది - ఎక్కడికెళ్ళావు - రామం గొంతు, ముఖం మారిపోయాయి శారద గజగజవణికిపోయింది - రామం అంతకోపంగా వుండటం చూడలేదు. ఇంతకుముందు తనెందుకు భయపడడం - ఏంతప్పు చేసింది తను - శారద తనను తాను ధైర్యపరచుకొంది.
"మీరొస్తారని ఎంత సేపు ఎదురు చూస్తాను తొమ్మిది దాటే వరకు చూసాను. బయటకెళ్ళాను. తప్పా' కాఫీ కప్పుచేతికందించింది.
'తప్పుకాదు, నిర్లక్ష్యం' - రామం ఆ మాట అంటూ' శారదా ఏమిటి ది గట్టిగా అరిచాడు.
బోసిపోయిన మెడవంక అప్రయత్నంగా చూసుకుంది. ఏదోమొండి ధైర్యం ఆవహించింది శారదలో.
'ఉన్నాయి. గాడ్రెజ్ లో'-
'అంటే - పవిత్రంగా చేసుకున్న పెళ్ళికి, అంతకన్న పవిత్రంగా కట్టుకున్న మంగళసూత్రాలకి విలువేం లేదా - శారదా - నిజం చెప్పు - ఈ వింత ధోరణి దేనికి - ఇలా కలసి బతకగలమా.....అయినా శారదా చెప్పు - ఆనాడు నా మాట తీసిపారేసి అబార్షన్ చేయించుకున్నావ్ -ఈనాడు నేను లేకుండా చూసి మెడలో సూత్రాలు తీసిపారేశావ్ - దేనికోసం ఇదంతా - నా సహనాన్ని పరీక్షిస్తున్నావా - చెప్పు శారదా, చెప్పు - రామం శారదని కుదిపేశాడు. శారద ఏమి చలించలేదు.
'అసలు ఈ పెళ్ళిలోనే నాకు విశ్వాసం పోతోంది - పెళ్ళి అనే పద్దతే శారద నోటి నుంచి వచ్చిన మాటలకి నిర్ఘాంతపోయాడు రామం. శారద అట్టడుగున పడిపోతోందా - శారద పక్కదారిలో నడవబోతోందా - శారద తనను విడిచిపెట్టేయడానికి నిశ్చయించుకుందా - రామం మనసుని మళ్ళీ శాంతపరచుకున్నాడు. నిదానంగా "శారదా - నా మాటవిను - నిన్ను చెడగొడుతున్నవాళ్ళెవరో మహాదుర్మార్గులు - పచ్చని సంసారాన్ని కాలరాస్తున్న కిరాతకులు" - రామం క్షణం శారదవైపు చూసాడు - సన్నని కనుబొమ్మలు తను ఊళ్ళో లేనపుడు బ్యూటీక్లినిక్ వెళ్ళిందన్నమాట - సరే, ఆమె యిష్టం - మంగళ సూత్రాలు తీసేసింది - భర్తను వదిలేస్తుంది - లివింగ్ టుగెదర్ - ఓ, మైగాడ్ - ఏ సంస్క్రుతికి ఇది నిదర్శనం - ఏ నాగరికతకి ఇది ఆదర్శం - శారద లాటి మంచి కుటుంబ వాతావరణం నుంచి వచ్చిన అమ్మాయే ఇలాటి వాటికి లోనయిపోతే, ఇంక ఏ అమ్మాయి ఏదారితొక్కితే ఎటుపోగలుగుతుందో ఎవరేం చేయగలరు - రామం నిట్టూర్చాడు.
'శారదా...శారదా' - రామంకేక పెడుతున్నాడు.
శారద వచ్చి పక్కనే నిల్చుంది
'ఇలా కూచో'-
శారద నిల్చునే వుంది.
'ఎవరా స్నేహితులు'-
'మీకు చెప్పాలా అసలు నాస్నేహితులగురించి మీకెందుకు'
'శారదా నాకు ట్రాన్సఫరయింది. ఎంతో సంతోషంగా వుంది. ఈ ఊరు వదిలిపెడితే మన సంసారం కుదుట పడుతుందని' - రామం శారదనడుం మీద చేయి వేసాడు. వెంటనే తోసిపారేసింది శారద.
'నేను ఈ ఊరు వదిలిరాను. మీరెళ్ళండి'-
'అంటే'
'అంతే' - శారద పక్కకు జరిగిపడుకుంది.
రామానికి ఏమీతోచటం లేదు. తను వెళ్ళిపోయి శారద ఒక్కర్తీ ఇక్కడుండిపోతుందా!!
* * *
