Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 88


                                    కపీశ్వరుడు

    చరిత్రాత్మకమైన పళ్ళదోపిడి "జయప్రదం"గా ముగిసింది.
    మా అడవిలో ఇంత గొప్ప దోపిడి ఇంత గొప్ప విజయం
     యాభై అరవై యేళ్ళలోపున ఎప్పుడూ సంభవించలేదని
    చెట్టుమీద జీవిస్తున్న మా శత్రువులే ముందుగా కయ్యానికి
    కాలుదువ్వారు. యుద్ధం ముగిసిన సరికి వందలకొద్దీ
    శత్రు మర్కటాలు మొగవీ, అడవీ నేలకొరిగిపోయాయి.
    వాళ్ళ చెట్టుమీద పళ్ళన్నీ మేము దోచుకున్నాము. మాకు
    అఖండ విజయం చేకూరిందని ప్రకటించుకున్నాము.
    మా కోతులం అనాగరిక జంతువులంకాము. సమరం ముగిసి మా చెట్టు మేము చేరుకొని మా గాయాలకి మేము వైద్యం చేసుకున్న తర్వాత విజయోత్సవాలు వైభవంగా జరిపించడానికీ, మా భగవంతుడికి మా కృతజ్ఞతాభివందనాలు సమర్పించడానికీ నిశ్చయించుకున్నాము, మరి మా దేవుడికి అభిషేకాలు చెయ్యకపోతే మరోసారి ఇటువంటి మంచి విజయం పంపించడని మాకు బాగా తెలుసును. అంచేత ఏంచేస్తే భగవంతుడు ప్రసన్నుడవుతాడా అని ఆలోచించాము. ఆయన జాగాలో మేముంటే మాకు ప్రీతికరమైనవేమిటని ఆలోచించాము. చిన్నలకీ, పెద్దలకీ మధ్య తీవ్రంగా చర్చలు జరిగాయి. మామూలు జీవితంలో మేము చేసే చప్పుడుకంటె మరి పదిరెట్లు బిగ్గరగా కీచులాడుకున్నాము. ఆఖరికి మా అందర్లోకి ముసిల్దీ, అందరికన్నా తెలివైనదీ అయిన కోతి. "నేనే దేవుణ్నై, కొన్నివేల సంవత్సరాలుగా ఈ కొమ్ములమీద కిచకిచలాడే కోతుల్ని కనిపెడుతున్నట్లయితే మీరు నోరు మూసుకొని ఊరుకోవడమే నాకెంతో సంతోషదాయకమని నిస్సందేహంగా చెప్పగలను" అంది. మా నోళ్ళు కట్టుపడ్డాయి. అప్పుడొకరిద్దరు లేచి "అదీ అవశ్య కర్తవ్యం. విజయోత్సవాన్ని మనం అయిదు నిమిషాల నిశ్శబ్దంతో పాటిద్దాం" అన్నారు.
    అందుకు ఏర్పాటు జరిగింది. పళ్ళదోపిడి వార్షికోత్సవం రోజున కోతులన్నీ ఎక్కడి పనులు అక్కడ ఆపివేసి నిశ్శబ్దంగా ఉండాలని తీర్మానించుకున్నాం.
    కాని అరణ్య జీవితం ఆదర్శప్రాయమైనది కాదు. అన్ని కోతులూ ఒక్కలాగే ఉండి, ఒక్క నాయకుణ్నే నమ్మి తమ జాతీయతనూ, ప్రాచీన సంప్రదాయాలనూ మన్నించగలిగినవయితే మా చెట్టే ఒక భూలోక స్వర్గమనిపించుకొనేది. వ్యక్తిగత సందేహాలను హతమార్చాలనీ, కోతిజాతి గొప్పతనం ఇప్పుడూ ఎప్పుడూ ఒక్కలాగే ఏ మార్పూ లేకుండా ఇలాగే చిరస్థాయిగా ఉంటుందనీ, అన్ని కోతులూ నమ్మవద్దూ! ఉఁహు! మాలోనే కొన్ని కోతులు ఈ జాతీయ భావాలకి విరుద్ధంగా ఆలోచిస్తున్నట్లు మాకు తెలిసింది.
    ఈ సంగతి మాకు ముసలి గండభేరుండపక్షి చెప్పింది. ఈ అవ్వ మా పొరుగున ఒక కొండ శిఖరంమీద జీవిస్తోంది. ఎప్పుడూ ఏవో పుకార్లు మోసుకురావడమే దీని పని. ఇహం, పరం అంటే ఏవో వేదాంతాలు మాట్లాడుతుంది. జీవితానికర్ధమేమిటని అడుగుతుంది. భూలోకంలో తన జీవితం ముగిసిపోతున్నట్లు మాట్లాడుతుంది. కొంత కాలానికి భూమ్మీద గండభేరుండ పక్షులే ఉండకపోవచ్చునంటుంది.
    "కోతులు మాత్రం కలకాలం ఈ భూమిమీద ఉట్టికట్టుకొని ఊగుతాయనుకున్నారా?" అని ఒకమారు గండభేరుండపక్షి మమ్మల్ని అడిగితే "నీకెందుకీ సందేహం కలిగిం"దని దాన్ని నిలవేసి అడిగాం. అప్పుడు తెలిసింది మాలోనే కొందరు విప్లవకారులున్నారని.
    యువకుల తరానికి చెందిన కోతుల్ని గండభేరుండపక్షి తీవ్రంగా విమర్శించసాగింది. అవెక్కడా కిందామీదా ఉండకుండా పేట్రేగిపోతున్నాయంది. "అవి తమ తోకల గురించి తరుచు మాట్లాడుకుంటూ ఉంటా"యంది. "విషయం మంచిదే" అన్నాం మేము "కోతిజాతికి తోక ప్రధానాలంకారం" అన్నాం.
    "మీలో పడుచుకోతులు కొత్త ఫ్యాషన్ అవలంభించడం చూస్తున్నాను. వాటికి పొట్టి తోకలని ధరించడం నాజూకయినట్టు కనబడుతుంది. కొన్నాళ్ళకి తోకలని పూర్తిగానే విసర్జిస్తాయేమో" అని ముసలిపక్షి హేళనగా ఇకిలించింది.
    మాకు చెడ్డ మండుకొచ్చింది. తోకతొక్కిన తాచుపాముల్లాగ లేచాం. "తోకలేని లేకపోతే ఇక కోతులెక్కడ? ఇటువంటి దుర్మార్గపు కూత లెందుకు కూస్తా"వని పక్షిని మందలించాం. మా తోకల్ని గురించి ఎవ్వరూ అవమానకరంగా మాట్లాడడాన్ని మేము సహించం.
    "ఈ దుర్మార్గపు కూత నాదికాదు. మీ కుర్రకోతులే ఈ ప్రచారం చేస్తున్నాయి. ఒకమారు ఇవి నన్ను పట్టుకొని దులిపి పారేశాయి. "ఎగిరే సరీసృపం! ఇది ఎంతోకాలం మిగలదు. కొన్నాళ్ళకి ఈ జాతి అంతరిస్తుంది" అన్నాయని. కోతులు మున్ముందు నాలుగు కాళ్ళమీద నడవడం మానేస్తాయనీ, తోకల్ని పూర్తిగా వదిలేస్తాయనీ అన్నాయి. 'అచిరకాలంలో మేము పరిణామం పొంది మానవుడుగా మారిపోతున్నాం' అన్నాయి.
    'అప్పుడు భూమిమీద గండభేరుండాలే కనబడవట' అంటూ ఆ ముసల్ది ఎగిరిపోయింది.
    ముసలిదాని చాదస్తపు ధోరణికి మాలో మేము నవ్వుకున్నాం. "మానవుడట పరిణామమట!" ఎప్పుడూ వినలేదు ఈ మాటలు మేము. కాని తోక సంగతి మాత్రం మమ్మల్ని కలవరపరిచింది. తోకలు లేకపోవడమే!  ఇంతకన్న విద్రోహం ఇంకోటి ఉండబోదు. తోక మా కోతిజాతికి పతాక! మా బతుక్కి పునాది! ఈ కుర్ర కోతులికి ఇవేం బుద్ధులో! అయినా పళ్ళదోపిడి తర్వాత పైకొస్తున్న కోతులు మర్యాదా, మప్పితం తప్పి మాట్లాడుతున్నాయి. కిందకొమ్మలలో ఇవి ఏదో తిరుగుబాటు లేవదీస్తున్నాయి. అందుచేత కొందరు గూఢచారులను పంపించాము. కొన్ని సోదాలు చేయించాము. గండభేరుండపక్షి చెప్పినదాంట్లో ఏమాత్రం నిజం వుందో కనిపెట్టడమే మా ఉద్దేశం.
    తర్వాత కథ చెప్పడానికి ముందు చెట్టుమీద మా జీవితాన్ని కొంత వర్ణించాలి. మేం ఉంటున్నది అనేకానేక శాఖోపశాఖలతో అతి విస్తీర్ణమూ, అత్యున్నతమూ అయిన ఒక ఫలవృక్షం. మీది కొమ్మలలో గాలీ, వెలుగూ ధారాళంగా ప్రసరిస్తాయి. ఇక్కడ ఉన్నత కుటుంబానికి చెందిన కోతులు జీవిస్తాయి. దిగువ కొమ్మల్లోనూ, ఆ మాటకొస్తే నేలమీద బురదలోనూ వేలకొలది తక్కువజాతి కోతులు నీచంగా బతుకుతూ ఉంటాయి. కొన్ని మీదికి రావాలన్నా మిగిలినవి రానివ్వవు. అరుచుకుంటూ కరుచుకుంటూ ఇరవై నాలుగ్గంటలూ ఏవో కొట్లాటలలో కాలం గడుపుతూ ఉంటాయి. వాటిలో ఐకమత్యం అనేదే కనబడదు.
    ఎగువకొమ్మల్లో జీవిస్తున్న మేము సుఖంగా కూర్చుని పళ్ళుతింటూ గింజలూ, తొక్కలూ కిందకి పారేస్తాం. వాటికోసం కింద కోతులు గిజగిజ తన్నుకు చస్తాయి. వాస్తవానికి మా పళ్ళన్నీ కింద కోతులే సంపాదించిపెడతాయి. ఆ సంగతి వాటికి తెలియదు. ఒక్కొక్క కోతి చాలా పళ్ళు సంపాదిస్తుంది కాని హాయిగా తినడానికి చోటుగాని తీరుబాటుగాని లేనందున వాటి పళ్ళన్నీ మాకే దక్కుతూ ఉంటాయి. వాటి పళ్ళని మేము చాలా తమాషాగా లాక్కుంటాము. మా ఉన్నత కుటుంబంలో ఉన్న తెలివైన కోతుల్ని కిందికి పంపుతాము. ఇవి మరీ ఉన్నతంగా జీవించలేవులెండి. ఎంచేతనంటే వీటి మెదడుకున్నంత వాడి కోరలకి లేదు. ఇవి కిందకొమ్మలకి కొంచెం దూరంలో తోకమీద వేలాడుతూ చమత్కారంగా ఊగి తక్కువ జాతి కోతుల గుప్పెట్లలోంచి పళ్ళు తస్కరిస్తాయి! అప్పుడు చూడముచ్చటగా ఉంటుంది. ఆ తక్కువ కోతుల ఆరాటం! ఇంతకు ముందుదాకా చేతిలో ఉన్న తిండి ఇట్టే తెలియకుండా ఎగిరిపోతుంది. అంతటితో ఆ కోతుల ఆశ్చర్యం ఆగ్రహంగా మారిపోయి పొరుగు కోతుల పళ్ళమీదకవి బయల్దేరుతాయి. ఆ పొరుగుకోతులు మరికొన్ని అడుగు కోతులమీదికి వెళుతూ వుంటాయి. కొన్ని ఆహారాన్వేషణలో అట్టడుక్కి పోతాయి. ఆహారం కోసం అట్టడుగున జరిగే సంగ్రామం అతి భయంకరం కాబట్టి ప్రతీ మర్కటం తనకాగతి పట్టకుండా ఎన్ని జాగ్రత్తలైనా పడుతుంది. ఆఖరికి తన ప్రాణానికైనా తెగిస్తుంది. ఈ విధంగా మేము ఎన్నో వేల సంవత్సరాలుగా జీవిస్తున్నాము. అప్పుడప్పుడు మా చెట్టుమీద సమృద్ధిగా పళ్ళు పండకపోయినా, ఇంకో చెట్టుమీద మాలాగే జీవిస్తున్న కోతులకి మరీ అపరిమితంగా పళ్ళుపండి మాకు కళ్ళు కుట్టినా మాలో మేము సాగించే వర్గ కలహాలని తాత్కాలికంగా కట్టిపెట్టి ఉన్నత కపిరాజుల ఉత్తరువుమీద దోపిడి దండయాత్రకి ఉపక్రమిస్తాం. ఇప్పుడు తెలిసిందా ఎందుకు మేము ఈ కపిత్వాన్ని ఆరాధిస్తామో? ఒకసారి కోతులు తమ కోతితనాన్ని పోగొట్టుకుంటే మా గొప్పతనమే దిగజారిపోయి అంతటా అరాజకత్వం అలముకుంటుంది. అనగా ఉన్నత కుటుంబపు కోతులకు సరిగా పళ్ళ సరఫరా జరగదు. మా చెట్టు మాకు దక్కకపోవడమో, మాకన్నా బలవంతులయిన కోతుల గుంపు మమ్మల్ని నాశనం చెయ్యడమో తటస్థిస్తుంది.
    కాబట్టి మా గూఢచారులు విప్లవవాదుల నాయకుణ్ణి నా యెదుట హాజరుపెట్టినప్పుడు మాకెంత ఒళ్ళుమండిందో ఎవరైనా సులభంగా ఊహించుకోగలరు. ఔరా, వీడి దారుణం! మాకు అత్యంత ప్రియమైన పతాకానికే వీడు ద్రోహం తలపెడుతున్నాడు. వీడూ, వీడి కోతిచేష్టలూను! తల ఎత్తుకొని మా సమక్షంలో నిలబడ్డాడు. నిలుచున్నాడు. అదీ ఆశ్చర్యం! వెనక కాళ్ళమీద మా కోతులం ఎంతోసేపు నిలబడలేం. వీడు నిటారుగా నిలబడ్డాడు. ముందు కాళ్ళతో ఆసరా కూడా తీసుకోలేదు. అదీకాక వీడి ఒంటిమీద రోమాలు తక్కువ. ఒంటి రంగు కూడా మామూలు కోతుల రంగు కాదు. నిర్భయంగా నిలుచున్నాడండీ మా ముందు! తన ముందుకాళ్ళని ఎంతో తీరుబాటుగా వెనక్కి జారవిడిచాడు. వాటివేళ్ళు ఎందుకో తహతాహలాడుతున్నాయి. వీణ్ణి చూస్తున్నకొద్దీ వున్నపాటున చీల్చి చెండాడాలన్నంత కోపం మాకందరికీ వచ్చింది. కొన్ని కోతులు పటపట పళ్ళుకొరుకుతూ గాండ్రించాయి. నాయకుడు మా కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నాడు. ఇదో విరుద్ధ లక్షణం - ఎన్నో యుద్ధాలలో ఆరితేరిన మేము ఇతరుల కళ్ళలోకి తిన్నగా చూడం, భయంవల్లా, అనుమానం వల్లా మా కళ్ళలో కాపట్యమూ బతుకులో అశాంతీ బలపడ్డాయి. వ్యూహాలు పన్నడం, రహస్యంగా ఆలోచించడం,  అవసరాన్నిబట్టి వెనుకంజ వెయ్యడం, అనుకోకుండా మీద పడడం మా యోధులకి ప్రధాన లక్షణాలు. తిన్నగా అమాయకంగా ఎదిరి కళ్ళలోకి చూసే కోతి ఎప్పుడో ఓడిపోయిందన్నమాట. కాని ఈ నాయకుడికి కోతితనమేలేదు. సమర వీరుల లక్షణాలేవీ వీడికి లేవు. యుద్ధ తంత్రజ్ఞులవలంబించే మాయోపాయాలేవీ వీడికి తెలియవు. అంతేకాక వీడు ఇంకోవిధంగా మా సంప్రదాయాలకి విభిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఏమంటే వీడు తన మనస్సులో ఏమి అనుకుంటున్నాడో అదే బైటికి కక్కేస్తున్నాడు. రహస్యాన్ని దాచడం వీడికి తెలియనే తెలియదు. శత్రువుకి మన ప్లాను తెలియనివ్వకపోవడమే అసలైన మిలిటరీ జాతివాడి లక్షణమని వేరే చెప్పాలా? ఈ అన్ని కారణాలవల్లా వీడి చేతకానితనం స్పష్టమయిపోయింది. నిస్సహాయంగా వీడు మాకు చేజిక్కిపోయాడు. మామూలు కోతులకంటే భిన్నంగా ఉన్నాడంటే అది వాడి ఖర్మ. అయితే వాడి మాటలు వింటేమాత్రం మాకు మండుకొచ్చింది. తనవి విద్రోహ భావాలని తన నోటితో తానే ఒప్పుకున్నాడు. అంచేత రోజుల తరబడి చెరలో ఉంచి వీడిచేత నేరం ఒప్పించే శ్రమ మాకు తప్పింది. వీడన్నమాటలివి. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS