వెంకటపతి తలెత్తి చూశాడు. వరూధిని వణికిపోతూ భర్తమీదకు వంగి ముఖంలోకి గాబరాగా చూస్తోంది.
"లంజాముండా?"
వెంకటపతి వరూధిని జుట్టు లంకించుకొన్నాడు. బలంగా గుంజి కింద పడేశాడు.
"వళ్ళు మదంపట్టి ఛస్తున్నావు!" దభీమని గుద్దాడు.
వరూథినికి కలిగిన భయంలో దెబ్బ నొప్పి తెలియలేదు.
"అంతా నాశనంచేసి నన్ను ఎదవనుచేసి కూర్చోపెట్టావ్!" మళ్ళీ గభీగభీ రెండు తగిలించాడు.
వరూధిని పెనుగులాడింది. మీదపడి కొడ్తున్న భర్త మొలపంచ లాగింది.
ఊడిపోతున్న పంచను సర్ధుకొనే ప్రయత్నంలో భార్య జుట్టు వదిలేశాడు వెంకటపతి.
వరూధిని రేచుకుక్కలా తప్పుకొంది.
"నీ మగసిరి ఆడదానిమీద కాదురా! ఆ గుర్నాథంగాడి మీద చూపించు. పెళ్ళాం మీద కాదురా! ముదనష్టపాడ! పరాయిమొగాడు పెళ్ళాన్ని పట్టుకొంటే చూస్తూ వూరుకున్నోడివి నువ్వూ ఒక మొగాడివేనా? తూ! నీ బతుకుచెడ!"
"తప్పుడుముండా, నోరుముయ్! నిన్నూ!....." అంటూ వెంకటపతి భార్యమీదకు దూకాడు.
వరూధిని పరుగెత్తింది. పడకగదిలో జొరబడి తలుపులు బిడాయించుకోటానికి ప్రయత్నించింది.
వెంకటపతి ఎగిరి తలుపులు తన్నాడు. తలుపులు బార్లాగా తెరుచుకొన్నయి. వరూధిని వెనక్కు విరుచుకుపడింది.
"నిన్ను పాపం తలచకూడదే!"
వెంకటపతి కిందపడ్డ భార్యను నేలమీద ఈడుస్తూ అరిచాడు.
"బంగారపుగడ్డ! అయినకాడి కమ్మించావ్? ఇల్లూ వాకిలీ, దిక్కూ దివాణం లేనివాణ్ణి చేశావ్! నా కొంప కూల్చావే! ఆఖరికి తండ్రీ కొడుకులకు కాకుండా చేశావ్! ఉన్న పరువు కాస్తా తీశావ్!"
"నువ్వాడదానివేనా? తాగి తందనాలాడతావా? సంసారంచేసే ముండవేనా నువ్వు? పో బయటికి?" అంటూ వెంకటపతి వరూథిన్ని రెక్కపట్టుకొని పైకి గుంజాడు. వరూధిని తోటకూరకాడలా వేలాడపడిపోయింది. రెండుచేతుల్తో లేవనెత్తబోయాడు. వరూధిని మంచుముద్దలా అయిపోయింది. చేతుల్లోనుంచి జారిపోయింది.
వెంకటపతి గుండెలు ఆగిపోయినై. మైకం దిగిపోయింది. బుర్రంతా ఓ పెద్ద చీకటిగోళంలా అయిపోయింది. భయంకర నిశ్శబ్దం అతని భయాన్ని ఇనుమడింపజేసింది.
ఏం జరిగింది? తనేం చేశాడు?
"వరూ! వరూ!" పిల్చాడు.
ఆమె పలకలేదు.
ఆమెను ఒళ్ళో కూర్చోపెట్టుకొని చుబుకం పట్టుకొని ఊపాడు. ఆమె తల ఎటు తిప్పితే అటే తిరిగి మళ్ళీ వేళ్ళాడబడుతోంది.
"నిన్నే? వరూ? ఏమయింది?"
వెంకటపతి గుండెలు కదలబడ్డాయి. చెమటలు పట్టిపోయినై. ముక్కుదగ్గిర వేలుపెట్టి చూశాడు. శ్వాస ఆడుతూంది.
ఫర్వాలేదు. అన్నుబట్టిపోయివుంటుంది. ఏమిటి తనింత మూర్ఖంగా చేశాడు? ఏనాడూ లేనిదీ తనెందు కిలా అయిపోయాడు ఈరోజు? ఆ వెధవ విస్కీ! ఎక్కువగా తాగేశాడు. తనేం చేసిందీ తనకే తెలియదు.
వెంకటపతి భార్యను చేతులమీద ఎత్తుకొని మంచంమీద పడుకోబెట్టాడు. చన్నీళ్ళు తెచ్చి ముఖాన చల్లాడు.
"ఎట్టావుంది? నిన్నే? ఎట్టా వుందీ?" దిగులుగా అన్నాడు.
వరూధిని కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. పెదవులు కదల్లేదు.
భార్య పక్కనే దిగాలుపడి కూర్చున్న వెంకటపతికి పొరుగింట్లో నుంచి పసిబిడ్డ ఏడ్పు విన్పించింది.
"బాబు! బాబు!" వెంకటపతికి రవి గుర్తొచ్చాడు. హృదయం కలతచెందింది.
బాబు తల్లిలేని బిడ్డ అవుతాడా? రేపొచ్చి అమ్మేమయిందని అడిగితే తనేం చెప్తాడు? తనే చేజేతులా చంపాననిచెప్తాడా? వరూథిన్ని తనే చేతులారా చంపుకొన్నాడు. అందరూ తనను అమాయకుడంటారు. తను హంతకుడు. భార్యనే చంపిన ఖూనీకోరు.
"వరూ? నిన్నే! ఎలావుంది?"
వెంకటపతి గొంతులోనుంచి మాటలు రావటంలేదు. గొంతు పూడిపోయింది. ఆమె ముఖంలోకి ఆదుర్దాగా చూశాడు.
వరూధిని పెదవులు కదిలాయి.
వెంకటపతి కళ్ళల్లో వెలుగులు మెరిశాయి.
"డాక్టర్ ను పిల్చుకొచ్చేదా?"
వెంకటపతి అంతవరకు ఆ ఆలోచనే రానందుకు తనలో తనే గొణుక్కున్నాడు.
వరూధిని అక్కర్లేదన్నట్టు మెల్లగా చెయ్యి ఊపింది. కనురెప్పలు బరువుగా లేపింది. విశాలమైన ఆ కళ్ళలో చూపులు మందగొడిగా ఉన్నాయి. నీరసంగా మూలిగి భర్తముఖంలోకి చూసింది. అతని ముఖం రక్తంతో తడిసి భయంకరంగా వుంది. కాని అతని చూపిలి మందలోనుంచి తప్పిపోయిన గొర్రెపిల్ల చూపుల్లా బెదురుగా వున్నాయి.
వట్టి అమాయకుడు! డాక్టర్ ను పిలవటానికికూడా తన అనుమతే కావాలి. అన్నీ తనే చెప్పాలి.
అంత బాధలోనూ వరూధిని పెదవులపైన చిరునగవుల జిలుగు వెలుగులు దోబూచులాడినై. భర్తమీద జాలి కలిగింది.
"బాగా లోతుగా తగిలిందేమో డాక్టరు దగ్గిరకెళ్ళి చూపించండి!"
ఓ క్షణకాలం వెంకటపతికి అర్ధంకాలేదు. అయోమయంగా చూశాడు.
అర్ధమయాక అన్నాడు .. ... "అదేముందిలే! అదే పోద్దిలే!"
గాయం మీద చెయ్యిపెట్టి తడుముకొన్నాడు.
"కాదండీ! గాజు పెంకు దిగబడిందేమో?"
"పెంకా గింకా? అంచుతగిలి తెగ్గోసుకొందనుకొంటా! రేపటికదే పోద్ది! నీ కెట్టా వుందీ? డాక్టర్ ను పిల్చుకురమ్మంటావా?"
"అవసరం లేదులెండి. ముందు మీరెళ్ళి గాయందగ్గర శుభ్రంగా కడుక్కురండి. ఆ బట్టలు కూడా మార్చుకోండి. నా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆయింట్ మెంట్ వుంది. అది రాయండి."
"ఆయింట్ మెంటా గీయింట్ మెంటా? అదెందుకు? దండగ? అదే పోతది!" వెంకటపతి లేచి వెళ్ళాడు.
వెంకటపతికి గాయం చన్నీళ్ళతో కడుగుతున్నప్పుడు తెలిసింది నొప్పి.
అద్దంలో చూసుకొంటూ "ఏమో అనుకొన్నా! బాగానే తెగింది? గాజుపెంకు గాదూ? సర్రున కోసుకుపోయింది." అనుకొన్నాడు వెంకటపతి.
"అన్నం పెట్టుకు తినండి. ఆ పనిముండ కూడా లేకుండా పోయింది."
"మరి నువ్వు తినవా?"
"ఓ పక్కన గుండె దడొచ్చి నేను చస్తుంటే అన్నం ఏం తింటాను?"
వెంకటపతి ముద్దాయిలా ముఖంపెట్టి భార్యకేసి చూశాడు.
మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళాడు. పళ్ళెం, గిన్నెలమోతా వింటూ వరూధిని అనుకొంది.
పశువు! నువ్వు తినవా అని అడుగుతాడు. నువ్వు తింటేగాని వీల్లేదని అన్నాడా? మరొకసారి అడిగాడా? ఇదే రామనాథబాబయితే ఎట్లా బతిమాలేవాడు? తను కాఫీ తాగకపోతే తనూతాగనని భీష్మించుకు కూర్చునేవాడు. తను తింటే తినేవాడు. తను నవ్వితే నవ్వేవాడు. తను బాధపడితే సహించేవాడుకాదు. అలాంటి రామనాథబాబు తనకు దూరం అయాడు. ఆ షావుకారి కోడలు......ఆ శ్యామలాంబ కూడా దొంగముండే? కానరాని కూబి. తను లేందే బతకలేదన్నట్టు మాట్లాడే రామనాథ బాబు ఎంత మారిపోయాడు? తనకెంత అన్యాయం చేశాడూ? తలచుకొని కుమిలి కుమిలి పోతున్న వరూధినికి వంటగదిలోనుంచి భర్త వెంకటపతి మాట విన్పించింది.
"పెరుగంతా వేసుకోనా? ఇంకెవరూ లేరుగా?"
వరూధినికి కటిక చీకట్లో, బురదలో కూరుకుపోయినట్లయిపోయింది. గుండెలు తరుక్కుపోతున్నాయి. కన్నీటితో చెంపలు తడిసిపోతున్నాయి.
వెంకటపతి పెరుగ్గిన్నె పళ్ళెంలో బోర్లించుకొని, అన్నం కలిపి పెద్ద పెద్ద ముద్దలు చేసి ఆప్యాయంగా ఎగరేస్తూ చిదానందంలో మునిగిపోయాడు.

